పాక శాస్త్రము – ప్రాధమిక సూత్రాలు.

ఈ మధ్యన చాలా మంది ఆడ లేడీస్ మగ జెంట్సు కూడా  వంటలు వార్పులు అంటూ వ్రాసేస్తున్నారు.   తింటే వాంతులు అని కొంతమంది కామెంటుతున్నారు కూడాను.  TV లో కూడా ఛెడామడా చూపించేస్తున్నారు .  ఈ వంటలు అన్నీ చాలా శ్రద్ధగా చదివాను, చూశాను.  కొత్తరకం వంటల గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేశాను.  ఇందులో చాలా మట్టుకు మా నాయనమ్మ చేసిన కూరలే. వాటికి  కొంచెం  విదేశీ పద్ధతులు,   కొంచెం ఉత్తర భారత రుచులు కలిపి పేరు మార్చి చలామణి చేసేస్తున్నారు అని అనుమానం వచ్చింది. రుచి మాట తినేవాడి ఖర్మ కానీ  అలంకరణ చేసి కంటికింపుగా (వాళ్ళ ఉద్దేశ్యం లో) చేసి పెట్టేస్తున్నారు.   నలభై ఏళ్ల నా రీసెర్చి అనుభవం తో  నేను కూడా కొన్ని కొత్త రకాల వంటకాలు దేశం మీదకు,  అమాయక పాఠకుల మీదకు వదులుదామని నిశ్చయించేసుకున్నాను.  నా రీసెర్చి కి ఈ వంటల కి సంబంధం ఏమిటంటారా. అదో పెద్దకధ.

 నేను చాలా కష్టపడి  రీసెర్చి చేసి దేశాన్ని ఉద్ధరించేద్దామనే సదుద్దేశం తోనే రీసెర్చి ఇన్స్టిట్యూట్ లో చేరాను. చేరిన కొత్తలో రీసెర్చి ఎల్లా చేయాలి, ఎందుకు చేయాలి అంటూ మా గ్రంధాలయం లో కూర్చుని పుస్తకాలు జర్నల్సు  తెగ చదివేశాను. ఒక ఏడాదిలో  జ్ఙాని నై పోయాను. వార్నీ,  రీసెర్చ్ అంటే ఇంత తేలికా అని హాచ్చెర్యపడిపోయాను. ఇక మనకి అడ్డేమిటి, విజృంభించేద్దామనుకున్నాను. కానీ ప్రతి సినిమాలోనూ ఒక విలను ఉంటాడు, ప్రతి అభిమన్యుడి  పతనం వెనకా ఒక సైంధవుడు ఉంటాడు, ప్రతి మొగుడి వెనక ఒక పెళ్ళాం ఉంటుంది, అని గ్రహించాల్సి వచ్చింది. నేను లైబ్రరి లో పుస్తకాలు కాచి వడబోస్తుంటే ఒక విషయం అర్ధం అయింది. ఇది చెప్పడం కొంచెం కష్టం.

 ఉదాహరణకి  ఒక పెద్ద ప్రొఫెసరు గారు ఉంటారు. ఆయన  లాబ్ లో బొల్డు మంది కుర్రాళ్ళు . కొద్దిమంది కుర్రమ్మలు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా దేశాన్ని ఉద్దరించేద్దామనే సదుద్దేశం తోనే ఉంటారు. కానీ ప్రోఫసరు గార్కి టైమ్ తక్కువ , లాబ్ లో చోటు ఉండదు. కానీ ఎక్కువమందికి పేరు కు  ముందు డాక్టరు జేరిపించేద్దామనే దుగ్ద బలం గా ఉంటుంది. వీరు ఒకరోజు సాయంకాలం సభ లో కూర్చుంటారు. కుర్రాళ్ళు,   కుర్రమ్మలు  చుట్టూ చేరుతారు. ఆయన ఒలికించిన జ్ఙానం  మూట కట్టుకోడానికి,  నోట్ బుక్ లు పెన్సిల్ లు రబ్బర్ లు పట్టుకుని. అప్పుడే చీకటి పడుతూ ఉంటుంది. ఆకాశంలో చంద్రుడు ఇప్పుడే వచ్చేదామా, ఇంకోచెంసేపు ఆగుదామా అని దీర్ఘాలోచనలో ఉంటాడు. ఈయన కి ప్రోఫసరమ్మ గారు (అంటే సర్ గారి భార్య) ఒక గాజు గ్లాసు లో  నారింజ రసం ఇస్తుంది. ఈయన మెల్లిగా చప్పరిస్తూ,  రుచి ఆస్వాదిస్తూ తల పంకిస్తూ ఉంటాడు. ఇంతలో కొంపలు అంటుకున్నట్టు చంద్రుడు గారు మబ్బులను చీల్చి చెండాడి విజయ గర్వంతో బయట పడతాడు. ఈ మీటింగ్ ని చూసి పోనీ పాపం అని కొన్ని వెన్నెల కిరణాలు అటు వైపు పంపుతాడు.  

గురువుగారు చంద్రుడి కేసి చూస్తారు. వారు పంపిన కిరణాలు బేరీజు వేస్తారు. చేతిలో గ్లాసులోని  నారింజ రసం  లో చంద్రుడిని  చూస్తారు. ఆయనికి బల్బు వెలుగుతుంది. చిరునవ్వు నవ్వుతారు.  కుర్ర (ఆళ్ళు, అమ్మలు)  పెన్సిల్ తీసి పుస్తకం లో వ్రాసుకోవడానికి తయారుగా ఉంటారు. ఆయన గ్లాసు పైకెత్తుతారు. ఏం కనిపిస్తోంది  అంటూ ప్రశ్నిస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళు మాములుగానే తెల్ల రంగు మొహానికి పూసుకొస్తారు కాబట్టి అదే మొహం  పెడతారు. (ఎవడైనా రంగు పూసుకోకుండా వచ్చి ఏమి కనిపించటం లేదు అంటే వాడికి ఇంకో రెండేళ్లదాకా  పని చేయడానికి ఏమి దొరకదు. ) తెల్ల మొహాల తోటి ఇంప్రెస్ అయిన గురువు గారు మళ్ళీ నవ్వి సెలవిచ్చారు.

 ఆ కిరణాలు నారింజ రసం లో పడి ఏమౌతున్నాయి.   ఎవరు మాట్లాడరు.
వక్రీకరణం చెందుతున్నాయి. ఆ చంద్రుడు చూడండి చిన్నగా కనిపిస్తున్నాడు. 
ఆళ్ళు + అమ్మలు  ముక్త కంఠం తో  వహ్వా అన్నారు. ఆచార్యుల వారికి ఉత్సాహం వచ్చేసింది.
రక రకాల కాంతి  కిరణాల తోటి  వక్రీకరణం  ఎల్లా ఉంటుంది ఉదయ కాంతి , మధ్యాహ్న కాంతి, సాయకాలం కాంతి, చంద్రకాంతి   అని భాష్యం చెప్పారు.
యస్ సార్ యెస్  అని  తాని తందాన అన్నారు శిష్య పుంగవులు.
గాఢత పెరిగే కొద్దీ వక్రీకరణలో  తేడా లేమిటి? ఇందులో నిమ్మరసం కలిస్తే ఏ విధంగా  మారుతాయి.
 ఏం చెప్పారు గురూ  గారు అని భజన మొదలెట్టారు శిష్య పరమాణువులు. ద్రోణాచార్యులు వారు అర్ధనిమీలత నేత్రులై 

నాయనా ధర్మజా నీవు పని మొదలు పెట్టు రేపటినించి. భీమార్జునులారా  మీరు నారింజలు, నిమ్మలు వెతకండి ఎక్కడ ఎవరింట్లో ఉన్నాయో? నకుల సహదేవులారా  మీరు గ్రంధాలయము నకు నరిగి ఈ విధమైన పని  ఇంతకు పూర్వము ఎవరు చేశారో చూసి వ్రాసుకు రండు. మనం వాటికి కొంచెం భిన్నంగా చేయాలి. అని ఉపదేశించారు.

