నాకే ఎందుకు ఇల్లా జరిగింది

గత 15 రోజుల నుంచి శరీరం లో ఏదో అయినట్టు అనిపిస్తోంది. ఏదో తేడా, ఇతమిద్ధమని చెప్పలేక పోతున్నాను. అన్నీ అవయవాలు సక్రమం గా పని చేస్తున్నాయని పించినా, చికాకు గా ఉండడం, నిరాసక్తత, విసుగు, శరీరానికి ఏమౌతోందో అన్న బెంగ,భయం పట్టుకుంది. ఈ బెంగతోనే ఇంకో నెల పైన గడిచిపోయింది.  పోనీ ఒక మాటు డాక్టర్ దగ్గరకు వెళ్ళి రండి అని మా ఆవిడ సలహా ఇచ్చింది. ఇటువంటి చెప్పుకోలేని రోగానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించాను. ఫిజిషియన్ దగ్గరికే వెళదామని నిర్ణయించుకున్నాను.

మా వీధిలోనే ఉన్న ఫిజియషన్ దగ్గరికెళ్లాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పదిమంది దాకా పేషంట్లు కూర్చున్నారు. ఆలస్యము అవుతుందేమో మరొకడి దగ్గరికి వెళదామను కుంటుంటే రిసెప్షనిస్టు  వచ్చింది. సరే ఇక్కడే కూచుని వైట్ చేద్దాం అనుకొని కూర్చున్నాను. ఒక 10 నిముషాల తరువాత రిసెప్షనిస్టు కొంచెం ఫ్రీ అయింతరువాత, ఆమె దగ్గరికి వెళ్ళి నా రోగ హిస్టరీ , జాగ్రఫీ చెప్పి, ఆవిడ అడగక పోయినా నా చరిత్ర, గొప్పదనం, అడ్రెస్ అన్నీ వివరం గా  ఒక 15 నిముషాలలో చెప్పి, రెండు నవ్వులు నవ్వి అక్కడే నుంచున్నాను ఆవిడను చూస్తూ. ఏమనుకుందో కానీ ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి వచ్చి నన్ను లోపలికి వెళ్లమంది.  వెళ్ళాను. డాక్టర్ బాబు నా కేసి  చూసి,  చెప్పండి  మీ సమస్య ఏమిటి అన్నాడు. నేను విపులం గా చెప్పాను. ఆయన   ఆశ్చర్యపడ్డాడ నిపించింది. కొంచెం సేపు ఆలోచించాడు. 15 ఏళ్లగా ప్రాక్టీసు చేస్తున్నాను. ఇటువంటి  మెడికల్  సమస్య ఎప్పుడూ వినలేదండీ అన్నాడు.  సరే బల్ల మీద పడుకోండి పరీక్ష చేస్తానన్నాడు. 

నేను బల్లమీద పడుకున్నాను. ఆయన స్టెత్ తో నా ఛాతీ మీద నాల్గు వైపులా నొక్కాడు. శ్రద్ధగా విన్నాడు. ఊపిరి పీల్చమన్నాడు. గాలి వదలమన్నాడు. ఎక్కడినించి అని అడిగాను.  పీల్చిన చోటునుండే మరోచోటనుండి కాదు అని కోప్పడ్డాడు.  వదిలాను. బోర్లా పడుకోమన్నాడు. కున్నాను. మళ్ళీ అదే అన్నాడు . నేను అదే చేశాను.  నా చేయి పట్టుకొని నాడి  చూశాడు. ఈ మాటు కాళ్ళు వేళాడదీసి బల్లమీద కూర్చోమన్నాడు. కూర్చున్నాను. నా కళ్ళ రెప్పలు విడతీసి కళ్లలోకి కళ్ళు పెట్టి చూశాడు. ఈ పని మీ రిసెప్షనిస్టు  చేస్తే బాగుంటుంది అన్నాను. నాకేసి కోపంగా  చూశాడు. నోరు తెరవండి అన్నాడు. కొండ గుహ లాగా నోరు తెరిచాను. నా నోట్లోకి లైట్ వేశాడు.  డాక్టర్ గారండోయ్ ఇందాక నా కళ్ల లోకి లైట్ వేయలేదండీ.   బాటరీ లైట్ లేదేమో అనుకున్నాను,  అన్నాను. నోరు మూసుకోండి అన్నాడు.  వెంటనే మూసుకున్నాను. ఈ నోరు కాదు, ఇది తెరవండి  అన్నాడు. మళ్ళీ నోరు తెరిచాను. నాలిక బైట పెట్టండి అన్నాడు.  పెట్టాను. మరీ  అమ్మ వారిలా అంతా బైటికి పెట్టఖ్ఖర్లేదు అన్నాడు. కొంచెం లోపలికి లాగుకున్నాను.  నోరు మూసేయ్యండి అన్నాడు.  సార్ నాలుక లోపలికి లాగి మూయమంటారా అని అడిగాను.   కోపంగా చూశాడు ఆయన. నేను నోరు మూసుకున్నాను.  ఓ చిన్న సుత్తి తీసుకొని , నా మోకాలి మీద, మోచేతి మీద, అరికాళ్లమీద కొట్టాడు. సార్  ముక్కు పిండి వసూలు చేసింది 150 మీ రిసెప్షనిస్టు ఇలా దెబ్బలు తినడానికా అన్నాను. 300 ఇవ్వండి కొంచెం మెత్తగా కొడతాను అన్నాడు. నేను మళ్ళీ నోరు మూసుకున్నాను. 

ఇలా వచ్చి కుర్చీలో కూచోండి  అన్నాడు తన సీటు లో కూలబడుతూ. కూర్చున్నాను. ఏంటి డాక్టర్ గారూ ఏమైంది నాకు అన్నాను. ఆయన  బహు దీర్ఘంగా నిట్టూర్చి ఏమో తెలియటం లేదు. కొన్ని పరీక్షలు చేయించుకోండి. మందులు కూడా వ్రాసిస్తా,  వాడండి అన్నాడు. మందులు వ్రాసేశారు కదా ఇంకా టెస్ట్ లు ఎందుకండి అన్నాను. రిపోర్టులు వచ్చిన తరువాత అవసరమైతే మందులు మారుస్తాం. పక్క వీధిలోనే ఉంది డయోగ్నాస్టిక్ క్లినిక్, అక్కడే చేయించుకోండి. మనవాడే కొంచెం చవకగా చేస్తాడు అన్నాడు.  మీరు ముందు కళ్ల డాక్టర్ దగ్గరికి కూడా  వెళ్ళి చూపించుకోండి.  పైనే ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళితే 125 కే చూస్తారు అని చెప్పాడు.  సరే అని బయటకు వచ్చాను. రిసెప్షనిస్టు దగ్గరికి వెళ్ళి,   డాక్టర్ గారు BP చూడడం మరిచిపోయారు. మీరు చూసి పెట్టండి అన్నాను. ఆవిడ నర్సు ని పిలిచింది. అబ్బే ఈవిడ చూస్తే చాలా high వచ్చేస్తుంది. మీరు చూడకూడదా అన్నాను. నర్సు నన్ను లాక్కెళ్లి చూసేసింది. BP యే లెండి.

