మా ఆవిడ ముచ్చట్లు
కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట.
మళ్ళీ రెండునెలల దాకా ముహూర్తాలు లేవురా, మళ్ళీ రావల్సిందే అని మానాన్నగారు నిర్ణయం చెప్పేసారు. మాబావ “పాపం వీడి పునస్సంధాన ముహూర్తం లస్కుటపా అయింది” అని జాలిపడ్డాడు.
ఆఫీసు కెళ్ళాక ఒక సందేహం వచ్చింది. ఊతవాక్యాలు అనేటప్పుడు మాఆవిడ దిక్కులు, వాళ్ళకేసి, వీళ్ళకేసి ఎందుకు చూస్తుందీ అని. ధైర్యంచేసి మాఆవిడను అడిగేసాను. సినీమాలు చూడరా అంది. నాగేశ్వరరావు ఏంచేస్తాడు? గుమ్మడికేసి చూస్తాడు, సావిత్రికేసి చూస్తాడు, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తాడు. ఆతర్వాత వాళ్ళు కూడా ఈయనకేసి చూస్తారు. అప్పుడు కాని బరువైన డైలాగు వదలడన్నమాట అంది. ఐ సీ అనుకున్నాను. నేను నాగేశ్వరావు వీరాభిమానిని అని కూడా చెప్పింది. నాగేశ్వరరావుకి ప్రేమలేఖ కూడా వ్రాసిందిట. ఆయన కాకపోతే ఎవడైతే ఏంటి అని నన్ను పెళ్ళి చేసుకునేందుకి ఒప్పుకుందిట.
ప్రద్యుమ్నుడి మొదటి పెళ్లి చూపులు
1968 మే నెలలో ప్రద్యుమ్నుడు అన్నగారి పెళ్ళికి భీమవరం వెళ్లి, జూన్ మొదటి వారంలో జోర్హాట్ కి తిరిగి వచ్చేసాడు.
అన్నగారి పెళ్ళిలో ఇద్దరు ముగ్గురు ప్రద్యుమ్నుడిని చూసి ముచ్చట పడ్డారు. అమ్మాయిలు కాదు. అమ్మాయిల తల్లి తండ్రులు. అన్నగారి పెళ్ళిలో తనకి కూడా పెళ్లికళ వచ్చేసిందని సంబర పడిపోయాడు ప్రద్యుమ్నుడు.
అందులో ఒకాయన ప్రద్యుమ్నుడు జోర్హాట్ తిరిగి వచ్చేలోపులే భీమవరం వచ్చి మాట్లాడి వెళ్లారు. అమ్మాయి జాతకం, ఫోటో కూడా ఇచ్చి, ప్రద్యుమ్నుడి ఫోటో జాతకం తీసుకు వెళ్లారు. జాతకాలు కుదిరితే తెలియపరుస్తామని చెప్పారు. అబ్బాయి దసరాకో సంక్రాంతికో వచ్చినప్పుడు పెళ్లి చూపులు కార్యక్రమం పెట్టుకోవచ్చని ప్రద్యుమ్నుడి తండ్రిగారు ఆయనకు చెప్పారు అమ్మాయి ఫోటో చూసి ప్రద్యుమ్నుడు మురిసిపోయాడు. ఇంట్లో అందరికీ కూడా ఫోటోలోని అమ్మాయి నచ్చింది. అమ్మాయి పేరు రాధ. BA చివరి సంవత్సరం చదువుతోంది. రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరు వాళ్ళది. పిల్ల తండ్రి తెలుగు మాష్టారు. వేదం కూడా చదువుకున్నారు. ప్రద్యుమ్నుడి నాన్నగారు ముచ్చట పడ్డారు. కానీ అమ్మగారు “వీడికి కాబోయే మామగారు కూడా తెలుగు మాష్టారేనా, వేదం కూడానా” అని నిరుత్సాహపడ్డారు.
పిల్ల తండ్రి వెళ్ళిన తరువాత ప్రద్యుమ్నుడు మొహమాట పడ్డాడు “అప్పుడే నాకు పెళ్ళా?” అని.
“ఇప్పటికే 25 ఏళ్లు నిండాయి. ఇంకా ఎప్పుడూ చేసుకుంటాడుట? నెత్తిమీద తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఇంకో రెండు మూడేళ్ళు అయితే పిల్ల నివ్వడానికి ఎవరూ రారు” అని తీర్పు చెప్పేసారు ప్రద్యుమ్నుడి తండ్రి గారు.
మొహమాటానికి మొహమాట పడ్డా, పెళ్లి చేసుకోవాలని ప్రద్యుమ్నుడు కూడా తొందర పడుతున్నాడు, కాబట్టి తల ఊపేసాడు. ఆ మద్యాహ్నం ఆంతరంగిక సభ జరిగింది. ఆ సభలో పెద్దక్క గారు తేల్చి చెప్పేసారు.
