అనగనగా ఒక రోజు

ప్రద్యుమ్నుడు చేస్తున్న పని ఆపి ఇంటికి వెళ్ళడానికి తయారు అవుతున్నాడు. సమయం 6-30 PM అయింది.  తయారవడం అంటే కిటికీలు మూయాలి. ఆ తరువాత తలుపులు వేయాలి. ఈ లోపుల యాష్ ట్రే ఖాళీ చెయ్యాలి. రేపు శలవు. ఎవరూ రారు కాబట్టి లాబ్ లో అన్నీ ఆఫ్ చేసారో లేదో చూడాలి. ఏ వాటర్ బాత్  ఆవిర్లు కక్కుతోందో చూడాలి.

ఈ వేళ చటర్జీ గారబ్బాయి పుట్టిన రోజు ఫంక్షను ఉంది. పెళ్ళైన పది ఏళ్ళకి పుట్టాడని అపురూపం గా పెంచుకుంటున్నాడు. మరీ మరీ చెప్పాడు. వెళ్ళాలి. కనీసం ఏడు గంటలికి వెళితే తొమ్మిదికి ఇంటికి జేరవచ్చును. తన లాబ్ లోని  నాలుగు రూములూ చూసి వచ్చి తన గదిలో కిటికీ తలుపులు వేయడం  మొదలు పెట్టాడు ప్రద్యుమ్నుడు.

ఇంతలో టెలిఫోన్ మోగింది. ప్రభావతి చేస్తోందేమో అనుకున్నాడు. ఎత్తలేదు. ఇంటికి వెళుతున్నాం కదా అని. మోగుతూనే ఉంది. విసుక్కుంటూ ఎత్తాడు.

“ప్రద్యుమ్నా, నేను చాలిహా ని. ఢిల్లీ నుంచి ఈ వేళ Prof. శంకరరావు  వచ్చారు. నిన్ను కలవాలని అంటున్నారు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు గెస్ట్ హౌస్ లో ఆయన్ని కలిసి వెళ్ళు”  అని చెప్పాడు డైరెక్టర్ గారి PA. 

పైగా  “ఈ సూచన బాసుగారి అంగీకారం తోనే ఇవ్వబడింది ” అని నవ్వాడు చాలిహా . 

“ఏమిటి అంత అర్జెంట్. రేపు మీటింగ్ లో కలుస్తాను గదా. లంచ్ టైము లో మాట్లాడుకోవచ్చు కూడాను”

“అన్నట్టు రేపు అఫీషియల్ లంచ్ లేదు. Dr.Sinha, chairman,  రేపు మద్యాహ్నం ఫ్లైట్ లో కలకత్తా వెళ్లి పోతున్నాడు.  చండీఘడ్ Dr.Saxena కూడా అదే ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నాడు. మీ శంకరరావు కూడా మీటింగ్ తరువాత కారులో కాజీరంగా వెళుతున్నాడు. మర్నాడు ఉదయమే ఏనుగు ఎక్కి, అక్కడినుంచే గౌహతి వెళ్లి విమానం ఎక్కేస్తాడు. మిగిలింది నువ్వు, మరో ముగ్గురు హెడ్స్,  లోకల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజీ నిపుణులు, మీ ONGC ఉపాధ్యాయ. అంతే. అందుకని లంచ్ ఏర్పాటు చెయ్యలేదు. మన బాసు కూడా లంచ్ కి ఇంటికి వెళ్ళాలి ” చెప్పాడు చాలిహా. 

“అన్యాయం. బాసు కేమైంది” అడిగాడు ప్రద్యుమ్నుడు.

“రేపు రాఖీ పూర్ణిమ. వాళ్ళ చెల్లెలు వస్తోంది. ఈ వేళే వెయ్యి రూపాయలు తెప్పించాడు బేంక్ నుంచి. భారీగానే ఇస్తాడేమో చెల్లెలుకి?” సందేహం వెలిబుచ్చాడు చాలిహా.

“అయితే నేను రేపు  లంచ్ ఇంట్లోనే చెప్పుకోవాలా?” అనుమానంగానే అడిగాడు ప్రద్యుమ్నుడు.

“అఖ్ఖర్లేదు. మాములుగా లంచ్ ఉంటుంది గదా గెస్ట్ హౌస్ లో. మిగతా మెంబర్స్ కి. నువ్వూ వెళ్ళు” సలహా ఇచ్చాడు చాలిహా.

“వద్దులే. చుక్కా, చుక్కలు లేని లంచ్ ఎందుకు? నేను ఇంటికే వెళతాను. మా ఆవిడ రేపు బిజీ కాకపొతే, స్పెషల్ గా వంట చేయడానికి ఒప్పుకుంటే, ఉపాధ్యాయని మా ఇంటికే తీసు కెళ్ళతాను” చెప్పాడు ప్రద్యుమ్నుడు.

