పుట్టితి పూజ్యుడౌ సంస్కృత మాష్టారు ఇంట మెట్టితి ఘనుడౌ తెలుగు మాష్టారి ఇల్లు
చేపట్టితి చేతకాని ఒక సైంటిస్టును, పులక్ బారువా కొనే నొక సెకండ్ హాండ్ లాంబ్రేట్టా
స్కూటర్, కొనే నొక మోటారు సైకిలు శశిధర్ సైకియా, గతి లేదా నా మొగుడి కొక కొత్త
స్కూటరయినా మధుసూదనా,ముకుందా, మురారీ, మాధవా ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
అని కడుంగడు దు:ఖిత మది యయి గద్గదస్వరం తో దీనంగా ఆలపించెను. ఆమె విచారాశ్రువులు నన్ను కదలించగా కఠినమగు నా కర్కశహృదయ మొకింత కరుగ నారంభించెను. అంతలో కర్తవ్యము గుర్తుకు రాగా నామెను మందలించ సాహసించ దలచితిని.
దేవీ శ్రీ దేవీ నీకేల ఈ అలుక నేనెంత నా జీతమెంత ఈడ్చి తన్నినను చేతికి 2500 రూకలు రావుగాదా, బాంకు లో ఉన్నది 5000 మించదు గదా, 10000 స్కూటర్ కొనుట ఎట్లు, అదియును గాక మీ తమ్ముని వివాహ శుభ ముహూర్తము వచ్చుచున్నది మనం వెళ్ళవలసి యుండును గదా, కావున నీ పంతం మానుమా అని చెప్పితిని.
బిరబిరా కృష్ణమ్మ పరుగు లెడుతున్నట్టు మా ఆవిడ కోపగృహంబు జొచ్చెను . నేనుకూడా డూడూ బసవన్న లాగ ఆమె వెంట నరిగితిని. నరిగి,
చిగురు బోడి, నా హృదయరాణి, వాళ్ళెవరో కొన్నారని మనం కొనదగునా, సఖీ వలదు, అలుక మానుము ప్రియే చారుశిలే
అని పాడితిని. కాదు కాదు శీలే అనాలి అని ఆమె బోధించెను.
ఆ తరువాత దారుణమైన, తీవ్రమైన చర్చలానంతరం ఈ కింద నొసంగు నొడంబడిక కు సమ్మతించడ మైనది
1. కొత్త స్కూటర్ కొనుటకు నిశ్చయించడం అయినది.
2. రేపే లోను కు అప్లై చేయవలె.
3. సంసార సాగరమున ఆర్ధిక తుపాను నివారించుట కై శ్రీమతి ప్రభావతి తమ తమ్ముని వివాహమునకు నేగుట అను విషయమై తగు సమయంలో తగు నిర్ణయం శ్రీమతి ప్రభావతి ప్రద్యుమ్నుడు తీసుకొనుట కై తదుపరి చర్చలు జరుప బడగలవు.
4. ఈ పైన చెప్పిన ఏ విషయమైనను ఉద్దేశ్యపూర్వకముగా నుల్లంఘించిన లేక త్వరితగతి కార్యా చరణ చేయకున్న శ్రీ ప్రద్యుమ్నులు వారిచే నిరాహారదీక్ష చేయించబడును.
దీని పై శ్రీమతి ప్రభావతి ప్రద్యుమ్నుడు వ్రాలు అని సంతకం చేయడమైనది.
మర్నాడు పొద్దున్నే నేను మామూలుగానే ఆఫీసు కు నరిగితిని. సంతకం పెట్టి ల్యాబ్ లో ఒక రౌండు కొట్టి నా సీటు లో కూర్చుంటిని. సుమారు 10.30 గం// అయింది. మా స్టెనో కుమారి అలకా హజారికా కిసుక్కున నవ్వి లోను అప్లికేషను పూర్తి చేసి పట్టుకు వచ్చాను. మీరు సంతకం పెట్టితే ఆఫీసులో ఇచ్చేస్తాను అని చెప్పింది. ఆహా అన్నాను ఆహాహా అని కూడా అన్నాను. అసలు నీకు ఎవరు చెప్పారు. నీకు వేరే ఏమీ పనిలేదా ? వారం రోజులయింది. దీపక్ గారి రిపోర్ట్ ఇంకా టైపు చెయ్యలేదు. ఈ పనులన్నీ వదిలి What is this loan application? అని ఘట్టిగా కోప్పడ్డాను. అలక మళ్ళీ కిసుక్కున నవ్వింది. ప్రభావతి దీదీ 9 గం// కి టెలిఫోను చేసారు. మీరు మర్చిపోతారేమో నని గుర్తు చేయమన్నారు అని చల్లగా చెప్పింది. ఈ వేళ సాయంకాలం లోగా డైరక్టరు గారి టేబులు మీదకు పంపే బాధ్యత నన్నే తీసుకొమ్మని చెప్పారండి అని అనెను. నేను గుర్ గుర్ మంటూనే సంతకం పెట్టి ఇచ్చితిని. అలకమ్మ గారు అది పుచ్చుకొని తుర్రు మనెను. ఈవిడ ఇంకా ఎవరికి టెలిఫోను చేసిందా అని ఆలోచిస్తుంటే గణగణ మని ఫోను మోగింది.