కళ్ళోడి దగ్గరకు వెళ్లమన్నారు కదా అని మెట్లు ఎక్కి పైకి వెళ్ళాను. అక్కడ  రిసెప్షనిస్టు కూర్చున్నాడు. ముక్తసరిగా మూడు ముక్కల్లో  చెప్పాల్సింది  చెప్పేశాను.  వెళ్ళి డాక్టరు గారిని చూడండి అన్నాడు. అక్కడ ఓ నలుగురు కూర్చుని ఉన్నారు. కళ్ళు నలుపుకుంటూ. నేను రిసెప్షనిస్టు కేసి ప్రశ్నార్ధకం గా చూశాను. వాళ్ళ కంట్లో మందు వేశాం. ఇంకో గంట టైమ్ ఉంది వాళ్ళకి అన్నాడు. నేను లోపలికి వెళ్ళాను. డాక్టరమ్మ కుర్చీలో కూచునుంది. రండి కూర్చోండి అంది. నేను కడుంగడు ముదావహుడనైతిని. ఏమిటి మీ ప్రాబ్లం అని అడిగింది. నేను ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాను ఆవిడ కేసి చూస్తూనే. కింద డాక్టర్ చేసిన టెస్ట్స్, చేయించుకోమన్న టెస్ట్స్, మందులు అన్నీ వివరంగా చెప్పాను ఆవిడ కేసి చూస్తూనే.  ఆయన మా వారే అంది ముసి ముసి గా నవ్వుతూ. అదృష్టవంతుడు అన్నాను. ఆవిడ మళ్ళీ నవ్వింది. నా కన్నులు మెరిసాయి. కళ్ళలో మందు వేయించుకోండి ఆ తరువాత చూస్తాను అంది. లేదండీ,  మీరు ఇక్కడ ఉంటారని తెలియక రెండు నెలలక్రితం,  కళ్ళు  సైట్ కి టెస్ట్ చేయించుకున్నానండి, Dr. భూషణరావు ఐ క్లినిక్, ఇక్కడ కంప్యూటర్ తో కళ్ళు పరీక్ష చేయబడును అని కూడా వ్రాసి ఉందండి అని చెప్పాను. వాడు మా అన్నయ్యే నండి అంటూ మళ్ళీ నవ్వింది. మళ్ళీ నేను చిత్తయ్యాను.

అయితే రండి కంప్యూటర్ ముందు కూర్చోండి అంది. నేను అక్కడ ఒక కుర్చీలో కూర్చున్నాను. ఆవిడ ఆ మిషను వెనక్కాల కూర్చుంది. ఈ రింగ్ లోకి చూడండి లైట్ కేసి అంది. నా దృష్టి అక్కడ నిలవటం లేదు. ఆవిడ మీదకే పోతోంది. అల్లా కాదు ఇక్కడ తదేక దృష్టి తో చూడండి. మీ కళ్ళలో ఏముందో నేను చూడాలి కదా అంది. నా కళ్ళల్లో ఏముంటుంది లెండి ఎదురుగా మీరే ఉన్నారు కదా అన్నాను.  నాకళ్లలో బాటరీ వేసి చూడండి అని సలహా కూడా ఇచ్చాను.  శంకరం అని పిలిచింది ఆవిడ. రిసెప్షనిస్టు వచ్చాడు. ఈయన తల కదలకుండా పట్టుకో అంది. వాడు ఉడుం పట్టు పట్టేశాడు.  ఆవిడ పని ఆవిడ చేసేసింది. నేను మళ్ళీ ఆవిడ టేబల్ దగ్గర ఆవిడ ఎదురుగా కూర్చున్నాను. డాక్టరమ్మ గారూ రిటైర్ అయి పని పాడు లేకుండా ఉన్నాను మీ క్లినిక్  లో ఏదైనా పని ఇప్పించండి అన్నాను. ఇక్కడ ఏమి ఖాళీలు  లేవు అంది.  జీతం ఇవ్వఖ్ఖర్లేదు నా కాలక్షేపం కోసమే అన్నాను. కుదరదు అనేసింది. 

నాతో మాట్లాడుతూనే మందులు,  వ్రాసేసింది. ఈ మందులు నోట్లోకి, ఈ డ్రాప్స్ కంట్లోకి అని కూడా చెప్పింది.  మా వారు వ్రాసిన టెస్ట్స్ చేయించుకొని మళ్ళీ రండి అంది.  అసలు మీ సమస్య కంటిది కాకపోవచ్చు.  మీ కళ్ళు  చూడకూడనివి కూడా  చూసేస్తున్నాయి .  ఈ NT వోడిని చూడండి అని సలహా ఇచ్చింది.  NT వోడా ఆయనేందుకండి  అన్నాను.  NT వోడు  కాదు  ENT డాక్టరు. పక్క వీధిలో నే ఉంటాడు. మన డయాగ్నోస్టిక్ క్లినిక్  కి రెండు బిల్డింగ్స్ అవతల.  మనవాడే  వెళ్ళి చూపించుకోండి. అంది.  మా రెండు స్లిప్స్ చూపిస్తే 100 కే చూస్తాడు అని కూడా చెప్పింది. అవసరమా ఆయన దగ్గరికి వెళ్ళడం అని అడిగాను. కంటికి దగ్గరగా ఉన్న అవయవాలు ఏమిటి చెప్పండి అని అడిగింది. నేను తడుము కోకుండా ముక్కు, నోరు, చెవి అన్నాను. చూసారా దగ్గరగా ఉన్నవాటి కేమైనా అయితే అప్పుడు కంటి కేమైనా కావచ్చు  కాబట్టి చూపించుకోండి. అవి సరిగ్గా ఉంటే అదృష్టవంతులే  అని కూడా అంది. అంటే లేవా అని అడిగాను. అల్లాగే అనిపిస్తోంది మరి అంది.  సరే అయిన ఖర్చు ఎలాగా అయింది  ఈ NT వోడి దగ్గరకు కూడా వెళదాం అని అనుకున్నాను.

