విజయవాడ లో బ్లాగర్స్ సమావేశం - పుస్తక ప్రదర్శన సందర్శనం

నూతన సంవత్సరం, జనవరి 8 వ తారీఖున విజయవాడ లో బ్లాగర్స్ సమావేశము నిర్వహించుటకునున్నూ, శ్రీ రహ్మానుద్దీన్ షేక్ గారిచే వికిపీడియా గురించి, బ్లాగు లు ఎలా మొదలుపెట్టాలి, ఎలా నిర్వహించాలి అనియున్నూ అన్న విషయములపై ఉపన్యాస మిప్పించుటకు నున్నూ సకల సన్నాహములు చేసితిమి కాన తమరెల్లరును విచ్చేసి సభను జయప్రదం చేసి మమ్ము నానంద పరచవలిసింది గా కోరుచున్నాము అని శ్రీ ఆత్రేయ గారు (లిపి లేని భాష బ్లాగు) , బ్లాగులోనూ,  శ్రీ రహ్మానుద్దీన్ గారు  మైల్ లోనూ బొట్టు పెట్టకుండా పిలిచినందున, తోటి బ్లాగర్స్ ను కలిసి పరిచయ భాగ్యం కలిగించుకొనుటకు, ఆపైన విజయవాడ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన ను మదీయ పాద ధూళి చే పావన మొనర్చుట కున్నూ సంకల్పించిన వాడ నైతిని. సరే, మన నిర్ణయాలు హై కమాండు వారికి వారి అనుమతి కొరకు నివేదించితిని. షరతులతో కూడిన ఆమోదము నిచ్చిరి.

ఒక రోజు ముందరే ఎందుకైనా మంచిదని, ముందు జాగ్రత్త గా  ఒక అరగంట ఆలస్యం గా వస్తానని శ్రీ రహ్మాన్ గారి వద్ద పర్మిషన్ తీసుకున్నాను . పర్మిషన్ తీసుకొన్నా , వారి నాశ్చర్య చకితులను చేయు దురుద్దేశం తో ఆదివారం ఉదయం 8-30 గంటలకు ఏలూరు కొత్త బస్ స్టాండ్ నకు చేరుకున్నాను. అయ్యో తాతగారూ,  ఇప్పుడే 3-4 నిముషాల కింద ఒక బస్ వెళ్లిందండి అని విచారం వెలిబుచ్చి ఇంకో పావుగంటలో మరొకటి వచ్చును కాన చింతించవలదు అని ఆశ్వాసము నిచ్చారు RTC వారు. సరే అని చేయుటకు నేమీ లేక సిగరెట్టు వెలిగించాను. (హెచ్చెరిక: సిగరెట్టు కాల్చుట హానికరము, కాల్చువారికి, వారి చుట్టుపక్కల నున్న వారికి కూడా. కాన కలకాలము బతుక దల్చిన వారు కాల్చు వారి చుట్టుపక్కల నుండుట శ్రేయస్కరము కాదు). మూడవ సిగరెట్టు పాడువేయు సమయమునకు డీలక్స్ బస్ వచ్చింది. ఎక్కి కూచున్నాను. ఇంకో పది నిముషాలలో బయల్దేరింది,  సుమారు  10 నిముషాలు తక్కువ 9 గంటలకు. ఆహా! అన్న టైమ్ కు ముందుగానే చేరుదును గదా అని సంతోషించాను. బయల్దేరిన 15-20 నిముషాలలో బస్ ఆగింది. డ్రైవరు గారు ఆహా అనిరి, ఓహో అనిరి, ఐ సీ అని కూడా అన్నారు. ఈ బస్ ముందునకు వెళ్ళుటకు ఇంజను సహకరించుట లేదు అని సెలవిచ్చారు.  మరేం ఫరవాలేదు, వెంటనే ఇంకో బస్ పంపిస్తారు,  మీరు నిశ్చింత గా ఉండండి అని నమ్మకం గా చెప్పారు.