నేను శాస్త్రి ని నువ్వు నువ్వేనా
అవును నేను నేనే
ఏమిటి అమ్మాయి స్కూటర్ కొనిపిస్తోందిట. నాకు చెప్పలేదేం
మీకు ఎల్లా తెలిసింది
మీ స్టెనో మా స్టెనో కి చెప్పితే ఆవిడ నాకు చెప్పి మిగత అందరి స్టెనో లకి చెప్పేసింది ట.
అంటే ఇప్పుడు ఇది టాప్ న్యూస్ అన్నమాట లాబ్ లో
అవును good luck వాహన యోగ ప్రాప్తిరస్తు అని దీవించి పెట్టేసాడు
ఇంతలోకి మా త్రిపాఠి గారు వచ్చి ఎదురుగా ఆసీనుడయ్యాడు.
రేపే వెళ్లి పట్టు కొచ్చేస్తున్నావుట? ఏ స్కూటర్? చూసావా? మాట్లడావా?
అంటూ ప్రశ్నల శరంపర కురిపించేసాడు. ఓ నవ్వు నవ్వి ఊరుకొన్నాను.
అస్సాంలో కురుస్తున్న వర్షాల గురించి, రాజస్తాన్ లో కాయని ఎండల గురించి, పెరుగుతున్న ధరల గురించి ఓ పావు గంట ఉపన్యాసం ఇచ్చి వెళ్ళి పోయాడు. నేను చంకలో ఓనోట్ బుక్కు,. చెవిలో ఓ పెన్సిలు పెట్టుకొని లైబ్రరీ వైపు అడుగులు వేసాను. నాల్గు అడుగులు వేసానో లేదో మా సదానంద గర్గ్ తగులుకున్నాడు.
సో హాపీ టు నొ దట్ యు హావ్ ఫైనల్లీ డిసైడెడ్ టు పర్చేజ్ ఎ వెహికిల్. వై డోన్టు యు గో ఫర్ ఎ ఫోర్ వీలర్ ?
నాకు మండుకు వచ్చేసింది. నీకెవరు చెప్పారు అని అడిగితిని. వాడు ఓ నవ్వు విసిరి ఓ మాటు ఘట్టిగా గాలి పీల్చి, హవా మే ఖబర్ హై అని వడి వడి గా అడుగులు వేసుకుంటూ నిష్క్రమించాడు. ఇప్పుడు ఇంక లైబ్రరీ లో కూర్చుంటే ఎంత మంది జోకులు వినవలసి ఉంటుందో అని నేను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను. ఫోను మోగింది. ఎత్తేను.
షుడ్ ఐ కాల్ ఫర్ టెండర్స్ సార్ ? ఏజ్ దిస్ అపియర్స్ టు బి ఏన్ ఇమ్మీడియట్ అండ్ ఇంపార్టంట్ పర్చేజ్, వుయ్ మే హావ్ టు సెండ్ దిస్ ఫర్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ది డైరక్టర్.
మా పర్చేజ్ ఆఫీసరు. మాట్లాడకుండా ఫోను పెట్టేసాను.
.ఒంటిగంటి కి లంచి కి ఇంటికి వెళ్ళేటప్పటికి, మా ఆవిడ మంచి మూడు లో ఉన్నారు. ‘సా ధిం చె నే మ న సా’ అంటూ త్యాగరాజు గారి పని పట్టేస్తున్నారు. నేను నిశ్శబ్దంగా నాపని కానిచ్చేస్తున్నాను, భోజనం చెయ్యడం. మా ఆవిడ, నేను మా కార్యక్రమాలు ఒకేమాటు పూర్తిచేసాము.
సాయంకాలం 3గం// కి టౌను వెళ్ళుతున్నాం. శాస్త్రిగారి తో మీరు కూడా రండి.
నాకు తీరుబడి లేదు
అనుకున్నాను, అవసరమైన రోజున మీకు మీటింగులు ఉంటాయని
అంత తొందరెందుకో నాలుగైదు రోజులు ఆగవచ్చు కదా
ఎల్లుండ కల్లా స్కూటరు ఇంట్లో ఉండాలి
డబ్బు అరేంజ్ చెయ్యాలి కదా
ఆ పని అయిపోయింది
నాకు తెలియకుండా ఎల్లా అయింది
మీకు తెలిస్తే అవదని నాకు తెలుసు కాబట్టి. శాస్త్రి గారి ఎకౌంట్ లోంచి 3500 మీ ఎకౌంటు లోకి ట్రాన్స్ ఫర్ అయింది. సాయంకాలం 4 గం// ల కల్లా చెక్కు వచ్చేస్తుంది మీకు ఆఫీసు నించి. అలక చెప్పింది. Credit and Thrift society నించి ఈ నెల లో మళ్ళీ ఓ నాలుగు వేలు తీసుకోవచ్చుట కదా. అలక చెప్పింది. అది శాస్త్రి గారికి ఇచ్చేయవచ్చును.