డయాగ్నాస్టిక్  క్లినిక్ లో రక్తం ధారపోసి, మలమూత్రాదులు దానం చేసి  ఈ NT వోడి దగ్గరకు వెళ్ళాను.  నేను వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరూ లేరు. ఒక పెద్దావిడ కౌంటర్ వెనక్కాల   కూర్చుని బఠాణీలు నములుతోంది. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి సంగ్రహం గా నా కధ చెప్పాను. ఆవిడ సెల్ ఫోను లో మాట్లాడింది. అల్లుడూ వెంటనే వచ్చేయ్యి పేషంటు వచ్చారు అని చెప్పింది. కాసిని బఠాణీలు నా చేతిలో వేసి ఇవి నములుతూ ఉండండి డాక్టర్ గారు వచ్చేస్తారు అని చెప్పింది. ఐదు నిముషాలలో డాక్టరు గారు వచ్చారు తెల్ల కోటు బొత్తాలు పెట్టుకుంటూ.  రండి అంటూ నన్ను తన రూమ్ లోకి తీసుకెళ్ళాడు.  

ఆయన వెనకే ఆయన రూమ్ లోకి వెళ్ళి నా కధ అంతా ఆయనకి చెప్పాను. ఆయన  ఇద్దరు డాక్టర్ల రిపోర్ట్ లు చూశారు.  I see అన్నారు. చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం గానే ఉంది అన్నారు.  అవునాండి అన్నాను. ఔను అన్నాడు ఆయన. నా దగ్గరకు వచ్చి నోరు తెరవండి అని చూశాడు. నా చెవి లోకి,  ముక్కు లోకి బాటరీ  లైట్ వేశాడు. నా గొంతు సవరించాడు తన చేతితో. మళ్ళీ ఐ సీ అన్నాడు. ఇప్పుడు కొన్ని టెస్ట్స్ చేస్తాను మీ ENT లు ఎలా పని చేస్తున్నాయో తెలుసు కోవడానికి. చెయ్యమంటారా అన్నాడు. అల్లాగే చెయ్యండి, 100 కట్టాను కదా అన్నాను. ఇంకొంచెం ఖర్చు అవుతుంది సుమారు 120-150 అన్నాడు. సరే కానివ్వండి. తప్పుతుందా అన్నాను. ఆయన నర్సు ని కేకేసి టెస్ట్ కి రెడీ చేయమన్నాడు. ఆవిడ గెంతుకుంటూ వెళ్లింది. ఈ టెస్ట్స్ మేము మన శాస్త్రాలు చదివి ఈ కాలానికి అనుగుణం గా డిజైన్ చేశాము అని చెప్పాడు. మేము ఆర్డర్ చేసిన ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు. అవి వచ్చేదాకా ఈ టెస్ట్స్ ఉపయోగించి కనిపెడతాము అని కూడా వివరించారు.  ఇంతలో నర్సు వచ్చి రెడీ అని చెప్పింది. పదండి టెస్ట్ రూమ్ లోకి అన్నాడు.

టెస్ట్ రూమ్ లోకి వెళ్ళేముందు నర్సు నా కళ్ళకి గంతలు కట్టింది. ఇదేమిటి అన్నాను. ఈ టెస్ట్స్ కి ఇది అవసరం అన్నాడు. నన్ను నర్సు నడిపించుకొని తీసుకెళ్లింది. స్పర్శ భాగ్యం  బాగానే ఉంది అనుకున్నాను. టెస్ట్ రూమ్ లోకి వెళ్ళిన తరువాత  డాక్టరు గారు చెప్పారు. ఇప్పుడు కొన్ని శబ్దాలు వినిపిస్తాము అవి ఏమిటో చెప్పాలి అన్నాడు. అల్లాగే అన్నాను నేను. రెడీ,  ప్లే అన్నాడు. చప్పుడు వినిపించింది. తబలా అన్నాను. వెరీ గుడ్, నెక్స్ట్ అన్నాడు. మళ్ళీ శబ్దం వినిపించింది. వీణ అన్నాను. గూడ్ అన్నాడు. మళ్ళీ వినిపించింది. గిటార్ అన్నాను. ఇంకోటి వినిపించింది. నాదస్వరం అన్నాను. మీ చెవి బ్రహ్మాండంగా పని చేస్తోంది అన్నాడు.