బస్ దిగాను. కొద్ది దూరం లో ఒక టీ కొట్టు కనిపించింది. ఒక టీ తాగుతూ  ఒక సిగరెట్టు పీల్చి, చేయునదేమీ లేక  ఇంకొక సిగరెట్టు కాలుస్తూ మరొక టీ సేవించి, ఎదురుగా నున్న పొలమునకు కొద్దిగా నీరు పట్టి, మరొక సిగరెట్టు తగలేస్తూ  ఇంకా ఎన్ని టీలు తాగవలనో నని చింతించు చుండగా దూరము గా బస్ కనిపించినది. వచ్చిన బస్ నెక్కి కూర్చున్నాను. చాలా మంది ఎక్కేశారు. అప్పుడు ఒక వీర వెంకట సత్యన్నారాయణ నృసింహ స్వామి గారు ఠాట్ అన్నారు. వాట్ ఈస్ దిస్ అన్నారు. మనం ఎక్కిన బస్ ఏమిటి? ఇప్పుడు వచ్చిన బస్ ఏమిటి? కుదరదు అన్నారు. వారి శిష్యులు వెంటనే అవును,  మనం బస్ స్టాండ్ లో ఎక్కినది డీలక్స్ బస్ ఇప్పుడు వచ్చినది ఎక్స్ప్రెస్  బస్.  రెంటికీ మధ్య బస్ చార్జి లో 5 రూపాయల తేడా.  RTC  వారు తేడా డబ్బులు ఇవ్వాలి లేదా డీలక్స్ బస్ పంపాలి అని ఘట్టిగా అన్నారు.  కొద్ది సేపు వాదోపవాదముల తరువాత బస్ బయల్దేరింది. శ్రీ వీ.వెం.స.నృ.స్వా. గారు నా పక్క సీటులో కూర్చున్నారు.  నా కేసి చూసి నిరసన గా నవ్వారు. మీలాంటి వారు  ప్రొటెస్ట్ చేయటం లేదండీ. అసలు మీ  లాంటి వారి వల్లే ఈ దేశం ఇలా తగులడి పోతోంది అని వ్రాక్కుచ్చారు. నేను నిశ్శబ్దమును వరించాను.

అవరోధముల నధిగమించి, విజయవాడ బ్లాగర్స్ సమావేశ సభా ప్రాంగణమునకు నేను చేరునప్పటికి 10- 40 అయింది. అప్పటికే 12 మంది అక్కడ ఉన్నారు. అందరికీ తలో నమస్కార బాణం వేసి, పరిచయం చేసుకొని ఉచితాసనము నలంకరించాను. లిపిలేని భాష బ్లాగు శ్రీ ఆత్రేయ గారు,  బాబు కార్టూన్స్ బ్లాగు శ్రీ దుర్గా ప్రసాద్  గారు, 64 కళలు బ్లాగు కళాసాగర్ గారు, అక్షర మోహనం బ్లాగు మోహన రాం ప్రసాద్ గారు  ఇంకా కొంతమంది బ్లాగర్స్ ని  పరిచయం చేసుకున్నాను.   మెల్ల మెల్లగా  ఇంకొంతమంది వచ్చారు. శ్రీ  ఆత్రేయగారు టీలు,  స్నాక్స్ తెప్పించారు. ముదమార తిని, తాగాము. సుమారు 20 మంది చేరిన తరువాత  పరస్పర పరిచయ ఉపన్యాసముల తరువాత 10 గంటలకు మొదలవాల్సిన  కార్యక్రమం  11-30 కి  మొదలయింది.

శ్రీ రహ్మాన్ గారు చెడుగుడు ఆడేశారు, వికిపీడియా వికిపీడియా అంటూ. వికిపీడియా గురించి వివరించి, మనమందరం దాని అభివృద్ధికి  ఏమి,  ఎలా చెయ్యాలో విశదీకరించారు. మీరందరూ వికిపీడియా లో తగు పాత్ర పోషించాలని ఉద్భోదించారు. వికిపీడియా గురించి కొంత చర్చా కార్యక్రమం జరిగింది. ఆ తరువాత శ్రీ రహ్మాన్ గారు బ్లాగు బహు  బ్లాగు అంటూ కబాడీ మొదలు పెట్టారు. రహ్మాన్ గారి చెడుగుడు కార్యక్రమం జరుగుతుండగా మరి కొంత మంది బ్లాగర్స్ వచ్చారు.