పక్కా ప్లాను వేసేసి నట్టున్నావు
మీరు కూడా వస్తే బాగుంటుంది
నేను వెళ్ళుతున్నాను ఆఫీసు కి
పిలచినా బిగువటరా భళిరా
ఆఫీసు కు వచ్చానన్న మాటే కానీ మా బాసు నా అప్లికేషను మీద నాట్ అప్రూవ్డ్ అని రాసేస్తే బాగుండునని అనుకొన్నాను. సుమారు 2.30 గం// కి ఫోను గణగణ మంది.
డైరక్టర్ హియర్
యువర్ శిష్యా హియర్ (నేను ఆయన దగ్గర Ph.D చేశాను అందుచే నన్ను అల్లాగ కూడా పిలుస్తారు )
హహ్హా, ఏమిటీ అత్యవసర కోటాలో స్కూటరు ఎడ్వాన్స్ కావాలా నీకు
అబ్బే వద్దండి
ఓ. కే గుడ్ లక్
థాంక్యూ సర్
చివరి ఆశ కూడా ఆవిరై పోయింది. ఇప్పుడు స్కూటర్ తప్పేటట్టు లేదు. ఇంకో రెండు వందలు నెల జీతంలో కట్. అయిపోబోయిన సొసైటీ లోను కంటిన్యూ అవుతుందని చింతించితిని.
నీ ఆశా అడియాసా చేజారే మణి పూసా లంబాడోళ్ళ రాందాసా
గుండెల్లో గునపాలే గుచ్చారే మీవాళ్ళు గుండెల్లో ఆఆఆ గుండెల్లో
అని పాడుకున్నాను. ఓ గంట తర్వాత అలక చెక్కు పట్టుకొచ్చి చూపించింది. రేపు నేను మీ ఎకౌంటులో డిపాజిట్ చేస్తానని చెప్పింది. సాయంకాలం మా ఆవిడ చెప్పింది ఆల్విన్ పుష్పక్ బాగుందండి చూడడానికి. సిల్వర్ గ్రే కలర్ ది సెలక్టు చేసాం. లాంబ్రెట్టా నచ్చలేదు నాకు. అయినా మన హైద్రాబాదు ది మనం కొనాలి కదా,. రిజిస్ట్రేషను అది వాడే చేయిస్తానన్నాడు. అంతా కలిపి 11650 మాత్రమే. రేపు ఒంటి గంట కి అంతా రెడీ చేసి పెడతానన్నాడు. మనం వెళ్ళి తెచ్చుకోవడమే. వెరీ సింపుల్ అని ప్రకటించింది. నేను ఇంక చేయునదేమి లేక, లేని ఉత్సాహం తెచ్చుకొని సరే కానిమ్ము అని అనుమతి ఇచ్చితిని.
మర్నాడు ఉదయం నించి మా ఇంట్లో సన్నాహాలు మొదలయ్యాయి. 7 గం// కి పూజారి గారు వచ్చారు. నా నక్షత్రం మాఆవిడ నక్షత్రం కలిపి గుణించారు. తారా బలం అన్నారు. బొటన వేలితో మిగిలిన అన్ని వేళ్ళ ముణుకులు లెఖ్ఖపెట్టేరు. పంచాగం తిరగేసారు. మధ్యాహ్నం 1.౦6 గం// కి బండి తీసుకోండి. దివ్యంగా ఉంది ముహుర్తం అన్నారు. మా ఆవిడకి సందేహం వచ్చింది.
గురువు గారూ ముహూర్తం అంటే డీలర్ దగ్గరి నించి బండి తీసుకోవడమా లేక బండి నడపడమా.
బండి తీసుకోవడం. కావాలంటే తరవాత పూజ చేసి బండి కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించి నడపడం మొదలు పెట్టవచ్చు.
మరి టౌను నించి 8 కి.మీ ఉంది కదా మన కాలనీ. నడిపే తీసుకురావాలి కదా మరి ఎల్లా?
అమ్మా అక్కడే పూజ చేయించి తీసుకు రావచ్చు గదా మా అబ్బాయి ఉవాచ.
అల్లా చేయించి తీసుకు రావచ్చా పూజారి గారూ
భేషుగ్గా తీసుకు రావచ్చు.
సరే మీరు 11.30 గం// కి వచ్చేయండి. పూజా సామాగ్రి మీరే తీసుకు వచ్చేయండి. అని వారికి ఓ వంద రూపాయలు ఇచ్చి పంపించింది.
