ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి.

గమనిక : - మొదట ఈ టపా ఫిబ్రవరి 7, 2011 న పబ్లిష్ చేశాను. కానీ ఆ మధ్యన నా పొరపాటు వల్ల ఈ టపా డిలీట్ అయింది. టపాతో పాటు కామెంట్లు కూడా పోయాయి. అందువల్ల ఈ టపా మళ్ళి రీపోస్ట్ చేస్తున్నాను, కామెంట్లతో సహా. మొదటిమాటు ఏభై పైగా కామెంట్లు వచ్చిన టపా కాబట్టి ఈ టపా అంటే నాకు ప్రత్యేక అభిమానం.  
61 కామెంట్ల వల్ల  ఈ టపా పెద్దదిగా ఉంది.  కొంచెం ఓపిక చేసుకొని పూర్తిగా చదవాలని కోరుతున్నాను.
 
Monday, February 7, 2011
ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి. 

ఈ రోజు కి నేను బ్లాగు ల్లోకి వచ్చి 239 దినాలయింది. ఈ లెఖ్ఖ ఏమిటి? ఆ అంకె ఏమిటి? సందేహం లేదు వీడు తిక్క శంకరయ్యో  లేక పిచ్చిపుల్లయ్యో అయి ఉండాలి. కాకపోతే వీడి బుఱ్ఱ లోంచి ఏదైనా ఇస్క్రూ కిందపడిందా అని వెతక్కండి, నాది కొంచెం పురాతన బుఱ్ఱ కాబట్టి వదులై పడిపోయిన ఇస్క్రూ లు మళ్ళీ బిగించడం కుదరదు.

ఆ మధ్యన , ఈ మధ్యన కూడా చాలామంది బ్లాగ్మిత్రులు బ్లాగుల్లో ఏదో ఒక దిన మహోత్సవం జరుపు కున్నారు. రెండు వందల టపాల శుభదిన మహోత్సవానికి  ఆహ్వానం కొంతమంది పలికారు.  కొంతమంది హహ్హహ వందవ టపా అన్నారు.  అర్ధశతం నాదే నాదే అని కొంత మంది పాడుకున్నారు.  లక్ష హిట్స్ నా బ్లాగులో అని కొంతమంది సంబర పడిపోతే, ఏభై వేలదాకా మా బ్లాగు లోనూ వచ్చారు అని కొంతమంది  ప్రకటించారు. మాకూ ఉన్నారు పాతిక వేల వీక్షకులు అని మరికొంత మంది సన్నాయి నొక్కులు నొక్కారు. అయ్యబాబోయ్ అప్పుడే రెండేళ్ళు గడిచి పోయాయి బ్లాగు లోకి వచ్చి అని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, మాకూ ఏడాది గడిచిపోయింది  చూస్తుండగానే అని  కొంత మంది ఆనందించేశారు. 

ఇవన్నీ చూసి,  వాళ్ళందరికీ అభినందనలు చెప్పిన తరువాత, నాకూ దురద పుట్టింది.  నేను కూడా ఏదో ఒక దినం చేసుకోవాలని  ముచ్చట పడిపోయాను . తద్దినం ఏమైతే బాగుంటుందా యని నిశితంగా చింతించాను. దీర్ఘంగా ఆలోచించాను. బహు విధముల పరిశీలించాను. నాకు  ఈ ఉద్దేశ్యం కలగ డానికి ముందే ద్విశత దినం గడిచిపోయింది.  ఏడాది ఆగటానికి మనస్సు ఒప్పటం లేదు. కనీసం పాతిక టపాలు అని డబ్బా కొట్టేస్కుందా మనుకుంటే అది కూడా ఇంకో రెండు నెల్లు పట్టేటట్టుంది.  కష్టపడి, చెమటోడ్చి, చేతులు అరగదీసుకొని, బుఱ్ఱని మధించి  ఎనిమిది  నెలల కాలం లో 21 టపాలు మాత్రమే వేయగలిగాను.      పోనీ పాతిక వేల హిట్స్  అనుకుంటే   ఇంకో  ఏడాదికి  కానీ ఆ భాగ్యం కలిగేటట్టు లేదు. బతిమాలగా, ప్రాధేయ పడగా, పడగా   మొన్నటి  దాకా  అంటే సుమారు  నెల  రోజుల క్రితం,   పదివేల మంది వచ్చి చూసి వెళ్లారు  నా బ్లాగు.  పోనీ ఇంకో కొంత కాలం ఆగుదామనుకుంటే, గత ఆర్నెల్ల కాలం లో ముగ్గురు మిత్రులు ఊర్వశిని,  రంభని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు.   ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ అన్న ఘంటసాల గారి పాట గుర్తుకు వచ్చింది. కానీ దినం చేసుకోవాలని క్రూర నిశ్చయం తో ఉన్నాను కాబట్టి ఎడాపెడా, చెడామడా ఆలోచించేసాను.   కిం కర్తవ్యం  అని సంస్కృతం లో కూడా విచారించాను. ఈశ్వరుం డను కూలించ తలచునో తలచడో అని కూడా ఆక్రోశించాను.    ఇల్లా ఏడ్చిన ఏడ్పు ఏడవకుండా ఏడుస్తుంటే, ఆకాశంలోని మెరుపు నా బుఱ్ఱలో  కలుక్కు మంది. ధన్యుడ  నైతిని దేవ దేవా అని పాడుదా మను కున్నాను కానీ మిగతా చరణం  గుర్తుకు రాక ఆపేయాల్సి వచ్చింది. మెరుపు ఏమిటంటే గూగులయ్యనే   అడిగితే  సమస్య తీరిపోతుందని. 

సరే యనుకొని కార్యోన్ముఖుడనై,  గూగులయ్యా గూగులయ్యా  నేను ఏ రోజు చేసుకోవాలి అని ఎడ్రస్సు బారు లో రాసి  ఓ నొక్కు నొక్కాను. సారీ మాదగ్గర అల్లాంటి పదాలకి అర్ధాలు లేవు అని జవాబు ఇచ్చాడు  మిస్టర్. గూ . నేను కూడా కొంచెం గజనీ మహ్మదు టైపు, పాసు అయ్యేదాకా మళ్ళీ మళ్ళీ పరీక్ష రాస్తూనే ఉంటాను.  ఈ మాటు ఇంకొంచెం తెలివిగా నాలోచించి తద్దినం   అని రాసి నొక్కాను.

3980 రిజల్ట్స్  ఇన్ 0.06 sec.  అన్నాడు మిస్టర్. గూ.

అబ్బే లాభం లేదు అనుకొని,  తద్దినము  అని రాసి నొక్కాను.  

412 రిజల్ట్స్  ఇన్ 0.08 sec. అని జవాబు ఇచ్చాడు గూగులయ్య.

తక్కువ రిజల్ట్స్ కి ఎక్కువ టైము ఎందుకు తీసుకున్నావు అని కోప్పడ్డాను Mr. గూ ని. హిహిహి అని నవ్వాడు. ఇంకొంచెం తీవ్రం గా చింతించి  తత్ దినం   అని నొక్కాను.

164 రిజల్ట్స్  ఇన్ 0.09 sec. , హహహ  అన్నాడు  గూ.