“టైగర్ ఫుడ్ చేయిస్తావా? నేను కూడా వస్తాను.” అడిగాడు చాలిహా.

“వచ్చేయ్.ఏదో ఒకటి ఉంటుందిలే.” చెప్పాడు ప్రద్యుమ్నుడు.

“నేను ప్రభావతినే అడుగుతాను. చటర్జీ ఇంటికి వస్తున్నారు కదా?” అడిగాడు చాలిహా.

“ఆ, మధ్యలో శంకరరావుని పెట్టావు కదా నాకు. ఆయనకు నాతోటి ఏం అవసరమో?” అడిగాడు ప్రద్యుమ్నుడు.

“రేపు మీ వాళ్ళు ముగ్గురున్నారు కదా. ఆ విషయం బహుశా. ఇందాకా ఆయన  అరగంట మాట్లాడాడు మన  బాసు తో. పొద్దున్న కూడ మాట్లాడాడు” అభిప్రాయ పడ్డాడు చాలిహా.

ఇంటికి బయల్దేరిన ప్రద్యుమ్నుడు ఆగాడు. ప్రభావతికి  టెలిఫోన్  చేశాడు.

“నాకు, అర్జెంటు పని పడింది. గెస్ట్ హౌస్ లో మీటింగ్ ఉంది. నువ్వూ, పిల్లలు వెళ్ళండి చటర్జీ ఇంటికి. నేను ఆలస్యంగా వస్తానని చెప్పు.” ఫోన్ పెట్టేశాడు.  చర్చకి తావు ఇవ్వకుండా.

కూర్చుని సిగరెట్ వెలిగించాడు. మూసిన కిటికీ తలుపు ఒకటి తెరిచాడు. ఆలోచనలో పడ్డాడు.  శంకరరావు గారికి ఇప్పుడు ఇంత అర్జంటుగా నాతో మాట్లాడవలసిన పని ఏమిటీ? రేపు జరగబోయే ఇంటెర్వ్యూ గురించి కాదు కదా. బాసుగారితో రెండు మాట్లు ఆయన మాట్లాడాడు కాబట్టి బహుశా దాని గురించే అయి ఉండాలి  బాసుగారు ఈయన ద్వారా నాకేమైనా సందేశం ఇస్తున్నారా?  అని అనుమానపడ్డాడు ప్రద్యుమ్నుడు.  తన Ph.D కి బాసుగారే   ఇక్కడ గైడ్. తనతో డైరెక్ట్ గా చెప్పే చనువు ఉంది ఆయనకు.  ఏమో బాసుల తీరు ఊహించడం కష్టమే.

శంకరరావు గారు బయాలిజీ ఆయన. ఆయనతో నాకు పరిచయం కూడా తక్కువే.  ఆయన  మన Research council  లో మెంబెర్ కూడా. గత రెండేళ్లలో మూడు మాట్లు కలిసాం RC మీటింగ్స్ లో. అంతకు మించి పరిచయం లేదు. RC మీటింగ్స్ లో ఘోష్ ఎక్కువగా మాట్లాడేవారు, మన డిపార్ట్మెంట్ గురించి. ఘోష్ తో పాటు  నేను.  బసంత్ వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళం. ఘోష్ కాకుండా మేమిద్దరమే ప్రాజెక్ట్ లీడర్స్ మా డిపార్ట్మెంట్ లో.     

రేపు సెలెక్షన్ కమిటీ మీటింగ్ ఉంది. నా డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు ఇంటర్వ్యూ కి ఉన్నారు.  ఇద్దరు గురించి బెంగ లేదు.  100% ఎలిజిబిలిటీ గ్రేడ్స్ లో ఉన్నారు.  శశికాంత్ సైకియా ఒకడు 75% గ్రేడ్ లో ఉన్నాడు.  మొత్తం రేపు ఇంటర్వ్యూ లో ఐదుగురు ఉన్నారు ఆ గ్రేడ్ లో. 5*.75 = 3.75 అంటే నలుగురిని ప్రమోట్ చేయవచ్చును.