ఇప్పుడు మీకు కొన్ని వాసనలు చూపిస్తాం. అవి ఏమిటో చెప్పాలి అన్నాడు. అల్లాగే అన్నాను. నాకూ హుషారు వచ్చేసింది. ఇప్పుడు ఒక ఆడ గొంతుక మధురంగా వినిపించింది. మీరు గిన్నె మూత తీసి గిన్నెలో ముక్కు పెట్టకుండా పైనుంచి ఆఘ్రాణించి వాసన చెప్పాలి అంది. మీరెవరండి అని అడిగాను. ఆవిడ డాక్టరు గారి భార్య అని నర్సు చెప్పింది. ఇందాకా వాయించింది ఆవిడే. పిల్లలకి మ్యూజిక్, వంటలు నేర్పుతుంది అని కూడా చెప్పింది.    నన్ను మళ్ళీ నడిపించుకొని గిన్నె దగ్గరికి తీసుకెళ్ళింది. నేను మూత తీసి వాసన చూశాను. పప్పు పులుసు వాసన వేస్తోంది అన్నాను.  వెరీ గుడ్ అని డాక్టర్ గారి భార్య అంది. చాలామంది సాంబార్ అంటారండి అని అంది. ఆయ్ మనది పగోజీ అండి. అయినా ఏ గాడిద అన్నాడండి అల్లాగ, వేయించి ఉడకపెట్టిన కందిపప్పు, ధనియాల పొడి వాసనా మేళవించిన ఈ వాసన తెలియని వాడు అని నేను ఆశ్చర్య పడ్డాను. ఆవిడ కిసుక్కున నవ్వింది. డాక్టరు గారు కోపంగా పని చూడండి అన్నాడు. రెండో గిన్నె తీసి చూశాను.  పచ్చిమిర్చి అల్లం దట్టించి కొత్తిమీర వాసనలు వెదజల్లుతున్న వంకాయ కూర అన్నాను. సెభాష్ అంది ఆవిడ. ముక్కు బాగానే పని చేస్తున్నట్టుంది అని గొణిగాడు డాక్టరు. ఉండండి అని ఆవిడ నాదగ్గరగా వచ్చి నా జడలో ఏమి పూలు పెట్టు కున్నానో చెప్పండి అంది.  ఇంకొంచెం దగ్గరగా రండి అని ఆవిడ జడ వాసన చూశాను. సన్నజాజులు, మొగలిరేకులు, దవనం వాసనలు వేస్తున్నాయి అని చెప్పాను. ఓహ్ యు ఆర్ గ్రేట్ అంది  ఆవిడ అబ్బురంగా.  మీ ముక్కు కత్తిలాగా పని చేస్తోంది అని ఆవిడ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇప్పుడు కొన్ని రుచులు చూపిస్తాము. నాలుగు చుక్కలు మీ నాలిక మీద వేస్తాం. ఏమి రుచో మీరు చెప్పాలి అంది ఆవిడ. నర్సమ్మ నా తల వెనక్కి వంచి పట్టుకోగా శ్రీమతి డాక్టర్ నా నోట్లో నాలుగు చుక్కలు వేశారు. తేనె పాకం అన్నాను. గూడ్ అంది  ఆవిడ. ఇంకో గ్లాసుడు పోయ్యండి అని అడిగాను. తరువాత అంది. నర్సమ్మ నన్ను వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్ళితే నేను నీళ్ళు పుక్కిలించి వేశాను. రెండో మాటు మళ్ళీ నాలుగు చుక్కలు. ఇది ఉప్పు వేసిన చింతపండు రసం అన్నాను. గుడ్ అంది  ఆవిడ. మూడో మాటు నిమ్మరసం లో ఉల్లికారం అన్నాను. సుమారు  20 మందికి ఈ టెస్ట్స్ చేశాం. ఎవరూ ఇంత కరెక్టు గా చెప్పలేదండీ అని ఆవిడ చాలా ఆనంద పడిపోయింది. 

నర్సు నా కళ్ల గంతలు విప్పింది. ఆవిడను చూశాను. మీకూ  కళ్ల డాక్టర్ కి పోలికలు ఉన్నాయండి అన్నాను.  మా పిన్ని గారమ్మాయే నండి అంది.   మీ ENT అంతా బాగానే ఉంది అన్నాడు డాక్టర్. T కి టెస్ట్ ఏమి చేయలేదు కదా డాక్టర్ గారూ అన్నాను.  నాలుకకి గొంతు కు దగ్గర సంబంధమే,  నాలిక బాగుంటే గొంతు బాగున్నట్టే అని తేల్చి చెప్పాడు డాక్టర్. నేను కొంచెం అనుమానం గా చూశాను.  ఆయన ఘట్టిగా నా గొంతు పట్టుకొని  నొక్కాడు. నేను కళ్ళు తేలేసి , నాలుక బైట పడేశాను. చూసారా గొంతు నొక్కితే కళ్ళు, నాలిక లలో రియాక్షన్ వచ్చింది కదా అన్నాడు.  నాకు ఒప్పుకోక తప్పలేదు.

 మరి అన్నీ బాగుంటే నా సమస్య ఏమిటి అన్నాను. మీరు  నారాయణ, గుండారావు లను చూడండి అన్నాడు డాక్టర్. వీళ్ళేవరండి  అన్నాను. నారాయణ నరాల డాక్టర్, గుండారావు గుండె డాక్టర్  వాళ్ళు పై వీధిలో ఉంటారు. మనవాళ్లే  వెళ్లిరండి. మేం అందరం కలిసి చర్చించి   రోగ నిర్ధారణ చేస్తాం  అని చెప్పాడు.  నాకేం చెయ్యాలో తోచలేదు. రేపు చూస్తాను లెండి అని వచ్చేశాను. ఇంకా ఎంతమంది చుట్టూ తిరగాలో అని విచారించాను.

సాయం కాలం మా బాల్య మిత్రుడు  శంకరం వచ్చాడు మా ఇంటికి,   ఏంటిరా డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నావుట అంటూ.  చూసిన డాక్టర్లు ఎవరు చెప్పలేకపోయారు.  ఇంకో ఇద్దరు ని చూడమని సలహా ఇచ్చారు. ఈ ఇద్దరితో ఆగుతుందా ఇంకా ఎంతమంది డాక్టర్ లను చూడాలో, అంతా అయోమయం గా ఉంది అని విచారించాను. అసలు నీ సమస్య ఏమిటి? అని అడిగాడు వాడు. నలుగురికి చెప్పుకోలేని సమస్య రా అని బాధపడ్డాను. చెప్పు ఫరవాలేదు నేనెవరికి చెప్పను అని హామీ ఇచ్చాడు. సమస్య ఏమిటంటే మా పక్కింటి  లావుపాటి ఆవిడ ఉంది కదా.ఎవరూ రంగమ్మ గారా?  లిఫ్ట్ లోకి అడ్డంగా కానీ వెళ్లలేని ఆవిడా అన్నాడు. అవును ఆవిడే,  గత రెండు నెలలు గా ఇలియానా లాగా కనపడుతోందిరా ఆవిడ  అని చెప్పాను.                                

48 కామెంట్‌లు:

sarma చెప్పారు...

మొత్తం చమురు ఎంత వదుల్చుకున్నారు.జబ్బు ప్రమాదకరమైనదే

అజ్ఞాత చెప్పారు...

" రెండు నవ్వులు నవ్వి అక్కడే నుంచున్నాను ఆవిడను చూస్తూ."--- ఇంకోళ్ళని ఆడిపోసుకోడం కాదు! మరి మనం చేస్తున్న పనేమిటో? రిసెప్షనిస్టులని చూడ్డానికి వెళ్ళడం, మళ్ళీ దానికో చెక్ అప్ ఎని పేరెట్టడం ఓటీ ! కానీయండి మహాశయా! ఇప్పుడర్ధం అవుతోంది, ఏలూరెందుకు వెళ్ళారో.....

పద్మవల్లి చెప్పారు...

ఇలియానాలా కనిపిస్తుందీ.:-))
మేమేం అనలేదు, మళ్ళీ మమ్మల్ని అనొద్దు ఎప్పుడైనా ఇలియన పేరెత్తితే.

అజ్ఞాత చెప్పారు...

Maastaru..