నేను అభ్యంతర కార్యక్రమ నిర్వహణకై బయటకు వెళ్ళాను. అప్పుడే శ్రీ P.శ్రీకాంత్ (నవ్వులాట బ్లాగు) గారి దర్శన, పరిచయ భాగ్యాలు కలిగాయి. కొంచెం సేపు నవ్వుకోలు కబుర్లు చెప్పుకున్నాము. ఒకే ఈకలు గల పక్షుల మగుట చేత (Birds of the same feather, హాస్యం) త్వరగానే కలిసిపోయా మనిపించింది. వారు ఎంత చక్కటి జోకులు వ్రాస్తారో అంతకన్నా ఎక్కువ చక్కగా మాట్లాడుతారు. ఆ సమయం లోనే  పాక వేదం బ్లాగు Dr.కౌటిల్య గారు విజయం చేశారు. మరికొంతసేపు ముచ్చటించుకొన్న తరువాత మళ్ళీ సభాప్రాంగణమునకు చేరితిమి.

బ్లాగులమీద చర్చా కార్యక్రమం జరుగుతోంది. కొంతమంది ఔత్సాహికులు బ్లాగు మొదలుపెట్టు సదుద్దేశం తో ప్రశ్న ల బాణాలు వేస్తుంటే రహ్మాన్ గారు చతురతతో సమాధానం ఇస్తున్నారు. వారి ప్రశ్నలకి వీరు అలిసిపోయారో,  వీరి సమాధానాలకు వారు సంతసించారో తెలియదు కాని సమావేశం ముగిసింది అని ప్రకటించారు. ఒంటిగంట దాటిందనుకుంటాను. ఆ వెనువెంటనే ఫోటో సెషన్ మొదలయింది. నకులుడు వాన చినుకుల మధ్యనుంచి గుర్రపు స్వారీ చేసే వాడట అని విన్నాను. నేను కూడా నకులుడి ని ఫాలో అయ్యి,  ఒక్క ఫోటో కూడా మిస్ కాకుండా అందరి ఫొటోల్లోనూ ఢాం ఢాం అంటూ పడిపోయాను. అన్నట్టు వనజా వనమాలి గారు కూడా మధ్యలో వచ్చారు. వారి పరిచయభాగ్యం కూడా కలిగింది. మధ్యలో అత్యవసర కారణాల వల్ల కొంతమంది వెళ్ళిపోయారు. ఫోటో సెషన్ సమాప్తం అయే టప్పటికి సుమారు ఒక ఇరవై  మంది దాకా ఉన్నారు. సభ గ్రాండ్ సక్సెస్ అయింది అనుకున్నాము.

ఈ సభ ఇంత బాగా నిర్వహించినందుకు శ్రీ ఆత్రేయ గారిని, వికీపీడియా గురించి, బ్లాగుల గురించి ఎన్నో విషయాలు అందరికీ అర్ధం అయేటట్టు గా చెప్పిన ఉపన్యాస కేసరి శ్రీ రహ్మానుద్దీన్ షేక్  గారిని  అభినందిస్తున్నాను.  ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.  అల్లాగే ఎంతో ఉత్సాహం గా పోల్గొన్న తోటి బ్లాగర్స్ కి, కాబోయే బ్లాగర్స్ కి, సభలో పాల్గొన్న మిగతా వారికి  కూడా  అభినందనలు, ధన్యవాదాలు.  (నాకు నేను చెప్పుకోవడం బాగుండదు కాబట్టి కామెంట్లలో మీరు చెప్పేయండి).

సభ అయిపోయింది. భోజనం ఎవరు పెట్టిస్తారా అని చూస్తున్నాను. ఇంతలో కౌటిల్య గారూ, రహ్మాన్ గారూ తరువాతి ప్రోగ్రామ్ ఏమిటి గురువుగారూ అన్నారు.  శిష్యులారా భోజనమొనర్చి పుస్తక ప్రదర్శనకేగుదము అని అన్నాను .  పుస్తక ప్రదర్శన కు దగ్గరగా ఉన్న రామయ్య హోటల్ కి వెళ్ళాం. శ్రీ రహ్మాన్ బిల్ కట్టడానికి ఉద్యుక్తుడయ్యారు. నేను కూడా మొహమాటానికి,  “నేను ఇస్తాను లెండి”  అని అతని జేబులో పర్సు తీయబోయాను. పరవాలేదు లెండి,  నా పర్సు లోది నేనే ఇస్తాను లెండి అన్నారు. సరే అతని పర్సు లోని రొఖ్ఖం అతను తీయడమే ధర్మం అని ఉరుకున్నాను. అన్నదాతా రహ్మాన్ సుఖీభవా అన్నాను. 