మిగిలే ఒకడు ఎవరు? శశికాంత్ తెలివైన వాడే. కష్టపడి పనిచేస్తాడు. ఇంకొంచెం ఎక్కువే చేస్తాడు.  గత ఐదారు ఏళ్లలో అతను పని చేసిన ప్రాజెక్ట్ నుంచి  రెండు  పేపర్స్  పాలిమర్ కెమిస్ట్రీ లోనూ,  ఒకటి ఫ్యూయల్ లోనూ వచ్చాయి.  వాటిలో ఇతని పని  బాగానే ఉంది. ఇంకో నాలుగు ఇండియన్ జర్నల్స్ లో వచ్చాయి.  సెమినార్స్ లో కూడా ప్రెజెంట్ చేశారు.  న్యాయంగా పని ప్రకారం చూస్తే ఇతనికి  రావాలి. కానీ మనిషి దుడుకు. అందరితోనూ దెబ్బలాడుతాడు,  నాతో సహా.  ఇన్స్టి ట్యూట్లో  జరిగే అన్యాయాలన్నిటికి  అతను తప్ప మిగతా వాళ్ళు అందరూ కారణమంటాడు.  నేను హెడ్ అయిన ఈ తొమ్మిది నెలలలోనూ  మూడు మాట్లు ఇతనితో కూర్చుని చెప్పాను “పద్ధతి మార్చుకోవయ్యా” అని.

“అదేమిటి సార్ మీరు కూడా ఇలానే అంటారు. మీకు కూడా ఎరోగంట్ అనే పేరు ఉంది తెలుసునా?” అని కూడా అడిగాడు.   

ఎలా ఇతనిని దారిలో పెట్టడం? ఒక విధంగా ఇతనే సమస్య అయ్యాడు నాకు నా డిపార్ట్మెంట్ లో. వాళ్ళ ఆవిడతో కూడా చెప్పాను ఒక మాటు విసిగిపోయి.
“బాసులు మీరే దారిలో పెట్టలేకపోతే
, దాసిని నావల్ల ఏమౌతుంది అని నవ్వేసింది.

భర్తలు మొండివాళ్ళు అయితే భార్యలకు హాస్య ధోరణి అలవాటు అవుతుంది అన్నారెవరో. ఏమో. ప్రభావతి ఏమంటుందో కనుక్కోవాలి. ఇంకో మాటు నవ్వుకున్నాడు.   

ఇదివరకు మన డిపార్ట్మెంట్  అనేవాడిని. ఇప్పుడు నా అంటున్నాను అనుకొని కూడా  నవ్వుకున్నాడు ప్రద్యుమ్నుడు. తనకి పొగరు ఇంకా పెరుగుతోందేమో నని కూడా అనుకున్నాడు.   

నాలుగు రోజుల క్రితము బాసు (డైరెక్టర్)  గారి దగ్గరకు వెళ్ళి చెప్పాడు కూడానూ, తన డిపార్ట్మెంట్ కేండిడేట్స్ గురించి. ఆయన శ్రద్ధగానే విన్నాడు. శశికాంత్ గురించే సుమారు పావుగంట పైనే మాట్లాడారు.

“అతని గురించి మంచిగా వినలేదు. మొన్న వర్క్ షాప్ లో కూడా ఏదో గొడవ అయ్యిందిట అతనితో. రేపు ప్రమోషన్ వస్తే ప్రాజెక్ట్ లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. తోటి వాళ్ళతో సామరస్యంగా లేకపోతే, project execution లో  నీకే చిక్కులు వస్తాయి. నేనైనా,  నిన్నే సంజాయిషీ అడగాల్సి ఉంటుంది. ఆలోచించుకో” అని అన్నారు కూడా.    

పేపర్స్ విషయంలో బాసుగారు క్రిటికల్ గానే అడిగారు.

“పేపర్స్ మిగతా వాళ్లకి కూడా బాగానే ఉన్నాయి. అతని ఈ పేపర్స్ లో సీనియర్ ఆధర్ ఎవరు?”

సూటిగా సమాధానం ఇవ్వలేదు ప్రద్యుమ్నుడు. మొత్తం పేపర్స్ లో,  మూడులో  మాత్రం అతను మొదట అని మిగతా వాటిలో అప్పటి హెడ్ శంకర్ ఘోష్, తను అని చెప్పలేదు. 

 “అల్లా అని కాదు సార్. టేబుల్ వర్క్ అంతా అతనూ, సుభాష్ చేశారు. నేను కానీ,  శంకర్ ఘోష్ కానీ అతనికి రెండో మాటు చెప్పాల్సిన అవసరం రాలేదు. ఎక్స్పెరిమెంటల్ డిజైను, టెస్టింగ్  అన్నీ సుభాష్ సహాయంతో  అతనే  చేశాడు. ఆధర్ షిప్ అంటారా,  మన ఆనవాయితీ  ప్రకారం చివరి పేరు మీదే”

