పుస్తక ప్రదర్సనలు - నేనూ

సంవత్సరం గుర్తు లేదు, ఎనభైలలో కలకత్తాలో  మొదటి మాటు పుస్తక ప్రదర్సనకి వెళ్లాను. వెళ్లాను అనడం కన్నా తీసుకెళ్ళబడ్డాను అనడం సబబుగా ఉంటుందేమో.  నన్ను అక్కడిదాకా తోసుకెళ్ళిన మిత్రుడు నారాయణ ,  పుస్తకాల గురించి చాలా సుభాషితాలే చెప్పాడు.  చిరిగిన చొక్కా తొడుక్కో కానీ పుస్తకం కొనుక్కో,  స్నేహితులని వదులుకున్నాఫరవాలేదు  పుస్తకాలు వదలకు,  ఒంటరిగా ఉన్నానని అనుకోకు పుస్తకాలే నీకు తోడు,  కష్టాలలో పుస్తకాలే కరదీపికలు, పుస్తకం హస్తభూషణం, అంటూ చాలానే చెప్పాడు. వాడో అరడజను పుస్తకాలు కొనుక్కోవడానికి నన్నో రెండు గంటలు తిప్పాడు. వాడు పుస్తకాలు తిరగేస్తుంటే వచ్చిన వాళ్ళను చూస్తూ నేను కాలం గడిపేసాను.
 
ఆ రాత్రి నాకూ వాడికి మా గెస్ట్ హౌస్లో వేదాంత చర్చ జరిగింది. 

ఒరేయ్ ఇందాకా నువ్వు చెప్పిన సూక్తులన్నీ చెప్పిన వారెవరురా? రచయితలా, పబ్లిషర్సా? పుస్తకాలు అమ్ముకోడానికి చేసుకునే ప్రకటనలలాగే ఉన్నాయిరా, అన్నాను. వాడికి కోపం వచ్చింది. 

అవి వివిధ రంగాలలో ప్రముఖులు చెప్పిన మాటలు.  సాహిత్యాన్ని మధించిన వారు ఉటంకించిన సత్యాలు అవి. కూపస్థ మండూకంలా, ఆఫీసు, ఇల్లూ, ఇల్లాలు.  పిల్లల తోటే జీవితం అనుకుంటే ఎలారా?  ప్రపంచంలో ఇంకా అనేక ఉదాత్తమైన విషయాలు ఉన్నాయి.  పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోరా అన్నాడు వాడు
  
ఎందుకురా అన్నాన్నేను 

ఎందుకేమిటి? జ్ఞానం పెరుగుతుంది. నాలుగూ తెలుసు కుంటావు.  ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. అవగాహన పెరుగుతుంది. ఇంకా ఇంకా బోల్డు బోల్డు లాభాలుంటాయి అని ఆయాసం తీర్చుకున్నాడు.

లాభాలు సరే,  చదవక పొతే నాకు వచ్చే నష్టాలు ఏమిటి? 

ఇది మూర్ఖపు ప్రశ్న.  జ్ఞానం పెరిగే కొద్ది చైతన్యం పెరుగుతుంది. నీలో ఉత్సాహం పెరుగుతుంది. కష్టాలను ధైర్యంగా, సంయమనంతో  ఎదుర్కుంటావు.  కష్టాలను తేలికగా అధిగమిస్తావు అని ఓ గ్లాసుడు మంచి నీళ్ళు తాగాడు.

ఈ కబుర్లు వద్దు. నీ జ్ఞానం వల్ల నీకేం లాభం కలిగింది. నా అగ్నానం వల్ల నాకేం నష్టం కలిగింది అని ఘట్టిగా ప్రశ్నిస్తున్నాను.  అసలు గ్నానం అనగా నేమి? అని కూడా వాడిని మొట్టి మరీ ప్రశ్నించాను.

పిచ్చివాడా జ్ఞానం అనగా జ్ఞానం అన్నమాట.  విషయ పరిజ్ఞానం వల్ల కలిగే ఆనందం.    జ్ఞానం అనగా పరమాత్ముని చేరుకునే మార్గం కూడా అని నువ్వు గ్రహించాలి.