భోజనం చేసి  పుస్తక ప్రదర్శన కేగి కినేగే స్టాల్ లో ఒక పదినిముషాలు భుక్తాయాసం తీర్చుకొని పుస్తకాలు చూడడానికి వెళ్లాము నేను,  కౌటిల్య గారు. రహ్మాన్ గారు కినిగే స్టాల్ లో ఉండిపోయారు.  నేను ప్రదర్శనకు వచ్చేముందు ఫలానా పుస్తకాలు కొందామని అనుకోలేదు. ఏదైనా కనిపిస్తే నచ్చితే కొందాములే అనే అనుకున్నాను. కాబట్టి ఏదైనా పుస్తకం కోసం వెతకడం అనే కార్యక్రమం లేదు.

ప్రదర్శన లో సుమారు 300 పైన స్టాల్సు ఉన్నాయి. హైదరాబాద్ లో పుస్తక ప్రదర్శన చూసి కూడా మూడేళ్లు దాటింది. గుర్తున్నంత వరకు నాకు హైదరాబాద్ కన్నా  విజయవాడ ప్రదర్శన బెటర్ ఆర్గనైజ్డ్ అని అనిపించింది. విశాలమైన ప్రాంగణం లో ప్రదర్శన పెట్టడం వల్ల ఇరుకుగా, ఇంకన్వీనియంట్ గా అనిపించలేదు. ఆదివారం కావటం వల్ల జనం ఎక్కువగా ఉన్నారు అయినా పుస్తకాలు తిరగేయడానికి, అక్కడక్కడ నాల్గైదు పంక్తులు చదవడానికి ఇబ్బంది గా అనిపించ లేదు.  ప్రదర్శనలో నేను విన్న, చదివిన, రచయితల పుస్తకాలు చాలానే కనిపించాయి. తెలియని వి ఇంకా చాలా ఎక్కువే.  ఇంగ్లిష్,  తెలుగు పుస్తకాలు,  అతి తక్కువుగా కొన్ని హింది,   తప్ప మిగతా భాషల పుస్తకాలు నాకు కనిపించలేదు. ఎక్కడైనా ఒకటి అరా ఉన్నాయేమో బహుశా నేను గమనించలేదు.  రెండు మూడు చోట్ల పాత పుస్తకాలు (అలా కనిపించాయి నాకు) 50% రిబేట్ మీద కూడా అమ్ముతున్నార నుకుంటాను. ఒకటి రెండు చోట్ల 3 పుస్తకాలు Rs. 100/  స్కీము కనిపించింది. ఎక్కువగా ఇంగ్లిష్ నవలలు. నాకు తెలిసిన రచయితలకన్నా తెలియని రచయితల పుస్తకాలు ఎక్కువ అందులో. కొనే సాహసం చేయలేదు.  అన్ని  రకాల పుస్తకాలు,  పిల్లల పుస్తకాలు నుంచి అధ్యాత్మిక పుస్తకాలు దాకా విరివిగానే కనిపించాయి.   ప్రాంగణం మధ్యలో తినుబండారాల స్టాల్సు  ఉన్నాయి. హాయిగా కూర్చుని తినడానికి,  తాగడానికి  తగు సంఖ్యలో కుర్చీలు కూడా ఉన్నాయి. అయినా స్థలం నీట్ అండ్ క్లీన్ గానే ఉంది.  మొత్తం మీద ప్రదర్శన సంతృప్తి కలిగించింది.

