పాపం ప్రద్యుమ్నుడికి ఈ మధ్యన తీరుబడి ఎక్కువయింది. పాత విషయాలు కొన్ని గుర్తుకు వస్తున్నాయి. వేసిన తప్పటడుగులు తెలుసుకుంటున్నాడు.
పెళ్ళైన కొత్తలో పాపం ప్రద్యుమ్నుడికి పెళ్ళాం ప్రభావతి అంటే బోలెడు ప్రేమ ఉండేది. అప్పుడప్పుడు అది గోదావరి వరదలాగా పొంగిపోయేది. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు పాపం ప్రద్యుమ్నుడు.
పెళ్ళైన కొత్తలో ప్రభావతి ప్రద్యుమ్నుడిని ఏమండీ అని పిలిచేది. మీరు అని సంబోధించేది. ప్రేమగా, గౌరవంగా , అభిమానంగా, ఆప్యాయంగా, మృదు మధురంగా, శ్రావ్యంగా అలా పిలిచేటప్పటికి ప్రద్యుమ్నుడు ఆనందోత్సాహాలతో పొంగిపోయేడు. ఎందుకంటే “ఏమండీ, మీరు” అని ప్రద్యుమ్నుడిని పిలిచిన ప్రప్రధమ వ్యక్తి ప్రభావతి. చిన్నప్పటి నుంచి, ఇంట్లోనూ, బయటా కూడా బంధు మిత్రులు, పరిచయస్తులు కూడా “ఒరేయ్, అరేయ్” అనే పిలిచేవారు. స్కూల్లో కొంతమంది మేష్టార్లు ప్రేమ ఎక్కువై, “శుంఠా, కుంకా” అని కూడా పిలిచేవారు. కాలక్రమేణా వయసు పెరిగే కొద్ది “పద్దూ, పద్దుగాడు” లాంటివి స్థిరపడ్డాయి. ప్రేమ ఎక్కువైనప్పుడు, జననీజనకులు, సోదర సోదరీమణులు పద్దూ గాడిదా అని కూడా అనేవారు.
ప్రభావతి పిలిచిన పిలుపుకి ప్రద్యుమ్నుడు ఉప్పొంగిపోయి కృతజ్ఞతా భావంతో ఒక అంగుళం వంగిపోయాడు. ప్రద్యుమ్నుడు ప్రభావతికి లొంగిపోవడానికి ఇక్కడే అంకురార్పణ జరిగింది.
జోర్హాట్ లో కాపురం పెట్టిన కొత్తలో ప్రద్యుమ్నుడి ఇంట్లో , మిక్సి, గ్రైండర్ ఇత్యాదులు లేవు. రుబ్బురోలు కూడా మూడు నెలల తరువాతే వచ్చింది. అప్పటిదాకా ప్రభావతి ఉదయం ఉపాహారంగా ఉప్మానే వడ్డించేది. సూజీ, గోధుమ రవ్వ, సేమ్యా, బ్రెడ్, అటుకుల ఉప్మాలు చేసేది. రకరకాల ప్రయోగాలు కూడా చేసేది. అప్పటికి ఇంకా నియంతృత్వ పోకడులు అలవాటు కాకపోవడం వల్ల ప్రభావతి ముందు హెచ్చరికలు చేసేది. ఈ వేళ గోధుమ రవ్వ + సేమ్యా ఉప్మా అని ప్రకటించేది. ఈ క్రమంలోనే టమోటా ఉప్మా , కేప్సికం, కేరట్, బటానీలు, బంగాళాదుంప, మిక్సెడ్ కూరల ఉప్మాలు కూడా వండి వడ్డించింది.
“ఆహా, ఈ పతివ్రతా తిలకం ఇంత కష్టపడి, నాకు రుచిగా వండి పెట్టాలని ఎంత తాపత్రయ పడుతోంది” అనే ఉదార భావం ప్రద్యుమ్నుడిలో మొలకెత్తి, దయ, జాలి, కరుణ, ప్రేమ, అభిమానం ఇత్యాదులన్నీ నీరు, ఎరువు పోయగా ఆ మొలక వృక్ష మయింది. అప్పుడు ప్రద్యుమ్నుడు ఇంకో రెండు అంగుళాలు వంగాడు.