అప్పుడు  లాంగ్  లాంగ్ గా ఇంగ్లీష్ లో థింకేను. థింకగా థింకగా  ఖళ్ళున  మళ్ళీ మెరిసింది.  అప్పుడు   తత్ దినము  అని లిఖించి, లేచి నుంచోని శుక్లాం బరధరం   సరస్వతీ నమస్తుభ్యం  అంటూ ఒక అరడజను శ్లోకాలు వచ్చీ రానివి, పూర్తిగా తెలియనవి  చదివేశాను. ఎందుకైనా మంచిదని  మా ఆవిడని కూడా తలుచుకొని  నేనే మా ఆవిడ గారి   మొగుడి గాడి  నైతే , త్రికాలంబు లందు సతి పదాంబుజ సేవ తప్ప అన్య  మెరుంగని ఇంటాయన నైతే, ఈ నొక్కు తోటి గూగులయ్య నిక్కమైన నిజంబు వక్కాణించు గాకా  ఆ ఆ ఆ   అంటూ ని నా నోట్లో పది నిముషాలు నానబెట్టి, సాగదీసి, చీల్చి చెండాడి, నానా హింసా పెట్టి  ఒక్క  నొక్కు నొక్కాను.

365  రిజల్ట్స్  ఇన్  0.13 sec. అని ఒహ్హోఃహో అని వికటంగా  పరిహసించాడు గూగులయ్య. 

నాకు అంతటా కాలింది, కాబట్టి మండింది. సత్యం చెప్పమన్నాను గదా యని మరీ ఇంత నిఖార్సైన పచ్చి నిజం వచించాలా  ధూర్త గూగులయ్యా అని క్రోధించితిని.  పైగా పరిహాసమా అని దూషించితిని. ఎన్ని రిజల్ట్స్ అంటే అన్ని రోజులకి అని  అనుకున్నందుకు తగిన శాస్తి అయినదని గూగులయ్య సంతోషించాడా  అని అనుకున్నాను.  కానీ నేను ఇల్లాంటి తాటాకు చప్పుళ్ళకి బెదిరే  కుందేలు లాంటి వాడిని కాదు.  ధీరుడిని. ఏనుగు లక్ష్మణ కవిగారు చెప్పిన భర్తృహరి సుభాషితాలలోని ధీరుడిని అన్నమాట.  ధీరుల్ విఘ్న నిహన్య  మానుల గుచున్  దృత్యున్నతో త్సాహంబునన్,  విజృభించేస్తాను అన్నమాట. Failure is but the first step in achieving success. అని బాగా తెలిసినవాడిని. ఫైల్ కాకుండా ఎప్పుడు పాస్ కాలేదు నేను. జయమ్ము నిశ్చయమ్ము రా భయమ్ము లేదురా అని పాడుకున్నాను. పదండి ముందుకు పదండి ముందుకు అని ఆలాపించాను.  నేనొక్కణ్ణీ నిల్చిపోతే  చండ్ర గాడ్పులు  వాన మబ్బులు భూమి మీద భుగ్నమౌతాయి అని కూడా అనుకున్నాను, అర్ధం   తెలియక పోయినా, అవసరం లేకపోయినా.  నా కుశాగ్ర బుద్ధికి ఇంకా పదును పెట్టి శోధించాను. ఉన్నట్టుండి కుశాగ్రము నా మెదడు ని గుచ్చింది. నిద్ర బోతున్న  నాలోని మాథెమాటిక్స్  జీనియస్ లేచాడు. అంతే నాలుగు స్టెప్స్ లో ప్రశ్న కి సమాధానము చెప్పేశాడు.

365+164+412+3980  = X + Y
(X*3-1)1/2 of 3/4  = Y + {2 (X2  +Y-1  )}
Therefore   X = Y/2 – 3                 
 So,    X = 237

ఏమండోయ్ ఆ ఇంట్లో / ఆఫీసు లో ఎవరైనా ఉన్నారా? ఒకమాటు అర్జెంటు గా ఇటు రండి. ఆ కంప్యూటర్ ముందు కూచున్న ఆయన/ఆమె మొహం మీద కాసిని  నీళ్ళు చల్లండి. కాసిని నీళ్ళు తాగించండి. అమ్మయ్య స్థిమిత పడ్డారా. మళ్ళీ చదవడం  మొదలు పెట్టండి.  

చిన్నప్పుడు  నేను లెఖ్ఖలు చేస్తే  మా లెఖ్ఖల మాష్టారు కూడా ఇల్లాగే కింద పడిపోయేవారు. లేకపోతే ఆ లెఖ్ఖలేమిటండీ.  ఒక ఆరడుగుల పొడుగు ఒకటిన్నర అడుగుల వ్యాసం కల పీపా  ఉండెను. దానిలోకి ఒక గొట్టం ద్వారా గంటకు 167.53 lts.  నీరు చేరును. పీపాకు కింద ఒక చిల్లు ఉండును. ఆ చిల్లు లోంచి గంటకు 158.79 lts నీరు కారిపోవును.  ఆ పీపా నిండుటకు ఎన్ని గంటలు పట్టును? ఇది ఓ లెఖ్ఖల ప్రశ్న. అర్ధం ఉందా. మెడమీద తలకాయ ఉన్న వాడెవడైనా చిల్లు పీపాలో నీళ్ళు నింపుతాడా? లెఖ్ఖల మాష్టార్లు తప్ప. అందుకనే ఇల్లాంటి ప్రశ్నలకి  నేను అల్లాంటి జవాబులే వ్రాసే వాడిని.

సరే తద్దినం 239 వ రోజున చేసుకుందామని నిర్ణయించు కున్నాను. అదేంటి లెఖ్ఖలో 237 అని కదా వచ్చింది అంటారా. మరి ఇప్పుడో లెఖ్ఖ చెప్పాను గదా, దానికి ఇంకో రెండు మార్కులు  కలిపా నన్నమాట. సరే ఇంత కష్టపడి లెఖ్ఖలు చేసినందుకు ఈ బ్లాగులోని గణాంకాలు కూడా కొంచెం సిగ్గుపడుతూ నైనా చెప్పేస్తాను.  ఏముంది  చెప్పడానికి అని ఆలోచిస్తుంటే, చెప్పడానికి ఏమీలేక, ఏం చెప్తే  ఎవరు ఏం అనుకుంటారో అనుకుంటూ  చెప్పడంకన్నా చెప్పక పోతే మేలుకదా అని భావించినా , ఏదో ఒకటి చెప్పడం ఇష్టంలేక పోయినా  ఏమైతే అది అనుకొని చెప్పాలని చెప్పేస్తున్నా నన్న మాట.

ఇప్పటి దాకా నా బ్లాగు లోకి వచ్చిన బంధు మిత్రులు 11590.    నేను  మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను  అన్న టపా వేసిన రోజున 484 మంది నా  బ్లాగులోకి వచ్చి నాకు ధైర్యం చెప్పి వెళ్ళేరు. ఇప్పటి దాకా ఒక రోజుకి  నా బ్లాగు లో  ఇది రికార్డు. మా ఆవిడ అని శీర్షిక ఉన్న టపాలు అన్నీ top 5 లోకి వచ్చేశాయి. మధ్యలో  మీ ఆయన మిమ్మలని ఎంత ప్రేమిస్తున్నాడు  అన్న టపా చేరింది. ఇవన్నీ 500 మందికి పైగా చదివారు. విడాకులు చదివిన వారు  629  ఇప్పటి దాకా ఇది రికార్డు . భానుమతి గారి అత్తగారి కధలు లా, మా ఆవిడ ముచ్చట్లు కధలు కి సాహిత్య ఎకాడమీ అవార్డ్  కాక పోయినా బ్లాగెకాడమి బహుమానం ఏమైనా ఉంటే వచ్చేస్తుందేమోనని భయం వేస్తోంది. ఇంత అడ్వెర్టైజ్మెంట్ చేసుకున్న తరువాత  ఐనా  ఇవ్వకపోతారా అన్న అనుమానం, ఆశ  వచ్చేస్తున్నా యన్న మాట. హిహిహి హహహ.

