ఇది కూడా ఒక ప్రేమ కధే - 2

మొదటి భాగం  ఇక్కడ చదవండి   ఇది కూడా ఒక  ప్రేమ కధే   

రెండు నెలలు గడిచిపోయాయి. ఈ రెండు నెలల్లోనూ మూడు మాట్లు గుళ్ళోనే కలిసారు. ఐదారు మాట్లు కా.....  ఫోన్ చేసాడు కా..కి. నెలకి వంద రూపాయలు టాక్ టైం వేయించినా, చెల్లి, తల్లి కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తున్నందున అంతకంటే ఎక్కువ మాట్లు చేయలేకపోయాడు కా..... కా..కి సెల్ లేదు. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే సెల్ అందుబాటులో ఉంటుంది. ఆయన రోజుకి 12 గంటలు ఆటో తిప్పుతుంటాడు. 11గంటలు నుంచి మద్యాహ్నం  3గంటలు దాకా ఇంట్లోనే ఉంటాడు ఆయన. కా..... సందేశాలు ఆ టైంలోనే ఇస్తుంటాడు.

రెండు నెలల తరువాత ఇంకో శుభవార్త చెప్పాడు కా..... ఇంకో ఐదుగురు పిల్లలు చేరారండి. ఐదారు క్లాసులు వాళ్ళు. ఇంకో వెయ్యి రూపాయలు వస్తాయి అని సంతోషపడ్డాడు కా.....
ఐదారు క్లాసుల వాళ్లకి ఇంకో వంద ఎక్కువ తీసుకోవచ్చు కదండీ అంది కా..
అబ్బే, రెండు వందలు ఇవ్వడమే ఎక్కువ అండి వాళ్లకి. ఇల్లు గడవడానికి  సేల్స్ వుమెన్గా  చేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. పిల్లల్ని బాగా చదివించాలని ఆశ. మంచి స్కూల్స్ లో చదివించే స్తోమత లేదు. పిల్లలు ఇద్దరికీ కలిపి నాల్గు వందలు ఇవ్వడమే వాళ్లకి కష్టం అని నిట్టూర్చాడు కా..... మొదట్లో ఎంతో కొంత సంపాదించాలనే మొదలు పెట్టానండి కానీ ఇప్పుడు తల్లి తండ్రుల తపన చూస్తుంటే పిల్లలకి బాగా నేర్పాలనే పట్టుదల వస్తోంది. ఈ మధ్యన వాళ్లకి చెప్పడానికి నేనో రెండు గంటలు కష్టపడుతున్నానండి ప్రిపరేషన్ కి.
మంచి పని చేస్తున్నారండీ అని అభినందించింది కా..

ఇంకో నాల్గైదు నెలలు గడిచాయి. ఇద్దరూ అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. ఒక చెరుకు రసం బదులు రెండు తాగుతున్నారు. అప్పుడప్పుడు తెగించి కా..... పది రూపాయల ఐస్ క్రీం కూడా కొంటున్నాడు ఇద్దరికీ. వాళ్ళు చెప్పుకునే కబుర్లు  మాత్రం  మారలేదు. ఇంటి కష్టాలు. నిట్టూర్పులు.  కా..కి  ఏ ఉద్యోగమూ దొరకక నిరుత్సాహం ఎక్కువవుతోంది.  చుట్టు  పక్కల ఏ షాపులోనయినా చేరడానికి తల్లి ఒప్పుకోదు. దూరం వెళ్ళడానికి తండ్రి ఒప్పుకోడు. కా..... ధైర్యం చెపుతాడు. కా..కి దిగులు ఎక్కువవుతోంది ఏ విధంగానూ తండ్రికి సాయం చేయలేకపోతున్నందుకు.