మిగతా శిష్యా గ్రేసరులతో,    మనకి UV, IR కూడా వచ్చేస్తాయి ఇంకో  ఆర్నెలలో.  మీరు కూడా మొదలు పెట్టేయవచ్చు. రకరకాల కిరణాలు తోటి చేయవచ్చు. దబ్బరసం, నేరేడు రసం, రేగిరసం , పుచ్చకాయ రసం మొదలగు వాటితో చేసేయచ్చు. తేలికగా ఒక పది పరిశోధన గ్రంధాలు రచియించ వచ్చు. అమ్మా దుశ్సలా మీ ఇంట్లో మామిడి చెట్టు ఉంది కదా. నువ్వు మామిడి రసం మీద చేయవచ్చు.

ఇంతలో ఒక దుశ్శాసనుడు తెగించి అన్నాడు సార్ ఆపిల్ రసం తో కూడా చేసేద్దాం.
అంతే  గురుడు అగ్నిహోత్రుడయ్యాడు.  క్రోధారుణ నేత్రుడై,

 ఏమిరా దుశ్శాసనా కళ్ళు నెత్తి కెక్కినవా, ఉచితానుచితముల మరచితివా, ఆపిలు ధర ఎంతో ఎరుగవా మన రీసెర్చ్ గ్రాంట్ ఎంతో ఎరుగుదువా, మొత్తం అంతా కలపి అక్షరాలా 14 వేల 6వందల 43 రూపాయల 22 పైసలు. ఇందులో మీ 10 మందికి కెమికల్స్ కి, గాజు కుప్పెలకు, మొదలైన వాటికి తలకొకడికి సుమారు గా 12-13 వందలు. అందుకనే కదా ఇంత పొదుపుగా రీసెర్చిచేయిస్తున్నాను.   తక్కువ ఖర్చుతో ఎక్కువ Ph.D లు చేయించాలని    నేను  ఆలోచిస్తుంటే  ఆపిల్  కావాలిట  ఆపిల్  అని దులిపేశాడు. 

 దుశ్శాసనుడు మోమును చిన్నది చేసుకొని ఆచార్య దేవా తప్పును మన్నించుడు. అని ప్రాధేయ పడెను. గురు దేవులు శాంతం వహించి, శిష్య పరమాణువులకు  మార్గోపదేశము చేసి తను విశ్రాంత మందిరము నకేగెను.  ఆపైన శిష్యొత్తములు విజృంభించి ఒక 5-6 ఏళ్ళు ఘోరముగా, క్రూరముగా అనేక రసములను విశ్లేషించి ఒక అర డజను పైగా Ph.D  లు సంపాదించిన వారలైరి.

 ఇదే పద్ధతిలో నేను కూడా రీసెర్చ్ ని పొడిచేసి కాచి వడబోచి ఒక డాక్టొరేటు సంపాదించుదా మని ఉద్దేశ్యించిన వాడనై, మా చిన్న బాసు గారి సన్నిధానమున చేరి వారికి నా మనోగతము నెరిగించిన వాడనైతి.  కోతి కల్లు  తాగటం అంటే ఏమిటో, అగ్గిమీద గుగ్గిలం అంటే ఏమిటో కధ కళి లో శివతాండవం ఎల్లా ఉంటుందో మొదలైన వన్నీ తత్ క్షణంబే తెలిసిపోయాయి.

 నువ్వు రిసెర్చేది  పెట్రోలియం  మీద. ఇందులో అటువంటి శశభిషలు కుదరవని ఎరుగవా? అందులోనూ నువ్వాడే నాటకం అప్లైడ్ రిచేర్చి లో.  బేసిక్ రిచెర్చి ఇక్కడ కుదరదు.
 అని దురహంకార మదోన్మత్తుడై   పోరా పోమ్ము ఈ వేళ అట్టెండర్ రాలేదు. గాజు కుప్పెలను కడిగి శుభ్రపరచుము, యంత్ర పరికరములమీద దుమ్మును తొలగించుము
 అని ఆజ్ఙలు జారీ చేసి తాను సమావేశము న కరిగెను. ఆహా ! గాడు ప్రోపొసెస్, చిన్న బాసు డిస్పొసెస్ అని చింతించినవాడనై  కార్యోన్ముఖుడ  నైతిని.  ఈ విధము గా నా ఉత్సాహమున నీరు చల్లి నా  రిచెర్చి ప్రక్రియను కారు కష్టముల పాల్జేసిన సైంధవుడు మా చిన్న బాసు.       

 ఇప్పుడు ఈ వంట బ్లాగులు, వంట టి‌వి ప్రోగ్రాము లు చూసి చూసి  నేను కూడా పై ప్రొఫెసర్ గారిలా వంటల రీసెర్చ్ చేసేద్దామని  డిసైడెడ్ అన్న మాట.  ఇక మీరేం చేయలేరు. ఇది చదివి తరించడం తప్ప. సాధారణం గా నేను ఏ నిర్ణయాలు తీసుకోను ఎందుకంటే తీసుకొనే వారు వేరే ఉన్నారు. నేను ఆజ్ఙానువర్తి ని.  కానీ తీసుకున్నానంటే  మడమ తిప్పను. ఎందుకంటే రెండు కాళ్ళు విరిగి ప్లాస్టరు లో ఉంటాయి కనుక.  కారణాంతరముల వల్ల రాణీ గారు దూరదేశ మేగినప్పుడు మనకు ఆటవిడుపు కావున సాహసించితిని.

పాక శాస్త్రం లో ప్రాధమిక సూత్రాలు ఏమిటి అని ఆలోచించాను. చాలా మందికి ప్రాధమిక సూత్రాలు ఉంటాయని కూడా తెలియదని తెలిసి విచారించితిని.  ప్రాధమిక సూత్రాలు ముఖ్యమైనవి చూద్దాం.  

1. ఆహార్యం :  దీని గురించి నేను చాలా పరిశోధించి  తెలుసుకున్నాను. మా అమ్మమ్మ గారు చేసినట్టు మా అమ్మగారు చేయలేరు. మా అమ్మ గారు చేసినట్టు మా సోదరీ మణులు కానీ మా ఆవిడ కానీ చేయలేరు. రుచి కి సంబంధించి,  అందరూ ఒకటే స్కూలు. మా ఆమ్మమ్మ గారి దగ్గర  మా అమ్మ,   వారి దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకున్నారు  తు చ తప్పకుండా . కానీ రుచిలో తేడా వచ్చేస్తుంది.  పదార్ధాలు,  పరిమాణాలు     అన్నీ అవే అయినప్పటికి. తేడా ఎక్కడ వస్తుందా అని చచ్చేటట్టు ఆలోచించాను. చావగా చావగా సమాధానం గోచరించింది.
మా అమ్మమ్మ గారు ఉదయమే స్నానం చేసి మడికట్టుకొని పూజ చేసి  వంటలోకి దిగేవారు. వంట చేసినంత సేపు ఆ నారాయణుడి మీదో , శంకరుడి మీదో, ఆ తల్లి పార్వతమ్మ మీదో పాటలో శ్లోకాలో చదువుతూ చేసేవారు.

 మా అమ్మ గారు స్నానం చేసి పూజ చేసి మొదలుపెట్టేవారు.  అవసరమైనప్పుడు మాత్రమే మడి కట్టుకొనేవారు. అంటే మా దువ్వూరి పెద్దమ్మ వచ్చినప్పుడో , మా  గుళ్ళపల్లి బాబయ్య వచ్చినప్పుడో, ఏవైనా వ్రతాలు, తద్దినాలు లాంటి సమయాల్లో మట్టుకు మడి కట్టుకొని నిష్ఠగా చేసేది. తద్దినం రోజున   గారెలకు వచ్చిన రుచి మిగతా రోజుల్లో  రాదేమిటి అని కూడా అనుకొనే వారం.  పాపం అమాయకురాలు.  ధర్మ సూక్ష్మం తెలియక, మా అమ్మ ,   తద్దినం రోజున నాలుగు పచ్చళ్ళ తో గారెల  రుచి బాగానే ఉంటుందని అనేది.  