అంటే నేను మోక్షుడిని కాలేనన్నమాట.

మోక్షుడు యనరాదు. చెంపలేసుకో.  మోక్షకామి యని గాని మోక్షగామి యని గాని యనవలెను. మోక్షకామి యనగా మోక్షమును కాంక్షించే వాడు. గామి యనగా  మోక్ష పధమున పయనించేవాడు యని యర్ధం యయ్యుండవచ్చు.
  
ఈ యయ్యుండడం ఏమిటి? అ అనే చోట  య ఎందుకు ఎక్కువుగా  ఉపయోగిస్తున్నావు?

ఇది వ్యాకరణ జ్ఞానం. అనేక రకములైన జ్ఞానములుండును. వాటిని గ్రహించి సాధన జేయుటయే మనుజుని కర్తవ్యం. పఠనము, అభ్యాసము చేతనే జ్ఞానులగుదురు.  జ్ఞానము లేనిచో  నంతయును నంధకారమే. అంధకారమున మసలు వానిని మూర్ఖుడందురు. అంధకారమున నుంటిమని గ్రహించుటయే  జ్ఞాన మార్గమున ప్రధమ సోపానము. జ్ఞానులలో ననేక తరగతుల వారుందురు. అజ్ఞాని, తధాజ్ఞాని, వ్యర్ధ జ్ఞాని,  అరజ్ఞాని, లోక జ్ఞాని,  జ్ఞాని, విజ్ఞాని, సుజ్ఞాని, మహాజ్ఞాని, సర్వజ్ఞాని, బ్రహ్మజ్ఞాని, కాలజ్ఞాని ఇత్యాది సోపానము లింకను ననేకమున్నాయి. అన్నట్టు జ్ఞాన వృద్ధులు, వృద్ధజ్ఞానులు యను  కొన్ని రకములవారు కూడా కలరు. 
  
తధాజ్ఞాని, వ్యర్ధజ్ఞాని యనగా నెవరు? చూసావా నాకుయున్ను వ్యాకరణ జ్ఞానము నబ్బుచున్నది. 

దీనిని సాంగత్య జ్ఞానమందురు.  జోగితో కరచాలనము చేసిన యడల కొంత బూడిద నీ కంటుకొనును గదా. తధాజ్ఞాని యనగా యధాతధముగా నభ్యసించు వాడు. గురువు గారు చెప్పినది వల్లెవేయువాడు. పుస్తకమున యున్నది కంఠతా పట్టువాడు. సారమును గ్రహించలేనివాడు. ఇప్పుడు విద్యాభ్యాసము చేయుచున్నవారిలో కొంతమంది తధాజ్ఞానులే. వ్యర్ధజ్ఞాని యనగా నెంతయో కొంత,  నక్కరకు రాని  జ్ఞానము కలవాడు. ఇంటర్వ్యూ కి వెళ్ళును. వాడేదో అడుగును. వీడికి తెలుసును. కానీ నాలిక వెనకే యుండిపోవును. బయటకు వచ్చుటకు తిరస్కరించును.  పరీక్షాపత్రంలో ప్రశ్నకి జవాబు తెలుసును  కానీ సమయానికి గుర్తు రాదు.  వీరు వ్యర్ధ జ్ఞాను లనబడుదురు. కర్ణుని వారసులుగా గుర్తింప బడతారు. 
          
గ్నాన సముపార్జనకి  పుస్తకాలు చదవాలంటావా?
 
గ్నాన కానీ జ్నాన కానీ కాదు.   జ్ఞాన  అనాలి జ కింద ఞ పెట్టాలి, న కాదు,  ఙ కాదు.  పుస్తకాలు చదివినా, పెద్దలు చెప్పిన మాటలు విన్నా , గుళ్ళో పురాణ ప్రసంగాలు విన్నా , నాబోటి వారితో చర్చలు జరిపినా  జ్ఞానము పెంపొందును. నీలో అజ్ఞాన తిమిరము నశించును. నీ హృదయాంతరాళమున వెలుగు ప్రవేశించును. 