“పెద్దాడి పెళ్లిలో లాగా ఆడపడచు లాంఛనాలు రెండు వందలు చేతిలో పెడితే కుదరదు. చిన్నాడి పెళ్ళిలో మాకు తలా వెయ్యి ఇవ్వాల్సిందే. అమ్మకు అత్తగారి లాంఛనాలు రెండు వేలు ఇవ్వాలి”
“నలుగురికీ నాలుగువేలు అత్తగారికి రెండు వేలు, మొత్తం ఆరు వేలు అంటే దాదాపు కట్నం అంత అవుతుంది. అంత ఆశ పెట్టుకోకండి. నేనూ నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాను. కష్టసుఖాలు నాకు తెలుసు.” అని ఇంకో తీర్పు చెప్పారు ప్రద్యుమ్నుడి తండ్రిగారు.
“పెద్దాడి మామగారు నీ బాల్య స్నేహితుడని, ఆయన ఏమన్నా నువ్వు ఒప్పుకున్నావు. చిన్నాడి పెళ్ళిలో అలా కుదరదు. మాటలకి వెళ్ళినప్పుడు నేను కూడా వస్తాను ఈ మాటు” కరాఖండిగా చెప్పింది ప్రద్యుమ్నుడి పెద్దక్క. అంతటితో ఆగలేదు ఆవిడ,
“ఒరేయ్ పద్దూగా, వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వు మిగిలింది వేసి వెయ్యి రూపాయలూ ఇవ్వాల్సిందే” అని కూడా నొక్కి వక్కాణించింది. “లేకపోతే నీ పెళ్ళికి మేం రాము” అనికూడా చెప్పింది.
“సరే అలాగే లే” అని ఒప్పేసుకున్నాడు ప్రద్యుమ్నుడు.
సభ తరువాత అరుగు మీద కూర్చుని ధూమ పానం చేస్తున్నప్పుడు, జాలి పడ్డాడు ప్రద్యుమ్నుడి పెద్ద బావగారు.
“మాకు పెళ్లి అయిన తరువాత కష్టాలు మొదలయితే, వీడికి పెళ్లి కాకుండానే మొదలవుతున్నాయి”
“అదేమిటి? హాయిగా సంసారం చేస్తున్నారు కదా. మీకేం కష్టాలు?” ఆశ్చర్యపడ్డాడు ప్రద్యుమ్నుడు.
“కనిపించేది అంతా సత్యం కాదు ప్రద్యుమ్నా. మీ నాన్న మీ అక్కయ్యకు పసుపు కుంకుమ గా ఇచ్చిన అర ఎకరం మొన్న అమ్మితే పదిహేను వందలు పూర్తిగా రాలేదు” అని నవ్వాడు పెద్దబావగారు.
“మేం అది ఎప్పుడో అమ్మేసాం” అని వంత పాడారు మిగతా బావలు కూడా.
అప్పుడు హితబోధ చేశారు బావలు నలుగురు,
“నాయనా ప్రద్యుమ్నా, పెళ్లి అనేది ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణ వ్యామోహంలో ముందు ముందు జరిగే విపరీత పరిణామాలను అజ్ఞానులు గ్రహించలేరు. పెళ్లికి పర్యవసానం బానిసత్వం. స్త్రీ అయస్కాంతం లాగా ఆకర్షిస్తుంది కానీ పెళ్లి అయిన స్త్రీలు అణుబాంబులా పరివర్తనం చెందే అవకాశాలు ఎక్కువ. అసలు ఆడపిల్లలు వయసుకు రాగానే ఈ పరివర్తనం మొదలవుతుందని, అందుకనే వారి తల్లి తండ్రులు శాయశక్తులా ప్రయత్నించి వీలైనంత త్వరగా పెళ్లి అనే పేరుతో ఆ అణుబాంబుని ఇంకెవరి ఇంట్లోనో వేసి ఊపిరి పీల్చుకుంటారనీ జ్ఞానులు బోధిస్తారు. అందుకే కట్నాలు ఇస్తారు, ఆడపడచు లాంఛనాలు, అత్తగారి లాంఛనాలు ఇస్తారు. అల్లుడు అలిగితే సైకిల్ కూడా కొనిపెడతారు. మగవాడు నిమిత్తమాత్రుడు. అయస్కాంత శక్తికో అణు ధార్మిక శక్తికో బలై పోతూనే ఉంటాడు. కాబట్టి బుద్ధి తెచ్చుకుని పెళ్లి అనే ఆడ పిల్లల తల్లితండ్రుల కుతంత్రం లో పడకు” అని ఉపదేశించారు.
“పెళ్లి చేసుకొని సంసారసాగరంలో మునిగేవాడు పురుషుడే. భార్యా పిల్లలు ఒడ్డున కూర్చుని వేడి వేడి వేరుసెనక్కాయలు తింటూ చప్పట్లు కొడతారు కానీ నీకు చేయ అందివ్వరు” అని కూడా బోధించారు.
“ఎంత వీరోచితంగా పోరాడినా సంసారం అనే మహా యుద్ధంలో పురుషులు బాలచంద్రులు, అభిమన్యుల లాగే అవతారం చాలించాల్సి ఉంటుంది.” అని కూడా ఉద్భోదించారు.