Yeee Jabbuki virugudu naa daggara vunnadi.. Fees wire transfer cheesthee chepthaanu...

sunita చెప్పారు...

బులుసుగారూ రంగమ్మ గారొక్కరేనా, లావుపాటి వాళ్ళందరూ ఇల్లూ లాగా కనపడుతున్నారా:))ఇంతకీ కళ్ళజోడు మార్చారా:))

puri jagan చెప్పారు...

ayyo.. Iliyaana anta laavekkindaa maastaaru..ee madhya kalavalaeu tanani.

pradeep చెప్పారు...

"నేను కడుంగడు ముదావహుడనైతిని"
అమ్మ తోడు ... ఇది మాత్రం అర్థం కాలేదు :)

pradeep చెప్పారు...

"నేను కడుంగడు ముదావహుడనైతిని"
అమ్మ తోడు ... ఇది మాత్రం అర్థం కాలేదు :)

SHANKAR.S చెప్పారు...

అయ్యో గురూజీ అనవసరంగా అంత డబ్బు వేస్ట్ చేశారు. మీ ప్రాబ్లెం ఏంటో ప్రభావతి గారికి చెప్తే చిటికెలో ఇలియానా కూడా రంగమ్మ గారిలా కనిపించే ట్రీట్మెంట్ ఇచ్చేవారుగా.

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Srikanth Eadara చెప్పారు...

:))

కృష్ణప్రియ చెప్పారు...

@ harephala,

ఈ టపా చూశాక మీరు వచ్చి ఈ మాటంటారని అనుకున్నాను :)

@ SHANKAR.S,

LOL

ఆ.సౌమ్య చెప్పారు...

హిహిహి రంగమ్మ గారు ఇలియాన లా కనిపిస్తున్నారా? నేను మరో టెస్ట్ చేస్తాను, కరక్ట్ గా సమాధానం చెప్పండి. మరి ప్రభావతిగారు రంగమ్మలా కనిపిస్తున్నారా మీకు? జవాబు చెప్పాక జబ్బు డిసైడ్ చేస్తాను. ఆ తనా ఏ డాక్టరు ద్గ్గరకి వెళ్ళాలో కూడా చెబుతాను.

Sujata M చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కొత్త పాళీ చెప్పారు...

"రెండు నెలలు గా ఇలియానా లాగా కనపడుతోందిరా ఆవిడ"
ఘృతాచి అలిగింది. ఎలా ఓదారుస్తారో యేమో?

అజ్ఞాత చెప్పారు...

రెండు విధాలుగా మీ రోగం కుదర్చవచ్చు
1. ప్రభావతిగారు మిమ్మల్ని ఒక్కర్నీ వదిలి ఊరెళ్తే (పెళ్ళాం ఊరెళ్తే..)
అ. పక్కింటావిడ మీ ఇంటికి దేనికీ రాకూడదు (పంచదారక్కూడా, పరదార అయిపోయింది కదా ఆవిడ)
ఆ. మీరేసుకునే వయాగ్రా ప్రభావతి గారు కూడా పట్టుకెళ్ళాలి. లేకపోతే ఇలియనా మజాకా?
2. ఏలూరు నుంచి మకాం మార్చండి. వెళ్ళక వెళ్ళక ఏలూరు డాక్టర్ల దగ్గిరకే వెళ్ళారూ? మొత్తం ఊరంతా అదే బాపతు డాక్టర్లున్నారు. సీరియస్ గా చెప్పాలంటే ఒక పీడియాట్రీషియన్ ఆఖరికి ఆరు నెలల పిల్లాడికి డిస్టిల్లిడ్ వాటర్ ఇంజెక్షన్ చేసి (డబ్బుల కోసం) డబ్బులు గుంజడం నాకు బాగా తెలుసు. ఆ సూది మందు (నీళ్ళే అనుకోండి) పాపకి ఒక వారం దాక నెప్పి పెడతాయి (ట). ఇలాంటి డాక్టర్లందర్నీ పబ్లిక్ గా ఉరి తీసినా పాపం లేదు.
3. బొనస్: చుట్టా సిగరెట్టూ మానలేదా ఇంకా?

9thhouse.org చెప్పారు...

చాలా బాగుందండీ. Shallow Hal సినిమా చూశారా? వీలు కుదిరినప్పుడొకసారి చూడండి. అందులోనూ ఇదే పరిస్థితి.

అజ్ఞాత చెప్పారు...

నా మాట కూడా సుజాత గారి మాటే..
క్షమించండి ప్రత్యక్షంగా మీతో పరిచయం లేకున్నా మీ వ్యక్తిత్వాన్ని మీరు రాసే రాతల ద్వారానే అంచనా వేస్తాము కనుక, మీ మీద గౌరవం యాభై శాతానికి పడిపోయింది.

ఇంకా 'కిలకిలా' అని వ్యాఖ్యలు పెట్టిన వాళ్ళంతా ఇంతక ముందు మీ 'మంచి రాతలు' చదివినందువల్ల అన్నారే కాని, ఈ టపా తెగ నచ్చేసి కాదు అని కచ్చితంగా తెలుస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

Bulusu Gaaru,

Post bagundi. -ve comments pattinchukoknadi. Miru doctors ni apahasyam chesinatlu ledu nijamga, kondaru manushullo unna /jarugutunna vishayaale chepparu.

personal ga ma family ilanti situations chala face chesindi. Ikkade mandulu konandi ani cheppadam nundi minor problem ki kuda operation cheyyaledante chachipotharu ani cheppevaraku. And anni professions lo laagane ikkada kuda manchi chedda rendu untaru. Ilantivi pattinchukokandi, miru tarachuga rayatam apakandi.

Sujata M చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శర్మ గార్కి,

ధన్యవాదాలు. చమురు ఎంత వదిలినా ఆరోగ్యమే మహా భాగ్యము కదా.

హరేఫాల గార్కి,

ఎప్పుడు అవకాశం వస్తుందా అపార్ధం చేసుకోవటానికి అని ఎదురు చూస్తున్నారా మీరు. దొరికి పోయానా ? అయినా నీతులు చెప్పడానికే కానీ ఆచరించడానికి కాదు అని తెలియదా మీకు. ధన్యవాదాలు.

పద్మవల్లి గార్కి,

నవ్వండి. నవ్వండి. ఒక్క ఇలియానా నేనా, ఇంకొ రెండు పేర్లు కూడా గుర్తుకొస్తాయి మీకు. ధన్యవాదాలు.