ఈ వెలుగు ఎట్లు ప్రవేశించును? 

వెలుగు ఎప్పుడూ అరికాలు కింద నించి ప్రవేశించును. అది క్రమ క్రమం గా నీ శరీరమంతయునూ నాక్రమించును. అది నీ యుదరమున ప్రవేశించినచో నీవు సిద్ధుడవగుదువు. నీకు ఆకలి దప్పికలు యుండవు. జ్ఞాన పిపాస ఇంకనూ పెరుగును. విజృంభించి జ్ఞాన సముపార్జన ఉధృతం చేసినచో నది నీ శరీరము నంతయు నాక్రమించి, నీ శిరస్సు చివర కేంద్రీకరమై నొప్పును. ఆ స్థితిలో నీకు వాయుగమనము, దూరదృష్టి, దూర శ్రవణము  మొదలగునవి నలవడును. అని చెప్పి ఆయాసం తీర్చుకొనుటకు ఒక క్షణం ఆగాడు. ఆ విరామ క్షణంలో మరో ప్రశ్న నేను సంధించాను. 

ఆ పైన ఏమవుతుంది?

ఆపైన నీ జ్ఞానము పెరిగినచో నది నీ శిరస్సు వెనకాల కాంతిపుంజమై విరాజిల్లును. నీవు సంపూర్ణ జ్ఞాని యని, బ్రహ్మర్షి వని  లోకమున కీర్తింపబడతువు. నీకు యదేచ్చా త్రిలోక సంచారం కలుగును. దేవతల సమావేశములలో పాల్గొనే నవకాశం  కల్గును. సశరీరుడవై  స్వర్గమున  ఘ్రుతాచి నృత్య ప్రదర్శనను తిలకించ గలవు. 

ఆ చివరి వాక్యం మాత్రం వీనుల విందుగా నున్నది మిత్రమా.

కానీ యది సామాన్యులకు దుర్లభము. కఠోర తపస్సాధనచే మాత్రమే సాధ్యము. భగవత్కృపా కటాక్షములు మెండుగా ప్రసరించిన వారికే నది సాధ్యము. పుస్తక పఠనము నా పథమున సాగుటకు నత్యంతావసరము. 


తరువాత  దీని గురించి నేను మరిచిపోయాను. మందులో అనేకం మాట్లాడుతాం. అవి అప్పుడే మర్చిపోతాం గదా. ఓ రెండు నెలల తరువాత పాపం నారాయణకి కొన్ని కష్టాలు వచ్చాయి. వాడికి ముగ్గురు మగపిల్లలు. ఆడపిల్ల కావాలని ఇద్దరూ బహు ముచ్చట పడేవారు. చివరి ప్రయత్నంగా నాలుగో సంతానాన్ని కందామని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నంలో నాలుగో మాటు కవలపిల్లలు కలిగారు. ఇద్దరూ మగపిల్లలే. పిల్లల సంరక్షణలో పాపం వాడు,  వాళ్ళావిడకి చేదోడుగా ఉంటూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. వాడి జ్ఞాన సముపార్జన అటకెక్కిందని వేరే చెప్పనఖ్ఖర్లేదు కదా. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తరువాత కూడా వాడు  చేతిలో పుస్తకంతో ఎప్పుడూ కనిపించలేదు. అప్పుడు నేనో పరమ సత్యం గ్రహించాను. జ్ఞాన సముపార్జన కూడా మన స్థితి గతుల మీద, పరిస్థితుల మీద ఆధార పడి యుండును, అని.