పోగాలము దాపురించిన వారు హిత వాక్యములు వినరు అని ఎవరో అన్నారు. ప్రద్యుమ్నుడు కూడా వినలేదు. పెళ్లి చేసుకొని సంసారసాగరాన్ని విజయవంతంగా ఈది, ముందు తరాలవారికి మార్గ దర్శనుడ నవుతానని భీష్మించాడు ప్రద్యుమ్నుడు. “గృహమే కదా స్వర్గసీమ” అని పాడి వినిపించేడు కూడా.
జోర్హాట్ లో కూడా కుటుంబీకులు కొంతమంది హిందీలోనూ, మరి కొంత మంది తెలుగులోనూ కూడా హితబోధ చేశారు. ప్రద్యుమ్నుడు పట్టించుకోలేదు. ఒక తెలుగాయన బ్రహ్మోపదేశం కూడా చేశారు.
“వత్సా, ప్రద్యుమ్నా, గృహస్తు అని ఎందుకు అంటారో తెలుసా?” సమాధానం కోసం చూడకుండా కొనసాగించాడు,
“గృహమే ఆస్తిగా కలవాడిని గృహస్తు అంటారు. మిగిలిన ఏ ఆస్తులూ భార్యా పిల్లలు వాడికి మిగలనీయరు. వారి సరదాలకు, వారి భోగాలకు, వారి టింగురంగా లకు ఖర్చు అయిపోతుంది. తండ్రిగారు ఇచ్చిన గృహము కూడా అతి కష్టం మీద నిలుపుగో గలుగుతాడు. ఇంటికి దీపం అనిపించుకునే ఇల్లాలుని గృహస్తి అంటారు. అంటే గృహంలో ఏనుగు అని అర్ధం. వారికి ఎదురు చెప్పలేరు, తెలియకుండా ఏ పని చేయలేరు. చెవులు పెద్దవి కదా.” ఇంతటితో ఆగలేదు ఆయన.
“పెళ్లి అయిన కొంత కాలం తరువాత ”జాయెతు జాయె కహా, సంఝేగా కౌన్ యహా దర్ద్ భరే దిల్ కి జుబా” అని పాడుకోవాలి. వలదు నాయనా వలదు పెళ్లి అనే యజ్ఞంలో సమిధి కావలదు” అని ప్రభోదించారు.
అయినా ప్రద్యుమ్నుడు లక్ష్యపెట్టలేదు. పైగా,
“ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి” అని పాడాడు కూడా.
ప్రద్యుమ్నుడు రాధ ఫోటో చూడగానే మనసు పాడేసుకున్నాడు ఆమె మీద. ఫోటోలో చూడగానే ప్రేమించడం ‘లవ్ యట్ ఫస్ట్ సైట్” అంటారా అని తనలో తనే చర్చించుకున్నాడు. “రాధే నా జీవనజ్యోతి” అని తీర్మానించుకున్నాడు.
తండ్రిగారికి ఉత్తరం వ్రాద్దామనుకున్నాడు “పితాశ్రీ, కట్నకానుకలు, లాంఛనాలు అంటూ అడగవద్దు. అవసరమైతే పెళ్లి ఖర్చులు కూడా కొంత మనమే భరిస్తాం అని చెప్పండి వారికి” అని. కానీ అంత పని చేసే ధైర్యం చాలలేదు. విషయం తెలిస్తే, పెద్దక్కగారు రుద్రకాళి అవతారం ఎత్తుతుందేమో నని భయపడ్డాడు కూడా.
ఒక ఇరవై రోజుల తరువాత తండ్రిగారు ఉత్తరం వ్రాశారు. “ఇంకో రెండు సంబంధాలు వచ్చాయి. ఒకాయన హైదరాబాదులో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. అబ్బాయికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ కూడా చేయిస్తానన్నారు, అమ్మాయి అక్కడే M.Sc చదువుతోంది. కట్న కానుకలు బాగానే ఇస్తారు అని మధ్యవర్తి చెప్పాడు. రాజమండ్రి ఆయన కూడా మళ్ళీ వచ్చారు. దసరాలకి వస్తే వెళ్లి చూసి ఏదో ఒకటి నిశ్చయించు కోవచ్చు” అని.
ఈ మాటు ప్రద్యుమ్నుడు బెదరలేదు, ఆలోచించలేదు. ధైర్యంగా తండ్రిగారికి ఉత్తరం వ్రాసేసాడు.
“నాకు ఇక్కడ ఉద్యోగం బాగానే ఉంది. ఆర్నెల్ల క్రితమే Ph.D పని మొదలు పెట్టాను. ఇంకో నాల్గైదు ఏళ్లు పట్టవచ్చు. Ph.D వచ్చేదాకా ఇక్కడినుంచి కదిలే ఉద్దేశ్యం లేదు. ఆయనెవరు నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడానికి. నేను ఒప్పుకోకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. రాజమండ్రి ఆయన మళ్ళీ వచ్చాడని అన్నారు కదా మీరు. పిల్లని ఇంతదూరం పంపడానికి ఆయన అప్పుడు అభ్యతరం చెప్పలేదు కదా. వారి అమ్మాయి మన ఇంట్లో అందరికీ నచ్చింది కదా. ఇంకా సంబంధాలు చూడడం ఎందుకు?” అని నిర్మొహమాటంగా తన మనసులో మాట చెప్పేసాడు.