 సరే మా ఆవిడ  కానీ మా సోదరీ మణులు కానీ ఆలస్యం గా లేచేవారు.  మడి కట్టుకోవడం మాట అటుంచి, స్నానం చేసో చెయ్యకో, ఏదో విధం గా ఇంత చేసి పాడేస్తే తినిపోతాడు కదా మొగుడు అనుకుంటూ చేసేవారు. పైగా వంట చేసేటప్పుడు  సినిమా పాటలు పాడుకొనే వారు. పోనీ ఆ పాటలైనా ఈశ్వరా జగదీశ్వరా లాంటి వి కావు ఆ వెధవ పాటలు  ఆ తెలిసిందిలే  ఓర్నాయనో తెలిసిందిరోయ్”   టైపు పాటలన్నమాట.  

కాబట్టి ఇందుమూలం గా నేను కనుక్కొన్నది ఏమిటంటే  రుచి  అమ్మమ్మ చేసినట్టు ఉండాలంటే, అమ్మమ్మ లాగానే సూర్యోదయ పూర్వమే లేచి స్నానమాచరించి  శుచిగా మడి కట్టుకొని, పూజ చేసి,   శ్రద్దగా  భగవంతుని ధ్యానిస్తూ, చేసే పనిమీద  దృష్టి నిలిపి  వంట చేయాలి. 

 2. పదార్ధాలు :  ఇవి కూడా చాలా ముఖ్యం. పదార్ధాలు అంటే వంటకు ఉపయోగించే  కూరగాయలు, పప్పు దినుసులు, పోపు సామాను, ఉల్లి, పచ్చిమిర్చి ఇత్యాదులన్నీ . వీటన్నిటికి కూడా స్థాండ ర్డైజేషను చేయాలి. గుంజి పచ్చిమిర్చి కి పగోజి పచ్చిమిర్చికి  రుచిలోను కారం లోను తేడాలుంటాయి. ఒకటి తిన్న వెంటనే గూబ గుయ్యుమనిపిస్తే, రెండోది కొంచెం ఆలస్యంగా నషాలానికి కెక్కుతుంది. భీమవరం  లో దొరికే ఆనపకాయకి హైదరాబాద్ లో దొరికే దానికి తేడాలుంటాయి.  టివి లోడోర్నకల్ లోని, భామ చేసి  చూపించిన  వంకాయ కూర, బెజవాడ పడతి చేస్తే అదే రుచి రాదు. కిటుకు ఎక్కడుందో గ్రహించారు గదా. టివి లో వంటల విషయం లో ఇంకో ధర్మసూక్ష్మం కూడా పాటించాలి.  వంట చేసే ఆవిడ ఒకరైతే హడావడి చేసే అంకాళమ్మ ఏంకరమ్మ, ఒకత్తుంటుంది. ఆవిడ మధ్య మధ్య  ప్రశ్నలు అడుగుతుంది.

 మీ హస్బెండ్ మీకు వంటలో హెల్పుతాడా? హెల్పడా మీరు చేసిన కొత్త రకం  వంటలు  ఆయనే తింటాడా  లేక బలవంతం గా మీరు ఆయన నోట్లో కుక్కుతారా? తిన్న వెంటనే ఆయనే హాస్పిటల్ కి పరిగెడతాడా  లేక రెండు రోజుల తరువాత మీరే అంబులెన్స్ లో తీసుకెళతారా ?. 

 ఇటువంటి ప్రశ్నలకు జవాబు ఇచ్చేటప్పుడు కలిగే ఆనందోత్సాహాలు  కూడా వంటల రుచి ని మార్చేస్తాయి. ఆనందోద్రేకాలతో  ఆవిడ గరిట ఘట్టిగా తిప్పేయవచ్చు. అప్పుడు గిన్నెలో పదార్ధాలు బాగా కలిసిపోవచ్చు. లేకపోతె కలిసినవి విడిపోవచ్చు  కారం సరిగ్గా పట్టవచ్చు పట్టకపోవచ్చు .  అందుకని టివి వంటలు చేసేటప్పుడు మీ పక్కింటా విడను తోడు తెచ్చుకోండి.  కూరగాయలు ఆవూరు నుంచే తెప్పించుకోండి. అవే బ్రాండ్ పదార్ధాలు ఉపయోగించండి.

 ఒక్కొక్కప్పుడు  ఒంటి  మీద  బంగారం  కూడా  పిచ్చ కాన్ఫిడెన్స్  ఇస్తుంది.  తిన్న వాడికేమైనా మన భుక్తికి లోటు ఉండదు అనే నమ్మకం కలిగిస్తుంది  అన్నమాట.  ఉన్న నగలన్నీ పెట్టుకొని మొదలుపెట్టండి. 

 3.పరికరాలు:  మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు  ఇత్తడిగిన్నెల్లోనే వంట చేసేవారు. మా అమ్మగారు కూడా చాలా కాలం ఇత్తడిగిన్నెల్లోనే చేసేవారు. ఆ తరువాత పాత బట్టలకి స్టీలు సామాను వ్యాపారం మా ఊళ్ళో కూడా అభివృద్ధి  చెందిన తరువాత స్టీలు గిన్నెలు ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటినించి రుచి కొంచెం తగ్గిందేమో నని నా అనుమానం. మా ఆవిడ హయాము లో కుక్కర్లు , గ్యాస్ పొయ్యలు, మిక్సీ లు,   ఇత్యాదులు వచ్చి రుచులు ఇంకా తగ్గిపోయాయి.

 మినప రొట్టి కానీ కొయ్య రొట్టి కానీ ఇత్తడి సిబ్బెలో చేస్తే వచ్చే రుచి ఆహా అద్భుతం. ఆ రుచి మళ్ళీ ఇప్పటిదాకా నా జిహ్వకి రాలేదు. అది కూడా కుంపటి మీద చేస్తూ పైన ఇత్తడి పళ్ళెం మూతపెట్టి దానిమీద బొగ్గులు వేస్తే యమా యమా గా ఉండేది రుచి.  సారీ యమ్మి యమ్మి అనాలనుకుంటాను ఇప్పుడు.
  
మా అమ్మమ్మ గారు వంట మొదలు పెట్టినప్పుడు 4 కట్టెలు మండించేవారు కొంతసేపయిన తరువాత రెండు కట్టెలు తీసేసేవారు. మళ్ళీ ఇంకోటి పెట్టేవారు.   చివరికి వచ్చేటప్పటికి కట్టెలు తీసివేసి కట్టెలద్వారా వచ్చిన బొగ్గుల వేడితోటే చేసేవారు.

 Ph.D  చేద్దామని  వచ్చిన ఒక  తెలుగు  chemical engineer కి ఈ సమస్య ఇచ్చాను. రకరకాల గిన్నెలలో తెలుగు వంటలు, కట్టెలపొయ్యి, కుంపటి, గ్యాస్ స్టౌ ఉపయోగములలో heat transfer effects, ఉడుకుటలో తేడాలు, రుబ్బురోలు, మిక్సీ లో తేడాలు,    తద్వారా రుచిలో  మార్పులు.   పాపం విన్న వెంటనే పారిపోయాడు. కానీ నాకు ఘట్టి నమ్మకం ఒక్క దిబ్బరొట్టి తయారీ తోనే నాలుగు Ph.D లు సంపాయించవచ్చు అని.  

 మన తెలుగు సంస్కృతి అంతా తెలుగు వంటలలోనే ఉందని నమ్మినవాడిని. తెలుగు సంస్కృతి వర్ధిల్లాలంటే   తెలుగు వాళ్ళు అందరూ  మళ్ళీ,   ఇత్తడి గిన్నెలు,  రుబ్బురోలు,   కట్టెల   పొయ్యలు,      కుంపట్ల   తోటి వంటలు చేయాలని మనవి చేసుకుంటున్నాను.  కనీసం పండగలకి పబ్బాలకి అయినా అవి ఉపయోగించాలని, దీనికి విధిగా ఒక చట్టం చేయాలని ప్రభుత్వం వారిని డిమాండ్ చేస్తున్నాను.