బాసుగారు ఫక్కున నవ్వాడు. “ప్రద్యుమ్నా నీలో కూడా ఏరోగన్సీ ఇంకా తగ్గలేదు. కొంచెం తగ్గించుకోవాలయ్యా . కుర్చీలో కూచున్న తరువాత కొంచెం సామరస్యంగా ఉండాలి. నోటికే మొస్తే అది అనేయకూడదు. నువ్వు ఒక మాటు అన్నావట కదా శంకర్ ఘోష్ తో, “బయో కెమిస్ట్రీ ఆయన  డైరెక్టర్ కి పెట్రోలియం తో ఏం పని? ఆయన పేరు ఎందుకు పెట్టాలి?”  అని. ఘోష్ చెప్పాడు నాకు. నీకు తెలుసునా, నువ్వు ఘోష్ తో అప్పుడప్పుడు విభేదించినా ,  ఘోష్ కి నువ్వంటే చాలా ఇష్టం. నీ గత CR excellent లు ఉన్నాయి ఇదివరకు. వెళ్ళే ముందు ఔట్ స్టాండింగ్ ఇచ్చాడు. నేను యధాతధంగా అప్రూవ్ చేశాను, నువ్వు అల్లా అన్నావని తెలిసినా”

ప్రద్యుమ్నుడు సిగ్గుతో తలదించుకున్నాడు.

“కుర్చీలో కూర్చుంటే కొన్ని అధికారాలు ఉంటాయి. వాటితో అప్పుడప్పుడు తలనొప్పులు కూడా ఉంటాయి. కొన్ని సర్దుబాట్లు అవసరం కూడా, నాకు ఇష్టం కాకపోయినా. చూద్దాం మీ వాడి సంగతి, నేనేమీ హామీ ఇవ్వలేను” అని ముగించాడు బాసుగారు.

ప్రద్యుమ్నుడు లేచాడు, “ సార్ ఇది హెడ్ గా నా మొదటి ఏడు, ఇంకా మూడు నెలలుంది ఏడాది పూర్తికావడానికి. ఇప్పుడు నా అభ్యర్ధిని గట్టెక్కించ లేకపోతే డిపార్ట్మెంట్ లో నామీద గౌరవం తగ్గే అవకాశం ఉంది. అంతకన్నా నేనింకేం చెప్పలేను.”

బాసుగారు నవ్వారు. “ చూద్దాం ప్రద్యుమ్నా, మీ  వాడు ఇంటర్వ్యూ బాగా చేస్తే, తలతిక్కగా మాట్లాడకుండా ఉంటే, కమిటీ రికమెండ్ చేస్తే, నీ కోసం ఒప్పుకుంటాను. మనిషి మారాలని ఘట్టిగా చెప్పు అతనికి.”

తలకాయ ఊపి బయటకు వచ్చేశాడు ప్రద్యుమ్నుడు. 

అదంతా గుర్తుకు వచ్చింది ప్రద్యుమ్నుడికి.  ఇప్పుడు ఈ శంకరరావు గారు ఏం మాట్లాడుతాడో? ఏం చెప్తాడో? బాసుగారు ఏం మాట్లాడేడో?

సాధారణంగా subject expert లు కమిటీ మీటింగ్ ముందు హెడ్స్ తో మీటింగ్ పెట్టరు. ఇంటర్వ్యూ అయిన తరువాత మాత్రమే వాళ్ళ అభిప్రాయాలు చెబుతారు.  అయినా శంకరరావు గారు తన సబ్జెక్ట్ expert కాదు. మన expert ఉపాధ్యాయ. కొంపదీసి Dr. Sinha రావటం లేదా? శంకరరావు గారు chairman గా ఉంటాడా?

 గెస్ట్ హౌస్ ఇన్ చార్జ్ కి టెలిఫోన్ చేసాడు ప్రద్యుమ్నుడు. Sinha, టుక్లై  టీ రీసెర్చ్ గెస్ట్ హౌస్ కి వెళ్ళాడుట. రేపు మీటింగ్ కి అక్కడనుంచే వస్తాడుట. సంగతి తెలిసింది. మరి ఈయన తన తోటి ఏం మాట్లాడుతాడు? బాసు గారు ఏం చెప్పాడో?  శశికాంత్ కి ఈ మాటు అవకాశం లేదా?

ఐదుగురిలో ముగ్గురి పేర్లు ఖాయంగా వినిపిస్తున్నాయి. కెమికల్ ఇంజనీరింగ్  గొగై, మన శశికాంత్ లో ఒకడే సెలెక్ట్ అవుతాడు అని వినికిడి. కెం. ఇంజ్ హెడ్ డిప్యూటి డైరక్టర్, తను అసిస్టంట్ డైరక్టర్. ఆయన మాటకే ఎక్కువ విలువ ఉంటుందా?  డైరక్టర్ లేనప్పుడు ఆయన ఇన్స్టిట్యూట్ బాధ్యతలు చూస్తుంటాడు కూడానూ. ఏమో మరి ఏమౌతుందో?