“దసరాలకి శలవు దొరకదు. నెల క్రితమే కదా తిరిగి ఇక్కడకు వచ్చింది. సంక్రాంతికి రావడానికి ప్రయత్నిస్తాను.” అని కూడా వ్రాసాడు.
సంక్రాంతికి ఇంటికి వెళ్లాడు ప్రద్యుమ్నుడు. రాధా ప్రద్యుమ్నుల జాతకాలు బ్రహ్మాండంగా కుదిరాయి అని చెప్పారు. పెళ్లి చూపులు అన్నారు. మొట్ట మొదటి పెళ్లి చూపులు ప్రద్యుమ్నుడికి. శ్రద్ధగా తయారయ్యాడు. భూమికి చంద్ర మండలానికి మధ్య దూరం తెలుసుకున్నాడు. గుడ్డులో పోషక పదార్ధాలు ఏమిటో భట్టి పట్టాడు. ఎందుకైనా మంచిదని కాంగో దేశం వైశాల్యం కూడా కనుక్కున్నాడు. M.Sc. పరీక్షలకి కూడా ఇంత కష్టపడలేదు కదా అని విచారించాడు.
పెళ్లి చూపులకి వెళ్ళారు. అమ్మాయి ఫోటోలో కన్నా బయటే బాగుందని ప్రద్యుమ్నుడు సరదా పడ్డాడు. వంటా వార్పూ , సంగీతం కూడా వచ్చునట. ఏదో సినిమాలో సుశీల పాడిన కీర్తన కూడా పాడింది. “ఇది ఏ సినిమాలో పాట?” అని పెళ్లి కూతురి తరఫు వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో నని భయపడ్డాడు ప్రద్యుమ్నుడు కానీ ఎవరూ అడగలేదు. అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తుందేమో నని ప్రయత్నించాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి తండ్రి గారు వీటో చేసేసారు. ఇటువంటి తిక్క ఆచారాలు మన ఇంటా వంటా లేవని తేల్చేసారు. తను భట్టి పట్టిన నాలుగు విషయాలు అమ్మాయికి చెప్పి తన లోక జ్ఞానం ప్రదర్శించాలన్న ప్రద్యుమ్నుడి ఉత్సాహం నీరు కారిపోయింది. పెళ్లి చూపుల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. అమ్మాయి తండ్రి మంచి రోజు చూసుకొని మిగతా విషయాలు మాట్లాడటానికి వస్తాం అని చెప్పారు.
ప్రద్యుమ్నుడు జోర్హాట్ వచ్చేసాడు. కలలో రెండు మూడు యుగళ గీతాలు పాడుకొన్నాడు కూడా రాధతో.
ఫిబ్రవరి నెలలో ప్రద్యుమ్నుడు తన బాసు గారితో దులియాజాన్ లో ఒక కంపనీకి వెళ్లాడు. బాసు గారి గౌరవార్ధం వాళ్ళు ఆ రాత్రికి అక్కడ ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో రామనాధం అనే ఒక తెలుగాయన ప్రద్యుమ్నుడితో పరిచయం చేసుకున్నారు. విందు కాబట్టి మందు గట్రా ఉన్నాయి. ఒక గ్లాసు చేతితో పట్టుకుని, మరో చేత్తో సిగరెట్టు పట్టుకొని ద్విపాత్రాభినయం చేస్తున్న ప్రద్యుమ్నుడితో రామనాధం గారు చాలాసేపే మాట్లాడారు. హాబీలు గట్రా కనుక్కున్నారు. జీతం, ప్రమోషను వచ్చే అవకాశాలు కూడా కనుక్కున్నారు. ఆయన ప్రద్యుమ్నుడి బాసు గారితో కూడా మాట్లాడడం గమనించాడు ప్రద్యుమ్నుడు.
తిరిగి వచ్చేటప్పుడు బాసు గారు చెప్పారు ప్రద్యుమ్నుడితో “ఆ రామనాధం నీకేదైనా ఉద్యోగం ఇస్తాడేమో? నీ గురించి అడిగాడు నన్ను.”
“అవునండీ నన్ను కూడా చాలా విషయాలే అడిగారు. ప్రాజెక్ట్ వర్కు గురించే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా చాలానే అడిగారండి. ఏమైనా, నా Ph. D అయ్యేదాకా మిమ్మల్ని వదలనండి” అని చెప్పాడు ప్రద్యుమ్నుడు.
“అందుకనే కుర్రాడు బుద్ధిమంతుడే కానీ దుడుకు స్వభావం, అని చెప్పాను. ప్రైవేట్ కంపనీలు వ్యక్తిగత విషయాలకి కూడా తగు ప్రాధాన్యత ఇస్తాయి.” అని అన్నారు.
ప్రద్యుమ్నుడు కలల్లో రాధతో డ్యూయెట్లు పాడుకుంటూనే తండ్రి గారి దగ్గర నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాడు. మార్చి అయిపోయింది. ఏప్రిల్ మొదలై వారం కూడా అయిపోయింది. తండ్రి గారి వద్ద నుంచి కబురు రాలేదు. మనసు కీడుని శంకించింది. ఏమైనా అడ్డంకులు వచ్చాయేమో నని సమాధాన పడడానికి ప్రయత్నించాడు. నాన్నగారికి వ్రాసే ధైర్యం లేక ప్రద్యుమ్నుడు పెద్దక్క గారికి ఉత్తరం వ్రాసాడు.