ఆ తరువాత కొన్ని ఏళ్ళకి హైదరాబాద్లో పని పాడు లేని ఒక సందర్భంలో పుస్తక ప్రదర్శనకి వెళ్లడం తటస్థించింది. అనుకోకుండా వెళ్లడం వల్ల, కొనే ఉద్దేశ్యం లేకపోవడం వల్ల, ప్రదర్శనకి వచ్చే వాళ్ళని కొంచెం శ్రద్ధగా గమనించాను. చిరిగిన చొక్కా వాళ్ళు ఒక్కరూ కనిపించలేదు. పట్టు, సిల్కు చీరలు, శాలువాలు, సూట్లు, బూట్లు.  స్వెట్టర్స్ కూడా చాలా కనిపించాయి.  ఒంటరిగా కూడా చాలా తక్కువ మందే వచ్చారు అని కూడా కనిపెట్టాను. ఎక్కువమంది స్నేహితుల తోనూ, భార్యా, పిల్లలు, బంధు గణంతోనూ వచ్చారు అని కూడా అనుకున్నాను.  కొంతమంది  పిక్నిక్కి వచ్చారేమో అనికూడా సందేహపడ్డాను.  సరదాగా వచ్చి, వచ్చాం కదా,  యని నాల్గైదు పుస్తకాలు కొన్నవారు కూడా ఉన్నారని దురభిప్రాయ పడ్డాను కూడా. నా జేబులో ఉన్న ఏభై రూపాయలతో  ఏదైనా పుస్తకం కొందామని చూసాను కానీ గంటల పంచాంగం తప్ప మరొకటి దొరకలేదు. జ్ఞానం కూడా చాలా ఖరీదు అనే సూత్రం కూడా తెలిసివచ్చింది.    

నాతో సాహిత్య చర్చ చేయించేవారు ఎవరూ కనపడక నేనే గేటు బయటకు వచ్చిన తరువాత సాహిత్య చర్చ చేసుకున్నాను. పుస్తక ప్రదర్శనలో కూడా తినుబండారాల దుకాణాలున్నాయి. ఆ పదార్ధాలు తింటూ, వాటి రుచులను గూర్చి చర్చించడమే నేను చేసే పెద్ద సాహిత్య చర్చ అని మీరు గ్రహించాలని నా తపన.


ఆ తరువాత  కొన్ని ఏళ్ళకి,  పదవీ విరమణ చేసి,  చేసేదేమీ లేక  బ్లాగుల్లోకి వచ్చి పడ్డాను. వచ్చిన కొద్ది నెలల్లోనే హైదరాబాద్ లో పుస్తక ప్రదర్సన వచ్చింది. కొంతమంది బ్లాగర్సు వెళ్ళి చూసి,  కొని వచ్చి,  దొంతరలు దొంతరలు పుస్తకాలు ఫోటోలు తీసి బ్లాగులో పెట్టేసారు. ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి  మళ్ళీ  వెళ్ళాలి అని  కొంతమంది ప్రకటించారు కూడాను.  ఇది చూసి మరి  కొందరు  మేమూ రెండాకులు చదువుతాం అని బొమ్మలు పెట్టి మరీ వక్కాణించారు.  ఒక పదిహేను రోజులు బ్లాగుల్లో పుస్తకాలు చాలానే దర్సనమిచ్చాయి. నా గుండె చెరువైంది. ఇంతింత జ్ఞానం వీళ్ళు ఇలా సంపాదించేస్తే,  వీళ్ళ సరసన నిలబడడానికి మనకి అర్హత ఉండదేమో నని బోరుమన్నాను. అప్పుడప్పుడు పక్కింటినుంచి తెచ్చిన వారపత్రిక చదవడానికే వారం రోజులు పడుతుంది నాకు. వీళ్ళకి ఇవన్నీ చదవడానికి ఎన్ని రోజులు పడుతుందా యని లెఖ్ఖలు వేసాను. లెఖ్ఖల్లో నేను మహా వీక్ కాబట్టి ఏ లెఖ్ఖా తెగలేదు. తెగించి నేను కూడా  అప్పో సప్పో చేసి నాల్గైదు పుస్తకాలు కొనాలని నిర్ణయించుకున్నాను.  సప్పే చేసి  (సప్పు అంటే తిరిగి ఇవ్వకూడనిది అని నా అర్ధం) ప్రదర్సనకి  వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నాను. అంతకు ముందు  రోజే ప్రదర్సన సమాప్తమయిందని తెలిసి హతాశుడ నయ్యాను.