అనానిమస్ గార్కి,

ఈ జబ్బు కూడా ఒక విధం గా బాగానే ఉందని అనుకుంటున్నాను. ఇంక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను. థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సునీత గార్కి,

ప్రస్తుతానికి రంగమ్మ గారోక్కరే. కళ్ళజోడు మార్చమని డాక్టర్ గారు చెప్పలేదండీ. ధన్యవాదాలు.

పూరి జగన్ గార్కి,

నా కళ్ళజోడు మీరు పెట్టుకొనే సమయం వచ్చిందేమో నని అనుమానం గా ఉంది. ధన్యవాదాలు.

ప్రదీప్ గార్కి,

అయ్యో అంత కంగారు పడి రెండు కామెంట్లు పెట్టేశారా ? మీరు మరీ నిలదీసి ప్రతి పదార్ధం చెప్పమంటే కష్టమే నండి. ఏదో వాడేస్తాం గుర్తుకొచ్చిన పదాలు. ధన్యవాదాలు.

శంకర్ గార్కి,

ప్రతిదీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లతానంటారు. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారా ఏమిటీ?
అయినా ఇలియానా రంగమ్మ గారిలా కన్పిస్తే మరో తమన్నా కోరుకుంటాము. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నీహారిక గార్కి,

లేచిపోదాం, లేచిపోదాం అని మీరనగానే లగెత్తుకొచ్చేయడానికి మీరేమన్నా ఘృతాచి నా , ఇలియానా నా, సిల్క్ స్మిత నా కనీసం రంగమ్మ గారా ? ఇదేదో తేలేదాకా నేను లేవడం కానీ పోవడం కానీ జరగదు. ధన్యవాదాలు.

శ్రీకాంత్ గార్కి,

ధన్యవాదాలు.

కృష్ణ ప్రియ గార్కి,

బాగుంది చాలా బాగుందండీ. నా బ్లాగు కొచ్చి, నా పోస్ట్ చూసి, కామెంట్లు చదివి హరేఫాల గారికి ఒక సెభాష్ , శంకర్ గారికి ఒక పొ. ప. న. ఇచ్చి వెళ్ళిపోయారు. నా సంగతేమిటి? కనీసం మీ ట్రేడ్ మార్కు, రెండు చుక్కలు ఒక బ్రాకెట్ కూడా నోచుకోలేదా నేను. ఏంచేస్తాం. ధన్యవాదాలు.

ఆ. సౌమ్య గార్కి,

మీరు కొత్త ఫిట్టింగ్ లు ఏమి పెట్టకండి. ప్రభావతి గారు ఎప్పుడూ దుర్గాదేవి లాగా కళకళ లాడుతూ కనిపిస్తుంది ప్రద్యుమ్నుడికి. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొత్తపాళీ గార్కి,

పాటల గంధి చిత్తమున పాటిలు కోప భరమ్ము తీర్ప ఏదో ఒక పాట పాడుకుంటాము సార్. తప్పుతుందా. ధన్యవాదాలు.

అనానిమస్ గార్కి,

నా రోగం కుదర్చడం కాదు నా కొంప కూల్చేటట్టున్నారు మీరు. .. దహా (దరహాసం)
డాక్టర్ లందరూ అల్లా లేరండీ. ఇంకా కొంత మంది సేవే ధర్మం గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ధన్యవాదాలు.

నాగ మురళి గార్కి,

ధన్యవాదాలు. ఆ సినిమా నేను చూడలేదండీ. దొరికితే చూస్తాను.

అజ్ఞాత గార్కి,

>>> మీ మీద గౌరవం యాభై శాతానికి పడిపోయింది.
నిర్మొహమాటం గా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు సంతోషిస్తున్నాను. మీ అంచనాలకి తగ్గట్టు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. కానీ ఒక విషయం మనవి చేసుకుంటాను. నేను సరదా గా వ్రాయడం మొదలు పెట్టి ఏణ్ణర్ధం కూడా కాలేదు. ఇంకా నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గార్కి,

సద్విమర్శ ఏదైనా ఆహ్వానింపదగ్గదే. మనని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అని నమ్ముతాను.
కార్పొరేట్ హాస్పిటల్స్ లో మెడికల్ ఎథిక్స్ , వాల్యూస్ తగ్గుతూనే ఉన్నాయి దురదృష్టవశాత్తూ. నాకూ అనుభవం లోకి వచ్చాయి. కానీ వృత్తే దైవంగా పనిచేసే వైద్యులు కూడా చాలా మందే ఉన్నారు. వారి సంఖ్య రోజు రోజు కి తగ్గుతొందేమో నని అనుమానం. ధన్యవాదాలు.

సుజాత గార్కి,

మీ అభిప్రాయం చెప్పినందుకు కృతజ్ఞతలు. మీలాంటి వారి అభిప్రాయాలు నా రచనలని మెరుగు పరుచు కోవడానికి ఉపయోగ పడతాయి. ధన్యవాదాలు.
డాక్టర్ల గురించి కూడా పైన జవాబుల్లో చెప్పాను నా అభిప్రాయం. మీరు డిలీట్ చేసిన కామెంట్లకు మీ అనుమతి లేకుండా జవాబు ఇచ్చాను. మన్నించండి.

రాజ్ కుమార్ చెప్పారు...

హహహ గురువు గారూ సూపరు.
నాకయితే జల్సా సినిమా లో సునీల్ -ధర్మవరపు సీన్ గుర్తొచ్చిందండీ.
బాగా నచ్చినవి రాయాలీ అంటే దాదాపు పోస్ట్ మొత్త రాసెయ్యాలేమో. కేక మాష్టారూ..

కృష్ణప్రియ చెప్పారు...

బులుసు వారికి,

అయ్యో! పోస్ట్ తర్వాత కామెంట్లు చదువుతూ,లక్ష్మీఫణి గారి మరియు శంకర్ గారి వ్యాఖ్యలని చూడగానే, ఇంకా నవ్వేసి (ఇంకా అన్నాను -- నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్!)

వారిద్దరి కోసం ఈ వ్యాఖ్య వదిలి, మీకోసం ఇంకోటి రాశాను.. మరేమైందో?

లేటయితేనేం? ఇప్పుడు మళ్లీ కామెంట్ పెడుతున్నాను..