 జూన్ 12, 2010 న బ్లాగు మొదలు పెట్టాను. 14 న మొదటి టపా వేశాను. సంకలినులు ఉన్నాయని అప్పుడు తెలియదు. రెండు టపాలు వేసిం తరువాత  జూలై 1 న కూడలి లో చేర్చాను.  ఆ తరువాత మాలిక, జల్లెడ లలో చేర్చాను  15-20  రోజుల  తరువాత. హారం లో నా బ్లాగు లేటు గా చేర్చాను.  8  టపాల తరువాత అనుకుంటాను.  అన్ని సంకలినుల నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.  నా బ్లాగులో మొదటి కామెంటు    శ్రీలలిత గారు  పెట్టారు. 21 టపాలకీ సుమారు గా 570 కామెంట్లు వచ్చాయి.  శ్రీలలిత  గార్కి  హృదయ పూర్వక  ధన్యవాదాలు చెప్పుతున్నాను.  నా మొదటి టపాకు  ఒకే ఒక్క కామెంటు  తార గారిది.  మొదట్లో  బ్లాగుల గురించి అంతో ఇంతో నేను తెలుసుకున్నది తార గారి ద్వారానే. వారికి నా కృతజ్ఙతా పూర్వక ధన్యవాదాలు.  కామెంట్లు పెట్టిన వారందరికి హృదయపూర్వక కృతజ్ఙతా
భివందనములు. 

 జూలై 4 వ తారీఖున వీవెన్ గారి వద్ద నుంచి ఒక ఈమైల్ వచ్చింది.  అక్షర సున్నా కి అంకెల సున్నాకి తేడా తెలియ చెప్పేరు. వారి ద్వారా కొన్ని అక్షరాలు తెలుగులో టైప్ చేయడం ఎలాగో నేర్చుకున్నాను. వారికి ధన్యవాదాలు. ఆ తర్వాత  జ్యోతి  గారి  ద్వారా మరి  కొన్ని నేర్చుకున్నాను.  వారికి కూడా          ధన్యవాదాలు.  Nerpu.com  వారిని  కూడా  కొన్ని ప్రశ్నలతో విసిగించాను.  ఓపికగా  future accountant  గారు సమాధానాలు పంపించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే,  నేర్చుకుందా మనుకుంటే  నేర్పేవారు, సహృదయులు  బ్లాగుల్లో చాలా మందే ఉన్నారు.  బ్లాగు మొదలు పెట్టినప్పుడు  ఈ వయసు లో నేర్చుకోవడం  నా వల్ల అవుతుందా అని అనుమానించిన మాట నిజం. ఇప్పుడు ధైర్యం వచ్చింది.  బ్లాగులో మంచి మిత్రులు,  శ్రేయోభిలాషులు దొరికారు.

చివరగా చెప్పాల్సిన కానీ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. సెప్టెంబర్ 27, 2010 న శ్రీనివాస్ పప్పు గారు నా బ్లాగులోకి  వచ్చి  ఒక కేక పెట్టారు.  అప్పటి నించి నా బ్లాగులో సుమారు  ఒక 15- 20%  వీక్షకులు పెరిగారు.  శ్రీనివాస్ పప్పు గార్కి నా కృతజ్ఙతా పూర్వక ధన్యవాదాలు.

కొంతమంది నేను బ్లాగులో వ్రాసేవి నా స్వీయ కధలు  అని అనుకుంటున్నారని  అనుమానంగా ఉంది. ఇక్కడ నేను వ్రాసేవి పూర్తిగా కల్పితాలు. ఎవరిని ఉద్దేశించి వ్రాసినవి కావు.  నేను వ్రాసే కధలలోని  మా ఆవిడకి కానీ ప్రభావతికి కానీ నిజ జీవితం లో నా శ్రీమతి  కి స్వభావం లో కానీ ప్రవర్తనలో కానీ పోలికలు లేవు లేవు లేవు అని ముమ్మారు నొక్కి వక్కాణిస్తున్నాను, బల్ల గుద్ది ఉద్ఘాటిస్తున్నాను. వారు వారే  వీరు వేరే అని కూడా వినమ్రంగా  మనవి చేసుకుంటున్నాను.  ఒక్క టపా  వీరివీరి గుమ్మడిపండు వీరిపేరేమి లో నేను కొంచెం కనిపిస్తాను. అది కూడా 75% కల్పితమే.  సరదాగా నవ్వుకోవటానికి  నేను,  మా ఆవిడ అని రెండు పాత్రలు  తో వ్రాస్తున్నాను. అన్నట్టు కధలో నేను కూడా నిజంగా నేను కాదు.

 పెద్దలు అన్నారు  “What cannot be mended has to be endured.”   So friends,   you may have to endure me for some more time.  Thank you all.  

                                                 
 

61 comments:

కృష్ణప్రియ said...   ౨౩౯ వ దిన శుభాకాంక్షలు.. ఇలాగే.. 477 వ మరియు.. 1893 వ దినాలు కూడా మీరు జరుపు కోవాలని.. దానికి 2637 కామెంట్లు దాటి రావాలని.. కోరుకుంటూ.. బ్లాగుకి నా అక్షింతలు.. మీకు నా శుభాభినందనలు... :)              February 7, 2011 at 8:03 AM 

కావ్య said...     మాస్టారు మీ ఇంటి లాండ్ లేన్ నెంబర్ ఇస్తారా :p     February 7, 2011 at 8:29 AM 

SHANKAR said...   అంతే కాదండోయ్ ఈ రోజు మీ బ్లాగులో పోస్టులు, మీ బ్లాగును ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్యా సమానమయింది. ఇది సంఖ్యా శాస్త్ర ప్రకారం మహత్తరమయిన ఘట్టమన్నమాట. ఇక బ్లాగ్వాస్తు శాస్త్రం ప్రకారం మీ బ్లాగులో ఉత్తర, దక్షిణాలలో తగినంత ఖాళీ స్థలం వదలక పోవడం వలన మీరు రెగ్యులర్ గా రాయలేకపోతున్నారు, ఈశాన్యం లో తాజా కామెంట్లు యాడ్ చేయండి :))))). రోజూ ౧౦౮ సార్లు కూమాహా మంత్రం జపించండి (కూడలి, మాలిక, హారం).
ఇంక మీ లెక్కల ఈక్వేషన్లు అదుర్స్. మీదయినా శైలి లో ఆసాంతం ఈ పోస్ట్ మనసారా నవ్వించింది. శీఘ్రమేవ సహస్ర పోస్టు ప్రాప్తిరస్తు.          
February 7, 2011 at 8:33 AM

 సిరిసిరిమువ్వ said...      మీ 239 వ దినానికి అభినందనలు. టపా చాలా బాగుంది. మీ టపాలన్నీ చదువుతాను గాని ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయలేదు. ఇప్పుడున్న మంచి బ్లాగుల్లో మీది కూడా ఒకటి! ఇలానే వ్రాస్తూ మమ్ముల్ని నవ్విస్తూ ఉండండి.    February 7, 2011 at 8:55 AM

 నీహారిక said...     This comment has been removed by the author.