 సీనియర్ బసంత్ ని కాదని తనకు హెడ్ గా బాధ్యతలు ఇచ్చారు, తొమ్మిది నెలల క్రితం. ఇప్పుడు శశికాంత్ విషయంలో డిపార్ట్మెంట్ లో రాజకీయాలు మొదలవుతాయా? ఇప్పటి దాకా బసంత్ తనని సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ఇది అవకాశంగా తీసుకొంటే గొడవలు మొదలవుతాయి.  బాసు గారికి తెలియదా? ఆయన ఒత్తిడిలు ఆయనకు ఉంటాయి. కానీ నాకు సూటిగా చెప్పవచ్చు గదా? శంకరరావు గారిని మధ్యలో దింపడం దేనికి?   

బాసుగారు తన గైడే కాదు, ఒకప్పుడు తన బ్రిడ్జ్ పార్టనర్ కూడా. ఆ చనువుతో రెండు మూడు మాట్లు  బాసుగారితో తీవ్రంగానే విభేదించడం జరిగింది. బహుశా దురుసుగా మాట్లాడేనేమో కూడా.  బాసు గారు తనకి ఒక గుణపాఠం నేర్పాలనుకుంటున్నాడా? తోటి తెలుగువాడు శంకరరావు గారి మాట వింటాను అనుకున్నాడా?  తన దురుసుతనం శశికాంత్ ని దెబ్బకొడుతుందా? హెడ్ గా ఉండడం ఇంత కష్టమా? తన ప్రవర్తన తన డిపార్ట్మెంట్ కాండిడేట్స్ మీద పడుతుందా?  లేక బాసు గారు డివైడ్ అండ్ రూల్ పాలసీ మా డిపార్ట్మెంట్ లో మొదలుపెడుతున్నాడా? పరోక్షంగా బసంత్ కి సపోర్ట్ చేస్తాడా? అయ్యుండకపోవచ్చు.  తనంటే బాసు గారికి చాలా, ఇష్టం,  అభిమానం. ఫామిలీ ఫ్రెండు కూడాను. అయినా బాసులు కదా. ఏమైనా చేస్తారేమో?         

 చూద్దాం. ఈయన ఏమంటాడో? మాట్లాడుదాం. అనుకొని లేచాడు. దుకాణం కట్టేసి గెస్ట్ హౌస్ జేరాడు. శంకరరావు గారితో భేటి అయ్యాడు.

“ఏమండీ ప్రద్యుమ్నుడు గారూ  బాగున్నారా?” అడిగారు శంకరరావు గారు.

“బాగానే ఉన్నామండి. ధన్యవాదాలు”  

“మీ RRL కి వస్తే బాగుంటుందండి. సైంటిఫిక్ వాతావరణం  కనిపిస్తుంది. పోలిటిక్స్  తక్కువే అనుకుంటాను” 

“లేకపోలేదు, కానీ పై లెవెల్స్ లోనే ఉన్నాయి. Work culture మిగతా వాటితో పోలిస్తే ఇక్కడ ఎక్కువే నండి.”

“Good, Nice to hear that. ఇంకేమిటండి సంగతులు. ఎంతమంది పిల్లలు మీకు?”

“ఒకబ్బాయి, ఒకమ్మాయి నండి.” అసలు సంగతికి రాకుండా డొంక తిరుగుడు ఎందుకో నని  ప్రద్యుమ్నుడికి చిరాకుగా ఉంది.

“నాకు ఇద్దరూ మగపిల్లలే నండి. ఆవిధంగా అదృష్టమే అనుకోవాలి.”

“అదేమిటండి మీరు కూడా అలా అంటారు. ఎవరైనా ఒకటే కదా” కొంచెం ఆశ్చర్యం ఒలకపోసాడు ప్రద్యుమ్నుడు.

“అబ్బే నా ఉద్దేశం అది కాదు. ఆడపిల్లలకి పెళ్లి చేయడం అంటే యజ్ఞం అండి. పెళ్ళికొడుకుని వెతకాలి.  అతని గురించి వాకబు చెయ్యాలి. ఉద్యోగం గురించి కనుక్కోవాలి.  కుటుంబం గురించి కనుక్కోవాలి. ఆర్ధిక స్థితిగతులు వాకబు చెయ్యాలి. చాలా చెయ్యాలండి. మా అన్నయ్య ఉన్నాడు. వాడికి ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. మూడో అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఇందులో కొన్ని పనులు నాకు అప్పజెపుతాడు. వాడు రాజమండ్రి లో ఉంటాడు. అన్నట్టు మీ ఎరికలో ఏమైనా సంబందాలు ఉంటే చెప్పండి.”