ఎప్పట్లాగే.. :))) మొన్న చేతి మీద మరుగుతున్న నూనె పడి బొబ్బ కట్టింది. మా చెల్లిని డాక్టర్ దగ్గరికి దేనికో తీసుకెళ్లినప్పుడు ఆయన దీన్ని చూసి,.. ఫీజు వసూలు చేసి సూది తో పంక్చర్ చేసి రెండు క్రీం లు, నొప్పి ని భరించటానికి మాత్రలూ, ఆంటీ బయాటిక్స్ రాసి దాదాపు వెయ్యి బిల్ చేసాడు.

నేను ఒక క్రీం తప్ప ఏదీ కొనలేదు. మెడికల్ షాప్ అతను.. డాక్టర్ గారు కోప్పడతారు తీసుకోండి.. అని బెదిరించినా తీసుకుండా వచ్చేసాం.

rajasekhar Dasari చెప్పారు...

అనానిమస్ గారు , ఏలూరు పిల్లల వైద్యుల గురించి కూడా చాలా ఘోరంగా మాట్లాడారు , నేను ఏలూరులో మెడికల్ డెలిగేట్ గా పని చేసినపుడు ఒక డాక్టర్ దగ్గరకు ఒక దంపతులు 4 -6 నెలల వయసు ఉన్న బిడ్డను తెచ్చి వాడు ఎప్పుడు ఏడుస్తున్నాడు ఏదైనా టానిక్ రాసి ఇమ్మాన్నారు, వాడు ఆకలేసి ఏడుస్తున్నాడు టానిక్ లు కొనే డబ్బులతో వాడికి పాలు కొని తాగించండి అని ఫీజు కూడా తీసుకోలేదు . ఆ సాయంత్రం వాళ్ళు వేరే డాక్టర్ దగ్గర నాకు కనపడ్డారు ,ఆ డాక్టర్ వ్రాసిన టానిక్ లను దండిగా కొన్నారు . ఇది నిజంగా జరిగినది .
బులుసు సుబ్రహ్మణ్యం గారు 16 ఏళ్ళ వయసులో కోతిపిల్ల కూడా ఐశ్వర్య రాయ్ లాగా కనపడుతుందని విన్నాను, కన్నాను కాని 60 ఏళ్ళ తర్వాతా కూడ ఇలాంటి జబ్బు ఉంటదని ఇప్పుడే తెలుసుకున్నాను . ఎలానూ స్నేహితుడితో చెప్పుకున్నారుగా , ఇలాంటి జబ్బులకు డాక్టర్ లకంటే స్నేహితులే సరి ఐన మందు ఇస్తారు .

శశి కళ చెప్పారు...

ఆక్కడ..టీ.వి....లొ భీష్మ...ఇక్కడ మీ బ్లాగ్ లొ
నవ్వులు...యెలా?...మీరె గెలిచారు..హ..హ..

kosuru చెప్పారు...

Post chaala bagundi saar! ending matuke koncham weak ga anipinchindi

గిరీష్ చెప్పారు...

నాలుకను టెస్ట్ చేస్తే గొంతును చేసినట్లే అని వాళ్ళంటే మీరెందుకు నమ్మలేదు మాష్టారూ... :) పోనీలేండి ప్రమాదం తప్పింది.. సూపర్ టపా..

Raj చెప్పారు...

గురుజీ.. బిల్లు పేషంటు పేరు మీదే ఇమన్నారా??? :P

buddhamurali చెప్పారు...

రిసెప్షనిస్టు వచ్చింది. సరే ఇక్కడే కూచుని వైట్ చేద్దాం అనుకొని కూర్చున్నాను.
.................
వైట్ చేయడం అంటే ?( mari chesharaa ) ఇంతకు రిసెప్షనిస్టు ఆ పరిస్థితి ఏమిటో చెప్పలేదు.

అజ్ఞాత చెప్పారు...

బులుసు గారూ,
కేవలం మీ టపా చదివితే మాత్రం ఈ టపా మీ స్థాయికి తగినట్లు అనిపించలేదు. మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, అలాగే మీ సాహచర్యమూ లేదు. పైన అఙ్ఞాత అన్నట్లు మీ రాతల ద్వారానే మిమ్మల్ని అంచనా వేసుకోవటం. మీ వివరణ చదివిన తరువాత కాస్త సమాధానపడ్డా మీరెంచుకున్న శైలి మాత్రం ఏమాత్రం బాగాలేదు. అలా అనిపించటానికి బహుశా ఇంతకుముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలు కారణం కావచ్చు. నేను వయసులోనూ, అనుభవములోనూ మీ కన్నా చిన్నవాడిని. ఇరువురమూ మరొక్కసారి సరిచూసుకుందాం.

Sujata M చెప్పారు...

బులుసు గారూ

సోరీ. అన్నీ తొందరపాటు పన్లే చేసాను. కామెంట్ డిలీట్ చేసినందుకు కూడా క్షమించండి. వైద్యుల వ్యాపార ధోరణి .. గురించి జనం హెచ్చరిక లో వుండడం మంచిదే !

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వేణూరాం గార్కి,

ధన్యవాదాలు, ఈ టపా మీకు నచ్చినందుకు.

కృష్ణప్రియ గార్కి,

ధన్యవాదాలు. చూసారా కామెంటు అడుక్కొని మరీ రప్పించాను మిమ్మల్ని మళ్ళీ.... దహా .
ఆ డాక్టర్ గారు పేషంట్ల కే కాక తోడు వచ్చిన వారికి కూడా వైద్యం చేసేస్తాడన్నమాట.

రాజశేఖర్ దాసరి గార్కి,

అల్లాంటి డాక్టర్ లు, ఇలాంటి పేషంట్లు కూడా ఉన్నారు. ఆ రెండో రకం డాక్టర్లు ఎక్కువుగా ఉన్నారని సాధారణ అభిప్రాయం.

తలలు బోడులైన తలపులు కూడా బోడులై పోవాలా మాష్టారూ. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వానప్రస్థానాలకి వెళ్ళటం లేదు. అంతా తపస్సు లు చేసుకోవటం లేదు. ఈ కధలో పాత్ర కి అలాంటి ఊహ ఉండడం తప్పుకాదేమో అనుకున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీరందరూ తప్పు అంటే ఒప్పేసుకుంటాను. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శశికళ గార్కి,

ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు.