శాస్త్రి గార్కి, డీలరుకి, సదానంద్ కి టెలిఫోను చేసి ప్రోగ్రాము చెప్పేసింది. సరిగ్గా 11.30 గం// కి మా ఇంటినించి శాస్త్రి గారు, వారి భార్య, నేను, మా ఆవిడ, మాపిల్లలు ఇద్దరు, సదానంద్, పూజారి గారు బయల్దేరాం శాస్త్రి గారి కారులో. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు రోడ్డు కిరువైపులా నుంచొని జయ జయ విజయీ భవ అని ఆశీర్వదించారు. 11.45 గం// కల్లా డీలరు గారి కార్యాలయం కి చేరిపోయాం. అక్కడ ఫార్మాలిటీసు అన్నీ పూర్తి అయ్యిం తరువాత 12.35 కల్లా పూజ మొదలు పెట్టేసారు పూజారి గారు. ఒంటిగంటా ఐదు నిముషాలకి పూజ అయిపోయింది. ఓ నిముషం తరువాత డీలరు గారు నాకు స్కూటరు తాళంచెవులు ఇచ్చారు. అఫీషియల్ గా ఈ బండి ఇక మీదే మీదే మీదే అని ముమ్మారు ఉద్ఘాటించారు. సభాసదు లందరూ చప్పట్లు కొట్టారు. ఉత్సాహం వచ్చిన నేను కూడా, అప్పు ఇచ్చిన శాస్త్రి గార్కి, బండి ఇచ్చిన డీలరు గార్కి, నెత్తి నెక్కి ఈ బండి కొనిపించిన మా ఆవిడ గార్కి, పూజ చేసిన పూజారి గార్కి, ఇప్పుడు కొత్తబండి నడపబోయే సదానంద్ కి, ఆశీర్వదించడానికి పనులన్నీ మానుకొని వచ్చిన శ్రీమతి శాస్త్రి గార్కి అందరికి యధాశక్తి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అంటూ వోట్ ఆఫ్ థాంక్స్ చెప్పేసాను.
పూజారి గారు ముందుకు వచ్చి ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టుట అను కార్యక్రమం ఉన్నది. కొట్టు వారు అందరూ వచ్చి కొట్టేయండి అన్నారు. వచ్చిన వాళ్ళందరం యధాశక్తి బలం ఉపయోగించి కొట్టేసాం పూజారి తో సహా. అప్పుడు డీలరు గారు కూడా వచ్చి కొబ్బరి కాయ కొట్టి సుఖ డ్రైవింగ్ ప్రాప్తిరస్తూ అని మార్వాడీ భాషలో దీవించాడు. చివరగా నిమ్మకాయలు తొక్కించు కార్యక్రమం కోసం సదానందు ముందుకు వచ్చాడు. అప్పుడు డీలరు గారు న న న అని నహీ నహీ నహీ అని కూడా అన్నాడు. మా అందరి కేసి చూసాడు అప్పుడు కహా హై. సార్ నడిపితే బాగుంటుంది కదా అన్నాడు. నాకు తొక్కడం రాదు అన్నాను. మా ఆవిడ నాకేసి గుర్రుగా చూసింది. తొక్కడం ఏంటి ఇంకా సైకిలు భాషేనా. డ్రైవింగ్ అనాలి అని కోప్పడింది. అల్లాగే అన్నాను.
ఏం పరవాలేదు గాడీ ఇస్టార్టు చేసి బండి న్యూట్రల్లో పెట్టి నిమ్మకాయల మీద నించి తోసేస్తే సారు డ్రైవు చేసినట్టే అని డీలర్ విశదీకరించాడు. నేను పట్టుకుంటాను బండి పడకుండా అని హామీ ఇచ్చాడు. వాల్ రైటు వాల్ రైటు అన్నారు అంతా. నాకు తప్ప లేదు. నేను రెండు కాళ్ళు రెండు వైపులకి వేసి సీటు మీద కూర్చున్నాను. రెండు చేతుల తోటి హాండిల్ పట్టుకున్నాను. సదానంద్ స్టార్ట్ చేసి న్యూట్రల్లో పెట్టాడు. పూజారి గారు రెండు నిమ్మ కాయలు ముందు చక్రం కింద రెండు వెనక చక్రం కింద పెట్టి ఇంకో రెండు నాల్గైదు గజాల దూరం లో పెట్టాడు. కింద వాటిని పచ్చడి చేసి ముందు వాటి రసం చక్రం తో పిండించాలన్న మాట.
డీలరు గారికి ఇంకా ఉత్సాహం వచ్చింది. అమ్మగారూ మీరు కూడా కూచోండి అన్నాడు.
మా ఆవిడ వెంటనే వెనక సీటు ఎక్కేసింది.
రెడీ వన్, టూ, త్రీ తొయ్యండి అన్నాడు డీలరు
ప్రభా నువ్వు మీ ఆయన భుజం మీద చెయ్యి వెయ్యి, శాస్త్రి గారి భార్య సలహా
పూజారి గారికి కూడా సరదా పుట్టేసింది. రెండో చెయ్యి నడుం మీద వేసేయమ్మా అన్నాడు.