ఐదు నెలల తరువాత కా..... ఒక మాటు కలిసినప్పుడు నిరుత్సాహపడ్డాడు. ఒక ఐదుగురు ఏడెనిమిది క్లాసు పిల్లలు ట్యూషన్ చెప్పమన్నారండి. నాలుగు  వందలు ఇస్తామన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదో విధంగా అవస్థ పడి చెప్పేయగలనేమో కానీ లెఖ్ఖలు చెప్పలేనేమో నని అనుమానం. వాళ్లకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో. అసలు ఒప్పుకోవాలో లేదో తెలియటం లేదండీ, అని వాపోయాడు.
నాది బి.ఎస్.సి. MPC అండి అంది  కా..
మీ నాన్నగారు ఒప్పుకుంటారా ఐదు కిమీ పంపడానికి. అందులోనూ ఓ వెయ్యి రూపాయలకి అన్నాడు కా.....
అడుగుతానండి. మీ ఇంటికయితే పంపుతారేమో అని ఆశాభావం వ్యక్తం చేసింది కా..  ప్రస్తుతం వెయ్యి, ఆపైన ఇంకా పెరగ వచ్చునేమో కదండీ, అని కూడా అంది.
నా సంగతి మీ నాన్నగారికి తెలుసా,  అడిగాడు కా.....
టెలిఫోన్ చేస్తారు కదండీ మీరు. మా నాన్న గారికి మీ గురించి చెప్పాను. అందరిలాగా కాకుండా ఏదో విధంగా తండ్రికి సాయపడుతారు మీరు అని మా నాన్న మెచ్చుకున్నాడు కూడా.
కా..... నవ్వాడు. కా.. డిటో చేసింది.

రెండు రోజుల తరువాత పరంధామయ్యగారు (కా.. తండ్రి) కా..... ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు.
మా అమ్మాయి చెప్పిందండి. ట్యూషన్ సంగతి. పట్టుబడుతోంది. నాకూ ఒప్పుకోక తప్పలేదు. అందుకనే మేము ఇక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటాము. ఎక్కడైనా అద్దె ఇల్లే కదా.   అప్పటిదాకా సాయంకాలం ట్యూషన్ అయిన తరువాత నేను వచ్చి తీసుకెళ్ళతాను.  ఆలస్యం అయినా మీ ఇల్లే కనుక భయం లేదు అని చెప్పాడు.
కా..... తల్లి కూడా  సంతోషంగా ఒప్పుకుంది. ఖాళీ టైం లో మా అమ్మాయికి  ఇంటర్ పాఠాలు చెప్పవచ్చు. ఫ్రీ గా నేనండోయ్ అని కూడా అంది. 

ఒక పది రోజుల తరువాత  కా.. కుటుంబం పక్క వీధిలో అద్దెకు దిగింది. రెండు ఇళ్లలో ఐదుగురు ఏడెనిమిది క్లాసు  పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు ఇద్దరూ కలిసి. ఒకరి ఇంట్లో కా.. MPC  చెపుతుంటే ఇంకో ఇంట్లో కా..... మిగతా సబ్జెక్ట్స్ చెప్పేవాడు.
తల్లి సలహా మీద మొదటి నెల పదిహేను వందలు ఇచ్చాడు కా..... కా..కి. ఇల్లు మారారు కదండీ ఖర్చు అయి ఉంటుంది కదా అందుకని అని సంజాయిషి ఇచ్చాడు కా.....
మీకు పార్టీ ఇస్తానండి, నాలుగు  బజ్జీలు, రెండు చెరుకు రసాలు అని  కా.. నవ్వింది. ఇంత కాలానికి ఒక పదిహేను వందలు సంపాదించానని చాలా సంతోషంగా ఉంది అని కూడా చెప్పింది.
మళ్ళీ నెల వెయ్యేనండి అని చెప్పాడు కా..... నవ్వుతూనే.  

ఇంకో ఐదారు నెలలు గడిచాయి. ఇంకో ఏడెనిమిది మంది  పదోక్లాసు దాకా పిల్లలు చేరారు.  కింద తరగతి పిల్లలు కూడా ఇంకో ఐదుగురు చేరారు.  చిన్న క్లాసుల పిల్లలకి కూడా కా.. చెప్పడం మొదలు పెట్టింది. ఎవరికి వీలైతే వాళ్ళు చెపుతున్నారు.  9,10 క్లాసులకి ఐదు వందలు, ఆరు – ఎనిమిదికీ మూడు  వందలు, ఇంకా చిన్న క్లాసులకి రెండు వందలు తీసుకోవడం మొదలు పెట్టారు. వచ్చే దాంట్లో ఖర్చులు పోను  సగం  కా..... తీసుకుని, మిగిలిన సగం సుమారు   మూడువేల ఎనిమిది వందలు కా.. కి ఇస్తున్నాడు.