సుమారు 3 గంటలు తిరిగాము ప్రదర్శన లో. నేను కొన్న మొదటి పుస్తకం నవోదయా లో అమరావతి కధలు. ఇది చాలమాట్లే చదివాను. ఈ మధ్యన అంటే గత ఏడెనిమిది ఏళ్లలో చదవ లేదు. అక్కడే రాబిన్ కుక్ వ్రాసిన ‘Seizure’  కనిపించింది. వెంటనే కొనేశాను. 2007 లో ననుకుంటాను పూనా వెళ్ళాను. NCL  గెస్ట్  హౌస్ లో దిగాను సతీ సమేతంగా. రాత్రి భోజనాల దగ్గర IIP లో పని చేస్తున్న పాత మితృడొకడు కనిపించాడు ఈ పుస్తకం తో. సరే,  నీ మొహం మండా నువ్వెల్లా ఉన్నావు  లాంటి ఉభయ కుశలోపరి కార్యక్రమం తరువాత,  వాడి చేతిలో పుస్తకం తీసుకొని ఆ రాత్రి చదవడం మొదలుపెట్టాను. రాత్రి 1-30 -2 దాకా చదివానను కుంటాను. అల్లాగే నిద్రపోయాను. తెల్లారి 8 గంటలకి,  వెధవ  నిద్ర లేపాడు. నేను వెళ్లిపోతున్నాను కాబట్టి పుస్తకం ఇచ్చెయ్యి అని గొడవ పెట్టాడు. ఏడుస్తున్నాడు కదా అని ఇచ్చేశాను. మళ్ళీ అది దొరక లేదు. నేను పూర్తిగా చదవ లేక పోయాను. అందుచే కొన్నాను. ఇవికాక ఓల్గా వి రెండు, శ్రీపాద వారిది ఒకటి, కధా సరిత్సాగరం, P.G వుడ్ హౌస్ కధలు తెలుగు అనువాదం, బాపు గారి బొమ్మలు పుస్తకం  ఒకటి  కొన్నాను. అన్నట్టు  సుజాత & రహ్మాన్ విరచిత బ్లాగు పుస్తకం కూడా కొన్నాను.

తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కినెగే స్టాల్ కెళ్ళాము. శ్రీ అనిల్ అట్లూరి గారి తో పరిచయం చేసుకున్నాను. వారు స్టాల్ నిర్వహణ లో బిజీ గా ఉండడం వల్ల ఎక్కువగా మాట్లాడడానికి సమయం దొరకలేదు.  రహ్మాన్ గారికి,  అనిల్ గారికి,  కౌటిల్య గారికి ధన్యవాదాలు  చెప్పి  6.30 గంటలకి  బయల్దేరి,  ఏలూరుకి మళ్ళీ క్షేమం గానే చేరాను.  

పుస్తకాలు 8,9  కొనేశాను హుషారుగానే. ఇవన్నీ ఎప్పటికి చదువుతానో. ఒక ఆర్నెల్లు పడుతుందేమో? ఏమో చూద్దాం.               
  

34 కామెంట్‌లు:

Kalasagar చెప్పారు...

బలుసు గారు
మా విజయవాడ అనుభవాలు బాగా రాసారు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

గుడ్ గుడ్ బాగున్నాయండీ కబుర్లు ఒక్క బస్ ప్రయాణంలో మీరెదుర్కున్న ఇబ్బంది దక్క....

జ్యోతిర్మయి చెప్పారు...

బులుసు గారూ మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళారు..సమావేశానికి, పుస్తక ప్రదర్శనకు కూడా ధన్యవాదాలు.

Sravya V చెప్పారు...

“నేను ఇస్తాను లెండి” అని అతని జేబులో పర్సు తీయబోయాను. పరవాలేదు లెండి, నా పర్సు లోది నేనే ఇస్తాను లెండి అన్నారు. సరే అతని పర్సు లోని రొఖ్ఖం అతను తీయడమే ధర్మం అని ఉరుకున్నాను.
---------------------------
హ హ, అసలు ఎక్కడా తగ్గరు కదా మాష్టారు :)) బావున్నాయండి కబుర్లు !

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చాలా సంతోషం సర్.. మీ పరిచయం సంతోషకరమే! మీ మాటలు సమ్మోహనాకరమే ! చక్కగా వ్రాసి.. నెయ్యం విలువ పెంచితిరి. ధన్యవాదములు.

కృష్ణప్రియ చెప్పారు...

:)) Too Good! Enjoyed reading the post..

కామేశ్వరరావు చెప్పారు...

ఏవనుకోకండి కాని, మీ విజయవాడ ప్రయాణం వెనక అసలు కారణం బ్లాగుమిత్రులని కలుసుకోడమో, పుస్తకప్రదర్శన చూడ్డమో కాక, మీ యింట్లో బొత్తిగా వీలుపడని హోమ కార్యక్రమాన్ని నిర్వహించడానికని మీ టపా చదివితే నాకనిపించింది. :)

రసజ్ఞ చెప్పారు...

కళ్ళకు కట్టినట్లు వ్రాశారు. నేను కూడా వచ్చినట్టు ఉంది చదువుతుంటే! ఈ సారి తప్పక వస్తాను.

అజ్ఞాత చెప్పారు...

అదేమిటి మాస్టారూ ! మరీ ఉన్నదున్నట్టుగా బయటపెట్టేసి, బులుసు వారిని మరీ ఇరుకులో పెట్టేయాలా ...