బండి తొయ్యబడింది. అదే సమయంలో మా ఆవిడ ఒక చెయ్యి నా భుజం మీద, రెండో చెయ్యి నా నడుం మీద వేసింది. నా నడుం మీద చెయ్యపడగానే నాకు చక్కిలిగింతలు పుట్టుకొఛ్ఛాయి. ఖళ్ళుఖళ్ళూ మని నేను నవ్వేసాను. హాండిల్ మీద చేతులు పట్టు తప్పాయి. స్కూటర్ గజ గజా వణికింది. అపాయం శంకించి మా ఆవిడ ముందుకు దూకేసింది. ఆపోజిట్ డైరెక్షన్ లో స్కూటరు ఒరిగింది. వెనక సీటూ ముందు సీటూ పట్టుకొని బండి ని బాలన్స్ చేస్తున్న డీలరు మీద మా ఆవిడ పడడం ఆయన వెనక్కి పడడం, స్కూటర్ ఇటు వైపు పడడం, నా కాలు ఒకటి గాలిలో మిగతా శరీరమంతా స్కూటర్ కిందా, నా తల నిమ్మకాయల మీద, డీలరు గారు రోడ్ మీద, వారు ప్రేమగా పెంచుకొన్న వారి బొజ్జ మీద మా ఆవిడ అన్నీ క్షణ కాలంలో జరిగిపోయాయి. మా ఆవిడ, మా స్కూటరు క్షేమం. పాపం డీలరు గారిని లేపడానికి నలుగురు అవసరమయ్యారు. అంతదాకా నా శరీరం స్కూటర్ కింద, నాకాలు గాలిలో నే ఉన్నాయి. సీతారామ కల్యాణం సినీమా లో శివ ధనుస్సు కింద పడ్డ యన్.టి వోడు అవమాన భారంతో కుంగి పోతుండగా తీరుబడి గా నడుచు కొని వచ్చిన హరనాధ్ లాగ, వచ్చిన సదానంద్ స్కూటర్ ఎత్తి నన్ను స్కూటరు భారం నించి విముక్తుణ్ణి చేసాడు.
నా వాహన యోగం ఎల్లా ఉన్నా, నా వాహనానికి వాహన యోగం పట్టింది. నర వాహనం. నిమ్మ కాయ తొక్కించడంతో సహా.
35 కామెంట్లు:
హ హ హ పోస్ట్ అదుర్స్...మొత్తానికి మంచి ప్రహసనమే, ముక్తాయింపే హైలైట్ ఈ పోస్ట్ కి. :)
ద్రౌపతి పద్యాన్ని మీ ఇంటావిడకి బాగా అన్వయించారు సుమండీ!
"చిగురు బోడి" అని రాసారు. అది తప్పేమోనండి. "బోణి" అని రాయాలనుకుంటా. 'గుణసుందరి కథ' సినిమాలో ఒక పాటలో పింగళి వారు "హుషారు బోణి" అని ప్రయోగించారు. "రసికరమణి, హుషారుబోణి, నీతల్లో పూవై...." అని సాగుతుంది పాట.
మీరు తప్పుగా రాస్తే పై వివరణ, లేదూ తెలిసే అలా వక్రీకరిస్తే మాత్రం ఓ పుట్టెడు నవ్వులు. :)
హహ్హహ్హా. భలే ఉందండీ సుబ్రహ్మణ్యం గారూ మీ టపా.:)
>>లోపలి నించే ఆవిడ గుర్ గుర్, ఇంకేముంది మాట్లాడటానికి గుర్ గుర్ అంది.
>>మీ స్టెనో మా స్టెనో కి చెప్పితే ఆవిడ నాకు చెప్పి మిగత అందరి స్టెనో లకి చెప్పేసింది ట.
ఇంకా చాలా చాలా నచ్చాయి లెండి. అవన్నీ కాపీ పేస్ట్ చేస్తే ఎలా.:)))
Absolutely super !!
:) :)
As usual hilarious.
బులుసు గారు మీ బండోపాఖ్యానం చాలా బాగుంది...పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు..
>>వాహనానికి వాహన యోగము
లో.....ళ్
ఆ.సౌమ్య గార్కి,
చిగురు బోడి లేక చిగురు బోణి అనే అనుమానం వ్రాసే టప్పుడు వచ్చిందండి. కామేశ్వర రావు గారి బ్లాగు లోకి వెళ్ళి ఆంధ్ర భారతి నిఘంటువు చూసాను.
చిగురు + పోడి = చిగురు బోడి = చిగురు వలె మనోజ్ఞురాలగు ఆడుది అని ఉంది. రు తర్వాత, బో తర్వాత అర సున్నలున్నట్టు గుర్తు. నేను అవి పెట్టలేదు. ఇది కూడా కరక్టే ననుకుంటాను.
అవునండి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యమే “పుట్టితి పూజ్యుడౌ ద్రుపద భూపతి కిన్, జగజ్జెట్టి పాండు సమ్రాట్టు కు కోడలి నైతి .......” పూర్తిగా గుర్తు లేదు. ఏదో ఆ సమయానికి వాడాలనిపించింది. పద్యం ఖూనీ చేసేసానా?
గుణసుందరి పాటలు మీకు అంతగా గుర్తుండడం ఆశ్చర్యంగా ఉంది. పాత పాటలు మీకు చాలా ఇష్టం అనుకుంటాను.
ధన్యవాదాలు ఓపిక గా చదివి వ్యాఖ్యానించినందుకు చాలా థాంక్స్.
మనసు పలికే గార్కి,
కొన్ని క్షణాలు ఖర్చు చేసి మా ఆనందం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
మరీ మరీ థాంక్స్ మీ కామెంటులకు.
హరేఫాలా గార్కి,
మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీవ్యాఖ్యలకి ధన్యవాదాలు
పరిమళం గార్కి,
ధన్యవాదాలు. థాంక్యూ వెరీ మచ్.