 ముఖ్యమైన ప్రాధమిక సూత్రాలు పైన చెప్పాను. ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని case specific కూడా ఉన్నాయి. ఇవి అన్నీ వంటల తయారీ లో చెబుతాను.

 తరువాత టపా  ‘వంకాయ పప్పు కూర భళా’  తయారు చేయడం ఎలా? తొందరలోనే వ్రాస్తాను. అప్పటిదాకా సెలవ్. 

45 కామెంట్‌లు:

కృష్ణప్రియ చెప్పారు...

మొదట కొంత పార్ట్ త్వరగా బ్రవుజ్ చేసి.. వచ్చినా..మీ విశ్లేషణ కి మాత్రం.. గట్టిగానే నవ్వేసాను. నిజమే.. మనం పాడే పాటల ప్రభావం వంటల మీద.. ఉంటుందేమో..:)

అలాగే దిబ్బరొట్టే మీద phD లు ఎన్ని ఇచ్చారో తెలియదు.. నేనూ ఇంకోటి అప్లై చేస్తా.. మీరు గైడ్ చేస్తానని మాటివ్వండి చాలు...

Ennela చెప్పారు...

" తెలుగు వాళ్ళు అందరూ మళ్ళీ, ఇత్తడి గిన్నెలు, రుబ్బురోలు, కట్టెల పొయ్యలు, కుంపట్ల తోటి వంటలు చేయాలని మనవి చేసుకుంటున్నాను."
అయ్యా నాలుగు ఇత్తడి గిన్నెలు, ఒక రుబ్బురోలు, రెండు కట్టెల పొయ్యిలు, రెండు కుంపట్లు, ఒక టన్ను వంట చెరకు, ఒక బస్తా బొగ్గులు urgent gaa కేనడా కి పార్సెల్ చెయ్యగలరని భావిస్తున్నాను...ఇవన్నీ వెంటనే వాడదాం దానిదేముందీ.....ఫయరు డిపార్ట్మెంటు వాళ్ళకీ యేదో పని ఉండాలిగా...

Gopal చెప్పారు...

బాగుంది. బాగుంది. దీనికి ఇంకొకటి కలపండి.

దువ్వూరి వెంకట రమణగారు తమ జీవిత చరిత్రలో ఒక విషయం వ్రాసారు. వాళ్ల పిన్నిగారు వంటమొదలు పెట్టే ముందు ఆయన్ని కూరలు కోసుకు రమ్మనమని తరిమే వారుట. కూరలు మిగిలిపోతే ఆవులకు వేసేవారుట కాని మిగిలిన కూరలు మరురోజు వాడే వారు కాదుట.

ఇదే కాక హిందుస్తాన్ టైమ్స్ లో ఆదివారం నాడు వంటల స్పషల్ వస్తుంది. ఒక మగాయనే రాస్తాడు. ఆయన పారిస్ లో ఉన్న ఒక రెస్తోరా గురించి వ్రాస్తూ వాళ్లు బటానీలు కోసిన 6 గంటలలోగా వాడతారని, అందువల్ల స్పెషల్ రుచి వస్తుందిని వ్రాసారు.

దీని వల్ల తెలిసినదేమంటే తాజా కూరలు (వండడానికి 5-6 గంటలకన్నా ఎక్కువ ముందు కొయ్యనివి) చాలా రుచిగా ఉంటాయి. ఇది నా అనుభవం కూడా. పెరటిలో కూరలు కోసుకువచ్చి వెంటనే కూర వండితే ఆ రుచే వేరు.

సుజాత వేల్పూరి చెప్పారు...

ఇప్పుడు ఏమిటంటారు? ఒక రుబ్బు రోలు, నాలుగు ఇత్తడి గిన్నెలు,కుంపటి,ఒక కట్టెల పొయ్యి, ఒక మణుగు కట్టెలు కొనేసి, పొద్దున్నే స్నానమాచరించి పాండు రంగడు లోని బాలకృష్ణ భక్తి గీతాలు ఆలపిస్తూ వంట చేయమన్నారా?

టీవీలో వంటలకు వెళ్ళాలంటే ఇంకొన్ని పనులు కూడా చేయాలి ఆడ వాళ్ళు.

ఆ రోజే మన పెళ్ళి రోజేమో అన్నట్టు మోచేతుల దాకా వీలైతే భుజాల దాకా అరబిక్ గోరింటాకు డిజైన్లు పెట్టించుకోవాలి ముందు రోజే! ఇంట్లో ఉన్న ఎండి పోయిన నెయిల్ పాలిష్ అయినా సరే, తీసి గోళ్ళకు ముద్దలు ముద్దలు గా పట్టించాలి. అది మీ చీరెకు మాచ్ అయిందా లేదా పట్టించుకోవద్దు. చూసేవాళ్ళ ఖర్మ! పెళ్ళినాటి పట్టు చీరో, లేదా ఆరెస్ బ్రదర్స్ లో కొన్ని రాళ్ల చీరో(స్టోన్ వర్క్ చీర) ధరించి గలగల్లాడుతూ వండాలి.చేతుల నిండా రెండేసి డజన్ల గాజులు ధరించాలి.

అలవాటున్నా లేకపోయినా లిప్ స్టిక్ వేసుకోడం మరవొద్దు!

మధ్యలో చిట్కా అడుగుతారు యాంకరమ్మలు! అప్పుడు " బియ్యం లో నీళ్ళు పోసి స్టవ్ మీద పెడితే అన్నం అవుతుంది" అనో,

"ప్రయాణానికి ముందే బట్టలు సర్దుకుంటే ఇబ్బంది ఉండదు" అనో ఈజీ సలహాలు చెప్పాలి.

sai krishna alapati చెప్పారు...

అవును అండి ...రోట్లో నూరిన వంకాయ పచ్చడికి మిక్సి లో వేసిన వంకాయ పచ్చడి కి చాల తేడ ఉంటుంది ....ఉలవచారు/పప్పు బొగ్గుల పొయ్యిమీద చేస్తేనే రుచి ఉంటుంది ...ఇంకా మీ రాత గురుంచి ఎన్ని సార్లు చెప్పిన తక్కువే ...వంటల మీద మీ Phd అదరహో ..

స్వామి ( కేశవ ) చెప్పారు...

గుంజి పచ్చిమిర్చి కి పగోజి పచ్చిమిర్చికి రుచిలోను కారం లోను తేడాలుంటాయి. ఒకటి తిన్న వెంటనే గూబ గుయ్యుమనిపిస్తే, రెండోది కొంచెం ఆలస్యంగా నషాలానికి కెక్కుతుంది. భీమవరం లో దొరికే ఆనపకాయకి హైదరాబాద్ లో దొరికే దానికి తేడాలుంటాయి. టివి లో, డోర్నకల్ లోని, భామ చేసి చూపించిన వంకాయ కూర, బెజవాడ పడతి, చేస్తే అదే రుచి రాదు. కిటుకు ఎక్కడుందో గ్రహించారు గదా.

బులుసు గారూ ..
చాలా బాగా ఎనాలసిస్ చేసారు సార్ మీరు ..
ఇంత మంచి విషయం చెప్పినందుకు థాంక్యూ..
నాకు ఎప్పటిలానే మీ ఈ పోస్ట్ కూడా బాగా నచ్చింది సార్

(ఈ మద్య నా ఎక్స్పీరియన్సులో తెలుసుకున్న విషయం ..
ఎప్పుడైనా ఆకలేస్తే అన్నం పెడతా సాంగు కూర వండేప్పుడు వినిపిస్తే , ఆ రోజు వట్టి అన్నమే మిగిలింది అని అర్ధం . ఆ రోజు కూర ఉండదు . :) )

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఎంత రీసెర్చు చేశారు గురువు గారు :-) చేయవలసి వచ్చింది శిష్యా అంటారా :-))

అజ్ఞాత చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారు ,మీ రాత కి నా జోహార్లు !.
సుజాత గారు ,మీ కామెంట్ కి నా గావు కేకలు !
కేవ్వే కెవ్వు !