నేను కూడా మార్గదర్శి లో చేరి నాలుగు పుస్తకాలు కొనుక్కోవాలని, జ్ఞాన పధంలో పయనించాలని, జ్ఞాన వెలుగుని కనీసం మోకాలు దాకా నైనా తెప్పించాలని ఆశ పడ్డాను.  పుస్తకాలు కొంటే పెట్టుకోడానికి బీరువాకూడా  ఒకటి సిద్ధం చేసుకున్నాను.  కానీ,   నేను ప్రదర్శనకి వెళ్ళకుండానే ఇంకో మూడు నాలుగేళ్ళు గడిచి పోయాయి.      ఏడు  తప్పకుండా వెళదామని దృఢంగా నిశ్చయించుకున్నాను. బ్లాగు మిత్రులని సంప్రదించి ఎక్కడ జరుగుతోందో, సమయాలు మొదలగునవి క్షుణ్ణంగా  తెలుసుకున్నాను.  ఆదివారం వెళితే బ్లాగు మిత్రులని కూడా కలిసే అవకాశం ఉంటుందని కూడా అనుకున్నాను. మొన్న ఆదివారం బయల్దేరాను. నాతోటి నా అర్ధాంగి కూడా బయల్దేరింది. ఆవిడ మధ్యలో  అశోక్ నగర్ లో మా సక్కుబాయి ఇంటి దగ్గర దిగిపోయింది. ఆవిడతోటి ఇంట్లోకి వెళ్ళి సక్కుబాయిని పలకరించి, అక్కడ నుంచి నేను ప్రదర్సన దాకా నడుచుకుని  వచ్చాను. (అన్నట్టు మా సక్కుబాయి గురించి ఎప్పుడో ఓ టపా వెయ్యాలి. ఆవిడ వన్ని సక్కుబాయి కష్టాలు).  వచ్చిన తరువాత  ఎంట్రి టికెట్ కొనాలేమో నని జేబులో చెయ్యి పెట్టాను. షాక్ తగిలింది. జేబులన్నీ వెతికాను.  చొక్కా విప్పి దులిపాను.  పేంటుకి ఉన్న అరడజను జేబులు మళ్ళీ మళ్ళీ  వెతికాను.  ఎంత వెతికినా నా పర్సు దొరకలేదు. ఇంట్లో మర్చిపోయానో లేక మా శ్రీమతి బేగ్ లో పాడేసుకున్నానో  గుర్తు రాలేదు.  అయినా నేను ధైర్యం వీడలేదు. గేటు దగ్గర నుంచుని టార్జాన్ స్టైల్ లో  ఓహోహో అని నాల్గైదు మాట్లు అరిచాను. లోపల ఉన్న  బ్లాగ్మిత్రులెవరైనా విని  నన్ను ఆదుకుంటారేమో నని. అబ్బే ఒక్కళ్ళూ రాలేదు.  విషణ్ణ వదనంతో, ప్రదర్సనపై నిరశన దృక్కులు ప్రసరిస్తూ, విషాదంగా  “ఆ అబ్ లౌట్ చలే” అని పాడుకుంటూ మా సక్కుబాయి గారింటికి వెళ్ళిపోయాను. 

      
ఈ రెండు రోజులు తీవ్రంగా ఆలోచించాను. నేనేమి సేయవలె అని చింతించాను.  మొన్న ప్రదర్సనకి వెళ్ళిన బ్లాగ్మిత్రుల పేర్లు సేకరించాను. వీళ్ళ ఇంటికి దండయాత్ర చేసి పుస్తకాలు సప్పు తెచ్చుకోవాలని తీర్మానించుకున్నాను. వీళ్ళే కాదు. ఇదివరలోనూ, కిందటి సంవత్సరాలలోనూ వెళ్ళిన వాళ్ళ పేర్లు, ఎడ్రస్ సంపాదిస్తున్నాను. వాళ్ళ ఇళ్లపై కూడా దాడి చేసి పుస్తకాలు సప్పు చేసో,  తస్కరించో నా బీరువా కళ కళ లాడేటట్టు చేయాలని భీషణ ప్రతిజ్ఞ చేసుకున్నాను. ఇలా సేకరించిన  పుస్తకాలన్నీ నా బీరువా భూషణాలై నలరారాలని ఉత్సాహ పడుతున్నాను.  