రమణి said...   మీ బ్లాగు 239 వ దినం సంధర్భంగా మీకు మీ బ్లాగు కి శుభాభినందనలు. మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను.    February 7, 2011 at 9:17 AM

రమణి said...     @కావ్యా :ఏంటో అందరి ఫోన్ నంబర్లు అడ్గుతున్నారు.. అసలే ఈరోజు ఉదయాన్నే బ్లాగుల్లో కిడ్నాప్ మూఠా చేరారని (కిడ్నాప్లో నేను కూడా చేయి వేస్తానని హామీ ఇచ్చాననుకొండి) నిఘావర్గాలు చెప్తున్నాయి. బులుసు గారు కూసింత జాగ్రత్త అవసరం ;)         February 7, 2011 at 9:19 AM

  కృష్ణప్రియ said...     @SHANKAR,    LOL    February 7, 2011 at 9:25 AM

శ్రీనివాస్ పప్పు said...   హ్హహ్హహ్హ భలేవారే గురువుగారూ గంధం చెట్టునించి సువాసనొస్తుందని ఒకరు చెప్పాలా,అలాగే మీ బ్లాగు గురించి కూడా(మీ చాతుర్యమే వేరూ)...  February 7, 2011 at 9:27 AM

  చెప్పాలంటే...... said...       మీ 239 వ దినానికి అభినందనలు. టపా చాలా బాగుంది. మీకు నా శుభాభినందనలు... :)  February 7, 2011 at 9:48 AM

 Weekend Politician said... ha ha..too good, hilarious February 7, 2011 at 9:54 AM

 వేణు said...   >> .. కానీ దినం చేసుకోవాలని క్రూర నిశ్చయం తో ఉన్నాను కాబట్టి ఎడాపెడా, చెడామడా ఆలోచించేసాను. >>       అక్షింతలు వేసేస్తా గానీ, కచ్చితంగా ఎన్ని వెయ్యాలో సమీకరణం రాయాలి మరి...! :):)

రాధిక(నాని ) said...    :)) హహ్హహ్హమీరు బలే రాస్తుంటారండి.మీ బ్లాగ్ కి ౨౩౯ వ దినం సందర్బము గా శుభాభినందనలు వందనాలండి.మీరిలాగే మమ్మల్ని నవ్విస్తూ మంచి మంచి పోస్ట్లు రాస్తున్డాలండి.

harephala said...   ఏమిటో లెఖ్ఖలూ గట్రా వేసెసి నన్ను కన్ఫ్యూజు చేసేశారు.ఎప్పుడో అప్పుడు ధైర్యం చేసేసి, మీ ఇంటావిడ గురించి వ్రాయండి. కల్పిత కథలు చదువుకోడానికి కావలిసినన్ని పుస్తకాలున్నాయి. మరి బ్లాగులెందుకుట?ఇంట్లో వాళ్ళ గురించి వ్రాయడానికే కదా! మహ అయితే ఒకరోజు ఉపోషం చేయవలసొస్తుంది. అదేం పెద్ద గొప్పా ఏమిటీ? ఆంధ్రదేశం లో ఏ రాజకీయనాయకుణ్ణడిగినా, ఓ గుడారం వేసి పెట్టేస్తాడు! పెరుకి పేరూ,మీ కడుపుబ్బరం తగ్గించుకోడానికి ఓ అచ్చోణీ లాటి సలహా ఇది! ఆలశించిన ఆశాభంగం!!

 Ennela said...   //మెడమీద తలకాయ ఉన్న వాడెవడైనా చిల్లు పీపాలో నీళ్ళు నింపుతాడా? లెఖ్ఖల మాష్టార్లు తప్ప//
హహహహ్హాహ్హ ,,,నిజమే సుమండీ,,ఎవరూ గమనించి "నట్లు" లేరు.,లేక పోతే యీ పాటికి "నట్లు" పీకేసే వారేగా...
అరెరె, మీరు మీరు కాదు అని చెప్పి ఇంత డిస్సప్పాయింట్ చేస్తారా? నేనొప్పుకోనంతే. మీరేదో కత్తితో గీకే చిట్కా చెప్తారని ఇంకా...ఆ...అ..ఆ ఎదురుచూస్తున్నా తెలుసా..(నా 'రంగు పడుద్ది  టపా కాలం నించీ)
మాస్టారూ, మీరు ఇలా లెక్కలెయ్యక్కర లేదు..మీరు టపా వ్రాసిన ప్రతి రోజు మాకు పండగే...
మీరు గబ గబా బోల్డు టపాలు వ్రాసేసి మమ్మల్ని బాగా బాగా నవ్వించెయ్యలని కోరుకుంటున్నా...మీకు 239 వ అభినందనలు.                 
February 7, 2011 at 11:29 AM

 ఆ.సౌమ్య said...   మీరు ఏం చేసినా వెరైటీగానే చేస్తారండీ...మీ మార్క్ ఉంటుంది...కేక
 మీకు 239 వ దినానికిగానూ శుభాకాంక్షలు.      February 7, 2011 at 12:02 PM 

జ్యోతి said...     Congratulations..     February 7, 2011 at 4:00 PM 

..nagarjuna.. said...     గురువుగారు, ఈ టపా చదివాక మాలో/లోన్/లోపల/యొక్క ప్రతిస్పందనలు తెలియచెప్పడానికి తెలుగు భాషలోని అలంకారాలేమి సరిపోయేట్టు. కత్తి, గడ్డపార,గునపం,కొడవలి, ఉరుము, మెరుపు, కెవ్వు, కేక, రచ్చ ఇత్యాది విశేషణాలను ఇంతకుముందే వాడేసి వున్నవారము కాబట్టి ఈ టపాను కీర్తించుటకు పదాల కొరత వున్నది.
ఏమిఅనుకోకపోతే ఆ గూగుల్‌ వాడిని కామెంటుబాక్స్‌తో పాటు ఒక audio input సౌలభ్యం ఏర్పాటు చేయవలసిందిగా కోరగలరు. పాఠకులు ఎంతగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారో తెలుసుకోవచ్చు.

 Manju said...   హెహెహె...దినం బాగా జరిపారండి    February 7, 2011 at 4:12 PM

 SHANKAR.S said...   చూసారా పొద్దున్నించి ఇప్పటికి మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇంకో ఇద్దరు పెరిగారు. అంతా సంఖ్యా శాస్త్రం మహిమ :)          February 7, 2011 at 5:35 PM

 భైరవభట్ల కామేశ్వర రావు said...   Proof by induction వగైరా రకరకాల ప్రూఫుల్లో Proof by confusion అన్న ఒక కొత్త విధానాన్ని మా ప్రొఫెసర్ గారు మాకు బోధించారు. మీ లెక్క చూస్తే అదే గుర్తుకు వచ్చింది! మీ బ్లాగిలాగే "దిన""దినా"భివృద్ధి చెందాలని నాలుగేం ఖర్మ, నాలుగువేల తొమ్మిదివందల ముప్ఫై రెండక్షంతలు వేస్తున్నాను.
ఇప్పటికి తెలుగు, లెక్కల సబ్జెక్ట్ల మీద మీకున్న కసిని వెల్లడి చేసారు, ఇంతకీ మీకు నచ్చిన సబ్జెక్టేమయినా ఉందా? :-)       
February 7, 2011 at 6:27 PM

 సుమలత said...   బావుంది అండి మీ దినం అందరు తెగ పొగిడేస్తున్నారు  మీ టపాలు గురించి అది ఏమిటో తెలియలేదు .నేను చదివిన మొదటి టపా నవ్వు కొన్నాను     February 7, 2011 at 6:51 PM

 సత్య said...    239 అంటే ఏమో అనుకున్నా....నిజమే  
సరదాగా నవ్వించదానికి మీకు సందర్భం అవసరం లేదు.
వర్తమానంలో లాగానే మీ బ్లొగ్ దినదిన ప్రవర్థమానమౌవ్వాలి.
అంకెలతో గారడి దాటి మీ బ్లొగ్ లోక ప్రియమవ్వాలి.
నవ్వే వాళ్లకి ఆయుష్షు పెరుగుతుందట
నవ్వించే వాళ్ళకి అభిమానులు పెరుగుతారు. మాలాగ!.
మా నవ్వులే పువ్వులై మీకందుతాయ్ మాలగా!!
naadi FAN.NO 20!!           
February 7, 2011 at 10:33 PM