సత్యాన్వేషి చెప్పారు...

రుబ్బురోలు పిండిని మెత్తగా దంచితే వచ్చే రుచి మిక్సీ బ్లేడ్‌తో కట్ చేస్తే ఉండదని నాకు తెలిసిన కొందరు ఎలక్ట్రిక్ రుబ్బురోలును ఇండియా నుండి యూరొప్ తెచ్చుకున్నారు.

మా ఊర్లో దొరికే దోసకాయలకు, టమాటోలకు పులుపు ఎక్కువ. వాటితో పప్పు చేసినా, పచ్చడి చేసినా రుచి అదురుతుంది, హైదరాబాద్‌లో దొరికే టమాటోలు, దోసకాయలు పులుపుకు బదులు తియ్యగా ఉంటాయి, వాటిని వండుకునే బదులు ఉట్టినే తింటే బాగుంటాయి.

అజ్ఞాత చెప్పారు...

ఒక్కొక్కప్పుడు ఒంటి మీద బంగారం కూడా పిచ్చ కాన్ఫిడెన్స్ ఇస్తుంది.

kevvu kevvu

ఆ.సౌమ్య చెప్పారు...

ఒహో అయితే వెనక్కి తిరిగి నడవాలా? మీకు రుచి లేకపోయినా వచిన నష్టమేమీ లేదు...మేము ముందుకి తిరిగే నడుస్తామని ప్రభావతిగారు బల్లగుద్దీ మరీ చెప్పమన్నారు. :))

మీరు మొదటి భాగంలో రాసిన రిసెర్చి, కుర్ర ( అమ్మల, అయ్యల) గోల చదివాక మా యూనివర్సిటీలో జరిగిన కొన్ని అంఘటనలు గుర్తొచ్చి బలే నవ్వుకున్నాను. అక్కడ కూడా అచ్చు ఇలాగే జరుగుతుంది సైన్సులో రిసెర్చి.

మధురవాణి చెప్పారు...

హహహ్హహహా.. రీసెర్చ్ గురించీ, వంట గురించీ రెండూ ఎంత బాగా సెలవిచ్చారండీ.. నవ్వలేక చచ్చాను.. :D
సుజాత గారి కామెంట్ కి కూడా ఒక లైక్ పెడుతున్నా .. :)

సుజాత వేల్పూరి చెప్పారు...

మధురా, మనకి బజ్జులు బాగా అలవాటై బ్లాగుల్లో కూడా లైకులు పెడుతున్నాం!:-)) ( I did the same in some other blog)

మురళి చెప్పారు...

కాంతి వక్రీభవనం అని మా ప్రొఫెసర్ (అని ఆయన ఫీలింగ్) చెప్పినట్టు గ్నాపకం అండీ.. .. ఇకపోతే 'వంకాయ పప్పు కూర భళా' కొంచం ఆలస్యంగా రాసినా పర్లేదు కానీ, 'భార్య చేత రుచికరమైన వంట చేయించడం ఎలా?' అనే పోస్టుని, పతివ్రతా శిరోమణి ప్రభావతీ దేవి గారు ఊరినుంచి రాకముందే మీరు రాసేస్తే చాలామందికి ఉపయోగ పడుతుందని నా అనుమానం...

రాజ్ కుమార్ చెప్పారు...

హహా.. గురూజీ.. మొదటి సగం బావుంది.అనిపించిందీ
"ప్రాధమిక సూత్రాలు ముఖ్యమైనవి చూద్దాం. ".. ఇదిగో ఇక్కడి నుండీ మొదలయ్యిందిగా.. అద్దిరిపోయిందీ... ఒక్క మాటలో చెప్పాలీ అంటే.. అధ్బుతం అన్నమాట... నాకు నచ్చినవన్నీ చెప్పాలీ అంటే... సగానికి పైగా పోస్ట్ కాపీ చేసి పెట్టాలి.. మీ పోస్ట్ మళ్ళీ మీ చేత చదివించడం బాగోదనీ ఊరుకుంటున్నా..

జై గురువు గారూ... జై జై గురువుగారూ..
"వంకాయ పప్పు కూర భళా" కోసం వెయిటీంగ్ ఇక్కడా. ;)

రాజ్ కుమార్

జేబి - JB చెప్పారు...

పరికరాలు, పదార్ధాలు రుచిని మార్చేస్తాయని తెలుసునుగానీ ఆహ్యార్యముగూడ ముఖ్యమనే నిజాన్ని తెలియపరిచినందుకు గురువుగారికి బ్లాగోన్ముఖంగా వందనాలు.

మీరు మీ భాషను మార్చడం ఈ వ్యాసాన్ని కొంచెం చప్పగా మార్చినది. నేను చెపినది అర్థమవకపోతే, ఈ క్రింది భాగమునకు మిగిలిన వ్యాసమునకు తేడా గుర్తించుడు:

>>>>దుశ్శాసనుడు మోమును చిన్నది చేసుకొని ఆచార్య దేవా తప్పును మన్నించుడు. అని ప్రాధేయ పడెను. గురు దేవులు శాంతం వహించి, శిష్య పరమాణువులకు మార్గోపదేశము చేసి తను విశ్రాంత మందిరము నకేగెను. ఆపైన శిష్యొత్తములు విజృంభించి ఒక 5-6 ఏళ్ళు ఘోరముగా, క్రూరముగా అనేక రసములను విశ్లేషించి ఒక అర డజను పైగా Ph.D లు సంపాదించిన వారలైరి.

హరే కృష్ణ చెప్పారు...

తాలింపేసుకుందాం రా..అదిరింది గురూజీ :)

రత్న మాల చెప్పారు...

బలుసు గారు మీ టపా ఎప్పుడు వస్తుందా అని చూస్తే,మంచి టపానే వేసారు. ఎంత పెద్దగ ఉంది టపా ఆనుకున్నా,చదివితే అప్పుడే అయిపోయిందా .అనిపించింది .ఎంత నవ్వుకున్నమో.మావూరికి మా తాతల కాలంలో ఒక నానుడి ఉందండీ,ఏంటంటే తింటే దండగర్ర కందులే తినాలి .అని ఇప్పుడుఅన్ని వరి పొలాలే, లేదంటే ఆ కందులు మీకు పంపించేదాన్ని PHD చేసేవారో ,చేయపించేవారో కదా!

కొత్తావకాయ చెప్పారు...

ఎప్పటిలాగే యమా యమా గా ఉంది పోస్టు. ఇప్పుడు యమ్మి, యమ్మి అనాలి కాబోలు.
ఇంకా స్టీలు గిన్నెలెక్కడ స్వామీ! ఇప్పుడంతా ఫాబర్వేర్ ఇన్ ద మైక్రో వేవ్. మీరు చేయాలని చెప్పిన ఇత్తడి గిన్నెలు, రుబ్బురోలు చట్టం అతిక్రమించిన వాడికి శిక్ష ఎలా ఉండాలయ్యా అంటే, వరుసగా ఆరు రోజులు రోట్లో రుబ్బిన కంది పచ్చడి, భాండంలోంచి అప్పుడే తీసిన ఆవకాయ కారం అంచున వేసి కుంపటి మీద సన్నటి సెగపై మధ్యాన్నమంతా నిమ్మళంగా ఇత్తడి గిన్నెలో, చారెడు వేరుశనగనూనెతో ఉడికి ఎర్రగా అంచు కట్టిన దిబ్బరొట్టి బాదం ఆకుల విస్తట్లోనో, అడ్డాకు విస్తట్లోనో పెట్టి తినిపించి, కంచు గ్లాసుతో చల్లటి కుండ నీళ్ళు తాగించి, ఏడో రోజు మా ఫ్రెండు పెళ్ళాం చేత లో కేలరీ లెంటిల్ దోసె నాన్ స్టిక్ తావా మీద వేయించి పెట్టిస్తే సరి. దెబ్బకి దెయ్యం వదిలేస్తుంది.