సునీత గార్కి,
మీరూ అయాన్ రాండ్ అభిమానులని తెలిసింది. Who is John Galt అని మేము చాలా తరుచు గా వాడేవాళ్ళం.
ధన్యవాదాలు మీ కామెంట్లకి
నైమిష్ గార్కి,
బండోపాఖ్యానం అంటే మీ ఉద్దేశ్యం మా బండి గురించే ననుకుంటాను. నేను బండోడిని అని అనిఉండరనే ఆశిస్తున్నాను. హహహ్హా
థాంక్యూ మీ వ్యాఖ్యానానికి. ధన్యవాదాలు
నాగార్జున గార్కి,
యోగములో .....ళ్.
అనండి సార్. మా మీద జోకులేసెయ్యండి. తరుణము మించిన దొరకదు.
ధన్యవాదాలు. మీ జోకుకి థాంక్యూ.
సుబ్రహ్మణ్యం గారూ,
>>బండోపాఖ్యానం అంటే మీ ఉద్దేశ్యం మా బండి గురించే ననుకుంటాను. నేను బండోడిని అని అనిఉండరనే ఆశిస్తున్నాను. హహహ్హా
మీరు నిజంగా మమ్మల్ని నవ్వించడానికే పుట్టిన కారణజన్ములండీ.. హహ్హహ్హా...
@సుభ్రఃమణియము గారూ (మీ పేరును ఖూనీ చేద్దామని ప్రయత్నిస్తున్నా :D)
ఇప్పుడే మీ కామెంటు చూసాకా డిక్షనరీలు తిరగేసాను. మీరూ కరక్టే నేనూ కరక్టే కానీ సగం సగం. అది బోడి కాదు, బోణీ కాదు. "పోడి", "పోణి" అన్నవి సరి అయిన పదాలు. రెంటికీ ఒకటే అర్థము, అవి రెండూ పర్యాయపదాలు.
బ్రౌణ్యంలో ఈ కింది విధంగా ఉంది.
"పోడి (p. 0823) [ pōḍi ] or పోణి pōḍi. [Tel.] n. Beauty, grace, ఒప్పు. adj. Beautiful, ఒప్పిదమైన. పోడిగా pōḍi-gā. adv. Well, properly, duly, ఒప్పుగా. "పోడిగాబిడ్డల పొరుగిండ్ల నుంచి." HD. ii. 2391. పోడిమి or పోణిమి pōḍimi. n. A sign or mark, లక్షణము. Brightness, splendour. పస, వన్నె. Proportion, fitness, neatness, సొంపు, పొంకము. Economy, management, prudence. మితవ్యయము. Wealth, సంపద. Happiness, సౌఖ్యము. Manner, విధము. "విలయకృశానుకీలముల వేడిమి బోడిమి మాలివ్రేల్మిడిం." Swa. ii. 10. టీ పోడిమిమాలి, సౌష్ఠవము చెడి. పోడిమిచెడు to die, చచ్చు. పోడిమడంచు to kill, చంపు. పోడిమిగా pōḍi-mi-gā. adv. Economically. మితవ్యయముగా. "
మీ మూలాన నేనొక పదాన్ని కరక్ట్‌గా తెలుసుకున్నాను. అందుకు మీకు థాంక్సులు.
నాకు పింగళి వారంటే విపరీతమైన అభిమానం. ఆయన రాసిన పాటలు ఏవైనా నాకు కంఠతావే. గుణసుందరి కథలో మాటలు, పాటలు పింగళివారే రాసారు, వాటిని కలలో కూడా మరచిపోలేను నేను. :) పాటలంటే చాలా ఇష్టం పాతవైనా కొత్తవైనా, మంచి సాహిత్యం సంగీతం ఉండాలేగాని నా ఆస్వాదనకి లోటు ఉండదన్నమాట. :)
ఒహో మీరు కరూణశ్రీగారి పద్యాన్ని వాడుకున్నారా, నేనింకా భారతంలో పద్యం అనుకున్నా. నాకు "వరమునబుట్టితిన్, పాండుభూపతికి కోడలైతి...." అన్న పద్యం గుర్తొచ్చింది. దానినే మీ ఇంటావిడమీద ప్రయోగించారనుకున్నా. :)
@ నైమిష్ గారు
బండోపాఖ్యానమేమిటండీ బాబూ...చస్తున్నా నవ్వలేక :)బులుసువారిమీద బలే పదం ప్రయోగించారులెండి. ఇంతకీ ఆయన ఫొటో మీరెప్పుడు చూసారూ?...హహహహ :D :D
బాగుంది. ప్రభావతిగారి పద్యం మాత్రం సూపర్.
బోణి, బోడి రెండూ కరక్టే
ప్రద్యుమ్నాయనమః,
.....నౌకా విహారం తర్వాత యింత నిశ్శబ్దం
యేమిటా అనుకున్నా..విషయం తెలిసింది.
మీ రాజప్రసాదంలో కోపగృహం...శయనాగారం
అన్నీ వుండి స్కూటరులేకపోవుటయా..ఇస్సీ..