ఇంకో పదిరోజుల్లో రుబ్బురోలు ప్రద్యుమ్నుడి ఇంట్లో గృహాప్రవేశం చేసింది. జోర్హాట్లో రుబ్బురోలు దొరకదు. వాయుసేన లో పని చేసే ఒక తమిళ సోదరుడు ట్రాన్స్ఫర్ అయి వెళుతూ రుబ్బురోలు దానం చేశాడు ప్రద్యుమ్నుడికి ఒక తెలుగు మిత్రుడి సిఫార్సు తో.
ప్రభావతి ఆనందించినట్లు కనిపించినా ప్రద్యుమ్నుడు కడుంగడు ముదావహుడు అయ్యాడు, ఉప్మా పర్వం అయిపోతుంది గదా యని. పాపం ప్రభావతి కూడ ఉత్సాహంగానే ఇడ్లి, దోశ, మినపట్టు, పెసరట్టు, అప్పుడప్పుడు ఉప్మా సహిత పెసరట్టు కూడా వండి వడ్డించేది.
ఒక ఆదివారం ఎప్పటి లాగానే 8 గంటలకి నిద్ర లేచాడు ప్రద్యుమ్నుడు. వరండా లోంచి శబ్దాలు వినవస్తున్నాయి. ఏమిటా అని శ్రద్ధగా విన్నాడు. రుబ్బురోలులో ఏదో రుబ్బుతున్న చప్పుడు.
“ఆదివారం పొద్దున్నే ఏమిటి రుబ్బుతోంది ప్రభావతి” అని ప్రశ్నించుకున్నాడు. సమాధానం కోసం వరండాలోకి వచ్చాడు.
ప్రభావతి రుబ్బురోలు ముందు కూర్చుని పెసర పప్పు రుబ్బుతోంది. రోలు ముందు ప్రభావతిని చూడగానే ఎప్పటిలాగానే ప్రద్యుమ్నుడికి జాలి పుట్టింది. జాలితో ప్రేమ పొంగుకు వచ్చింది. పొంగు ప్రవాహమయ్యే సూచనలు కనిపించాయి.
“రుబ్బు రోలు తీసుకు వచ్చి ఎంత పాపం చేశాను. ఈ నారీ శిరోమణి రెండు మూడు రోజుల కొక మారు ఈ రుబ్బుడు కార్యక్రమమునకు ఉపక్రమించు చున్నది కదా. దీనికంతయు కారణము నా నాలికయే కదా.” అని విచారించాడు.
“ప్రభావతి వంటి పిల్ల లేదోయ్ లేదోయ్
రోజూ పప్పు రుబ్బిస్తే నన్ను
వదిలి పోతుందోయ్ వదిలి పోతుందోయ్” అని పాడాడు ప్రద్యుమ్నుడు.
“నండూరి వారి అభిమానులు కర్ర పుచ్చుకుని వస్తారు ఆయన పాటలని ఖూనీ చేస్తే” అని నవ్వింది ప్రద్యుమ్నుడి ఎంకి.
“మీరు దంతధావనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని వస్తే పెసరట్లు వేసుకుందాం. ఈ లోపు చట్నీ కూడా చేసేస్తాను. ఉప్మా తయారయి పోయింది” అని చెప్పింది ప్రభావతి.
మళ్ళీ జాలి పొంగుకొచ్చింది ప్రద్యుమ్నుడికి. జాలి తో పాటు ప్రేమ ప్రవాహం కూడా.
“చట్నీ వద్దు పతివ్రతా తిలకమా, పెసరట్టు ఉప్మా తో బాగానే ఉంటుంది. అయినా వారం రోజుల క్రితం కొన్న కాశీనాథ్ భట్టాచార్య వారిచే తయారు జేయబడిన జింజర్ కా పికెల్ ఉన్నది కదా” అన్నాడు ప్రద్యుమ్నుడు.
“ అది పికెల్ కాదు బెల్లం పాకం” అంది ప్రభావతి.
“గారెలలోకి, పెసరట్లకి కూడా బెల్లం పాకం బాగానే ఉంటుంది కదా భార్యామణీ” అన్నాడు ప్రద్యుమ్నుడు.
“మీ మొహం. మీరు మొహం కడుక్కు రండి. ఈ లోపు నాకు బోల్డు పనులున్నాయి” అని విసుక్కొంది ప్రభావతి.
మళ్ళీ జాలి పొంగుకొచ్చింది. ఇంకో రెండు అంగుళాలు వంగాడు. నడ్డి, తల భూమికి సమాంతరంగా వచ్చేస్తున్నాయేమో నని అనుమానం వచ్చింది ప్రద్యుమ్నుడికి. ఎంత ప్రేమ పొంగినా, ఇక మీద వంగకూడదు అని స్వగతంలో నిర్ణయించుకున్నాడు.