కొత్తావకాయ చెప్పారు...

పుస్తకాలు చదివి వాటి గురించి మీ శైలిలో కబుర్లు చెప్తే వినాలని ఉంది. ఆరునెలలు పట్టినా సరే.. చి.న.

Zilebi చెప్పారు...

బులుసు గారు,

వనజవనమాలి గారి నెయ్యం ని నెయ్యి గా చదివి, ఆ పై భైరవ భట్ల వారి హోమాన్ని చదివి , అయ్యారే మాష్టారు కొత్త గా ఏదో 'బ్లాగ్ హోమం మొదలు పెట్టినట్టు వున్నారే అని వచ్చా. ఇదన్న మాట ఈ విజయవాడ హోమ్ బ్లాగర్ మీట్ కథ !

ఈ బ్లాగర్లు ఎందుకు మీటు తారప్పా ? !!

చీర్స్
జిలేబి.

Kottapali చెప్పారు...

బావుంది. కామేశ్వర్రావుగారు కంక్లూజన్ తో ఏకీభవిస్తున్నాను.
హైదరాబాదే కాదు, బెంగుళూర్, చెన్నైలలో నేణు చూసిన పుస్తక ప్రదర్శనలకంటే విజయవాడ ఉత్సవం రాశిలో, వాసిలో, వైశాల్యంలోనూ పెద్దది.

అజ్ఞాత చెప్పారు...

>>ఎదురుగా నున్న పొలమునకు కొద్దిగా నీరు పట్టి

నీళ్ళు లేక పంట విరామంలో ఉన్న రైతన్నకు సహాయంజేసిన సందర్బంగా బులుసు గారికి "రైతు మిత్ర " బిరుదు ఇవ్వాలని కోరుతున్నామహో...

SHANKAR.S చెప్పారు...

ఎంతో ఉత్సాహంతో సభలో పాల్గొన్న మీకు అభినందనలు గురూజీ.(హమ్మయ్య మీరు అడిగినట్టే అభినందించేశాను :) )

"శ్రీ రహ్మాన్ గారు చెడుగుడు ఆడేశారు"
అయితే మొత్తం మీద రహ్మాన్ సభని షేక్ చేసేశాడన్న మాట.

మీరు ఇంతలా ఊరించాక వచ్చే యేడాది తప్పనిసరిగా ఓ సారి విజయవాడ పుస్తక ప్రదర్శన చూసి తీరాలని తీర్మానించడమైనది.

(అనట్టు గురూజీ ఇంతకీ అధిష్టానం వారు పెట్టిన షరతులేమి? వాటిని మీరు నేర్పుగా ఉల్లంఘించిన వైనమేమి? వివరంగా ఓ టపా రాద్దురూ :) )

రాజ్ కుమార్ చెప్పారు...

బాగు బాగు గురువుగారూ మీ విశేషాలు..
రెహ్మాన్ కబాడీ ప్లేయరా? నాకు తెలీనే తెలీదు ;)
>>నీ మొహం మండా నువ్వెల్లా ఉన్నావు లాంటి ఉభయ కుశలోపరి కార్యక్రమం >>> కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ ;)

..nagarjuna.. చెప్పారు...

ఇక మీదట మిమ్మల్ని కలవడానికి వస్తే చేతులూపుకుంటూ రావాలంటారు. మీ మాట శిరోధార్యం గురూగారు. అటులనే చేసేదము :)

పద్మవల్లి చెప్పారు...

బావున్నాయండీ కబుర్లు.

“నేను ఇస్తాను లెండి అని అతని జేబులో పర్సు తీయబోయాను. పరవాలేదు లెండి, నా పర్సు లోది నేనే ఇస్తాను లెండి అన్నారు."

హ హ, కి.ప.దో.న

Hima bindu చెప్పారు...

బాగున్నాయండీ విశేషాలు .

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కళాసాగర్ గారికి,

ధన్యవాదాలు.


వేణూ శ్రీకాంత్ గారికి,

ధన్యవాదాలు. అదేమిటో కానండి ఏది సవ్యం గా కాదు నా విషయంలో. ..... దహా .

జ్యోతిర్మయి గారికి,

ధన్యవాదాలు.