తిరుగు టపాలో ఉత్తరం వచ్చింది.
“వాళ్ళ వాళ్ళు ఎవరో దులియాజాన్ లో ఉన్నారట. నీ దురదృష్టం కొద్దీ నువ్వు వాళ్ళ ఆఫీసుకే వెళ్ళావట. ఆయన నీతోనూ, మీ బాసుతో కూడానూ మాట్లాడారట. “కుర్రాడు పొగరుబోతు, సిగరెట్లు కాలుస్తాడు, మందు కొడతాడు, క్లబ్లో రాత్రి 10 గంటల దాకా పేకాట ఆడుతాడట.” అని సమాచారం తెలుసుకొని వాళ్ళ వాళ్లకి తెలియ పరిచారట” .
ఈ విషయం మధ్యవర్తి ద్వారా తెలిసి ప్రద్యుమ్నుడి తండ్రి గారు అగ్గిరాముడై ఇంట్లో కధకళి కూడా చేసేసారట. “ఉద్యోగం మాని ఇంటికి వచ్చేయమని నీకు తాఖీదు పంపడానికి ఆయన తయారయితే అతి కష్టం మీద నేనూ అమ్మ కలసి ఆపాం”, అని కూడా అక్కగారు తెలియజేశారు.
“ఔరా రామనాధం ఎంత పని చేసేవురా” అని ఆక్రోశించాడు ప్రద్యుమ్నుడు.
ఉజ్వల భట్టాచార్య తో నా నౌకా విహారం
నాన్నగారూ నాన్నగారూ నాకింకా ఎందుకు పెళ్లి చేయలేదు అని.
వారు మా అన్నయ్య కేసి చూపించి అగ్రజుని కి కాకుండా అనుజుడికి పెళ్లి చేసే ఆచారం మన ఇంటా బయటా కూడా లేదు అని సెలవిచ్చారు.
నేను ఆగ్రహము తో కుపితుడ నై, క్రోధము తో దు:ఖితుడనై, విచార వదనుడనై ఇట్లు వ్రాక్కుచ్చితిని
“సోదరా, సహోదరా నీకును 27 ఏళ్లు వచ్చెను. అయినను బ్రహ్మచర్య వ్రతమేలా నాచరించు చుంటివి. నీకిది భావ్యమా”
మా తండ్రిగారి జ్యేష్ట పుత్రుడు మందహాసం చేసి “నువ్వు అరిచి ఏడ్చి మొత్తుకున్నా సరే, నాకు 750 రూప్యములు జీతము వచ్చు వరకు విహాహం చేసుకోను కోను కోను” అని నొక్కి వక్కాణించెను. నేను ఉండునది హైదరాబాదా మజాకానా అని కూడా అన్నాడు . మై నహీ కరూంగా అని ఎఫెక్టు కోసం హూ అని కూడా అన్నాడు.
నేను వెంటనే గుణకారం, భాగహారం కూడా చేసేసి వాడి ఇంక్రిమెంట్ 25 రూకలు, ఏడాదికి పెరుగు డి.ఏ 50-70 రూకలు వెరసి 2 వత్సరములు దాకా వీడి పెళ్లి కి అవకాశం లేదనిపించి, సంయమనం పాటించి మృదు మధుర స్వనం తో ఉద్ఘాటించితిని
“ సుబ్బావధాన్లు గారి ప్రధమ దౌహిత్రుడా, సోమయాజులు గారి ద్వితీయ పౌత్రుడా, మీ తాత గార లిరువురును 17 ఏళ్లు వచ్చుటకు ముందే వివాహము చేసికొనిరి. కుల గౌరవము, వంశ గౌరవము నిలబెట్టు నుద్దేశ్యము లేదా” అని.
లేదు అని చాలా సింపుల్ గా సమాధాన మిచ్చాడు.
అయినను ఆశ చావక నేను ఈ మారు శాంత గంభీర స్వరం తో
“ఎక్కడో 3000 కి.మీ దూరం లో అస్సాం లో తిండి తిప్పలు, కాఫి టిఫిన్లు కూడా లేకుండా నేను అవస్థ పడుతుంటే నా మీద ఇసు మంత యైన కనికరం లేదా. నా క్లాసు మేటు తిరు వెంకటాచారి గుర్తున్నాడా, ఎప్పుడూ పరీక్షలు తప్పుతూ, బి.ఏ ఇంకా చదువుతూ, నా కన్నా ఒక ఏడాది చిన్న వాడైన చారి, పెళ్లి చేసుకొని, తండ్రి గారి ని తాత ను చేసాడని విని నప్పుడు నీకేమి అనిపించలేదా? హతవిధీ బుద్ధి తెచ్చుకొనుము” అంటూ గద్గద గొంతు తో ఘోషించితిని.
అయినను వాడు చలించలేదు.
అందువల్ల నాకు ఇంకా పెళ్లి కాలేదన్న మాట. అయినను నేను నిరుత్సాహం చెందక ’ధైర్యవంతో బుద్ధిమంతః’ అని ఎవరూ అననిది నేనే అనుకొని, బుద్ధిమంతుడను కాబట్టి ధైర్యం తెచ్చుకొని సంసారం అను సాగరం లో దూకుట అను కార్యక్రమమును పోస్ట్ పోను చేసుకొన్నాను.
కానీ ’మనస్సో కోతిహి’ అని కూడా విని యుండుట వలన ఆ యొక్క చంచలమైన మనస్సు తో అలోచించి, పోనీ, ఎవరో ఒక సుందరిని లవ్వాడేసి ప్రేమించి, సుందరీ ఆమె తల్లి దండ్రులు అంగీకరిస్తే, మా నాన్నశివ తాండవం చెయ్యకపోతే, పెళ్ళాడేస్తే ఎల్లా ఉంటుంది అని కూడా సుదీర్ఘం గా చింతించితిని.
ఎందుకైనా మంచిదని ఈ విషయం నా మిత్ర మండలి లో చర్చకు పెట్టాను. నా మిత్రమండలి అనగా ఉన్నికృష్ణన్ నారాయణ మీనన్, గణపతి అయ్యర్ అను నా ఇద్దరు మితృలు. మేము ముగ్గురము చాలా మంచి మితృలము. ముగ్గురము దక్షిణ భారతీయ బ్రహ్మచారు లమగు ట చే మా బంధము ఇంకను బలపడినది. సుమారు గా ఒకే వయసు వార మగుటచే అభిరుచులు కూడా ఒకటి గా నుండెడివి.
ముగ్గురము ఏక కంఠము తో ఏక తాటిపై నడిచే వారము. ఒకే సినిమా మూడు టికెట్లు పై చూసేవారము , ఒకే బిల్లుపై మూడు ప్లేట్లు ఇడ్లి తిని ఆరు ప్లేట్ల సాంబారు తాగెడి వారము. మా ముక్కులు, కర్ణములు, కనులు చురుకుగా పనిచేసి మా కాలనీ లో ఎవరింటిలో ఇడ్లీలు, దోసలు ఇత్యాదులు చేసిరో మరు నిముషమందే కనిపెట్టేసి భిక్షకు వెళ్లి పోయేవారము. వీరు సౌత్ ఇండియన్ , వారు నార్త్ వారు, వీరు బెంగాలీ, వారు అస్సామీ అను బేధ భావము చూపక అందరి ఇళ్ళ లోను వారు పిలవక పోయినా వెళ్లి వారిని సంతోషపెట్టి వచ్చెడివారము. అంతటి దృఢమైన మితృత్వము మాది.
ఇప్పుడు మేము ఈ సమస్య పై డా. సదానంద గర్గ్ గారింట్లో కూర్చుని వారి శ్రీమతి ఇచ్చిన టీ తాగుతూ ఆలు బొండా లు తింటూ, లవ్వా, మారేజియా, లవ్వు+మారేజి యా అని సుదీర్ఘంగా చర్చించి సమాధానం దొరకక, ఖిన్నులమై, విషణ్ణ వదనులమై వారింట్లోనే ఆలూ పరోఠా తిని ఇంటికి పోయితిమి.
మరు నాడు ఆదివారమగుట చే రావు గారింట్లో పెసరట్టు ఉప్మా + కొబ్బరి చట్నీఅని సమాచారం ఉండుట వల్ల ఉదయమే 8.30 గం. రావు గారింట్లో మరల సమావేశమై తిమి. (3*4) + (2* 2) = 16 పెసరట్లకు సరిపడు పిండి రుబ్బిన రావు గారి భుజ బలమును కీర్తించి తినుటకు ఉపక్రమించితిమి.
ఇంతలో కుశాగ్ర బుద్ది గల శ్రీమతి భావనారావు అక్కయ్య గారు ప్రశ్నించారు
“ఇంతకీ ఎవరిని ప్రేమించ దలిచారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? మన కాలనీ లో కానీ మన లాబ్ లో గాని పెళ్లీడు ఆడపిల్లలు ఎవరూ లేరను కుంటాను.”
మేము స్టన్నయి పోయాము. అవును కదా బేసిక్స్ ని పట్టించు కోకుండా ఇంత సేపు అనవసర చర్చలు చేసామా అని విచారించాము. అనుమాన నివృత్తి కొరకు మేము మా తీక్షణ వీక్షణాలు కాలనీ లోని ప్రతీ గృహంబు లోనికి పంపాము. అంకుల్ అంకుల్ అను 10 ఏళ్ళ కన్నా తక్కువ వయసు గల ఆడ పిల్లలే కనిపించారు. లాబ్ లో కూడా ఆంటీలు, పిన్నిలు, అక్కయ్యలు తప్ప ప్రేయసి కాగల వారెవరూ కాన రాలేదు.
హా హతవిధీ అనియున్ను ఔరా ఔరౌరా అనియున్ను దు:ఖించితిమి.