ఇద్దరూ కష్టపడుతున్నారు. రోజూ కనీసం రెండు గంటలు ప్రిపరేషన్ కి కేటాయించుకున్నారు. అప్పుడప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి పాఠాలు ప్రింట్ అవుట్లు తెచ్చుకుంటున్నారు. ముఖ్యమైన పాఠాలు పిల్లలకి ప్రింట్ అవుట్ కాపీలు ఇస్తున్నారు.  పిల్లలకి నేర్పాలనే తమ ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు ఆ గుడికి వెళుతున్నారు. అరటి పళ్ళో, కొబ్బరికాయో సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటల్లో పాఠాలు ఎక్కువుగా వస్తున్నాయి. పిల్లల ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలో చర్చించుకుంటున్నారు. ఆశ్చర్యంగా పిల్లల బాగోగులు వీళ్ళ దృష్టిలో ఎక్కువయ్యాయి. ఈ విషయం పిల్లల తల్లి తండ్రులు గుర్తించారు. సంతోషించారు. పక్క ఐదారు వీధుల్లో వీరి గురించి తెలిసింది. ఇంకో రెండేళ్ళకి వీళ్ళ పిల్లలు ఏభైకి చేరారు.  ఆరు  కన్నా చిన్నలకి రెండు వందల ఏభై తీసుకుంటున్నారు, ఏడు  ఎనిమిది లకి  మూడు  వందల ఏభై, తొమ్మిది పదిలకి ఐదు వందలు పుచ్చుకుంటున్నారు.   సుమారు పదహారు వేలు సమానంగా పంచుకుంటున్నారు.  

రెండు ఇళ్లలోనూ శాంతి సామరస్యాలు విరయడం మొదలైంది. సంపాదన చాలనప్పుడు ఇంట్లో కీచులాటలు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి,  అన్న విషయాలలో కా..కి, కా.....కి వాళ్ళ ఇళ్లలో చర్చల్లో ప్రాధాన్యత వచ్చింది. దాంతో బాధ్యతలు పెరిగాయని ఇద్దరూ అనుకోవడం జరిగింది. ఇంకా  సంపాదించడానికి మార్గాలు వెతకటం ఎక్కువయింది.    

కా....., కా.. ల స్నేహం మూడున్నర ఏళ్ళకి పైగా వర్ధిల్లుతోంది. కా..... కెమిస్ట్రీ చెప్పడంలో కూడా నైపుణ్యం పెంచుకున్నాడు. లెఖ్ఖలు, ఫిజిక్స్ కా.. చెపుతోంది. కా.. చిన్న క్లాసులకి ఇంగ్లిష్ కూడా చెప్పేస్తోంది. బాధ్యతలు సమానంగానే పంచుకుంటున్నారు. కానీ ఆశ్చర్యంగా వీరి మధ్య మరేమి రాలేదు. ఇద్దరూ కలిసి ఒక్కమాటు కూడా సినిమాకి వెళ్ళలేదు. గుడికి తప్ప మరొక చోటికి వెళ్ళలేదు. ఇప్పుడు సాయినాధ కాలనీలోని శివాలయం మీద గురి కుదిరింది రెండిళ్ళ లోనూ. అందరూ కలిసి వెళ్లడం మొదలయింది. అక్కడ పూజారి గారితో కూడా పరిచయం పెరిగింది.