"వంకాయ పప్పు కూర భళా" రాసే ముందు ఈ పోస్టు ఓ మాటు చదివి నా మనో భావాలను లెక్కలో వేసుకోవలసిందిగా మనవి. ఏది ఏమైనా భళా కోసం భలే ఎదురుచూస్తున్నాం.

http://kothavakaya.blogspot.com/2010/12/blog-post.html

మనసు పలికే చెప్పారు...

గురూ గారూ.. ఎన్ని సార్లు పలకా బలపం (ల్యాప్‌టాపూ మౌసూ) పట్టుకుని రమ్మంటారూ.? మీకేమేమొచ్చో అనీ ఒకేసారి చెప్పెయ్యంది.. అవన్నీ నేర్చేసుకోడానికి వచ్చేస్తా ఒకేసారి..;);)
అంటే మరి హిమాలయాల నుండి ఏలూరుకి ఊరికే బస్సులు పెట్టరు కదా అందుకనమాట:)))
మీ Ph.D. లు మాత్రం అద్భుతం అమోఘం.. మీ దగ్గర బోల్డంత విద్య నేర్చేసుకుని నేను ఆకుకూరల మీద చేస్తా Ph.D.;)

మీ శిష్యరికంలో ఆకుకూరల మీద అద్భుతమైన ప్రయోగాలు చేసి సగర్వంగా డాక్టరేట్ పుచ్చుకుంటా. అలా డాక్టరేటు పుచ్చుకునే ఆనందకర సమయంలో మైకు పుచ్చుకుని మీ గురించి లోకం నలుదిక్కులా వినపడేలా చెప్పి, మీ చేతుల మీదుగా డాక్టరేటు తీసుకుంటా;);)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కృష్ణ ప్రియ గార్కి,

నేనొకటి గమనించాను. ఆడవాళ్ళు ఒప్పుకోక పోవచ్చు. ఎవరినైనా భోజనానికి పిలుస్తే వంట బ్రహ్మాండం గా ఉంటుంది. చేసే వంట మీద శ్రద్ధ అని అనవచ్చా దాన్ని.
అప్లై చేసెయ్యండి వెంటనే.కనీసం మీ ఇంట్లో దిబ్బరొట్టెలు తినే భాగ్యం కలుగుతుంది నాకు. :))
ధన్యవాదాలు.

ఎన్నెల గార్కి,

మీరు కామెంటు పెడుతున్నారా ? లేక డిమాండ్ల లిస్ట్ పెడుతున్నారా ?
మీరు శలవులకి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయండి. భారత దేశం లో అంటే మన ఇండియా లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా అయిన తరువాతే వస్తారు కాబట్టి పక్కింట్లో ప్రాక్టీసు మొదలుపెట్టితే మనింట్లో తగు జాగ్రత్తలు తీసుకోవచ్చన్నమాట.
ధన్యవాదాలు

వేణుగోపాల్ గార్కి,

ధన్యవాదాలు. అవునండి తాజా కూరలు తో చేస్తే ఆ రుచే వేరు. వారం రోజులు ఫ్రిజ్ లో నిల్వ ఉంచి మధ్యలో రోజుకి నాల్గు గంటల పవర్ కట్ తో సహా , చేసి తినే వాళ్ళం మనం. ఏమిటో అవి తలచుకొని ఆనందించ వలసిందే.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సుజాత గార్కి,

>>ఇప్పుడు ఏమిటంటారు?
అయ్యబాబోయ్ ఏమి అనను. అంటే ఆ రుబ్బురోలు పొత్రము ఇటువైపు విసురు తారేమో నని భయం వేస్తోంది. అయినా బాలకృష్ణ పాండురంగడి పాటలు వింటూ వంట చేస్తే, నీ చేతి మాత్రా వైకుంఠ యాత్రా అనే అర్ధం.
మీ కామెంటు చూసినప్పటినించి ఆలోచిస్తున్నాను . ఓంకార్ యాంకర్ గా, మీరు టి‌వి వంటల ప్రోగ్రాము లో పాల్గొంటే ఎలా ఉంటుందా అని. ఆయన పారిపోతాడా లేక ఆయన్ని మీరు హాస్పిటల్ కి పంపుతారా? :))
ధన్యవాదాలు.

సాయి కృష్ణ ఆలపాటి గార్కి,

ధన్యవాదాలు. రుబ్బురోలు లో చేసిన వాటికి అంత రుచి ఎందుకు వస్తుందంటే ? కోటి రూపాయల ప్రశ్న.


స్వామి (కేశవ) గార్కి,

ఏమిటో అనుకున్నాను మీ అనుభవాలు కూడా గొప్పగానే ఉన్నాయి. ‘నరసింహ స్వామిని రా, నంజుకు తింటానురా’ టైప్ పాటలు వినిపించకండి మరి. :))
ధన్యవాదాలు

వేణూ శ్రీకాంత్ గార్కి,

ఒకప్పుడు మా ఇన్స్టిట్యూట్ కాలనీ లో సుమారు 10-11 తెలుగు కుటుంబాలు ఉండేవి. ప్రతి నెల ఒక ఆదివారం మగవాళ్ళ వంటల దినం అని పెట్టుకునే వాళ్ళం. ఒక ఇంట్లో చేసే వాళ్ళం వంట ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో సహా. కొత్త రుచి అని చెప్పి ఒక రోజు ఒక బీరు కాయ కుమ్మరించాము సాంబారులో. అప్పటినించి సాంబారు కానీ రసం కానీ చేస్తే కాపలా ఉండేవారు. అంత చెయ్యి తిరిగిన రీసెర్చ్ మాది. :))
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు. అవును, సుజాత గారి కామెంటు చాలా బాగుంది.

సత్యాన్వేషి గార్కి,

చాలా మంది మగవారి అభిప్రాయం కూడా అదే. కానీ పొద్దున్నే ఆఫీసు కెళ్ళేముందు కాళ్ళు జాపి రుబ్బురోలు ముందు కూర్చోలేము కదా.:))
అవునండి. ప్రాంతాలని బట్టి కూరగాయల రుచి మారుతుంది. ధన్యవాదాలు.

అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు.

ఆ. సౌమ్య గార్కి,

>>> మీకు రుచి లేకపోయినా వచిన నష్టమేమీ లేదు.
ఇందులో కొత్తగా మీరు చెప్పేదేముంది. అందరి మొగుళ్ళది అదే అనుభవం కదా. :))
యూనివర్సిటీ ల్లో, సైన్స్ అనే కాదు ఏ విభాగం లోనైనా అదే పరిస్థితి. నో డబ్బులు, నో ఫెసిలిటీస్, నో ఎక్విప్మెంట్. 2-3 ఇయర్స్ లో పూర్తి చేసే పని 4-5 ఏళ్ళు కూడా పట్టేసేది చాలా మాట్లు.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మధుర వాణి గార్కి,

రెండిటిలోనూ నేను ఎక్స్పెర్ట్ ననే అనుకుంటాను. కానీ బాసులు ఇద్దరూ ఒప్పుకోరు. :))
కామెంట్లకి కూడా లైక్ బటన్ పెడితే బాగుంటుందేమో.
ధన్యవాదాలు.