ఇంకో పదిహేను, ఇరవై రోజులు రుబ్బురోలు పర్వం సలక్షణంగానే నడిచింది. ఈ మాటు జాలికి చోటు ఇవ్వలేదు ప్రద్యుమ్నుడు, ప్రయత్నపూర్వకంగానే, కష్టంగానైనా.
ఆ తరువాత వరుసగా నాల్గైదు రోజులు ఉదయం ప్లేటులో ఉప్మా దర్సనమిచ్చింది, ఈ మధ్యనే తెప్పించిన ప్రియా ఆవకాయతో సహా. ఆరవ రోజున కూడా ఉప్మా చూసి ప్రద్యుమ్నుడు, యదాలాపంగానే, తెలివితక్కువగానే అడిగాడు ప్రభావతిని,
“ప్రభా డియర్, ఏమైంది ఒంట్లో బాగాలేదా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా?” అని.
“డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత సమస్య ఏమీ లేదు. కుడి భుజం నొప్పిగా ఉంది. కొంచెం వాచిందేమో కూడా.” అని జవాబు ఇచ్చింది ప్రభావతి కాఫీ ఇస్తూ.
ప్రద్యుమ్నుడికి సమస్య అర్ధం అయీ అవనట్టుగా ఉంది. రుబ్బుడు కార్యక్రమంలో చెయ్యి నొప్పి పెట్టిందా అనే అనుమానం పొడచూపింది మనసులో. కాఫీ తాగేసి ఆఫీసు కెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ ఓ సలహా కూడా ఇచ్చాడు.
“ఎందుకైనా మంచిది. ఒక మాటు ప్రతిమ దగ్గరకు వెళ్ళు. నేను టెలిఫోన్ చేసి చెబుతాను ప్రతిమకి” అని.
“అఖ్ఖర్లేదు. ప్రతిమతో నాకు పరిచయం బాగానే ఉంది. మీకు అంతగా ప్రతిమతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడుకోండి. నాకభ్యంతరం లేదు. నా సంగతి సాకుగా చూపి మాట్లాడఖ్ఖరలేదు.”
Dr. ప్రతిమ మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తోంది వాళ్ళ ఆఫీసులోనే. పెళ్ళికి ముందు సుమారు ఆర్నెల్లు, ప్రద్యుమ్నుడు ప్రతిమ చుట్టూ తిరిగేవాడని ప్రభావతికి తెలిసింది. అంతస్తుల్లో అంతరాలు ఎక్కువగా ఉన్నందున ప్రద్యుమ్నుడి ప్రయత్నాలు భంగమయ్యాయని కూడా తెలిసింది. ప్రతిమ తండ్రిగారికి, రెండు తేయాకు తోటలు ఉన్నాయని కూడా తెలిసింది ప్రభావతికి. కాలక్షేపం కోసమే ఉద్యోగం చేస్తోందని, ఆమె లండన్ వెళ్ళే ప్రయత్నంలో ఉందని కూడా తెలిసింది. ఆమెకు కాబోయే భర్త అక్కడే ఉన్నాడని తెలిసి ప్రద్యుమ్నుడు ప్రేమ ప్రయత్నం విరమించుకున్నాడని కూడా భోగట్టా సేకరించింది, ప్రభావతి.
ఇంకో వారం పది రోజులు ఇలాగే గడిచిపోయాయి. ఉప్మా, బ్రెడ్ జామ్, కారన్ఫ్లేక్స్ పరంపర కొనసాగింది. ప్రద్యుమ్నుడు మాట్లాడకుండా తిని వెళ్లిపోయేవాడు. “తనకే ఇవి తినడం విసుగొచ్చి , ఇడ్లీ, దోసల ప్రకరణం మళ్లీ ప్రభావతి మొదలు పెడుతుందేమో” నని ఆశగా ఎదురు చూస్తున్నాడు ప్రద్యుమ్నుడు.
ఒక ఆదివారం ప్రద్యుమ్నుడుకి ఉదయం నిద్రలేవగానే వరండాలో రుబ్బుడు శబ్దం శ్రావ్యంగా వినిపించింది. విజయ దరహాసం ప్రద్యుమ్నుడి పెదవుల మీదకు పాకింది. లేచి వరండాలోకి వచ్చాడు. పెసరపప్పు రుబ్బుతున్న ప్రభావతి ముగ్ధ మనోహరంగా కనిపించింది ప్రద్యుమ్నుడి కళ్ళకి.