కా..తల్లి మనసులో కోరిక కలిగింది. భర్తతో ఆలోచించింది. కానీ ఆయన సందేహ పడ్డాడు. స్నేహం అవసరం కొద్ది పెరిగింది  కానీ ఆటో వాడి కూతురుని కోడలుగా ఒప్పుకుంటారా? అనే భయంతో ముందుకు వెళ్ళడానికి సాహసించలేదు. కా..... తల్లి మనసు  కూడా, చనువుగా ఇంట్లో తిరిగే  కా.. ని చూసి ముచ్చట పడడం మొదలు పెట్టింది. కానీ ఆడపిల్ల తల్లి తండ్రులు చొరవ తీసుకోకుండా ఉంటే, తన మనస్సు చెప్పడం సబబు కాదేమో నని ఊరుకుంది.

శివాలయం పూజారి గారు పెళ్ళిళ్ళ పేరయ్య కూడా. ఒక రోజు ఏదో సందర్భంలో కా.. తల్లిని అడిగారు,
 “అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా?” అని.
“ఇంకా లేదండి. మొదలు పెట్టాలి” అని జవాబు ఇచ్చింది.
అప్రయత్నంగా, అనాలోచితంగా అక్కడే ఉన్నా కా..... తల్లి అనేసింది,
“సంబంధాలు చూడాలా? మా వాడు పనికి రాడా” అని.
కా.. తల్లి ఆనందంతో తబ్బిబ్బైంది. మరుక్షణం కా..... తల్లి చేతులు పట్టుకొని కళ్ళ కద్దుకుంది.
పూజారి గారు “శుభం” అన్నారు.

విషయం తెలిసి కా..... కా.. దీర్ఘంగా చర్చించుకున్నారు. తమ చర్చల సారాశం తల్లి తండ్రుల ముందు ఉంచారు.
కా.. సంపాదనలో సగం తండ్రికి ఇస్తుంది. కా.. తండ్రి రాత్రి ఎనిమిది తరువాత ఆటో తోలరాదు. మిగాతా సగంలో మూడు వంతులు కా..... చెల్లెలు, చదువుకి,  పెళ్ళికొరకు బేంకులో వేయాలి.
కా..... సంపాదనలో సగం ఎప్పటిలాగానే తండ్రికి ఇవ్వాలి. మిగతా సగంలో మూడు వంతులు ఇదివరకు  లాగానే కాంట్రాక్టరు అప్పు వాయిదాలు కట్టాలి. ఇంకో ఏడాది తరువాత,  అప్పు తీరిన తరువాత కామాక్షితో చర్చించి తమ భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలి. కొంత  కా..... చెల్లెలి పెళ్ళికి ఉపయోగించాలి.
చెల్లెలి పెళ్లి అయేవరకు ఇంట్లో పసిపాపలు రాకుండా చూసుకోవాలి.
కా..... తల్లి తండ్రులు అంగీకరించారు. కా.. తల్లి తండ్రులను ఒప్పించారు.

ఒక శుభదినాన ఉదయం, దేవుని సాక్షిగా,  పూజారి గారి ఆధ్వర్యంలో గుళ్ళో కా..... కా..  దండలు మార్చుకున్నారు. రిజిష్టారు ఆఫీసు కెళ్ళి సంతకాలు పెట్టారు. సాయంకాలం,  దగ్గర బందుమిత్రులకి ఒక ఇరవైఐదు మందికి విందు ఇచ్చారు. మొత్తం ఖర్చు రూ. 6400 రెండు కుటుంబాలు సమానంగా పంచుకున్నాయి.

(ఆ తరువాత ఏమైంది అంటారా? శుభం కార్డు పడ్డ తరువాత సంగతి మనకు ఎందుకు? అయినా బాధ్యతల నుంచి తప్పుకోని  పిల్లలకి కష్టాలు కొన సాగుతాయేమో కదా.)  

గమనిక :- ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 11/11/2014 న ప్రచురించబడింది.                                   

8 కామెంట్‌లు:

sarma చెప్పారు...

లెక్కలే కనపడ్డాయి ప్రేమ బదులు. :)

లక్ష్మీ'స్ మయూఖ చెప్పారు...

అమ్మో 1వ తారీఖు సినిమా గుర్తుకువచ్చింది.భాద్యతలు తెలిసినపిల్లలు చేసే ఏ పనిని తప్పు పట్టలేము.