ప్రద్యుమ్నుడికి విసుగ్గా ఉంది. ఇవన్నీ వినడానికి. అవతల చటర్జీ ఇంటికి ఇంకా లేటయితే బాగుండదు. ఈయన సంగతి తేల్చడు.  అయినా ఓపిగ్గా అడిగాడు,

“శాఖా బేధాలు ఉన్నా ఫరవాలేదా?”   

“అబ్బే మా వాడికి పట్టింపులు ఎక్కువే నండి. ఎంత చెప్పినా వినడు.”    

ప్రద్యుమ్నుడు మాట్లాడలేదు.

“అవునూ, అత్యవసరమైతే ఇక్కడి నుంచి మీ ఊరు ఏమిటన్నారు?’

“భీమవరం. ప.గో.జి.“

“తెలుసును. మా వాళ్ళు ఉన్నారండి అక్కడ,  అంటే ఉండి అగ్రహారంలో.”

ప్రద్యుమ్నుడి చిరాకు పరాకాష్ట కి చేరుకుంటోంది. ఆయన కొనసాగించాడు.

“ఇక్కడి నుంచి రోజూ ఫ్లైట్స్ ఉన్నాయా కలకత్తాకి? కలకత్తా నుంచి హైదరాబాద్ కి?”

“ఈ వేళ మీరు వచ్చిన ఫ్లైట్ వారానికి ఐదు రోజులు ఉంటుందండీ. ఇది కాక ఇంకో ఫ్లైట్ ఉంది మద్యాహ్నం  2 గంటలికి. అది చిన్నది, ఫోకర్.  రోజూ  ఉంటుంది.  హైదరాబాద్ కి కూడా కలకత్తా నుంచి  వారంలో నాల్గైదు రోజులు మాత్రమే ఉందనుకుంటాను” ప్రద్యుమ్న ఉవాచా.  అసహనంగా కుర్చీలో కదిలాడు.      

“ఒక సంబంధం వచ్చిందండి. కుర్రాడు M.Tech. చేసాడు, IIT కాన్పూర్ లో. అమెరికా అవకాశాలు వచ్చాయిట కానీ తల్లీ తండ్రులను వదిలి వెళ్లడం ఇష్టం లేదుట. తండ్రికి ఆరోగ్యం అంత బాగా లేదుట.  తణుకు చుట్టుపక్కల 15 ఎకరాలు ఉన్నాయట. స్థితిమంతులే. ఆయన తణుకులో హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారట, ఏదో స్కూల్లో. “

ప్రద్యుమ్నుడు సహనం కోల్పోతున్నాడు. ఇంటర్వ్యూ విషయానికి వస్తే మాట్లాడి వెళ్ళిపోదామని చూస్తున్నాడు.  ఆయన కొనసాగించాడు,

“అబ్బాయి ONGC  లో పనిచేస్తున్నాడు.  మొన్నటిదాకా డెహ్రాడున్ లో పని చేశాడుట. ఆర్నెల్ల క్రితం అస్సాం లో నజిరా కి బదలి మీద వచ్చాడుట. అతని గురించి శ్రమ అనుకోకుండా వాకబు చేసి చెబుతారా? మనిషి ఎటువంటి వాడు? బుద్ధిమంతుడేనా? చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ కానీ డెహ్రాడున్ లో కానీ ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా?  కోపిస్టా? వగైరా,  ఇవి అతని వివరాలు.”    అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి ఇచ్చాడు.

మాట్లాడకుండా పుచ్చుకొని జేబులో పెట్టుకున్నాడు ప్రద్యుమ్నుడు,

“రేపు శిబ్సాగర్ నుంచి Dr. ఉపాధ్యాయ వస్తున్నారండి.  ఆయన ONGC లో chief chemist. ఆయనకి తెలిసే ఉంటుంది. కనుక్కుందాం” అన్నాడు ప్రద్యుమ్నుడు.  

“కుర్రాడు నజిరా లో ఉంటాడండి. మీకు వీలైనప్పుడు నాల్గైదు రోజుల్లో ఒక మాటు వెళ్లి కనుక్కుంటే ఋణపడి ఉంటాను” అన్నాడు శంకరరావుగారు. ప్రద్యుమ్నుడు ఈ విషయం పొడిగించ దలచుకోలేదు ఇంకా,

“అల్లాగే నండి. నజిరా లో మన తెలుగు వాళ్ళు సుమారు ఆరేడుగురు ఉన్నారు. నేను వెళ్లి కనుక్కొని మీకు చెబుతాను. ఇంతకీ మీరు నన్ను పిలిచిన విషయం? ”  