“లేచారా? నేను
లేచేటప్పటికే 7-30 అయింది. పెసరట్టు ఉప్మా చేసుకుందాం. ఆప్పుడే 8 దాటింది. కొంచెం ఈ కొబ్బరి కోరండి. ఇంకా ఉప్మా కూడా
చెయ్యాలి.” అని అంది.
ప్రద్యుమ్నుడు ముందు జాగ్రత్తగా అన్నాడు,
“ఇంకా మొహం కడగలేదు. అయినా పెసరట్టు ఉప్మాకి చట్నీ అవసరం లేదులే” అన్నాడు సామరస్య పూర్వకంగానే.
“ఎంత, అయిదు నిముషాల పని. ఇది చేసేసి మీ కార్యక్రమాలకి వెళ్ళండి.” బతిమాలే ధోరణి లోనే అంది అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.
“సరేలే కొబ్బరే కదా కోరెస్తే సరి. ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా? ” అని కూడా అనుకున్నాడు.
కోరం ముందు కూర్చుని కొబ్బరి చిప్ప పట్టుకొని కోరడానికి ఉపక్రమించాడు ప్రద్యుమ్నుడు.
ఇంతలో ప్రభావతి లేచి, వంటింట్లోకి వెళ్లి ఐదు నిముషాల తర్వాత బయటకు వచ్చింది. మొహం సబ్బుతో తోమింది అనుకున్నాడు ప్రద్యుమ్నుడు.
“మొహం జిడ్డుగా ఉంది. ఆదివారం కదా ఎవరైనా వస్తే బాగుండదు” అంటూనే బెడ్ రూం లోకి వెళ్లింది. ఇంకో ఐదు నిముషాల తరువాత వచ్చింది. ఈ లోపునే ప్రద్యుమ్నుడు కొబ్బరి కోరడం పూర్తి చేసేశాడు. ప్రభావతి చూసి.
“బాగానే కోరారండి. సన్నగా మెత్తగా, నా కంటే బాగా ” అంది. సన్నగా, మెత్తగా అంటే అర్ధం కాకపోయినా, “నా కంటే బాగా” అన్న మాట విని కొంచెం గర్వపడ్డాడు అమాయకుడు.
వంటింట్లోకి వెళుతూ అంది ప్రభావతి. “పెసరపప్పు నేను చాలా మట్టుకు రుబ్బేశాను, ఇంకో నాల్గైదు మాట్లు తిప్పితే సరిపోతుంది. అది మీరు చూడండి. ఈ లోపున నేను ఉప్మా చేస్తూ ఉంటాను.”
రుబ్బురోలు కేసి చూశాడు ప్రద్యుమ్నుడు. పిండి మెత్తగానే కనిపిస్తోంది. ఇంకో నాల్గైడు మాట్లు పొత్రం తిప్పితే సరిపోతుందేమో అనుకున్నాడు. అయినా బింకంగానే అన్నాడు,
“నాకు రుబ్బడం చేత కాదు ప్రియతమా”
“ఇదేం, బ్రహ్మవిద్యా, రోజూ నేను రుబ్బుతుంటే చూస్తూనే ఉన్నారుగా”
“ఎప్పుడూ ఇటువంటివి చేయలేదు” దీనంగానే అన్నాడు ప్రద్యుమ్నుడు.
“భలే వారే. M. Sc. చేశారు. అందులోనూ కెమిస్ట్రీ, మీకు తెలియక పోవడం ఏమిటీ. మీరు చెయ్యగలరు” నమ్మకం గానే అంది ప్రభావతి
ధైర్యం చెబుతూ.
ప్రద్యుమ్నుడు వంటింట్లోకి తొంగి చూశాడు. ప్రభావతి కత్తిపీట ముందు వేసుకొని, ఉల్లిపాయలు తరుగుతోంది. పక్కనే పచ్చి మిరపకాయలు, అల్లం ఉన్నాయి కూడా. ఇక తప్పదనుకొని రుబ్బురోలు ముందు పీటపై కూర్చున్నాడు, రుబ్బడానికి సిద్ధమై. రెండు మాట్లు పొత్రం తిప్పాడు.