గమనిక :- ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 17/12/2013 న ప్రచురించ బడింది.  

20 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

దండయాత్ర చేసేయండి అలా పబ్లిక్ గా ఇన్ని పుస్తకాలు కొన్నాం అన్ని పుస్తకాలు కొన్నాం అన్నవాళ్ళ మీదకి, సమసమాజ నిర్మాణం కావాలి కదండీ :)

నాగరాజ్ చెప్పారు...

అద్భుతంగా రాశారండి. (జ్ఞాన) వెలుగు ఎప్పుడూ అరికాలి కింది నుండి ప్రసరించును. ఈ విషయం నాకిప్పటిదాకా ఎవ్వరూ చెప్పనే లేదండి. చూశారా, ఎంత పనైపోయింది, నేనేమో సాక్స్, షూ వేసుకుంటానాయే, అందువల్లే అనుకుంటాను, అరికాలు సరిగా కనిపించక జ్ఞాన వెలుగు ఇప్పటిదాకా ప్రసరించలేదు. ప్చ్... అందుకేనేమో అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్నానింకానూ. జ్ఞానుల్లో కూడా ఇన్ని కులాలు, తెగలు, జాతులు ఉన్నాయనే విషయం ఇప్పుడే తెలిసింది. అమ్మో, ఒక్కచోటే ఒక్కరోజే ఇంత జ్ఞానం తెలుసుకునే సరికి మోకాలు తెగనొప్పి పెఠేస్తోంది. మీరు గజనీ, ఘోరీ లెవెల్లో మీ మిత్రుల ఇళ్ల మీద దండయాత్ర చేసి, సప్పు రూపేణా పుస్తకముల తస్కరించి, పోస్టులు రాసిన యెడల, మేము కూడా ఇక్కడ ఎలాంటి సప్పు(డు) చేయకుండా జ్ఞానాన్ని గ్రోలెదము. కనీసం ఈ జన్మకు అరికాలి నుండి యుదరము దాకానైనా వెలుగును తెచ్చుకుని ఆకలి దప్పుల జయించవలెననెడు కోరిక తీవ్రముగా దహించుచున్నది. యెందులకనగా, నా జీతమంతా తిండికే సరిపోతుంది మరి. మిగతా దశల సంగతి వచ్చే జన్మలో చూసికొనవచ్చునన్నది నా ఎత్తుగడ. శీఘ్రమేవ మీ బీరువాకు పుస్తకకళ ప్రాప్తిరస్తు!! :-)

సుజాత వేల్పూరి చెప్పారు...

కట్టలు కట్టలు గా కొని, చదవడానికి కుదరక పక్కన పెట్టిన పుస్తకాల్ని చూస్తుంటే ఒక్కోసారి బ్లాగుల్లోనూ ఫేస్బుక్ లోనూ ప్రదర్శించడానికి కూడా పుస్తకాలు కొనేస్తున్నామా అని సందేహం వస్తోందండీ ఈ మధ్య!

MURALI చెప్పారు...

గురూజీ, గుంటూరు పట్టణమున కౌటిల్యయను వెర్రి వైద్యుడు కలడు. ఎటులైన యాతడి చిరునామ సంపాదించితిరేని మీ బీరువా యే కాదు యావత్తు మీ గృహము పొత్తములతోడ కళకళలాడును :)

రాజ్ కుమార్ చెప్పారు...

అదరహో... అద్భుతః
మీకు మీరే సాటి గురూజీ.

Unknown చెప్పారు...