మురళి గార్కి,

మీ ప్రొఫెసరు గారు కరెక్టు. నేనే తప్పువ్రాశాను. నాకు తెలుగు సాంకేతిక పదాలు తో పరిచయం తక్కువ. ధన్యవాదాలు కరెక్ట్ చేసినందుకు.
శ్రీమన్నారాయణు డే ఆ విషయం తెలుసుకోవడానికి భూలోకంలో అవతారాలు ఎత్తేడుట. ఆయన వల్ల కానిది మన వల్ల అవుతుందా చెప్పండి. :)) ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

వేణూ రాం గార్కి,

మొదటి సగం ఇంగ్లీష్ లో ఆలోచించి తెలుగు లో వ్రాయడం జరిగింది. అసలు ఈ టపా మొదలుపెట్టింది ‘మా బాసు – నా తిరిగి పరిశోధన – 1’ అని. కానీ కొన్ని టెక్నికల్ టెర్మ్స్ తో ఇంగ్లీష్ లో పండిన హాస్యం తెలుగులో పేలవం గా అనిపించింది. ఆ పైన వరసగా రెండు మూడు రోజులు వంటల టి‌వి ప్రోగ్రామ్స్ చూడడం తటస్థించింది. శీర్షిక మారిపోయింది. దాంతోటి కొంచెం కలగా పులగం అయింది. వ్రాసేటప్పుడు ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఉండవలిసింది.
రెండవ భాగం నచ్చినందుకు ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జేబీ – JB గార్కి,

బహుశా , పైన చెప్పిన కారణాల వల్ల కొంత, బ్లాగు భాష ఉపయోగించడం కొంచెం ఎక్కువ అవడం వల్ల కొంత, టపా పేలవం గానే ఉంది అని నేను కూడా అనుకున్నాను. నాకు సంతృప్తి కలగని టపాల్లో ఇది ఒకటి. మరి ఎందుకు వెయ్యడం అంటే.....
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

హరే కృష్ణ గార్కి,

>>> తాలింపేసుకుందాం రా.
ఈ శీర్షిక కూడా బాగానే ఉంది. దీంతోటి కూడా ఒకటి వ్రాయాలి .
ధన్యవాదాలు.

రత్నమాల గార్కి,

ధన్యవాదాలు. దండగర్ర కందులు అనగా ఏమి? ఎప్పుడూ వినలేదు. విని ఉన్నా గుర్తు రావడం లేదు అన్నమాట.
ఒక బస్తాడు పంపించండి. ఒక Ph. D పంపిస్తాను. :))

కొత్తావకాయ గార్కి,
ధన్యవాదాలు. ఇక్కడ ఇంకా మైక్రో వేవ్ లు అంత గా వాడకంలో రాలేదు. దిబ్బరొట్టి నాకు పార్సిల్. కేలరీ దోస, కళ్ళు తుడుచుకుంటూ మీరు తినెయ్యండి. దిబ్బరొట్టి తినడానికైనా చట్టం అతిక్రమిస్తాను. :))
మీ టపా చదువుతాను. థాంక్యూ .

రత్న మాల చెప్పారు...

బలుసు గారు దండగర్ర అంటే మా ఊరు అప్పట్లో మా ఊరులో కందులు బాగా పండేవి.అందరు తింటే దండగర్ర కందులే తినాలి.అనే నానుడి ఉండేది .ఆ కందులు అంత రుచిగా ఉంటాయి.

నేస్తం చెప్పారు...

nice post

ఇత్తడి గిన్నెలు, రుబ్బురోలు, కట్టెల పొయ్యలు, కుంపట్ల తోటి వంటలు చేయాలని మనవి చేసుకుంటున్నాను

నేనూ ముహుర్తం పెట్టుకున్నానండి ...ఇండియా వెళ్ళగానే అమలు పరచాలి ఈ పని అని..కాకపోతె ఇత్తడి పాత్రలు బరువు :((

అజ్ఞాత చెప్పారు...

మా వారూ అప్పుడప్పుడూ ఇలా "తాజా కూరగాయలతో మడి కట్టుకుని ఇత్తడి గిన్నెల్లో వండొచ్చు గా" అని అడుగుతూ వుంటారండీ. దానికి నేనొక తిరుగు లేని మంత్రం కని పెట్టాను.
"అలాగే నండి! కానీ అందుకు ముందు మీరొక వారం రోజులు క్రమం తప్పకుండా ఉదయమూ సాయంత్రం సంధ్య వార్చుకొండి. ఒక రెండు సార్లు ఏకాదశి ఉపవాసం చేయండి. ఆఫీసుకు నొసటి పైన విభూతి రేఖలు ఉంచుకునే వెళ్ళండి. అప్పుడు నాకూ మూడొచ్చి మడి కట్టుకుని పప్పు వేయించి, కుంపటి మీద వొండి, వొడ్డించి
ఆఫీసుకెళ్ళి వొస్తాను," అన్నాను.
మళ్ళీ కుంపటి మాటెత్తితే వొట్టు!
శారద

ఆ.సౌమ్య చెప్పారు...

@sbmurali2007 (శారద)గారూ

fantastic...ఎంత బాగా చెప్పారండీ...నాకు బలే నచ్చింది మీ జవాబు. బులుసుగారూ విన్నారా? :D

తృష్ణ చెప్పారు...

టపాలో మీరు రాసిన "అందరి" లిస్ట్ లో నన్ను కలిపితే మాత్రం నేనొప్పుకోను. నా వంట ఫోటోలు చూడ్డానికే కాదు తినటానికి కూడా బాగుంటాయి. ఇది గొప్ప కాదు కాన్ఫిడెన్స్ అన్నమాట. ఇక మీరు "గుమ్మడికాయల దొంగ..." సామెత మాత్రం రాయకండి జవాబులో...:))))
అన్నట్లు మాష్టారూ, పతివ్రతా ఇస్త్రీలు మంచి వంట ఎలా చేయాలో చెప్పారు. బానేవుంది. మరి విధేయులైన భర్తలతో ఆ చేసిన రుచికరంగా వంటకాలను తినిపించటం ఎలానో కూడా శెలవివ్వాలి మరి !

Pavani చెప్పారు...

బులుసు గారు, బావుంది.

(శ్రీరమణ గారి "మిథునం" చదివారా?. ఆయన కొబ్బరి పచ్చడి గురించి చెప్పే తీరు నోరూరిస్తుంది, ముక్కుకి గుభాళింపు తగుల్తుంది. అలాగే మంతెన సత్యనారాయణరాజు గారు తినకూడనివాటి లిస్ట్ చెప్పేతీరు కూడా..వెళ్ళి వాటిని తొందరగా తినేసెయ్యలనిపించేట్టుగా ఉంటుంది)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ హ బులుసు గారు ఐతే బాగా చెయి తిరిగిన రీసెర్చ్ అనమాట :-)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,

ఆనంద సంతోషం తో అవాక్కైన గురువు గారు. వణుకుతున్న గొంతుతో, మహదానందం తో కన్నులనుండి కారుతున్న గ్లిజరిన్ నీళ్ళతో డాక్టోరేటు డిగ్రీ ప్రదానం చేస్తున్న దృశ్యం ఊహించుకొన్నాను.:))
నాకేమి తెలుసునో నేను తెలుసుకున్నాక చెబుతాను మీకు. అంతదాకా ఓపిక పట్టండి.
ధన్యవాదాలు.

రత్నమాల గార్కి,

మీ ఊరు పేరుతో ప్రసిద్ధి చెందినవా . అయితే ఆ రుచి మేము ఇప్పుడు మిస్ అయి పోయా మన్న మాట. ఏంచేస్తాం .
ధన్యవాదాలు.

నేస్తం గార్కి,

వెంటనే అమలుపరచండి. ఇత్తడి గిన్నెలు బరువంటారా? అండగా వెనక మీ వారుండగా మీకేల చింత ?
ధన్యవాదాలు.

(sbmurali2007) శారద గార్కి ,

అదేమిటండీ, ఉషోదయం లో సంధ్య కి , సంధ్యా సమయంలో ఉష కి వందనం చేయమంటున్నారా ? అబ్బే మరీ సత్యకాలం వారిలా ఉన్నారే మీరు. ఒక మాటు గుడికెళ్లి నేను విభూతి మొహం నిండా రాసుకొని వెళ్ళితే సాములోరు వచ్చారని మా ఆఫీసు లో అమ్మాయిలందరూ జాతకాలు చెప్పమని నా వెంట పడ్డారు. మీరంత ధైర్యం చేయకండి. :))
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆ. సౌమ్య గార్కి,

ఆ విన్నాం, విన్నాం. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి? నన్ను ఎవరు తిడతారా అని ఒక కన్ను ఇటువేసి ఉంటారా ?
ధన్య వాదాలు.