శ్రావ్య గారికి,

ధన్యవాదాలు. బిల్లు కోసం యుద్ధాలు చేస్తుంటారు. నేను ఎపుడూ ఎదుటివాడే గెలవాలనుకుంటాను........ దహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వనజ వనమాలి గారికి,

మీ వ్యాఖ్యలు శ్రవణానందకరమే. ధన్యవాదాలు.

కృష్ణ ప్రియ గారికి,

ధన్యవాదాలు. దహా.

భైరవభట్ల కామేశ్వర రావు గారికి,

పెళ్ళైన కొత్తలో ఒక నాలుగైదు ఏళ్ళు ఘోర యుద్ధాలు జరిగిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు నా నిత్యాగ్నిహోత్రానికి అందరూ అలవాటు పడిపోయారు. నిఝంగా బ్లాగర్సు ని కలవటానికి, పుస్తక ప్రదర్శన కోసమే వెళ్లానండి. పుస్తక ప్రదర్శన మీద ఒట్టు. నమ్మండి. .... మహా.
ధన్యవాదాలు.

రసజ్ఞ గారికి,

ధన్యవాదాలు. వి.చు.ప.బ్లా.స. కి (విజయవాడ చుట్టు పక్కల బ్లాగర్స్ సమావేశం) స్వాగతం.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హరేఫాల గారికి,

బులుసు వారిని ఇరుకున పెట్టేవారి సంఘం లో చేరుతున్నారన్నమాట మీరు కూడా. కానివ్వండి. ఏమి చేస్తాం? ..... దహా.
ధన్యవాదాలు.


కొత్తావకాయ గారికి,

అబ్బే, పుస్తక సమీక్షలు వ్రాసేటంతటి మేధావి ని కానండి. ఎదురుగా ఉన్నదే అర్ధం కాదు. ఇంక పంక్తి కి పంక్తికి మధ్య ఏమి వెతుకుతాను. ..... దహా.
ధన్యవాదాలు.

జిలేబి గారికి,

>>> ఈ బ్లాగర్లు ఎందుకు మీటు తారప్పా ? !!

మీ చేత కామెంటు పెట్టించడానికి.
మా హోమంలో నెయ్యి వెయ్యం. నవ్వులే. నవ్వితే నవ్వండి లేకపోతే నవ్విపొండి అన్నదే మా స్లోగన్. ....... దహా.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నారాయణ స్వామి గారికి,

కామేశ్వర రావు గారికి ఇచ్చిన వివరణే మీకూనూ. ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

మీరు అటువంటి కార్యక్రమాలు ఏమి పెట్టకండి. ఆ రైతు కర్ర పుచ్చుకొని నా వెనకాల పడితే, వృద్ధుడిని, పరిగేయలేను....... దహా .
ధన్యవాదాలు.

శంకర్ గారికి,

నేను అంతా నిస్సిగ్గుగా అడిగినా ఎవరూ చెప్పలేదండీ. మీరే అర్ధం చేసుకొని అభినందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
విజయవాడ ప్రదర్శనకు స్వాగతం.
కొన్ని దేవ రహస్యాలు ఉంటాయి. వాటిని మీరు అడుగరాదు. అర్ధం చేసుకోండీ.

రాజ్ కుమార్ గారికి,

>>> రెహ్మాన్ కబాడీ ప్లేయరా? నాకు తెలీనే తెలీదు ;)..
నేను చెప్పానని చెప్పకండి. మళ్ళీ విజయవాడ వెళ్ళితే భోజనం దొరకదు. ... దహా
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాగార్జున గారికి,

నేను వ్రాసిందేమిటి? మీరు అర్ధం చేసుకొన్నదేమిటి? లాభం లేదు. మీకు ప్రైవేటు చెప్పాల్సిందే. .... దహా.
ధన్యవాదాలు.

పద్మవల్లి గారికి,

ధన్యవాదాలు. పక్కవాడి పర్సుకి నా చేతికి ఏదో అయస్కాంతాకర్షణ ఉందేమో నని అనుమానమండి. .... దహా .

జేబి – JB గారికి,

ధన్యవాదాలు.

చిన్ని గారికి,

ధన్యవాదాలు.

శశి కళ చెప్పారు...

oke eekala pakshuku...ha..ha...sa.da.haa..meku meere saati bulusu gaaru

Advaitha Aanandam చెప్పారు...