>>> వెలుగు ఎప్పుడూ అరికాలు కింద నించి ప్రవేశించును....ఆపైన నీ జ్ఞానము పెరిగినచోనది నీ శిరస్సు వెనకాల కాంతిపుంజమై విరాజిల్లును......సశరీరుడవై స్వర్గమున ఘ్రుతాచి నృత్య ప్రదర్శనను తిలకించగలవు

మాస్టారూ...ఒకవేళ నేను యోగవిద్యలో ప్రావీణ్యత పొంది, నా మోకాళ్ళను భుజాలకిరువైపులా చుట్టి, నా అరికాళ్ళు రెంటినీ దగ్గరకు చేర్చి, పడగ విప్పిన నాగరాజువోలె వాటిని నా నెత్తి పైకి పెట్టి, ఆ భంగిమలో అలానే ఉంటూ, అంబటిపూడి వారి "30 రోజుల్లో బ్రహ్మర్షి కావడం ఎలా?" అనే పుస్తకం మొదటి రెండు పేజీలు చదివితే మా ఘ్రుతాచీ డ్యాన్సు ఫొగ్రాం చూడొచ్చంటారా? ;)

మీ బ్లాగు చాన్నాళ్ళనించి చదువుతున్నా ఎప్పుడూ కామెంటినట్టు గుర్తు లేదు, ఇదే మొదటి సారి. మీ టపాలు చదివిన ప్రతిసారీ నవ్వుతో కడుపు నొప్పి, కళ్ళ నీళ్ళు ఖాయం అంటే నమ్మండి. నేను ఏలూరు వాణ్ణి, కాని ప్రస్తుతం ప్రవాసుణ్ణి. మీరు అక్కడ ఉన్నప్పుడు రెండు మూడు సార్లు ఊళ్ళోకి వచ్చినా సమయాభావం వల్ల కలవలేకపోయానన్న బాధ ఇప్పటికీ పోలేదు. మీరిలాగే హాస్యగుళికలు వదులుతూ ఉండాలని కోరుకుంటూ...

భవదీయుడు,
వర్మ

నేస్తం చెప్పారు...

బాబోయ్ గురువుగారు మీరసలూ... నాకు కూడ పొలోమని పుస్తకాలుకొనేసి అక్కడితో ఊరుకోకుండా ఇన్ని పుస్తకాలు కొన్నానోచ్చి అని ఊరించినవాళ్ళందరి పై మాంచి కచ్చగా ఉంది... నేనుకూడా పేర్లు సేకరించడంలో మీకు సాయం చేస్తాను.. అనుమతివ్వండి..

శశి కళ చెప్పారు...

:))))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కష్టే ఫలే గారికి,
అలాగల్లాగే సార్. లిస్టులో మీ పేరు కూడా ఉంది......దహా.
ధన్యవాదాలు.

నాగరాజ్ గారికి,
ధన్యవాదాలు. జ్ఞాన వెలుగుకి షూస్, సాక్స్ అడ్డంకి కావు. జ్ఞానులలో ఇంకా రకాలు, వాటిలో వర్గాలు చాలానే ఉన్నాయి. వీరి మీద కూడా ఎప్పుడో ఒక టపా వెయ్యాలి. అన్నట్టు, జ్ఞాన సముపార్జనకి నా జీతం చాలదనే సత్యం తెలిసిన తరువాత వెలుగుని అరికాలు లోనే ఆపేసాను.......దహా.

సుజాత గారికి,
ఎంతమాట అనేసారండి. మీకు జై జై.......దహా.
ధన్యవాదాలు.

మురళీ గారికి,
ధన్యవాదాలు. ఆయన దగ్గరికి వెళితే రుబ్బురోలు పొత్రం తో ఎదురు దాడి చేస్తారేమో నని సందేహం.......దహా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రాజ్ కుమార్ గారికి,
ధన్యవాదాలు.

వర్మ గారికి,
ధన్యవాదాలు. మీరు ఏలూరు వాసులా? ఏలూరు మేము వస్తూనే ఉంటాము. ఎప్పుడో అప్పుడు కలుద్దాం తప్పకుండా.
మీరు అంత తీవ్రంగా యోగాభ్యాసం చేసేస్తే విజయమో వీరస్వర్గమో ఖాయం. విజయమైతే ఘ్రుతాచి నృత్యం, రెండోది అయితే ఏకంగా రంభా ................దహా.

నేస్తం గారికి,
ధన్యవాదాలు. అనుమతి అఖ్ఖర్లేదు. ఏకంగా దండయాత్రకే సిద్ధం కండి..........దహా.

శశికళ గారికి,
మీ చిరు హాసాలకి ధన్యవాదాలు.

బంతి చెప్పారు...

హ హ మీరు సూపరు గురువు గారు :)))

శ్రీలలిత చెప్పారు...

మీరిలాంటి టపా యేదో వ్రాస్తారని నాకెప్పుడో తెలుసు. అందుకే నేను కొనుక్కున్న పుస్తకాల గురించి యెవ్వరికీ చెప్పకుండా దాచేసుకున్నాను. హ హా..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బంతి గారికి,
ధన్యవాదాలు.

శ్రీలలిత గారికి,
ధన్యవాదాలు. ఇప్పుడు మీ పేరుని లిస్ట్లో no.1 గా పెట్టాను. మీ ఇంటికి వస్తాను. పెడితే భోజనం చేస్తాను. ఇస్తే కాఫీ తాగుతాను. ఇవ్వకపోయినా కనీసం రెండు పుస్తకాలు తెచ్చుకుంటాను, సప్పుగానే........దహా.

mother's lap చెప్పారు...

పుస్తక ప్రదర్శన అంటారా లేక ప్రదర్సన అంటారా

yours sivaprasad

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ నువ్వు చెప్పిన సూక్తులన్నీ చెప్పిన వారెవరురా? రచయితలా, పబ్లిషర్సా? పుస్తకాలు అమ్ముకోడానికి చేసుకునే ప్రకటనలలాగే ఉన్నాయి”
// “ సప్పు అంటే తిరిగి ఇవ్వకూడనిది అని నా అర్ధం) ” //
————-
సూక్తులు చెప్పినది పబ్లిషర్సే అయ్యుండాలి, సర్ అనుమానమేముంది 😁😁.

అలాగే, మీ నిర్వచనం ప్రకారం ఎరువు తీసుకువెళ్ళిన పుస్తకం చాలాసార్లు “సప్పు” గానే తయారవుతుంది చివరకు 😡.
————-
మీ టపా సూపర్, సర్ 👌😁😁. పుస్తకాలు చదవకుండానే ఇంత “గ్నానం” సంపాదించేసిన మీరు నిజంగా గ్రేట్ మహాజ్ఞాని అండీ 🙏.


బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ........... ధన్యవాదాలు. ఆ కాలంలో బ్లాగుల్లోనూ, బజ్జుల్లోనూ బోల్డంత గ్నానం దొరికేదండి. .......... మహా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అది యొక స్వర్ణయుగం, గతవైభవం అంటారా అయితే 🙂? నేను చూడలేదు లెండి, కాస్త లేటుగా ప్రవేశించాను.

సుజాత వేల్పూరి చెప్పారు...

ఇప్పుడు గంటకోసారి పంచేయొచ్చని అందరూ ఫేస్బుక్ కి, ట్విటర్ కి వలస పోయారు బులుసు గారూ

నా బ్లాగు కూడా మొన్ననే తుప్పట్టిన తాళం తీసి ఎలాగో కాస్త బూజు దులిపాను

చూద్దాం ఎన్నాళ్ళు రాయగలనో

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు. స్వర్ణయుగం అనలేమేమో. నేను 2010 లో వచ్చాను. కొత్త బ్లాగర్స్ ని ప్రోత్సహించే వారు అప్పటి బ్లాగర్స్. గత వైభవం అంటే గతించిన కాలం మిన్న వచ్చు కాలం కన్నా అని కదా నానుడి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సుజాత గారికి. ......... ధన్యవాదాలు. నాల్గైదు నెలల క్రితం నేను ఫేస్బుక్కు లో ఖాతా కి మంగళం పాడేసాను. ఇప్పుడు ఇక్కడ, ఇంకా MeWe లోనూ మాత్రమే.

మీరు బ్లాగుల్లోకి తిరిగి వచ్చినందుకు సంతోషం. స్వాగతం సుస్వాగతం.

మీరే ఎక్కడో ఎప్పుడో అన్నట్టు గుర్తు. ఇది పుట్టిల్లు అది మెట్టినిల్లు అని.
మీ టపాలకై ఎదురు చూస్తుంటాం. ............... మహా