భావన గారే ఒక ఉపాయము సూచించినారు. అయ్యరు గారు అయ్యరిని పెళ్లి చేసు కోకపోతే ఆస్తి దక్కదు కాబట్టి గణపతి కి లవ్వు అఖ్ఖర్లేదు. ఉ. కృ. నా. మీ కి మేనరికం ఉంది కాబట్టి వారి పప్పులు ఉడకవు. ప్రద్యుమ్నుడు కూడా రెండేళ్ళ బట్టి పెళ్లి పెళ్లి అంటున్నాడు. ఇంకో రెండేళ్లు ఇల్లాగే పెళ్లి అంటూ గడిపేస్తాడు. కావున అంత దాకా ఏదో నాల్గిళ్ళలో ఇలాగే వారాలు చెప్పుకుంటూ గడిపేయండి అని సలహా ఇచ్చారు. అక్కయ్యగారూ మా మనో భావాలూ దెబ్బతిన్నాయి దీనికి మేము నిరశన వ్యక్తం చేస్తున్నాము అని గ్లాసులో కాఫీ గడగడా తాగేసి బయటకు వచ్చేసాము.
మా డైరక్టరు మీద మా చెడ్డ కోపం వచ్చేసింది. ఎంత సేపూ నా లాబ్ లో యువ శక్తి, సగటు వయస్సు 34 మాత్రమే అని డప్పాలు కొట్టు కోవడం తప్పితే, ఇంత గంభీర సమస్య పొంచి ఉన్నదని గ్రహించ లేక పోయాడు. బొత్తిగా దూరదృష్టి కానీ హ్రస్వ దృష్టి కానీ లేని వాళ్ళని డైరక్టర్లుగా ఎంపిక చేయడం వల్లే మన దేశం ముందుకు వెళ్ళ లేక పోతోందని విచారించాము. ఈ మారు అయినా పెళ్లి కాని 20 – 24 వయసు గల అందమైన అమ్మాయిలకి కాని, పెళ్లీడు కు వచ్చిన అందమైన అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానించేసాము. దురదృష్ట వశాత్తు మా లాబ్ కి రెండు మూడు కి.మీ దూరంలో గృహ సముదాయాలు ఏమీ లేవు. జోర్హాట్ టౌను కెళ్ళి ప్రయత్నిద్దామంటే 7 కి.మీ దూరం. కష్టములు ఈ విధము గా కూడా వచ్చునా అని విచారించి, విధిని బహుపరి విధముల దూరితిమి. ఈ విధంబుగా మేము దు:ఖించు చుండగా రోజులు వారములుగా, అవి నెలలుగా మారిపోవు చున్నవి.
ఒక రోజున నాకూ మా డా. శంకర్ ఘోష్ అంటే మాచిన్న బాసు కి అభిప్రాయ బేధాలు వచ్చి ఆయన నన్ను అన రాని మాటలు అన్నా, అవనత మస్తకుడనై ఆలకించి నా సీట్లోకి వచ్చి ఆసీనుడ నగుచుండగా, ధనుర్విముక్త శరం లా పరిగెట్టుకు వచ్చిన ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ నా ఎదుట సీట్లో కూలబడ్డాడు.
రొప్పు తున్నాడు. ఏ నాగుపామో పగపట్టి వాడి వెనకాల పడిందేమో నని అనుమానం వచ్చి, ఎందుకైనా మంచిదని నా కాళ్ళు రెండూ ఎత్తి కుర్చీలో పెట్టేసాను.
పాములు పగపట్టవు అదంతా ట్రాష్ అని తెలిసినను, పగబట్ట కూడదనే శాస్త్రం వాటికి తెలుసునో లేదో అని చిన్న అనుమానమన్న మాట.
రొప్పుతూనే ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ ఉజ్వల ఉజ్వల ఉజ్వల భట్టాచార్య కి ఈ వేళ అప్పాయింట్ మెంట్ ఆర్డర్ డిస్పాచ్ అయింది. ఇప్పుడే అని చెప్పాడు.
నా కళ్ళ ముందు స్వర్గంలో ఘృతాచి నాట్యం చేస్తూ కనిపించింది. తెలుగు సినిమా లో భారీ హీరోయిన్ రారా నా సామి రారా అని పాడి నట్టనిపించింది. ఇద్దరం చేతులు పట్టుకొని కుహూ కుహూ బోలే కోఎలియా కోఎలియా కోఎలియా సనిదప సానీదాపా సస్సా రిర్రీ గగ్గా మమ్మా కోఎలియా అని పాడేము. బొత్తి గా సంగీత జ్ఞానం లేక పోయినా సంగీతం లో ఓలలాడే సాం.
ఆ తదుపరి వివరాలు చెప్పేడు. 22 యియర్స్ 4 మంత్స్, అన్ మారిడ్, M.sc. Micro biology, Gauhati, C/O శ్రీ తన్మయ భట్టాచార్య, dy. C.E, railways, maaligaon . Bio chemistry dept., joining as JRF, ఇతి వార్తః సమాప్తః
ఇంతలో మా గణపతి అయ్యర్ కూడా వచ్చేసి వీడు చెప్పిన కధే పునః ప్రసారం చేసాడు.
ఆ రోజు నించి,
“రావోయి మా ఇంటికి మావా మాటున్నది మంచి మాటున్నది” అని పాడుకుంటూ ఉజ్వల వచ్చేసింది.
నేను కంగారు పడిపోయాను. మొహం చూద్దామంటే కనిపించటం లేదు.