  హరే కృష్ణ said...    239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి.     కెవ్వు..మీరు కేకంతే!
11000 పైచిలుకు హిట్లు వచ్చాయి.    ఇది ఎప్పటినించి? మీ గణాంకములు తప్పు అనిపిస్తోంది. ఏడాదిలో ఇంకా చాలా చాలా ఎక్కువేమో నని నా నమ్మకం :P
stat కౌంటర్ ని అస్సలు నమ్మలేమండి..ఇది ఎప్పుడెలా ఉంటుందో దానికే తెలియదు ఒక టైం వచ్చాక దానికదే ఆగిపోవడం బోలెడు శుభాకాంక్షలు!
inflation లో కూడా మీరు అక్షింతలు ఫ్రీ గా ఇస్తున్నారా ..ధర్మ ప్రభువులు :)                                        

 Sunil said...     నీహారిక గారి కామెంట్ కి బులుసు గారి జాబు ఎల్లా ఉంటుందో!! ఈ విషయం వేంటనే ప్రభావతి గారికి చెప్పకపోతే నాకు అన్నం సహించదు, ఆఫీస్ లో నిద్ర పట్టదు, అబ్బో ఇంకా చాలా చాలా జరగవు. ఇప్పుడేమంటారొ బులుసు గారు చూద్దాం.             February 7, 2011 at 11:47 PM

  Mauli said...   బాబొయ్ మీరు ఎప్పుడు కావాల౦టే అప్పుడు అక్షి౦తలు వేయి౦చుకొ౦టున్నారు కదా..మళ్ళీ 1893 వ దిన౦ దాకా ఈ టపా వెయ్యక౦డే :)
మీరు మీరు కాదు అన్నారు సరే ..మీరు మీరు గా వ్రాయడ౦ ఏ౦టి..మీరు ఆమె లా వ్రాస్తే మీ అభిమాన స౦ఘాలు వచ్చి ఉ౦డే వి :)
నిహారిక గారూ, సుబ్రహ్మన్య౦ గారి౦ట్లో అప్పడాల కర్ర ఉ౦ది, అని ఈ టపా ద్వారా తెలిసి౦ది ..మీ వ్యాఖ్య చదివిన వాళ్ళావిడ వీరి ని అప్పడాల కర్ర తో తగు విధమ్ గా సత్కరి౦చితిరి..కావున వె౦టనే వ్యాఖ్యలకు స్ప౦ది౦చ లేకున్నారు.. :)        బులుసు గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ...౨౪౦ వ దిన౦ శుభాభివ౦దనములు ...

 Mauli said...   బులుసు గారు, మీ ఆత్మ పైన వ్యాఖ్యాని౦చిన Sunil గారి రూప౦ లో వచ్చి౦ది చూడ౦డి ...(ఇద్దరి వి ఒకే బ్లాగు :))
మీ నీడ బ్లాగులపై తమరి స్ప౦దన ఖోరుచున్నాము :)          
February 8, 2011 at 2:40 PM

 నీహారిక said...    This comment has been removed by the author.

కృష్ణప్రియ గార్కి, ......... 477వ దినం మరియు 1893వ దినం అన్నారు, మళ్ళీ వీటికి లెఖ్ఖలు చేయాలంటే కొంచెం కష్టం. మళ్ళీ  జీనియస్ ని నిద్రలేపాలి. అక్షంతలు బ్లాగుకే కదా నాకు కాదు కదా, అమ్మయ్యా   థాంక్యూ .

కావ్య గార్కి, ........... నా జీవితం తెరిచిన BSNL వారి హైదరాబాదు టెలీఫోను డైరక్టరీ. అనవసర విషయాలు ఎక్కువ, అవసర విషయాలు నిల్. చిన్న చిన్న అక్షరాలలో Dr. B. Subrahmanyam, South End Park అన్న చోట ఉండే నంబరు నాదే నాదే. మీకు లావుపాటి కళ్ళద్దాలు ఉంటే అందులోంచి చిన్న అక్షరాలు కనిపించవు ఆనుకుంటే 040 24122304 కి టెలిఫోన్ చేసి చూడండి. ఆపైన మీ అదృష్టం. థాంక్యూ.

శంకర్ గార్కి, ........... మీ సలహాలకి కృతఙ్ఙడి ని. ఆచరణీయమైన సలహాలు ఇచ్చారు. సంఖ్యా శాస్త్రం , బ్లాగ్వాస్తూ, జ్యోతిషం, నా చేతి రేఖలు, నా నుదిటి రాత ఇత్యాదులన్నీ బ్రహ్మాండం గానే ఉన్నాయి. కానీ మీకు తెలియనిది ఏముంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని కూడా అల్లాగే ఉన్నాడు. అక్కడికి మా ఆవిడ పూజలు గట్రా చేస్తూనే ఉంటుంది. ప్రసాదాలు, ఫలహారాలు గట్రా నేను సేవిస్తూనే ఉంటాను, తీర్ధం తో సహా. అయినా ఏమిటో ఏమి మార్పులేదు. సహస్ర పోస్టులు అయ్యబాబోయ్. 50 అయితే అనుమానం, 100 అయితే ఖాయంగా నా గుండె ఆగిపోతుంది.   
ఇప్పుడు ఫాలోయర్స్ 25 కి పెరిగారు. మళ్ళీ మీ లెఖ్ఖలు మీరు, నాలెఖ్ఖలు నేను మళ్ళీ మొదలు పెట్టాలేమో? మీ రెండు వ్యాఖ్యలకి ధన్యవాదాలు

సిరిసిరి మువ్వ గా ర్కి, ........... ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మీ వ్యాఖ్యలో మూడవ లైను వీనుల విందుగా కంటి కింపుగా నుండెను. మీరిలాగే కామెంట్లు పెడుతుండాలని కోరుకుంటున్నాను.                                                       
February 8, 2011 at 5:52 PM 

నీహారిక గార్కి, ......... ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. నన్ను లేపేస్తానన్నవారు ముగ్గురు నలుగురు ఉన్నారు. కారణాలు ఏమైనా, గీతాంజలి లో లాగైనా లే...చి..పో..దా..మా. అన్న వారు మీరొక్కరే. సంతోషం, అల్లాగే తప్పకుండా. కానీ ఒక చిన్న చిక్కు ఉంది. నాది కొంచెం భారీ శరీరం. దాన్ని లేపాలంటే ఓ crane కావాలి. అది పట్టుకొచ్చారంటే నన్ను లేపుకుపోవచ్చు. 

రమణి గార్కి, .......... ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి . అయినా నన్ను కిడ్నాప్ చెయ్యడానికి ముఠాలు, ప్రణాళికలు, అనవసర హైరానా ఎందుకు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వచ్చేస్తాను. కానీ మళ్ళీ నన్ను వదుల్చుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి మరి. జాగ్రత్త.

శ్రీనివాస్ పప్పు గార్కి, .......... ధన్యవాదాలు. కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి. కాకతాళీయమని మీరనవచ్చు. నన్ను ఇల్లాగే అనుకోనివ్వండి. అది నా తృప్తి. థాంక్యూ once more.

చెప్పాలంటే గార్కి, ...........  ధన్యవాదాలు మీ కామెంట్లకి.

Weekend politician గార్కి, ......... థాంక్యూ వెరీ మచ్.        February 8, 2011 at 5:55 PM 

వేణు గార్కి, ......... అయ్యా మళ్ళీ సమీకరణాలు అంటే కష్టం. మా లెఖ్ఖల జీనియస్సు ది కుంభకర్ణ నిద్ర. లేపాలంటే కష్టం పైగా ఖర్చు. అందుకని మీకు తోచినన్ని, గుప్పెడపట్టినన్ని వేసేయండి. దోసిలి యొగ్గితిన్.ధన్యవాదాలు

రాధిక (నాని) గార్కి, .......  మీ శుభాభినందనలకి నా ధన్యవాదాలు. రాయడానికి ప్రయత్నిస్తాను మీరందరూ నవ్వుతామని హామీ ఇస్తే.