తృష్ణ గార్కి,

మీరు మంత్రించి, పచ్చగడ్డిని కూడా ఆవపెట్టిన పనసకాయ కూర లాగా చేయగల సమర్ధులని నాకు తెలుసు. అయితే గియితే .... ... దొంగని నేనే.
భర్తలు సాధారణం గా రెండు రకాలు. 1. విధేయులు 2. వీర విధేయులు. వీళ్లతో ప్రాబ్లం ఉండదు. అసాధారుణులు ఎవరైనా ఉంటే ఇదివరలో నేను సతీ ద్రౌపదీ పాకం లో వ్రాసినట్టు చేయమని చెప్పండి. :))
ధన్యవాదాలు.

పావని గార్కి,

చదివాను కానీ గుర్తు లేదు. నమ్మండి.
కొబ్బరి పచ్చడి అంటారా ముందుంటాను నేను. ఆరోగ్యానికి నాకు అసలు పడదు. :))
ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ గార్కి,

అవునండి, నమ్మకం కలగటం లేదా. మా ఊరు రండి. భెండాలుపొటల్ తినిపించేస్తాను. :))
ధన్యవాదాలు.

kiran చెప్పారు...

మొదట టపా చూసి..ఇంత పెద్దదా అనుకున్న....ఎలా అయిపోయిందో..హాయిగా నవ్వుకుంటూ పూర్తి చేసేస..:)
‘వంకాయ పప్పు కూర భళా' కోసం వెయిటింగ్..:)

హనుమంత రావు చెప్పారు...

మీ రీసెర్చీ వక్రీకరణాలు మా కందవుకానీ.... మీరువ్రాసిన వంటకు పూర్వరంగము...భేష్... రోజూ అనుకునే మాటే=ఆ రోజుల్లో అమ్మలూ అమ్మమ్మలూ చేసిన రుచులు ఇప్పుడు లేవని... నిజమే భగవన్నామస్మరణతో, శ్రద్ధతో చేసే వంట రుచే వేరు....స్నానం చేస్తే కాని వంటపొయ్యి వెలిగించకూడదనే సిద్ధాంతమిప్పుడు చెప్తే పెద్దరాద్ధాంత మవుతుంది...స్వాత్కర్ష అనుకోపోతే...అప్పుడప్పుడు నేను చేసినా, రోజూ ఆవిడ చేసినా మా ఇంట ఆ పాతపద్ధతే...అత్తగారిదగ్గరావిడ ట్రైనింగ్, ఆవిడ నాకు
డైరెక్షన్...ఈ పద్ధతి పాటిస్తే రుచులు పెరుగుతాయి .... అన్నట్టు దిబ్బరొట్టె వ్రాసారు కాని ఆ ఇత్తడి మూకుడులో చేసిన రొట్టెలో చెఱకు పానకం నంజుకోమని వ్రాయలేదేమండీ? ఇంకా చాలావున్నాయండి...తఱావాణి అన్నం+కొత్త ఆవకాయ+పప్పు నూనె; చద్దన్నంలో
మాగాయి ఊరుగాయ+కమ్మటి మీగడ: ఇలాంటి రుచులు బులుసువారి కలం అందిస్తుందేమో... అందరితోపాటు నేను వెయిటింగ్...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కిరణ్ గార్కి,

ధన్యవాదాలు. టపా సైజు మామూలే నండి. అక్షరాల సైజు పెరిగింది.:))


హనుమంత రావు గార్కి,

మరిచిపోయిన రుచులు మళ్ళీ గుర్తు చేస్తున్నారు మాష్టారూ. చెరుకు పానకం, దిబ్బ రొట్టి ఆహా జవాబ్ నహీ. తరవాణి ఇప్పుడు ఎక్కడా, ఎవరింట్లోను చూడలేదు. చాలా మందికి తరవాణి తయారు చెయ్యడం చేత కాదు. వేసవికాలం స్పెషల్ అది. మా చిన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉండేది. మీరు ఇంకా చేస్తుంటే రెసిపి నాకు పంపండి.
ధన్యవాదాలు.

SHANKAR.S చెప్పారు...

గురువు గారూ మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మీ పుట్టిన రోజు కూడా ఎప్పుడో చెబ్దురూ ప్లీజ్

Swathi చెప్పారు...

Mee Post lu chaala bagunnaayi. Entho navvisthunnaayi. nelaki 1 or 2 kakunda, vaaraaniki 1 or 2 meeru raayagalagaalani korukuntunnanu. thanks a lot for your blog.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శంకర్ గార్కి,

ధన్యవాదములు. కొంచెం ఆలస్యం గా స్పందించినందుకు క్షమించేయ్యండి. పుట్టిన రోజులు గుర్తు పెట్టుకునేంత చరిత్ర ఏమి లేదు సార్ నాకు. :))

స్వాతి గార్కి,

ధన్యవాదములు. ఇంతకన్నా ఎక్కువ వ్రాస్తే "మీ బ్లాగును త్వరగా మూసివేయాలి" అన్న డెమాండ్ మొదలవుతుందేమో నన్న భయం.

శ్రీధర్. దు చెప్పారు...

అయిపోయిన పెళ్ళికి బాజల్లగా ఇప్పుడు నా కామెంటు; చాల బావుంది మీ టపా,

అమ్మమ్మ చేసినట్టు ఉండాలంటే, అమ్మమ్మ లాగానే సూర్యోదయ పూర్వమే లేచి స్నానమాచరించి శుచిగా మడి కట్టుకొని, పూజ చేసి, శ్రద్దగా భగవంతుని ధ్యానిస్తూ, చేసే పనిమీద దృష్టి నిలిపి వంట చేయాలి.
అమ్మమ్మల కాలం వంటేమోగాని ఇప్పుడు తినేటప్పుడు మాత్రం భగవంతుణ్ణి ధ్యానిస్తూ తినాలి, లేకపోతె టీవీలో ఏదోఒకటి చూస్తూ నోటికి పని చెప్పాలి. [నా శ్రీమతి మీ బ్లాగు చదవట్లేదు అని నా నమ్మకం!!?]


పాలకొల్లులో మా మామయ్యగారు మారుతి టాకీసు పక్కన కాకా హోటలుకు కేవలం దిబ్బరొట్టెలు తినడానికి తీసుకెళ్ళేవారు. మీరు చెప్పినట్టే కుంపటి మీద, పళ్ళెం పైన బొగ్గులు వేసి కాల్చేవాడు. దిబ్బరొట్టె చెయ్యడంలో డాక్టరేటులేని స్కాలర్ అక్కడి వంటవాడు :-)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీ గార్కి,
ధన్యవాదాలు. ఇంట్లో వంట అలవాటు అయిపోతుంది లెండి. కొంత కాలం పోతే అదే బాగుందనుకుంటాము.:))

పాలకొల్లు కాకా హోటల్ పేరు చెప్పండి. ఎప్పుడైనా అలా వెళితే నేను కూడా రుచి చూసి వస్తాను.

శ్రీధర్. దు చెప్పారు...

హోటలు పేరు గుర్తులేదండి, అది మారుతి ధియేటర్ను ఆనుకొనే ఉంటుంది. ఈసారి చూసి చెబుతాను మీకు.

అజ్ఞాత చెప్పారు...

మీ రిసెర్చ్ నా బొందలా ఉంది. మైసూరుపాకం సాంబారులో నంచుకు తిన్నట్లు ఉంది.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీ గార్కి,

ధన్యవాదాలు.

అనానిమస్ గార్కి,

నా రీసెర్చ్ మీ బొందలా ఉందని మీరు కూడా కనిపెట్టేశారన్న మాట. ధన్యవాదాలు.