హ హ హ ఏంటీ నేనిస్తానని తన పర్సు తీసారా..?
ఇంకా నయ్యం నేను తింటానని వారి ప్లేటు కూడా లాగలేదు... దహా (మీ స్టైలు లో)

నా ఓటు మాత్రం harephala గారికే.... ఇరుకున పెట్టే విషయంలో... (ఇంకో దహా...)


బాగున్నాయి మీ కబుర్లు ....

హరే కృష్ణ చెప్పారు...

శ్రీ రహ్మాన్ గారు చెడుగుడు ఆడేశారు, వికిపీడియా వికిపీడియా అంటూ. వికిపీడియా గురించి వివరించి, మనమందరం దాని అభివృద్ధికి ఏమి, ఎలా చెయ్యాలో విశదీకరించారు. మీరందరూ వికిపీడియా లో తగు పాత్ర పోషించాలని ఉద్భోదించారు. వికిపీడియా గురించి కొంత చర్చా కార్యక్రమం జరిగింది. ఆ తరువాత శ్రీ రహ్మాన్ గారు బ్లాగు బహు బ్లాగు అంటూ కబాడీ మొదలు పెట్టారు. రహ్మాన్ గారి చెడుగుడు కార్యక్రమం జరుగుతుండగా మరి కొంత మంది బ్లాగర్స్ వచ్చారు.

ROFL :)))

హరే కృష్ణ చెప్పారు...

రహ్మాన్ గారు చతురతతో సమాధానం ఇస్తున్నారు. వారి ప్రశ్నలకి వీరు అలిసిపోయారో, వీరి సమాధానాలకు వారు సంతసించారో తెలియదు కాని సమావేశం ముగిసింది అని ప్రకటించారు.

ఉపన్యాస కేసరి LOL

పోస్ట్ అంతయూ కెవ్వ్ కెవ్వ్ గురూజీ :)

yuddandisivasubramanyam చెప్పారు...

excellent

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శశికళ గారికి,

ధన్యవాదాలు.

మాధవి గారికి,

ప్లేట్ లాగను లెండి. ఆ ప్లేట్ లో ఉన్నవాటిని తీస్తానేమో అవకాశం వస్తే . నన్ను ఇరుకున పెట్టే సంఘం లో మీరు కూడా సభ్యత్వం తీసుకున్నారన్నమాట. ధన్యవాదాలు.

హరేకృష్ణ గారికి,

మీరు ఇంత గా మళ్ళీ నొక్కి వక్కాణిస్తే, రహ్మాన్ గారు వచ్చి నా నెత్తిమీద ఓ కొబ్బరికాయ కొట్టేస్తారేమో నని భయం గా ఉంది. ధన్యవాదాలు.

శివసుబ్రమణ్యం గారికి,

ధన్యవాదాలు.

Murthy చెప్పారు...

నమస్తే సుబ్రహ్మణ్యం గారు,
మొట్టమొదటిసారిగా మీ బ్లాగ్ చదివాను.
ఎందుకని ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకున్నాన అని కొధిగా భాధ పడ్డను.
మీ పాఠకుడు....
ధన్యవాదములు

Murthy చెప్పారు...

నమస్తే సుబ్రహ్మణ్యం గారు,
మొట్టమొదటిసారిగా మీ బ్లాగ్ చదివాను.
ఎందుకని ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకున్నాన అని కొధిగా భాధ పడ్డను.
మీ పాఠకుడు....
ధన్యవాదములు

SIVA SUBRAHMANYAM చెప్పారు...

గురువు గారు చాలా కాలం తరువాత హాయిగా నవ్వుకున్నాను. ఈ రోజు మీ పోస్తులు మొత్తం చదివాను.ఇన్నాల్లు ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది

Chandu S చెప్పారు...

సర్,చాలా బాగున్నాయి కబుర్లు. (పైకి)

షరతులతో? కూడిన ఆమోదము నిచ్చిరి.
దేవ రహస్యాలు? ఏమయి ఉంటాయి? ( (లోపల)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీ DSR మూర్తి గార్కి,

మా బ్లాగుకి స్వాగతం. ధన్యవాదాలు.

శ్రీ శివ సుబ్రహ్మణ్యం గారికి,

ధన్యవాదాలు.

చందు S. గారికి,

(ప్రకాశముగా) ధన్యవాదాలు.
(స్వగతముగా). దేవరహస్యాలు తెలియకుండా ఉంటాయా. నన్ను ఇరుకున పెట్టడానికి కాకపోతే. ..... దహా