ఇంతలో ప్రభావతి చెప్పింది, “ఆ పక్కనే మూత వేసిన గిన్నెలో ఇంకొంచెం పెసరపప్పు ఉంది, అది కూడా రుబ్బేయండి.” మూత తీసి చూశాడు ప్రద్యుమ్నుడు, మూడు నాలుగు గుప్పెళ్ళు పైనే ఉంది పెసరపప్పు అనుకున్నాడు.
“ఇంత పప్పు ఎందుకు? మనిద్దరికి రుబ్బిన పిండి సరిపోతుంది కదా?” అన్నాడు ప్రద్యుమ్నుడు విసుగ్గా.
“అదేమిటి, మీ అభయ్ సింగ్ వస్తానన్నాడు కదా ఈ వేళ బ్రెక్ఫాస్ట్ కి. మరిచిపోయారా? “
“గుర్తు లేదు నాకు. ఎప్పుడు చెప్పాడు? అయినా వాడికి ఇడ్లీ, దోశ చేస్తే బాగుంటుంది కదా ” అడిగాడు ప్రద్యుమ్నుడు.
“నాలుగు రోజుల క్రితం క్లబ్బులో చెప్పాడు. మీరు రమ్మని ఆహ్వానించారు కూడాను. నాకూ గుర్తు లేదు. నిన్నరాత్రి పడుకునే ముందు గుర్తుకు వచ్చింది. పెసరపప్పు నానవేశాను” చెప్పింది ప్రభావతి.
ఎలాగూ తప్పదు కదా, వాడు వచ్చేలోపున పూర్తి చేయాలి, రుబ్బడం. లేకపోతే ఆఫీసులో నేను పిండి రుబ్బుతున్న వార్త ప్రసారం చేసేస్తాడు. గబగబా రుబ్బడం మొదలు పెట్టాడు ప్రద్యుమ్నుడు. ఇంకో పది నిముషాల్లో రుబ్బడం అయిపోయేటప్పుడు, చెప్పింది మళ్ళీ ప్రభావతి,
రుబ్బడం అయిపోతే, పిండి గిన్నెలోకి తీసి, రోలు కడిగి, ఈ వేయించిన వేరుసెనగపప్పు కొబ్బరితో కలిపి ఇంత మజ్జిగ పోసి రుబ్బెయ్యండి. నేను పోపు పెట్టేస్తాను. ప్రద్యుమ్నుడికి కోపం వచ్చింది. కానీ అభయ్ సింగ్ వచ్చేస్తాడేమో తొందరగా అని భయపడ్డాడు. “పోనీ పాపం ఇంకా చెయ్యి నొప్పిగా ఉందేమో” నని సరిపెట్టుకున్నాడు. కొబ్బరి, వేరుశెనగపప్పు కూడా మజ్జిగతో రుబ్బేసి, పచ్చడి ప్రభావతికి ఇచ్చేసి తన కార్యక్రమాలకి వెళ్ళిపోయాడు ఇంకేం మాట్లాడకుండా.
గెడ్డం
గీసుకుంటుంటే అనుమానం వచ్చింది
ప్రద్యుమ్నుడికి, “ఇది కావాలని చేసిందా లేక అనుకోకుండా జరిగిందా?” అని.
ఏమైతేనేం ఇంకో రెండు అంగుళాలు వంగ వలసి వచ్చిందిగా అనుకున్నాడు. తను వంగాడా? లేక ప్రభావతి కావాలని వంచిందా? సందేహం తీరలేదు. ఏమైనా లంబ కోణం కంటే తక్కువగానే వంగిపోయాను కదా, ప్రభావతి ముందు అని విచారించాడు ప్రద్యుమ్నుడు.
“సీతారామ స్వామీ నే చేసిన నేరం బేమి” అని పాడుకున్నాడు.
ఈ పాట ఇంకో రెండు మూడు మాట్లు పాడుకోవలసి వచ్చింది, పొదుపు ఉద్యమంలోనూ (పొదుపు సమీకరణాలు ), ప్రభావతి పుట్టినరోజు సందర్భంగానూ ( మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను ).
ఈ పాటలన్నీ అయేటప్పటికి, చేతులతో కాలి వేళ్ళు పట్టుకునే స్టేజికి వచ్చేశానని విచారించాడు.
ఇలాగే సాగితే తలతోనే కాలి వేళ్ళు అంటుకోవచ్చునేమో అని దుఃఖించాడు పాపం ప్రద్యుమ్నుడు.
1 కామెంట్:
“స్వయంకృతం” కాదా మరి 😁😁?
కామెంట్‌ను పోస్ట్ చేయండి