లక్ష్మీ'స్ మయూఖ చెప్పారు...

అమ్మో 1వ తారీఖు సినిమా గుర్తుకువచ్చింది.భాద్యతలు తెలిసినపిల్లలు చేసే ఏ పనిని తప్పు పట్టలేము.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శర్మ గారికి,

అవును సారూ. ఎంత సంపాదించినా కొందరి లెఖ్ఖలు కుదరవు. ధన్యవాదాలు.

స్వరాజ్య లక్ష్మి గారికి,

అవునండి. ధన్యవాదాలు.

Zilebi చెప్పారు...



బులుసు వారు,

ఖచ్చితం గా ఇది అసలు సిసలైన ప్రేమ కథే!

సమాజం లో తమ బాద్య్హతల్ని మరిచి పోకుండా, ఆకాశం లో కోతలు, కోటలు కట్ట కుండా, సినిమాల్లో స్విజ్ లో పాటలు పాడు కో కుండా, నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుంటే నే గోదాట్లో దూకి చస్తా అని గ్లిజారిన్ కన్నీళ్లు లేకుండా సాఫీ గా కాకున్నా రోజు వారి కష్టాల తో కూడా ప్రేమాయణం సాగుతుంది అనడానికి మీ ఈ కథ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ !

ఇది మీరు సమాజంలో గమనించి రాసిన కథ అయి ఉంటె , ఇది సమాజానికి ఖచ్చితమైన ప్రతీక కూడాను !!

ముందు ముందు మీరు మరిన్ని కథల టపాలు రాయాలి ! (బ్లాగు లో నైనా , ఈ మాట లో నైనా, పత్రికల్లో నైనా ఎక్కడైనా కూడా!)

చీర్స్
జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి,

ధన్యవాదాలు.ఏలూరులో ఉండగా ఒకరి గురించి వినడం జరిగింది. దానికి కొంత జోడించి కధ వ్రాయడం మొదలుపెట్టాను. కొంత నడిచిన తరువాత నాకు తెలియకుండానే కధలో హాస్యం తప్పుకుంది. మార్చుదామని ప్రయత్నించాను కానీ కుదరలేదు...దహా.

Karthik చెప్పారు...

Superb superb sir..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

https://bulususubrahmanyam.blogspot.com

నా బ్లాగు కొన్ని సంకలినిలు కి అనుసంధానం చేయబడింది. ముఖ్యంగా మాలిక (http://maalika.org), శోధిని (http://www.sodhini.com), జిలేబివదన (http://zilebivadana.blogspot.com ), తెలుగు బ్లాగులు (http://100telugublogs.blogspot.com/?m=0), జల్లెడ (https://www.jalleda.com ), ఇంకా ఒకటి రెండు.
నా బ్లాగు జల్లెడ లో చాలా కాలం గా రావడంలేదు. గత కొన్ని నెలలుగా నా బ్లాగు ఒక్క మాలికలోనే కనిపిస్తోంది. అప్పుడప్పుడు మిగతా వాటిలో కనిపిస్తోంది కానీ చాలా ఎక్కువ మాట్లు ఒక్క మాలిక లోనే కనిపిస్తోంది. ఏమైనా కామెంట్లు వస్తే అవి, అన్నీ చోట్లా కనిపిస్తున్నాయి (జల్లెడ లో తప్ప) కొంత మంది మిత్రుల బ్లాగుల్లో వారు చదువుతున్న బ్లాగుల లిస్టు లో కూడా నా బ్లాగు టపాలు పాతవే కనిపిస్తున్నాయి.
మిత్రుల సలహాతో కొన్ని చర్యలు నా బ్లాగు సెట్టింగ్స్ లో చేపట్టాను. కానీ ఫలితం కనిపించలేదు.
ఈ సమస్యకు పరిష్కారం ఎవరికైనా తెలిస్తే నాకు తెలియ జేయ ప్రార్ధన. నా మెయిల్ srisubrahlaxmi@gmail.com కి కూడా పంపవచ్చు. ధన్యవాదాలు.