అయిననూ శ్రీమతి ప్రద్యుమ్నగారు అదే తమ
కార్యాలయంగా కథ నడిపిన తీరు ప్రశంసనీయం.
షోడశోపచార పూజలో...గజానారోహయామి,
అశ్వానారోహయామి లాగ ... మీ ద్విచక్రవాహనం
పూజలందుకున్న క్లైమాక్స్...అత్యద్భుతం...
శుభాభినందనలు.........దినవహి.
simply Adurs, am feeling jelous about u r friends and colleagues, could not resist the feeling of coming to southend park to meet u.
హ హ :-) వాహనానికి వాహన యోగం, పాపం సుబ్రహ్మణ్యం గారు, దెబ్బలు ఏమీ తగిలించుకోలేదు కదా. టపా అంతటా చెణుకులు యధావిధిగా మెరుపులు మెరిపించాయి :-)
ఆ.సౌమ్య గార్కి,
దండాలండి దండాలు. పిల్లి = మార్జాలము = బిడాలము అని ఎంత బాగా చెప్పారండి. మీరు పోడి/ పోణి = అరపేజీ వ్యాఖ్యానం తో అంత విపులంగా చెప్పి నందుకు చాలా ధన్యవాదములు. నేను కూడా కొంచెం రీసెర్చి చేసాను. కనుక్కున్నదేమి టంటే బహుశా ’చిగురుబోడి’ ఒకే పదం అయ్యుండ వచ్చు. చిగురు బోడి అని విడగొట్టి అడిగితే “ఎల్లెల్లు అల్లాంటివి మా వద్ద లేవు” అని అన్నాయి నిఘంటువులు. విడిగా వ్రాసి పొరపాటు చేసానని ఒప్పేసు కుంటున్నాను. "విలయకృశానుకీలముల వేడిమి బోడిమి మాలివ్రేల్మిడిం." దీని అర్ధం కోసం నేను మళ్ళీ నిఘంటువు వెతకాలా, మీరు చెప్పేస్తారా.
పైన సరదాగానే వ్రాసాను. తెలియని విషయాన్ని అంత నిశితంగా పరిశీలించి మీరు తెలుసుకొని నాకు తెలియపర్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇక ముందు కూడా నేనేమైనా పొరపాటు చేస్తే సరిదిద్దమని కోరుతున్నాను.
అవునూ, ఇప్పుడు నాపేరుని ఖూనీ చెయ్యాలనే సదుద్దేశం ఎందుకు కలిగిందో?
మీ వివరణకి, మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
మనసు పలికే గార్కి,
మీ రింకా అమాయకులు అనుకున్నాను. బులుసు గారూ ఆయనెవరో మిమ్మల్ని బండాడు అంటున్నాడండి. బండాడు, బండాడు అని అందరికి మళ్ళీ గుర్తు చేసేసారు గదా. ఆ. సౌమ్య గారు కూడా అనేసారు. హతవిధీ, నేనేమి సాయవలె.
మీ వ్యాఖ్యలకి బహుత్ బహుత్ ధన్యవాదములు.
కొత్తపాళీ గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. పద్యాలో, భావకవిత్వమో వ్రాసేద్దామని ముచ్చట పడ్డ రోజులున్నాయి. రెండు కవితలు వినగానే, మీ మొహం లాఉందండి అని మా ఆవిడ అనగానే, సరే జోకరు గానే ఉండిపోదామనే డిసైడ్ అయిపోయానన్న మాట. మీరు బాగుంది అంటుంటే మళ్ళీ ఏదో ఆశ కలుగుతోంది.
హనుమంత రావు గార్కి,
ధన్యవాదాలు మీ కామెంటులకి. అబ్బే రాజప్రాసాదాలేవి లేవండి. ఉన్న రెండు గదులు అవసరాన్ని బట్టి రూపాంతరం చెందుతాయన్న మాట. థాంక్యూ.
రాకిమో గార్కి,
ధన్యవాదాలు మీ కామెంట్లకి. స్వాగతం మీ రాక మాకెంతో ఆనందం సుమండీ.
వేణూ శ్రీకాంత్ గార్కి,
100 kgs. స్కూటరు, మీద పడితే దెబ్బలు తగులుతాయి గదా సారూ. కొత్త స్కూటరు లో 1st. aid box వెంటనే పనికి వచ్చిందన్నమాట.
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
మీరు కామెంట్లలో కూడా ఎక్కడా తగ్గరేఁ :D
మీకు తప్పొప్పులు చెప్పడమా, బలేవారె! అసలే తెలుగులో మీరు ఉద్దండపండితులు...హమ్మమ్మా ఎంతమాట! (ముక్కుమీద వేలు) :)
బులుసుగార్కి,
రామ రామ మిమ్మల్ని ఉద్దేశించికాదండీ...నేనన్నది ముమ్మాటికీ మీ బండి గురించే..
"రెండు కవితలు వినగానే, మీ మొహం లాఉందండి అని మా ఆవిడ అనగానే, సరే జోకరు గానే ఉండిపోదామనే డిసైడ్ అయిపోయానన్న మాట."
మీ మొహం అందంగా ఉంటుందని నేరుగా చెప్పడానికి సిగ్గుపడి ఇలా అన్యాపదేశంగా చెప్పారేమో మీ ఆవిడ. థింకు పాజిటివ్వు. :-)
హహ్హహా.