హరేఫాలా గార్కి, ....... ఆవిడ గురించి రాయాలా? ఆయనే ఉంటే మంగలాడు ఎందుకు అన్న సామెత వినలేదా మీరు. అంత ధైర్యమే ఉంటే ఇప్పటికే లేచిపోయుండేవాడిని కదా. మీకు మల్లె మీ బ్లాగు లో మీరు, లక్ష్మి గారి బ్లాగులో ఆవిడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాదులాటలుండవు మా ఇంట్లో. నా సామ వేదం నాది ఆవిడ దండోపాయం ఆవిడదీ. ధన్యవాదాలు.

ఎన్నెల గార్కి, ........ ఈ నేను నేనే కానీ ఆ నేను వేరే అన్న మాట. కత్తి తో గీకే చిట్కాలు మీకేందుకండి. మీ బెట్టీ ఉంది గా. నా కసలే భయం. మా ఆవిడని తోడు తెచ్చుకోవాలి. నేను వ్రాస్తూనే ఉంటాను మీరు అందరూ ఛీ కొట్టేదాకా. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

ఆ. సౌమ్య గార్కి, ........  నా దినం కూడా వెరైటీ గానే ఉందంటారా. ధన్యోస్మి. ధన్యవాదాలు.

జ్యోతి గార్కి, .........  థాంక్యూ.                       
February 8, 2011 at 5:59 PM 

నాగార్జున గార్కి, ....... >>>కత్తి, గడ్డపార,గునపం,కొడవలి, ఉరుము, మెరుపు, కెవ్వు, కేక, రచ్చ ...                ఇత్యాది అన్నీ ప్రయోగించినా వీడు బ్లాగోదిలి పారిపోవడం లేదు అంటారా. పాశుపతాలు, ఆగ్నేయాస్త్రాలు ఇత్యాదులు సిద్ధం చేసుకోండీ. మీరు ఎన్ని వ్యంగాస్త్రాలు వదిలినా నేను కదిలేది లేదు.
ఈ ఆడియో ఏదో బాగానే ఉండేటట్టుంది సారూ. Both ways ఉండాలి. నవ్వని వాడి పని నేను పట్టవచ్చు కదా. మీ వ్యాఖ్యలు శ్రవణానందకరం గా ఉన్నాయి. ధన్యవాదాలు.

మంజు గార్కి ,........  ధన్యవాదాలు.

భైరవభట్ల కామేశ్వరరావు గార్కి, ......... Create confusion అన్నది నా విధానం. బహుశా మీ ప్రొఫెసర్ గారు నా ఉపన్యాసాలు ఏమైనా వినుంటారు.  నాకు బొత్తిగా నచ్చని సబ్జెక్టు chemistry. అందుకనే కసి తీర్చుకోవటానికి అదే చదివి పీకి పాకం పట్టి ఒక Ph.D సంపాదించానన్నమాట.
లెఖ్ఖ పెట్టను గాని, ఒక బస్తాడు అక్షంతలు వేస్తే మహదానంద భరితుడనౌతాను.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

సుమలత గార్కి, ......  ధన్యవాదాలు. నా దినం బాగానే జరిగిందంటారా థాంక్యూ.

సత్యగార్కి, .........   అంకెల మోహం అందరికీ ఉంటుందిసారూ. ఆ గారడీ నించి బయట పడడం అంత తేలిక గాదు. అయినా మీరందరూ అభిమానిస్తుంటే అదే ఆనందం. ధన్యవాదాలు.     February 8, 2011 at 6:03 PM

హరే కృష్ణ గార్కి, ......   అయ్యబాబోయ్ అక్షంతలు నేను ఇవ్వటం లేదు. మీరే తీసుకొచ్చి వేయాలి. Kg నించి ఓ బస్తాడు దాకా ఎన్నయినా పరవాలేదు. గణాంకాలు ఏదో ఒకటి నమ్మాలి కదండీ మరి. ధన్యవాదాలు.

సునీల్ గార్కి, .......  మీరుకూడా ఓ కత్తి పట్టుకొని తయారు గా ఉన్నారా నేను మెడ వంచితే ఏసెయ్యడానికి. ఏం చేస్తాం కానివ్వండి. ధన్యవాదాలు

మౌళి గార్కి, ...... ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. రెండు లెఖ్ఖలతో 1893 వ దినం రేపు రప్పించేయ్యగలను.
అప్పడాల కర్రల గురించి బహిరంగంగా చెప్పుకొను నేను కూడా మీకు మల్లె.
జవాబులు కి ఆలస్యం కావాలనే చేశాను. కావ్య గారు టేలేఫోను చేసి ప్రభావతీ గార్కి చెప్పడానికి తయారు గా ఉన్నారు. రమణి గారు కిడ్నాప్ ప్లాను వేస్తున్నారు. సరే నీహారికగారు మరోలా అంటున్నారు. ఇంకొంచెం ఆగితే ఇంకా ఏమైనా ఆఫర్సు వస్తాయేమో నని ఆగాను. మధ్యలో మీరు అడ్డు పుల్లలు వేస్తారేమో నని ఇప్పుడు భయంగా ఉంది. అందుకని జవాబులు ఇచ్చేస్తున్నాను

మౌళి గార్కి, ........  ఈ రెండో కామెంటు అసలు అర్ధం కాలేదు. నా ఆత్మ నాతోనే ఉంటుంది. అది ఎక్కడకు వెళ్ళదు. మీ నీడ బ్లాగులు అంటున్నారు. కొంచెం వివరించండి.        
February 8, 2011 at 6:06 PM

 ఆ.సౌమ్య said... .....  అసలు మీరు ఎక్కడా తగ్గరేం...మీ కామెంట్లు ప్రత్యేకంగా ఒక కామెంటు చదివి అరగంట నవ్వానంటే నమ్మండి :D              February 8, 2011 at 6:09 PM

 Mauli said...  హ హ ...మిమ్మల్ని వాళ్ళ౦దరి (కావ్య, రమణి గాఅరు, నిహారిక గారు ) ను౦డి 'మాకోస౦' కాపాడు కోడానికే అడ్డుపుల్ల వెయ్యాల్సి వచ్చి౦ది..లోక కల్యాణ౦...నారాయణ నారాయణ :)
వ్యాఖ్యాత సునిల్ కూడా మీరేనా?.(Sunil అనే పేరు పై క్లిక్ చెయ్య౦డి )..  మీ నీడ అన్నది వీరిని :
http://www.blogger.com/profile/07337502568798165932
ఇదేమి న్యాయ౦ జర్మనీ లో ఉ౦డి పాప౦ కావ్య గారికి హైదరాబాదు న౦బరు ఇస్తారా..హన్నా..

నీహారిక గార్కి, .......  మీ రెండో కామెంటుకి,   ముందు గొయ్యి వెనక నుయ్య, పెనం నుంచి పొయ్యిలోకి, ఎక్కడికి అన్న విషయాలు ఆలోచించాలి గదా. టైమ్ పట్టింది మరి.    ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి.
చిన్న సలహా, సరదాకి హాస్యానికి కూడా ఒక హద్దు ఉండాలన్నది నా ఆకాంక్ష. ఎప్పుడైనా ఒకమాటు గీత దాటవచ్చు తనకి తప్ప ఇతరులకి ఇబ్బందికరం గాలేనప్పుడు.            February 8, 2011 at 6:22 PM

మౌళి గార్కి, ......  ఏమిటో నేనే లెఖ్ఖల పండితుడనని అనుకుంటే మీరు రెండు రెళ్ళు ఆరు అనేశారే. 1980 లో Institute of French Petroleum లో పనిచేస్తున్నప్పుడు పారిస్ లో ఉండేవాడిని. జర్మనీ కి దగ్గరగా ఉన్నది అప్పుడే. హాలండు,ఇంగ్లాండు,స్విట్జెర్లాండ్ మొదలైనవి తిరిగాను కానీ జర్మని ఎప్పుడు వెళ్లలేదు. కాబట్టి నా నీడ జర్మని లో పడే అవకాశం లేదు లేదు.
సునీల్ గారు మీకు మల్లె నా అభిమాని.ఆయన కూడా బహుశా నాకు మల్లె ఒక సైంటిస్టు అయి ఉండవచ్చు.నా బ్లాగు follow చేస్తున్న వారిలో ఒక సునీల్ ఉన్నారు. వారే వీరా అన్నది కూడా నాకు తెలియదు. ఒక బ్లాగు లో వ్రాసుకోవడానికే సరిగ్గా కుదరటం లేదు. పైగా నీడ బ్లాగా. పెద్ద జోకు.
నేను హైదరాబాదు లోనే ఉన్నాను. సందేహం ఉంటే టెలీఫోను చేసి చూడండి.   ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. థాంక్యూ.       
February 8, 2011 at 7:10 PM

  Mauli said...    సుబ్రహ్మణ్యం గారు,  అయ్యో టెలిఫొన్ గురి౦చి సరదాగా అన్నాను ..సునిల్ గారు మీ అభిమాని అని చెప్పారు కదా..సరే :)    రె౦డు రెళ్ళు ఆరు అని, చక్కగా అర్ధమ్ అయ్యేట్టు చెప్పారు ..:)
February 8, 2011 at 7:18 PM  

  Sunil said...  @Mouli garu: మౌళి గారూ, నేను వేరు, గురువుగారు వేరు. నాకింకా పెళ్లికాలేదు. ఏదో ఇలా కొన్ని బ్లాగులు చూసుకుంటూ బ్రతికేస్తున్నాను. పాపం సుబ్రహ్మణ్యం గారిని అపార్ధం చేసుకోకండి.

  మనసు పలికే said... .....  గురువు గారూ:) కెవ్వు టపా.. అసలు 239వ రోజుని సెలెబ్రేట్ చేసుకోవాలి అన్నా మీ ఆలోచన ఉంది చూసారూ.. సూ...పరు:))
నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ప్రతి సారి నా పుట్టినరోజు ఉదయాన్నే ఫోన్ చేస్తుంది. ఆరోజు ఏ వారమైతే ఆరోజుని విష్ చేస్తుంది..(హ్యాపీ సండే, హ్యాపీ మండే.. ఇలా అనమాట)అసలు విషయానికి మాత్రం రాదు. మీ టపా చూడగానే తను గుర్తొస్తూ ఉంది:) ఏ అకేషన్ లేకపోయినా అలాగే కాల్ చేసి విష్ చేస్తూ ఉంటుంది:))
ఇంతకీ ఈ తద్దినం గొడవేంటండీ బాబూ నవ్వలేక చచ్చా:) నాగార్జున అన్నట్లు, ఇంక పదాలేవీ మిగలలేదు మిమ్మల్ని పొగుడుదామంటే..          
February 8, 2011 at 7:51 PM  

  మాలా కుమార్ said... ..మీ 239 దినానికి అభినందనలండి .   February 8, 2011 at 7:55 PM

 మంచు said...   నాకీ ఈక్వేషన్ ఎంతకీ తెగట్లేదండీ గుగ్గురువు గారు... ఈ సమీకరణం సాధించాక మళ్ళీ వస్తా              February 8, 2011 at 11:22 PM  

 నీహారిక said... ....  This comment has been removed by the author.

అనానిమస్ గార్కి, ......  క్షమించండి. మీ వ్యాఖ్య నేను పబ్లిష్ చేయటం లేదు. నామీద విమర్శ, కష్టం కలిగించే దైనా, పబ్లిష్ చేస్తాను. కానీ ఇతరుల మీద విమర్శ నాబ్లాగు లో పబ్లిష్ చేయను, except when it is humorous and does not hurt the person concerned.
ధన్యవాదాలు.               
February 9, 2011 at 12:51 PM

 నీహారిక said... ... This comment has been removed by the author.

Anonymous said...    మీ సంస్కారానికి జోహార్....   February 9, 2011 at 1:17 PM

 శ్రీనివాస్ పప్పు said... ....  "క్షమించండి. మీ వ్యాఖ్య నేను పబ్లిష్ చేయటం లేదు. నామీద విమర్శ, కష్టం కలిగించే దైనా, పబ్లిష్ చేస్తాను. కానీ ఇతరుల మీద విమర్శ నాబ్లాగు లో పబ్లిష్ చేయను, except when it is humorous and does not hurt the person concerned."
గురువుగారికి "వందనాలు వందనాలు గంధపు హరిచందనాలూ (శ్వేతపత్రం సమర్పయామి)"

మౌళి గార్కి, ........  ధన్యవాదాలు.

సునీల్ గార్కి, .......  అపార్ధాలు తొలగించినందుకు ధన్యవాదాలు.
>>>నాకింకా పెళ్లికాలేదు. ఏదో ఇలా కొన్ని బ్లాగులు చూసుకుంటూ బ్రతికేస్తున్నాను.
పెళ్లి కాలేదు కాబట్టి బ్లాగులు, పెళ్లి ఐతే పాట్లు. పాపం పసివాడు.:):)

మనసు పలికే గార్కి, ......  అంత చింతించి, లేఖ్ఖలేసి 239 అని నేను అంటే, మీరు ఒట్టి సూపరు తో తేల్చేశారు. తద్దినం అంటే వివరించాలంటే మళ్ళీ ఇంకో టపా అవుతుంది.   ధన్య వాదాలు మీ వ్యాఖ్యలకి.

మాలా కుమార్ గార్కి, ....... ధన్యవాదాలు.                
February 9, 2011 at 8:52 PM

మంచు గార్కి, .......  ఆ సమీకరణ సాధించాలంటే అంత వీజి కాదు. మా జీనియస్సు కే నాల్గు లైన్లు పట్టింది. అయినా Try చేస్తానంటే మీ ఇష్టం. అల్ ద బెస్ట్.    ధన్యవాదాలు.

నీహారిక గార్కి, ........ ధన్యవాదాలు. సారీ చెప్పఖర్లేదండి.

అనానిమస్ గార్కి, .......  ధన్యవాదాలు.

శ్రీనివాస్ పప్పు గార్కి, .....  ధన్యవాదాలు.                   
February 9, 2011 at 8:54 PM 

manogna said... .....  తద్దినం చాలా బాగా పెట్టారండీ.... లెక్కలు వేయాలన్నా...విరగబడి నవ్వించే పోస్ట్ లు రాయాలన్నా మీ తరువాతేనండీ. అసలు మీకిలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో. బాబ్బాబు మాకూ కొంచెం నేర్పించండి. మీ పేరు చెప్పుకుని నా బ్లాగులో పెద్ద పోస్ట్ రాస్తాను. మొత్తానికి భలే లెక్క వేశారండీ. అందుకోండి నా వీరతాళ్ళు. మర్చేపోయాండి మీ 239వ దినానికి నా శుభాకాంక్షలు. మీరు ఇలాగే నవ్విస్తూ ఉండాలి....మేము ఇలాగే నవ్వుతూ ఉండాలి.  February 12, 2011 at 6:33 AM

మనోజ్ఙ గారూ
స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను
ఆ పరిచిన పూల మీదుగా ఇలా నడిచి రండి
ఆ సింహాసనం అధిష్టించండి
ఈ పూలగుచ్చం స్వీకరించండి
ఈ గజమాల వేయనీయండి
ఈ పట్టుశాలువా స్వీకరించండి
ఈ కానుకలు స్వీకరించండి
నేను విసురుతున్న వింజామరనుంచి
వీచే మలయమారుతాన్ని ఆస్వాదించండి
పళ్ళు ఫలహారాలు భోంచెయ్యండి
మీకోసం ప్రత్యేకం గా తయారుచేయించిన
జున్నుపాల పరమాన్నం ఆరగించండి

మా బ్లాగులో మొదటి మాటు ఏభైవ వ్యాఖ్య రచించిన
మీకుఇవే మాఅక్షర లక్షలు అబినందన సుమాంజలులు
మీ ఈవ్యాఖ్య మా బ్లాగులో సువర్ణాక్షరాలతో లిఖించబడి
చిరస్మరణీయమౌతుందని ఆకాంక్షిస్తున్నాను
మా బ్లాగు తరుఫున నా తరుఫున కృతజ్ఙతలు
తెలియచేసుకుంటున్నాను ధన్యవాదాలుచెప్పుకుంటున్నాను

జై జై జై మనోజ్ఙ గారికి జయహో జయ జయహో         
February 12, 2011 at 9:44 AM

 Ennela said...  మాస్టారూ, అన్నీ మనోజ్ఞ గారికి అచ్చంగా ఇచ్చేద్దాం కానీ, జున్ను పాల పరమాన్నం మాత్రం మిగిలిన 49 మందికి పంచవలసిందిగా విన్నపము శాయబడిందొహో ఓ ఓ ఓ ఓ ఓ

సోమార్క said... .....  అయ్యా!బులుసు సుబ్రహ్మణ్యం గారూ!మీ బ్లాగుని నేడే పరిచయం చేశాడు మన గూగులయ్య.మీ హాస్యం చింతామణి నాటకంలో శ్రీహరి అన్నట్లుగా, సెనగలు తిని చెయ్యి కడుక్కున్నట్లు క్షణాల్లో సాతాళించి ముగించేశారు.నాకు చాల నిరుత్సాహంగా ఉంది. ఇలంటి రచనలు మరిన్ని మాకు భావిలో అందిస్తారని మీ బ్లాగులో చేరిపోయా.మన్నిస్తారుగా!           February 12, 2011 at 6:28 PM 

ఎన్నెల గార్కి,. ........  ధన్యవాదములు.49 మందికి సమంగా పంచాలంటే డేంజర్ అపాయము ఉండును. అందులో 10 కామెంట్లు నావే ఉన్నాయి. అసలే ఒక చిన్న పంచదార కర్మాగారం ఉంది నాలో. అదంతా ఎందుకు కానీ మీకో బిందెడు పరమాన్నం పంపేస్తా. సరేనా. :):):)

సోమార్క గార్కి, ........  మా బ్లాగుకు స్వాగతం. తినగ తినగ వేము తీయనగును కి రివర్సు కూడా నిజమే. అంటే తినగ తినగ తీపి చేదు అగును, అన్నది. ఇంతకన్నా ఎక్కువుగా వ్రాసిన కష్టమే. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.                         
February 13, 2011 at 12:05 PM

 Ennela said... ....... ధన్యవాదాలండీ...ఇంతకన్నానందమేమీ...అని త్యాగరాజుని రప్పించేసాను మనసులోకి..     హమ్మో! బిందెడే !..యీ బిందె కొలతలేమి, పెద్దదా చిన్నదా? చిన్నదైననేమి పో అది కెనడా వచ్చుటకు వీలగునా? వీలైనది పో, ఎంత కాలము పట్టును..పట్టినది పో మేము ఎన్ని రోజులు ఉపవాసము చేయవలెను? ఇత్యాది సందేహములు వెంటాడుచున్నవి మాస్టారూ..మీరు చెక్కర కర్మాగారముతో పాటు లెక్కల కర్మాగారము కూడ ధరించి యున్నవారు కావున కొంచెం లెక్కలు సెలవీయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను.
పరమాన్నం మాత్రం జున్నుపాలతోనే వండించాలి సుమా!         
February 13, 2011 at 7:53 PM

ఎన్నెల గార్కి, ........ Oh క్షమించాలి కెనడా అని మరచిపోయాను. Offer withdrawn. మీరు మా ఊరు వచ్చినప్పుడు పెద్దబిందెడు, జున్నుపాల పరమాన్నం. త్వరగా వచ్చేయండి.       February 16, 2011 at 4:09 PM

 జేబి - JB said... ....  మళ్ళీ చాలాకాలానికి నవ్వుకున్నానండి. మీ బ్లాగు ఇంకా ఇంకా చాలా దినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానండి.
ఆలస్యంగా స్పందించినందుకు క్షమించండి. బ్లాగుల్లోకి రావడానికి బొత్తిగా వీలు చిక్కట్లేదు; చూశారుగా, అర్థరాత్రి వ్యాఖ్యలు పెడుతున్నా.                 
February 17, 2011 at 12:27 AM 

manogna said... ......  meeru bhalevarandi.... na post tho nanne kottaru. mottaniki mee ahvanam chala bagundi. sweekarinchadiniki nenu ready...ekkadi, eppudu ravalo chebite....vachhi junnupala parmannam lottalu vesukuntu tintanu.

జేబి-JB గార్కి, ....  ఆలస్యంగా నైనా వచ్చారు. సంతోషం. ఇంకో మరిన్ని దినాలు చేసుకోవాలంటారా. సరే అల్లాగే కానిద్దాం. :):)          ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

మనోజ్న గార్కి, ........  మీరు ఎప్పుడొస్తే అప్పుడే జున్ను పాల పరమాన్నము తో స్వాగతం చెప్పుతాం.
ధన్యవాదాలు.            
February 17, 2011 at 7:15 PM

 పానీపూరి123 said...         :-))             February 19, 2011 at 2:23 AM

7 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

239వ దినం ..... హ్హ హ్హ హ్హ, మీకు భలే ఐడియాలు వస్తుంటాయండీ. మరి మీలాంటి బ్లాగర్లు వ్రాయకుండా ఊరుకుంటే బ్లాగ్ లోకం ఎలా వెలవెలబోతుందో చూస్తున్నాంగా. కాబట్టి ఇక బ్రేకులు తీసుకోవద్దు. సహస్ర పూర్ణచంద్ర దర్శనం జరగాలి.

అన్నట్లు ఈ టపాని బట్టి చూస్తే నీహారిక గారు అప్పటికే Deletion Queen లా ఉన్నారే 😀😀?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారికి. ........ ధన్యవాదాలు. వ్రాసినా పాఠకులు లేకపోతే అలాగే ఉంటుందేమో (వెలవెలా). ....... మహా

Zilebi చెప్పారు...



ఈమాటలో రాసుకుంటే యేదో వెలైనా గిట్టు :) ఈ వెల్ లో వెల, వెలబోవనేలా బులుసు గారూ :)

జిలేబి


Zilebi చెప్పారు...



ఈ మాటలోన వ్రాయం
గీ మాటలకు వెల కొంత గిట్టేదయ్యా
సోమరుల బ్లాగు లోకము
లో మా వెల, వెలవెలా! చలో నరసన్నా :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి. ...... ధన్యవాదాలు. ఈమాట కి వ్రాసినా మరో అంతర్జాల పత్రికకు వ్రాసినా మరో పదిమంది చదువుతారనే ఆశ. అంతకు మించి మరేమి గిట్టుబాటు కాదు........ మహా

Lalitha చెప్పారు...

మీరిలాంటి 239th days ఎన్నెన్నో జరుపుకోవాలి. నాకు weekend లో మాత్రం బ్లాగులు చదవడానికి కుదురుతుంది. మీరొక కొత్త పోస్ట్ పెట్టినప్పుడల్లా తప్పకుండా చదివి కమెంట్ పెడతాను. మీరు బ్లాగుల్లో రాస్తూ వుండండి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

లలితా TS గారికి. ........ ధన్యవాదాలు. మీ వ్యాఖ్య నాకు వ్రాయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తప్పకుండా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ......... మహా