“అసలు నేను ఈ వేళ నజిరా వెళదామనుకున్నాను.   మీ డైరక్టర్ తో  చెప్పాను. ఆయన మీ గురించి చెప్పారు. మీకు ONGC  తో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయట కదా. మీకు అక్కడ పరిచయాలు బాగానే ఉన్నాయిట. మీకు చెబితే మీరు ఈ పని చేస్తారు అని చెప్పారండి. నేనే మీ డిపార్ట్మెంట్ కి వద్దామనుకున్నాను. కానీ ఆఫీసులో మాట్లాడం కుదరదేమో నని రాలేదు. మీ డైరక్టర్ గారే చెప్పారు. “మీకు చెబుతాను. ప్రద్యుమ్నుడే వచ్చి మీతో మాట్లాడుతాడు”” అని.

ప్రద్యుమ్నుడు నవ్వేసాడు. ఇదా సంగతి అనుకున్నాడు. ఎంత టెన్షన్ పడ్డాను ఇప్పటిదాకా అని అనుకున్నాడు.

“అల్లాగే నండి. ఆ అబ్బాయి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మీకు టెలిఫోన్ చేస్తాను, రెండు మూడు రోజుల్లో. మీరు నిశ్చింతగా ఉండండి” అని చెప్పి సెలవు తీసుకొని చటర్జీ ఇంటికి వెళ్లాడు తేలిక పడిన మనసుతో.     


 

17 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మొత్తానికి వడ్లగింజలో బియ్యపుగింజ అన్నమాట. ఇదీ సంగతి అని తేలేవరకు చాలా టెన్షన్ కదా? అందులోనూ ఆ పెద్దమనిషి మీ ఇనిస్టిట్యూట్ కు గెస్ట్ గా వచ్చారు కూడానూ. ఒక రిసెర్చి ఇనిస్టిట్యూట్ వాతావరణం, పరిస్ధితులు, పవర్ ఈక్వేషన్స్ వీటన్నిటితో కథ ఉత్కంఠగా సాగిందండీ 👌. ఆ పేర్లు చదువుతుంటే మా యూనివర్శిటీ చదువు రోజులు, ఆ ఉత్తర భారతదేశ నామధేయాలు గుర్తొచ్చాయి.

ఆ టుక్లై టీ రిసెర్చి గెస్ట్-హౌస్ కేనా గతంలో ఎప్పుడో “జిలేబి” గారు వచ్చి బస చేశారు అన్నారు మీరు మొన్నెక్కడో? ఆహా, భవిష్యత్తులో పరిచయం పెరుగుతుందని ఆ నాడు ఊహించలేక పోయారు కదా?

ఇక కొన్ని సూపర్ వాక్యాలు ;- 👇😁
// “చుక్కా చుక్కలు లేని లంచ్” //
// “బాసులు మీరే దారిలో పెట్టలేకపోతే, దాసిని నా వల్ల ఏమౌతుంది?” //
// “భర్తలు మొండివాళ్ళు అయితే భార్యలకు హాస్యధోరణి అలవాటు అవుతుంది అన్నారెవరో” // .... బాగానే ఉంది కానీ ఇది రివర్స్ లో ఉండాలేమో 🤔?😁

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ........ ధన్యవాదాలు. వడ్లగింజలో బియ్యపు గింజ అని తేలేదాకా టెన్షన్.

జిలేబి గారు అస్సాంలో కొంతకాలం ఉన్నారేమో నని నా అనుమానం. ఎక్కడో ఒక మాటు అడిగారు వారు "భలానా అస్సామీ రచయిత భలానా రచన (పేరు గుర్తులేదు) చదివారా మీరు? " అని. అబ్బే నాకు అస్సామీ రాదండి అని జవాబు ఇచ్చిన గుర్తు. ఎక్కడో గుర్తు రావటం లేదు. అన్ని టపాల కామెంట్లు వెతకాలి. అంత ఓపిక లేదు ఇప్పుడు. ఏమిటో వారి లీలలు. .........మహా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

కొంటెగా హింట్లు ఇస్తుంటారు గానీ తన ఉనికి వివరాలు మహా ... మహా ... గోప్యంగా ఉంచుతారు కదా మన “జిలేబి” గారు. ఒకసారి తన బ్లాగులోనే ట్రిబ్యూన్ వారి ఆహ్వానంపై అస్సాంలో ఏదో కాన్ఫరెన్స్ కు వెళ్ళివచ్చానని వ్రాశారు. ట్రిబ్యూన్ తోను, అస్సాంతోనూ మీకున్న సంబంధబాంధవ్యాలు ఏమిటి, మీరు జర్నలిస్టా, అస్సాంలో పని చేశారా అని నేను ... తెలియక ... పృచ్ఛించితిని, కానీ వారు అక్కడతో గప్-చుప్ ఎప్పటిలాగానే. మీరన్నట్లు వారి “లీలలు” వర్ణించతరమా??