కోసూరు గార్కి,

ధన్యవాదాలు. 6 పేజీల బిల్డ్ అప్ చివరి వాక్యం కోసం. పండలేదంటారా?
4 పేజీలు సీరియస్ గా చివరి పేరా తోటి వ్రాసినది మొదటి డ్రాఫ్ట్. కుదరలేదు అనిపించింది. ఆ తరువాత మూడో డ్రాఫ్ట్ ఇది. బహుశా మిగతా ఏ పోస్ట్ కి ఇంత టైమ్ తీసుకోలేదు. ఇదే చీదేసింది. వ్రాయడం లో అనుభవా రాహిత్యం అనుకుంటాను. థాంక్యూ.

గిరీష్ గార్కి,

ఏమోనండి, పోగాలము దాపురించిన వారు .... సామెత ఉంది కదా. అందుకనేననుకుంటాను. ధన్యవాదాలు.

రాజ్ గార్కి,

ఇటువంటి రోగాలకి మెడికల్ కవరేజి ఉండదట. అందుకని బిల్ అవసరం లేదు లెండి. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బుద్ధా మురళి గార్కి,

వైట్ చేయడం కాలేదు కానీ బరువు తగ్గిపోయాడనుకుంటాను చివరికి . ధన్యవాదాలు.

ఆచంగ గార్కి,

మీ కామెంటు కి ఏ విధంగా స్పందించాలో తెలియటం లేదు. రచయిత వ్రాసే కధలని బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేసేటంతటి అనుభవం నాకు లేదు. రచయిత గా నేనింకా ఓనమాలు నేర్చుకుంటున్నాననే అనుకుంటున్నాను. ఇవి నేను సరదాగా కాలక్షేపం కోసం వ్రాసుకుంటున్న కధలు. కధలే. ఇందులో పాత్రల స్వభావాన్ని బట్టి నన్ను అంచనా వేయవద్దు అనే కోరుకుంటాను.

ఇందులో బహుశా నాల్గైదు వాక్యాలు నేను వ్రాసి ఉండకూడదు అని కొంతమంది అనుకుంటున్నారని నాకు అర్ధం అయింది. ఆ పాత్ర స్వభావానికి అవి అవసరమేమో ననుకొని నేను వ్రాసాను. తప్పయితే మన్నించండి.

సుజాత గార్కి,

ధన్యవాదాలు. మీ మొదటి వ్యాఖ్య చూసినప్పటినుంచి నేను ఆత్మ విమర్శ చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా సమాధానం దొరకలేదు. థాంక్యూ.

అజ్ఞాత చెప్పారు...

బులుసు గారూ,
ఇందులో మన్నింపుల ప్రస్తావన ఏమీ లేదండీ. కాకపోతే మనం నడిపించే కథనములో మనం ఒక పాత్రగా ఉన్నప్పుడు కేవలం అది కథకై రాసినా సరే పాఠకులు దాన్ని మనకే ఆపాదించి చదువుకుంటారు. ఇది బహుశా కాగితమ్మీద కలం పెట్టే ప్రతీ ఒక్కరికీ హెచ్చరికగా తీసుకుందాం. ఒక సంఘటనను లేదా సామాజిక సమస్య లేదా సాంఘిక ఘటనను మన ఆలోచనల ప్రభావం ఎమీ లేకుండా యదాతథంగా ఒక కథనం వ్రాస్తే దాన్ని మనం కథగా ఎంచలేము. అది ఒక పాత్రికేయ కథనం. అలాక్కాదు ఇది కథే అనుకుంటే అందులో రచయిత తన మనసులోని భావాల ప్రభావం తప్పకుండా సమాజానికి వెల్లడిచేస్తాడని నా నమ్మిక.

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

గత వారం నుంచి నీహారిక పేరు తో కొన్ని మగ వారికి మాంచి ఉత్సాహన్ని కలిగించే, కామేంట్లు మాలిక వ్యఖ్యలలో కనిపిస్తున్నాయి. వాటిన్ని చదువుతుంటే నాదేండ్ల పి. శర్మ,సీకోలు గుర్తుకొస్తున్నాడు. ఆమే పేరు తో ఎవరైనా ఫేక్ ఐ.డి. పేట్టుకొని రాస్తున్నారా?

అజ్ఞాత చెప్పారు...

హహహ ఏదేమైనా ఆవిడ కామెంట్స్ చూస్తుంటే చివరికి మీరు ఈ పోస్ట్ శీర్షిక లో పెట్టినట్లు "నాకే ఎందుకు ఇల్లా జరిగింది" అని తీరిగ్గా విచారించాల్సి వచ్చేలా ఉంది :-))))))

Pavani చెప్పారు...

.....బులుసు గారు, తొందరపడి కొన్ని పోస్ట్ లకు సమాధానాలివ్వకండి. సరసాలు ఇక చాలు :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆచంగ గార్కి,

ధన్యవాదాలు. ఆలోచించ వలసిన విషయం చెప్పారు.

నీహారిక గార్కి,

నాకేమో సప్తపది సినిమాలో ,
అయిగిరి నందిని నందిత మోహిని, విశ్వ వినోదిని నంది నుతే
...............................
జయజయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
గుర్తుకు వస్తోంది. ధన్యవాదాలు.

అనానిమస్ గార్కి,
అనానిమస్ గార్కి,
పావని గార్కి,

అందరికీ ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఈ టపాలో ఇంక కామెంట్స్ పబ్లిష్ చేయను. థాంక్యూ ఆల్.

Country Fellow చెప్పారు...

ఐబాబోయ్, మిస్టర్ బీన్ లాగా సూపర్ రాశారండీ బాబూ :)

hari.S.babu చెప్పారు...

ఊపిరి పీల్చమన్నాడు. గాలి వదలమన్నాడు. ఎక్కడినించి అని అడిగాను. పీల్చిన చోటునుండే మరోచోటనుండి కాదు అని కోప్పడ్డాడు. వదిలాను.

--

సార్! యేంటి సార్ ఇది!! పాతళ భైరవి లో రేలంగి "చెవులు పట్టుకో" అనగానే "నావా?" అన్నంత గొప్పగా పేల్చారుగా.

hari.S.babu చెప్పారు...

ఊపిరి పీల్చమన్నాడు. గాలి వదలమన్నాడు. ఎక్కడినించి అని అడిగాను. పీల్చిన చోటునుండే మరోచోటనుండి కాదు అని కోప్పడ్డాడు. వదిలాను.
---
సార్! యేంటి సార్ ఇది!! పాతళ భైరవి లో రేలంగి "చెవులు పట్టుకో" అనగానే "నావా?" అన్నంత గొప్పగా పేల్చారుగా.