అయినా ఉజ్వల బెంగాలీ పాటో అస్సామీ పాటో పాడాలి కానీ “వై తెలుగు పాట పాడింగ్ “ అని కూడా అనుమానం వచ్చేసింది.
ఆహా పెళ్లి కాకుండానే తెలుగు నేర్చేసు కున్న మహా తెలుగు పతివ్రత అని ఆనందపడి పోయాను.
ఒక డ్యూయెట్ వేసుకుందా మనిపించింది. ఏ పాట పాడాలి అని ఆలోచిస్తుంటే తను సిగ్గుతో ననుకుంటాను పారిపోయింది.
అయినా నేను డూపు ని పెట్టి పాడేసుకుందా మని అనుకున్నాను. లాహిరి లాహిరి లాహిరి లో పాడాలి అనుకున్నాను. ఎల్లాగూ ఉజ్వల మొహం కనిపించ లేదు కాబట్టి, నేనూ జమున కలసి పాడేద్దామని, జమున లో ఉజ్వలని చూసు కుందామని అనుకున్నాను.
కానీ ఇంతలో మా ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ పరిగెత్తు కుంటూ వచ్చేసాడు. నా చెవిలో జమున కాదు సావిత్రి లాహిరి లాహిరి పాటలో అని సలహా కూసాడు.
నాకు మండిపోయింది కోపం ముక్కు కి ఎక్కింది.
ఓరీ దుర్మార్గ దుశ్చింత దుర్యోధనా నా కల లోకి నా అనుమతి లేకుండా ప్రవేశించి నాకే సలహాలు ఇచ్చుచుంటివా అని వాడిని మెడ పట్టుకుని నా కల ముఖ ద్వారం దాకా తీసుకెళ్ళి ఒక్క తోపు తోసాను.
మళ్ళీ నేను ఆలోచించాను. మొన్న చూసిన ఇంగ్లిష్ సినిమా లోని హీరోయిన్ ని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకొని ఆవిడను పిలిచాను. పాపం ఆవిడ వెంటనే వచ్చేసింది.
ఆవిడకు సీను చెప్పేను. ఆవిడ మేకప్పు వేసుకొని వచ్చేసింది.
నువ్వు అల్లా పది గజాల చీర కట్టుకొని ఒక్క మొహం మాత్రమే చూపిస్తే ఎల్లా? ఈ మాత్రం దానికి నువ్వు ఎందుకు నా కల్లోకి అని కోప పడ్డాను.
తెలుగు సినిమా కాబట్టి తెలుగు వేషం అంది.
ఇంతలో సినిమా డైరక్టరుగా వేషం మార్చేసుకొని ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ యాక్షన్ యాక్షన్ అని అరిచేడు.
ఆ పక్కనే కెమేరా మాన్ గా గణపతి అయ్యర్ కనిపించేడు. ఉన్నట్టుండి నేను క్లాపు బాయ్ గా మారి పోయాను. టేక్ 124 నౌకా విహారం అని అరిచేను.
ఆ ఇంగ్లిష్ ఆవిడ ఒక్కత్తే నావలో కూర్చుని “లాహిడ్ లాహిడ్ లాహిడ్ లూల్ జంగమే హుయాళా హుయలా” అని పాడేస్తోంది.
నా కల్లోకి మళ్ళీ వచ్చి నన్ను క్లాప్ బాయ్ ని చేసిన ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ ని నరికేద్దామని కత్తి కోసం నేను వెతుకుతూంటే మెలుకువ వచ్చేసింది.
రెండు రోజుల తర్వాత ముహూర్తం రానే వచ్చింది. ఉజ్వల ఉద్యోగంలో చేరే రోజు.
ఆవేళ నేను రంగు రంగుల చారల బుష్ కోటు వేసుకొని పైజామా లాంటి ఫాంటు వేసుకొని (ఆ రోజుల్లో అవే ఫాషన్), పక్కింటావిడ జర్మనీ నించి తెచ్చుకొన్న సెంటు పూసుకొని , టిప్ టాప్ గా తయారయి అరగంట ముందు ఆఫీస్ గేట్ దగ్గర కాపలా కి వెళ్లి పోయాను.
11గం. అయింది ఉజ్వల జాడలేదు.
నేను బహు చింతా క్రాంతుడనై biochemistry dept. కి వెళ్ళితిని.
అక్కడ నన్ను చూసి డా. సుర్జిత్ సేన్ గుప్తా, రా రా నీకు మా కొత్త గా చేరిన ఉజ్వల ని పరిచయం చేస్తా అని తీసుకెళ్ళి, భూమికి ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తులో , గుండ్రంగా ఉన్న ఒక మనిషి ని చూపించి
Meet Mr. ujvala Bhattacharya అన్నాడు.
నా కాళ్ళ కింద భూమి కంపించింది. కనుల ముందు అమావాస్య చీకట్లు కమ్మేసాయి. నాగుండెల మీద విధి టంగ్ టంగ్ టంగ్ అంటూ సమ్మెట దెబ్బలు కొడుతున్నాడు. ఒక్కమాటు గా విషాద సంగీతం నా చెవిలో మారు మ్రోగిపోయింది.