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బావుంది గురూజీ.. మీతో పాటు మమ్మల్నీ టెన్షన్ పెట్టేశారు :-)

Zilebi చెప్పారు...



"చాలా బాగుందండి , ఎక్కడ ఒక్క సెకండ్ కూడా ఆగలేదు , చదువుతూనే ఉన్నా ... ప్రద్యుమ్నుడి లాంటి వాళ్ళు నిజంగా అరుదు . అంత పరిణితి . ... అంత క్రమశిక్షణ . చాల బాగుంది. :)


జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు.

జిలేబి గారి లీల ఇంకోటి నాకు అనుభవంలోకి వచ్చింద నిన్న. ........మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వేణూశ్రీకాంత్ గారికి. ......... ధన్యవాదాలు. కొన్ని సంఘటనలు అప్పటికి టెన్షన్ కలిగించినా తరువాత తలుచుకుంటే నవ్వు వస్తుంది. ..........మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి. ......... ధన్యవాదాలు.

మీ లీలలు మాలాంటి వాళ్లకు అర్ధం కావు. ఒక చోట అనానిమస్ గారు (బహుశా మీరేనేమో నని నా అనుమానం. కానిచో క్షమించండి) పెట్టిన కామెంటు యధాతధంగా ఇక్కడ కామెంటులో పేరు మార్చి పెట్టేశారని అనుకుంటున్నాను. మధుమానసం బ్లాగు నేను కూడా చూస్తూ ఉంటాను. ............. మహా

ఏమైనా మీ కామెంటుకు మరీ మరీ ధన్యవాదాలు. ............మహా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హ్హ హ్హ హ్హ, “జిలేబి” గారు అటువంటి లీలలు చాలా అవలీలగా చూపిస్తారు కదా, సుబ్రహ్మణ్యం గారూ 😁?

కాకపోతే మీరన్నారు చూశారా // “ మధుమానసం బ్లాగు నేను కూడా చూస్తూ ఉంటాను. ............. మహా ” // అని ..... బ్లాగుల ఇతర పాఠకుల గురించి ఆ మాట వారికి సకాలంలో గుర్తుకు రాదేమో బహుశః 😁? “పిల్లి కళ్ళు మూసుకుని పాలు త్రాగడం” సామెత లాగా అన్నమాట 😁😁😁

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

వారోలీలాబ్రహ్మలు,
వీరోకామెంటుబ్రహ్మ,విధిలీలకదా!
మీరోహాస్యబ్రహ్మలు,
సారూ!తమలోన తాము చతురులె సుమ్మా!😂

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

అకటా!జిలేబిసారును
అకటావికటములాడిరి,అన్యాయమిదీ!
సకలాగమబుధులనిటుల
పకపక నగుబాటుసేయ భావ్యంబగునా?😥

Lalitha చెప్పారు...

అనుకున్నదొకటి - అయినదొకటి అన్నమాట! మీ హహహా-భాషలో మ. మం. హా. :))

Zilebi చెప్పారు...


ఆ అనానిమస్సు గారు బయట పడినారిక్కడ:)


ఎవరా అనానిమస్సో చెప్పుకోండి‌ చూద్దారి :)


జిలేబో సితారో

జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. .......... ధన్యవాదాలు. ఆవేళ మాలిక వ్యాఖ్యల పేజిలో ఈ రెండు ఒక దాని తరువాత మరొకటి కనిపించాయి కూడాను. అంతా జిలేబీ మాయ. ........... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వెంకట రాజారావు లక్కాకుల గారికి. ......... ధన్యవాదాలు. మా చతురత జిలేబి గారి ముందు పనికి రాదు మాష్టారూ.

ఇది పరిహాసం కాదు. వారంటే నాకు అభిమానం, గౌరవం. నా గురించి, నా బ్లాగు గురించి వారు వారి బ్లాగులో చాలామాట్లే ఆదరంగా ప్రస్తావించారు. అందుకు వారికి నేను సదా కృతజ్ఞుడినే. ఈ వ్యాఖ్యలు సరదాగానే. వారూ సరదాగానే తీసుకుంటారని నా నమ్మకం. ............ మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

లలిత గారికి. ....... ధన్యవాదాలు. తలచినదే జరిగినదా ...... అని ఏదో పాట ఉంది. అదే గుర్తుకు వస్తుంది. ......మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి. ...... ధన్యవాదాలు. నా ఊహకు అందటం లేదు. మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి. ...........మహా