>>వాహనానికి వాహన యోగము>> :)
మా ఊళ్ళో రిక్షాబండాడు అనే అంటారండీ మరి నైమిష్గారి తప్పేంటండీ అసలు. బండోడు మటుకు కేవలం ఒక్క ఆంధ్రుల అభిమాన నాయకుడికే చెల్లు, ఇంకెవరూ (మీతోసహా) వాడకూడదంతే, ఆ!
ఆ. సౌమ్య గార్కి,
నేను పండితుడిని కాదండి. పండిత పుత్రః అని ఒప్పుకోవడానికి అభ్యంతరం లేదు.
ధన్యవాదాలు.
నైమిష్ గార్కి,
కృష్ణ కృష్ణ, మీరు అన్నది మా బండి గురించే నని మాకు తెలుసు నండి. కానీ మీరు అన్నదానిని సరదాగా నే కొంచెం సాగదీసాను. మా మిత్రులు మరికొంచెం సాగదీసారు. మా బ్లాగు లో నవ్వడానికి, నవ్వించడానికి No limits అన్న మాట. అల్లాగని elastic limits దాటం.
ధన్యవాదాలు.
భైరవభట్ల కామేశ్వర రావు గార్కి,
“ఎక్కడి వాడొ యక్ష తనయేందు జయంతు వసుంతు కంతునిన్ చక్కదనంబునన్ గెలువ జాలిన వాడు.......” అనుకుంటూ పడిపోయింది చిన్నప్పుడు. 41 ఏళ్ళ సహజీవన సౌభాగ్యం లో ఆవిడ మెరుపులు నా చెణుకులు అలవాటయి పోయాయి.
ధన్యవాదాలు.
జేబి-JB గార్కి,
అమ్మయ్య, మీరు కూడా అనేశారా ? వీర తాళ్ళు పుచ్చుకొని ఇంతమంది లైను లో నుంచున్నారని ఇప్పుడే తెలిసింది. ’రిక్షా బండోడు’ అనండి సార్ అనండి. టైము ఏం చేస్తాం. మా ఆవిడా, ఇద్దరు పిల్లలు, నెల సరుకులు కాలి దగ్గర, వారం కూరగాయలు నెత్తి మీద, రిక్షా కొనుక్కున్నా బాగుండేదే అనుకున్న రోజులు ఉన్నాయి..
ధన్యవాదాలు.
సునీల్ గారు అన్నారు,
అయ్యబాబోయ్ పెళ్ళి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా? నేనేమో గారలు తినడం అనుకున్నాను....
సునీల్ గార్కి,
అయ్యా క్షమించాలి. మీ పై కామెంటు ఎక్కడో తప్పి పోయింది. అందుకని ఇల్లా పెట్టవలసి వచ్చింది.
ఇంత అమాయకులా మీరు. పెళ్ళి అనగా మూడు ముళ్ళ బంధము. ఏడు అడుగుల నడక. అంతే మొగుడు ఫినిష్.ఇంక ఆవిడ సామ్రాజ్యంలో మగాడు.. ఏం చెప్పమంటారు? అది అనుభవించిన కానీ తెలియదు.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
నేస్తం” గారి “జాజిపూలు” బ్లాగులో // “ మరేం ఫరవాలేదు. పాతవన్ని మళ్ళీ వెయ్యండి. చదవటానికి మేమున్నాం. ............... మహా” // అని 25 ఏప్రిల్, 2022 12:24 PM “ నాడు మీరో సలహా ఇచ్చినట్లున్నారు కదా.
మీ బ్లాగులోనే నవంబర్ 2010 నాటి మీ ఈ "వాహనయోగం" టపా ఇప్పుడు మళ్ళీ వేసి, “నేస్తం” గారికి శాంపుల్ చూపిస్తున్నారా ����?
అఫ్-కోర్స్ మీ టపాలు ఎన్ని సార్లు చదివినా అలాగే నవ్వులు పూయిస్తుంటాయి లెండి ��. Carry on ��.
- విన్నకోట నరసింహారావు
Sent from my iPhone
విన్నకోట వారికి. ......... ధన్యవాదాలు
ఈ వాహన యోగం మాత్రమే కాదండీ, గత రెండేళ్లుగా నేను ఇక్కడ మళ్ళీ పాత టపాలే వేస్తున్నాను. కొత్తవి వ్రాయడం కుదరటం లేదు. ఎందుకంటే స్టీమ్ అయిపోయింది అనుకుంటాను. ఆ బండి ఇంక నడవదు. శుభం కార్డు పడిపోయింది. ..................... మహా
మ హా 🙂🙂
- విన్నకోట నరసింహారావు
Such a wonderful Post Thanks for sharing, this post has been extremely helpful to me.
Latest News Updates
హహహ..
బాబాయి గారు , మీరు ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. దయ చేసి ఒక సారి నన్ను పలకరించి సంతోష పెట్టండి.
దుర్గాదేవి గారూ,
నమస్కారం,
నేను కులాసా. మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారని తలుస్తాను. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి