ఔను, వాళ్ళిద్దరూ విడిపోయారు.

రెండు కూరలు, సాంబారు పట్టుకొచ్చేయండి. అన్నం పడేస్తాను.


ఈ వారంలో అప్పుడే మూడో మాటు కూరలు కొనుక్కోవడం.

తప్పేమి కాదు. 42 ఏళ్ళగా వంట  చేస్తున్నాను. ఇంకా ఎంతకాలం?
 

శంకరం ఇంట్లోంచి పచ్చి బొప్పాయ కాయ పట్టుకొచ్చాను. ఆవ పెట్టిన కూర తిని చాలా కాలమైంది కదా. 

దాని తొక్కు తీయాలి. చిన్న ముక్కలు చేయాలి. మిక్సీలో వెయ్యాలి. ముద్ద కాకుండా జాగ్రత్తగా పొట్టు లాగా వచ్చేటట్టు చూడాలి. అప్పుడు కూర చెయ్యాలి. ఇంత తతంగం ఉంది. నా వల్ల కాదు.

 తతంగం అంతా నేను చేస్తానులే. నువ్వు కూర చెయ్యి. 

మీ వల్ల అయ్యే పని కాదు. పనిమనిషికి ఇచ్చేస్తాను ఆ కాయ. 


భూషణం గారు కారు మాట్లాడుతారట. పేరుపాలెం బీచ్ కి వెళ్ళి వస్తారుట, సరదాగా ఓ రెండు మూడు గంటలు గడపటానికి. మనల్ని కూడా రమ్మంటున్నారు.

పేరుపాలెం బీచ్ కని కారులో ఆ రోడ్ల మీద  మూడు గంటలు వెళ్లడం, మూడు గంటలు రావడం, అక్కడో గంటో రెండు గంటలో కూచోవటం. ఒళ్ళు హూనం చేసుకోవటం నా వల్ల కాదు.
. 
అదేమిటే,  బీచి , సముద్రం, అలల హోరు, చంద్రుడు, వెన్నెల, తళతళా మెరిసే నీరు, నీళ్ళలో నుంచుంటే కాళ్ళ కింద కదిలే ఇసుక అంటూ కవిత్వం ఒలకబోసేదానివి కదా.

ఎప్పుడు, ఎప్పుడో నా చిన్నప్పుడు. 

అదేమిటి, 15  ఏళ్ల క్రితం వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లలా గెంతులేసే దానివి కదా.

15 ఏళ్లక్రితం నేను చిన్నపిల్ల లాగానే ఉండేదానిని. గత రెండు మూడు ఏళ్ల లోనే బాగా పెద్ద దాన్ని అయిపోయాను. 

ఏమో ఎందుకో, రెండేళ్ల లోనే అంత పెద్ద దానివి ఎలా అయ్యావో? నాకేం తేడా కనిపించటం లేదు. జుట్టు ఇంకొంచెం నెరిసింది. అంతే. 

ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?  మీ కెలా అర్ధం అవుతుంది.

చెప్పు, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. 

ఏం చెప్పాలి. Psychological tiredness, మానసిక అలసట అంటే  అర్ధం  అవుతుందా? మొగుడు, పిల్లలు, ఇప్పుడు మనవ(లు , రాళ్ళు), వీళ్ళకి ఇష్టమైన తిళ్ళు, పనులు చేయడం, నా కంటూ ఉన్న ఇష్టాలన్ని పక్కన పెట్టేయడము. ఇదేగా 42 ఏళ్ళగా,  రోజు రోజూ చేసిందే చేసి, విసుగు వచ్చేసింది. నేనేమిటి అని చూస్తే నా జీవితంలో నేను కనిపించటం లేదు. మీరంతానే కనిపిస్తున్నారు. 

అదేమిటి,  త్యాగాలు నువ్వేనా,  నేనూ చేసాను. 

చేసారు, కాదనటం లేదు. కానీ మీరు చేసినవి ఎన్ని?  మీరో ఐదు చేస్తే,  నేనో పది  చేసాను. మీకు బయట ప్రపంచం ఉంది. ఆఫీసు, చుట్టూ ఓ పది మంది, ఇంకో జీవితం ఉంది. ఒక రిలాక్సేషన్ ఉంది. నాకేముంది. వంటిల్లు, బెడ్ రూం తప్ప.

అన్యాయంగా మాట్లాడుతున్నావే. మరీ అంత కష్టపెట్టానా? 

కష్టంగా కాదు బాధ్యత గానే చేసాను. బాధ్యత ల్లోనే సంతోషం వెతుక్కున్నాను.  పెళ్లి చేసుకున్నప్పుడు ఇన్ని బాధ్యతలు మోయాల్సి  వస్తుందని  తెలియదు.

ఇంకొకరిని,  ఎవరినైనా చేసుకో పోయావా? కొంచెం వ్యంగంగానే పలికింది నా గొంతు.

ఎవరిని చేసుకున్నా, వంట తప్పదు, పిల్లల్ని కనడం, పెంచడం తప్పదు. వీటికి తోడు కొన్ని ఆర్ధిక బాధ్యతలు తప్పవు. ఎవరైతే నేమిటి?  అసలు పెళ్లి చేసుకొని అంత  దూరం అస్సాం  రావడం  నాకు ఇష్టం లేదు. మా నాన్నతో చెపితే “నీమొహం, నీకేం తెలుసు. కుర్రాడు బుద్ధిమంతుడు. సెంట్రల్ గవర్నమెంట్ , ఇరవై ఐదు ఏళ్లకి క్లాస్ వన్ గెజెటేడ్, నాల్గు అంకెల జీతం, ఇంతకన్నా మంచి సంబంధం  ఎక్కడ దొరుకుతుంది.”  అని పెళ్లి చేసి పంపించేసాడు.

నీకు నేనేమి లోటు చెయ్యలేదే. జీతం తీసుకొచ్చి నీ చేతిలోనే పోసాను. నా సిగరెట్లకి కూడా నిన్నే అడుక్కున్నాను. నా ఖర్చులకి, ఇంటికి వచ్చిన జీతం లో పదిహేను  శాతం మించ కూడదని రూలు కూడా పెట్టావు. ఆ తరువాత పదికి తగ్గించావు. నేను కాదనలేదే.

గెజెటేడ్ అని మా నాన్న మీకిచ్చి పెళ్లి  చేస్తే, పెళ్ళైన రెండేళ్ళకి రేడియో,  నాల్గేళ్ళకి గేస్, ఏడేళ్ళకి మిక్సి,  పదేళ్ళకి స్కూటర్ వచ్చాయి. అది మీ సంపాదన.

ఇంతకీ ఏమిటంటావు నువ్వు అని అడిగాను.

నాకు ఈ జంఝాటనల నుంచి విముక్తి కావాలి.

నేనేం చెయ్యాలి. 

విడాకులు ఇయ్యాలి.

వాట్?

యస్. హాస్యానికి కాదు, సీరియస్ గానే అంటున్నాను. ఎంత కాలం ఈ గానుగెద్దు లాగా జీవించడం. నా ఇష్టా ఇష్టాల ప్రకారం శేష జీవితం గడపాలని అనుకుంటున్నాను. 

నీ మొహం. 

కాదు, మీ మొహమే.

అది అసలు బాగుండదు.

నాకు నచ్చే చేసుకున్నాను.

మరి ఇప్పుడు ఈ గోలేమిటి? 


టెలిఫోన్ మోగింది. మా అమ్మాయి. సరే ఓ అరగంట హరికధలు చెప్పుకుంటారు కదా అని నేను బయటకు వెళ్ళి పోయాను. ఓ ఇరవై రోజులు గడిచాయి.  మధ్యలో ఒకటి రెండు మాట్లు మళ్ళి ఈ టాపిక్ ఎత్తింది కానీ నేను చర్చ సాగనియ్యలేదు. 


కాలింగ్ బెల్ మోగింది. బద్ధకం గా లేచాను. పది నిముషాలు తక్కువ ఆరు అయింది. తెల్లారకుండా ఎవరు వచ్చారు చెప్మా అనుకుంటూ తలుపు తెరిచాను. ఎదురుగా మా అబ్బాయి, కోడలు, పిల్లలు. 

అదేమిట్రా అకస్మాత్తుగా ఊడి పడ్డావు? కబురైనా లేదు.

అమ్మ అర్జంటుగా రమ్మంది. అందుకని వచ్చాము. నీకు తెలియక పోవడమేమిటి?
అని ఎదురు ప్రశ్న వేసాడు. ఇంతలో మా ఆవిడ లేచి వచ్చింది. 

వచ్చారా? రండి. మొహం కడుక్కోండి. కాఫీ పెడతాను. అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.

పుత్రరత్నం వంటింట్లో చేరాడు. మాటలు వినిపిస్తున్నాయి.

రాజీ,  రాత్రి 11-30 బస్సు కి బయల్దేరుతానంది. ఎనిమిది అవుతుందేమో వచ్చేటప్పటికి.


నాకు కొంచెం అర్ధమవుతోంది. ఈ వేళ తాడో పేడో తేల్చేస్తుందా?  పిల్లలు వస్తున్నారు అన్న విషయం కూడా నా దగ్గర దాచింది,  అంటే వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారా?  నేను ఎవరికీ కాకుండా పోతానా?  నేను ఒంటరి నయిపోయానా?  ఏమిటి చెయ్యాలి నేను?  ఇంట్లోంచి బయటకు పోయి రెండు మూడు రోజుల తరువాత వస్తే ?

అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి. విందాం. పిల్లలు ఏమంటారో. ఏంచేసినా అందరి సమ్మతి తోనే చేద్దాం. కాఫీ ఇస్తూ అంది ప్రభావతి.

తన మనసు నాకు అర్ధం కాక పోయినా నా ఆలోచనలన్నీ పసి గట్టేస్తుంది. ఇది నాకు వరం. కానీ దానికి శాపమా? 

ఈ వేళే ఏమీ తేలకపోవచ్చు లెండి. కానీ ఇది మొదటి స్టెప్ .

ఇంకో మాటు ఆలోచించవా? 

మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 
 

ఏమిటి ఇది? 42 ఏళ్ల సంసారం తరువాత విడిపోదామంటుంది. గత రెండు మూడు  ఏళ్ళగా అసహనం   పెరిగింది దీనికి. ఈ కాలం లో నాకు కొత్త అలవాట్లు ఏమీ అలవడలేదు. సిగరెట్లు కూడా తగ్గించాను. ఎప్పుడో తప్ప మందు ముట్టుకోవడం లేదు. ఈ రెండు మూడు ఏళ్లలో నాలో ఏమీ మార్పు  రాలేదు. మరి ఎందుకు?


మద్యాహ్నం భోజనం అయిన తరువాత డైనింగ్ టేబుల్ కాన్ఫెరెన్స్ మొదలయింది.

ఇంతకీ ఎందుకు విడాకులు తీసుకోవాలను కుంటున్నావు  అని అడిగాడు మా అబ్బాయి .

మానసిక అలసట అని చెప్పాను కదరా.
 
అంత,  మానసిక అలసట కి కారణాలు ఏమిటో? ప్రశ్నించాడు మా అబ్బాయి. 

కారణాలు అని అడిగితే, నువ్వు, నీ చెల్లెలు, మీ నాన్న అందరూ నూ.  మీ నాన్నకి, మీకు,  నాకు అభిరుచుల్లో, అలవాట్లలో, సరదాలలో చాలా తేడాలున్నాయి.

ఏమిటో అవి, మా అబ్బాయి అడిగాడు. 

మొదట్లో నాకు తెలుగు పుస్తకాలు చదవడం అలవాటు ఉండేది. కొంచెం లో కొంచెం భావుకత ఉండేది.  ఈయనకి అలాంటివి ఏమీ పట్టవు. ఖాళీ దొరికితే పోయి క్లబ్బులో కూర్చుని బ్రిడ్జ్ ఆడడమే తెలుసు. పెళ్ళానికి ఓ మూర మల్లెపూలు తీసుకెళ్ళాలని ఈయనకి తెలియదు.

జోర్హాట్ లో మల్లెపూలు ఎక్కడా  అమ్మరు. పెరట్లో కనకాంబరాలు పూసేవి గదా . నేను మెల్లిగా అన్నాను.

అదే మీ  తత్వం. పూలు  కావాల్సి వస్తే కోసుకుంటుంది. పంచదార కొనుక్కు వస్తుంది. 

డబ్బులు నీ దగ్గరే ఉండేవి కదా అమ్మా. సిగరెట్లకి కూడా నాన్న నిన్నే అడిగేవాడు కదే. మా అమ్మాయి. 

అవే తెలివితేటలు మీ నాన్నవి. ఇంటి పని, వంట పని, బజారు పని అన్నీ నావే.  పెత్తనం నాదిగా కనిపించేది. ఆయన చడి  చప్పుడు కాకుండా చేసేసేవాడు. “వాడు డబ్బు కావాలన్నాడే, ఎంతో కొంత పంపించు. వాళ్ళు చందాలు అంటూ వచ్చారు. ఇంట్లో అడగమన్నాను. ఎంతో కొంత ఇయ్యి”. అనవసర ఖర్చులు చేసేవారు. ఇరవై తారీఖున, “డబ్బులు అయిపోయాయి,  వచ్చేటప్పుడు బాంక్ నుంచి తీసుకు రండి”,   అంటే,  అప్పుడే అయిపోయాయా,   అంటూ ఇంత పొడుగ్గా దీర్ఘం తీసేవారు. 

అదేమిటమ్మా ఇంట్లో రాజ్యం నీదే కదా. మా అమ్మాయి అంది. 

రాజ్యమా,  సింగినాదమా? పెళ్ళైన కొత్తలో బాధ్యతలు. ఇంటికి డబ్బు పంపించాలి. చెల్లెలి పెళ్లి. అవి అయ్యేటప్పటికి  మీ  అవసరాలు పెరిగాయి. మధ్యలో ఏదో ఒక ఇబ్బంది. సర్దుకు వచ్చేటప్పటికి తల  ప్రాణం తోకకి వచ్చేది.   
  
మరి ఇంతకాలం సంసారం సజావుగానే  చేసారు కదే. మీ ఇద్దరి మధ్యా ఇంత విబేధాలు ఉన్నాయని మేము కలలో కూడా అనుకోలేదు.

విబేధాలు అంటూ ఏమీ లేవు. ఇప్పటికి మా ఇద్దరికీ ఒకరు అంటే ఇంకొకరికి ప్రేమ, అభిమానం అన్నీ ఉన్నాయి. 

మరి ఏమిటి సమస్య.
   
ఎడ్జస్ట్ మెంటాలిటీ అంటారు కదా. అదే అలవాటు అయింది.  మొదట్లో ఎంత అవస్థ పడ్డానో మీకేం తెలుసు.  వాళ్ళ రుచులు వేరు. నావి వేరు. మా ఇంట్లో ప్రతి దాంట్లో బెల్లం వేసే వారం. ఇక్కడ ప్రతిదీ ఆవ పెట్టడం అలవాటు చేసు కున్నాను.   ఈయన అన్నీ తేలికగా తీసుకునేవాడు.  పెళ్ళైన కొత్తలోఈయన ఆఫీసు కెళితే  ఇంటిలో ఒక్కర్తినే. పనిమనిషి ని  పెట్టుకోకుండా ఇంటి పని అంతా నేనే చేసుకునే దానిని. అదే అలవాటు అయిపొయింది. ఇంక విసుగొచ్చి ఇప్పుడు గత రెండేళ్లగా పని మనిషిని పెట్టుకున్నాను. 

సరేనమ్మా, అది అంతా అయిపొయింది. నువ్వన్నట్టే ఎడ్జస్ట్ అయిపోయారు. ఇద్దరు పిల్లలు. పెళ్ళిళ్ళు చేసారు. మనవలని, మనవరాళ్ళని ఎత్తుకున్నారు. రామా క్రిష్ణా అనుకునే 64 ఏళ్ల వయసులో  నీకు  ఇది ఏమిటి? 

నిజమే  అడ్జస్ట్ అయ్యాం. ఇద్దరం కూడా, నేను ఎక్కువగా  ఆయన కొంచెం  తక్కువగా.    అది ఇంకా సాగుతోంది. ఇలా ఎంతకాలం. నాకు నేనుగా, నా అభిరుచులు, సరదాలకి అనుగుణంగా బతకడానికి అదృష్టం లేదా? 42 ఏళ్ళగా విశ్రాంతి లేకుండా పని చేసి అలసిపోయాను. నాకు విశ్రాంతి కావాలి. 

మా ఇంటికి వచ్చి ఉండండి. హాయిగా విశ్రాంతి గా ఉండే ఏర్పాటు చేస్తాను, మా అబ్బాయి, అమ్మాయి.

కుదరదు.  నేను మీ ఇంటికి వచ్చినా మీరు మాఇంటికి వచ్చినా నాకు పని తప్పదు. మీకు, మీ  పిల్లలకి, ఇష్టమైనవి నా చేత్తో చేసి పెట్టాలనే కోరిక నుంచి తప్పించుకోలేను. ఇక్కడ  మేమిద్దరికి చేసుకునేది కాస్త,   అరడజను మందికి చెయ్యాలి మీ ఇళ్లలో ఎక్కడికి వచ్చినా. నాకు పని ఎక్కువవుతుంది  కానీ విశ్రాంతి దొరకదు. 
 
పోనీ వంట మనిషిని పెట్టుకో ఇక్కడే.

కుదరదు రా. ఇక్కడే ఉంటే కొన్ని కొన్ని జంఝాటనల నుంచి బయట పడలేను. పొద్దున్నే లేచింది మొదలు, ఈ వేళ ఏం వండాలి, పని మనిషి వస్తుందా రాదా, రాత్రి ఈయన రెండు మాట్లు లేచాడు, నాల్గు మాట్లు దగ్గాడు. జలుబేనా, డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాలా? రేపు వాళ్ళు వస్తారు, ఏం పెట్టాలి, ఇత్యాదులు ఆలోచించకుండా ఉండలేను. తాపత్రయ పడకుండా కూచోలేను.  అందుకనే వీటికి దూరంగా  నేనో ఓల్డ్ ఏజ్ హోం లో చేరుతాను. ఇది నా నిర్ణయం. మారదు.  ఆర్నెల్లకో సారి మిమ్మల్ని పిల్లల్ని చూడడానికి వస్తాను. 

మరి నాన్న సంగతి.

ఆయనా మీ దగ్గరికి రాడు. ఆయనని  మరెక్కడో ఇంకో ఓల్డ్ ఏజ్ హోం లో చేర్చండి. మా హోం కి దూరంగా.

నాన్నా నువ్వేమంటావు.

అనడానికి ఇంకేముంది. మీ అమ్మ మాట నేను ఎప్పుడు కాదన్నాను. అలాగే కానివ్వండి. విడాకులు  వద్దు. విడిగా ఉంటాం. రెండు మూడేళ్ళ తరువాత మళ్ళీ ఆలోచిద్దాం. అప్పటికి మీ అమ్మ మారుతుందని ఆశిద్దాం. 

ఇంకో రెండు రోజులు దీర్ఘ చర్చల తరువాత ప్రభావతి, ప్రద్యుమ్నులు విడి విడిగా బతకటానికి ఒప్పందం కుదిరిపోయింది. 

ఒక నెల రోజుల తరువాత  ప్రభావతి హైదరాబాద్ లో, ప్రద్యుమ్నుడు  వైజాగ్ లోనూ ఓల్డ్ ఏజ్ హోం లలో చేరిపోయారు. 


విడిగా ఎంతకాలం ఉంటారు, మళ్ళీ  కలుస్తారా, విడాకులు తీసేసుకుంటారా. ఏమో,  వేచి చూడాలి.  కాలమే సమాధానం చెప్పాలి.   
40 కామెంట్‌లు:

శ్రీరామ్ చెప్పారు...

Nijamaa?? :-(

Sree చెప్పారు...

madhytaragati vayaasu mallina dampatula abhiprayalni chala chakkaga chepparu. very realistic...
-Srirama murty Nistala

భాను కిరణాలు చెప్పారు...

" అదేమిటి , 15 ఏళ్ళ క్రితం వైజాగ్ లో ఉన్నప్పుడు కుడా చిన్నపిల్లలా గెంతులేసేదానివి కదా....
15 ఏళ్ళ క్రితం నేను చిన్న పిల్లనే "
" ఆయనని ఎక్కడైనా ఓల్డేజ్ హోం లో చేర్చండి .... మా హోం కి దూరంగా " ...........
మీఎరు కేక గురువుగారు ....... అప్పట్ట్లో మీరు సినిమాల్లోకి వచ్చుంటే జంద్యాలగారు యేమైపొయెవారో పాపం.....

శశి కళ చెప్పారు...

nijMa...?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కథ కి తగ్గ పేరు. బాగుంది.
కథ, చెప్పిన తీరు కూడా బాగుంది. సహజంగా ఉంది. బాగా నచ్చింది.

Chinni చెప్పారు...

బావుంది కానీ విడిపోయారు అని అనుకోవడానికి మనసొప్పట్లేదు.. కల్పితమా?నిజమా?

అజ్ఞాత చెప్పారు...

"నవ్వితే నవ్వ౦డి" అనే శీర్షికతో ఈ వ్యాసం రాసారు, కానీ నాకు నవ్వు రాలేదు. మీరు దీన్ని కొంత సీరియస్ గానే రాసారు అనుకుంతున్నాను.

నాకు ఎందుకో ఆ పెద్దావిడ కొంచం "అతి"గా రియాక్ట్ అయినట్టుగా అనిపించింది. ఒక ఇల్లాలిలొ 2-3 సంవత్సరాలలొ ఇంత మార్పు రావడం, అదీ 40యేళ్ళు కాపురం చెసిన తరువాత రావడం అనెది మరీ విడ్డూరం!!!

Sravya V చెప్పారు...

ఏంటీ మాస్టారు నవ్వితే నవ్వండి అని ఇలా రాస్తే నవ్వేస్తామా :-) అయినా ఈ కథ నాకు నచ్చలా !

అజ్ఞాత చెప్పారు...

విడిగా ఎంతకాలం ఉంటారు? ఒక నెలో, రెణ్ణెల్లో ఉంటారు.
తరువాత పేరుపాలెం బీచి దగ్గరలో అర ఎకరం స్థలం కొనుక్కుని శ్రీ రమణ గారి 'మిథునం' కథలోలా చక్కగా కాలక్షేపం చేస్తారు.
అంతేనాండి?

Narsimha Kammadanam చెప్పారు...

మాంచి టాపిక్ టచ్ చేశారు....జీతం తెచ్చి నీ చేతికేగా ఇస్తున్నాను.....ఈ డయిలాగు,సద్ద లేక తల ప్రాణం తోకకొచ్చింది ..ఇదీ చాల సార్లు విన్నాను...42 సంవత్సరాలు కాపురం చేసాక ఇలాంటి వాదన రవడం విడ్డూరం ఎమి కాదు...బయట నిజంగా చాలా మంది జీవితాల్లో ఇలాంటి వాదం వస్తుంది ముఖ్యంగా పిల్లల పెళ్ళిళ్ళు అయిన కొత్తలో భార్య భర్తలు ఇలానే వాదులాడుకుంటారు(ముఖ్యంగా పై రెండు డయిలాగ్స్ )

కావ్యాంజలి చెప్పారు...

అయ్యో !!! నిజమా?? ఇదేమిటండి...మా జనరేషన్ వాళ్ళు విడాకులు అనే పదాన్ని ఈజీ గా వాడేస్తున్నారు.....చాలా ఈజీ గా తీసుకుంటున్నారు అని బాధ పడతాను నేను.....అలాంటిది, పెద్దవారు మీరు కూడా :( నవ్వు రాలేదు సరికదా...ఏదో తెలియని బాధ :(

అజ్ఞాత చెప్పారు...

చాలా మంది ఆడవాళ్ళకి ఆ వయసులో అలా అనిపిస్తుందేమోనండీ! మా అత్తగార్నీ, అమ్మనీ చూసినప్పుడు నిజానికి నాకే జాలేస్తుంది. యాభై యేళ్ళుగా, వాళ్ళ కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా చేసి, ఇప్పుడసలు వాళ్ళకి ఆ అలవాటు పోయింది. మీరన్నట్టే ఒకలాటి మైల్డ్ డిప్రెషన్ కి లోనవుతున్నారు.
Sharada

అజ్ఞాత చెప్పారు...

నేను ఇప్పుడే ఊరునుంచి వచ్చి టపా చూశాను. వ్యాఖ్య పెడదామని రాసి మానేశాను. నా బ్లాగులో టపా రాస్తున్నా.

జ్యోతిర్మయి చెప్పారు...

ఈ కథ నాకు నచ్చలేదు సార్. ఆవిడ దూరంగా ఉన్నంతమాత్రాన ఇవన్నీ ఆలోచించకుండా ఉంటారా? ఇన్నాళ్ళుగా అలవాటయిన తోడు లేక నిరాసక్తత ఇంకా పెరుగుతుందేమో కదా. ఇద్దరూ కలసి బాధ్యతలు పంచుకుంటే ఈ సమస్య సమసి పోతుందనిపిస్తుంది. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలే ఇలా విడిపోతామంటే అది వింటున్న మనవలకు వివాహ వ్యవస్థ పట్ల ఏ విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది? పెళ్ళవగానే 'నా' నుండి 'మన' లోకి మారిపోతాం. మళ్ళీ ఇలా కొత్తగా 'నా' మొదలవడం అస్సలు నచ్చలేదు.
నా వ్యాఖ్య మిమ్మల్ని నొప్పించి వుంటే దయచేసి క్షమించండి.

www.apuroopam.blogspot.com చెప్పారు...

బు.సు. గారికి, జీవితంలో నటించడంలో కూడా ఎక్స్ పర్ట్ అయిన మీరు ఈ పోస్టు తమాషాకి వ్రాసారనే అనుకుంటున్నాను.నిజమనే నమ్మితే-- ఇందులో ప్రభావతి గారి నిర్ణయం చాలా అసంబధ్దమైనది. నిజమే. 42 ఏళ్లు సంసారం కోసం అవిశ్రాంతంగా సేవ చేసి అలసిపోయిన మనిషికి ఎవరికైనా అటువంటి ఆలోచనలు రావడం తప్పుకాదు. కానీ జీవిత చక్రం వెనక్కి తిరగదు.పాణిగ్రహణం చేసిన రోజునే జీవితాంతం ఒకరిని విడచి ఒకరం ఉండమని ప్రమాణం చేస్తాము.కనుక స్త్రీ అయినా పురుషుడైనా కూడా దానికి కట్టుబడి ఉండాల్సిందే.మనకోసం మనం ఒక సంసారాన్ని సృష్టించుకున్నాక దాని నుండి దూరంగా పోవడం బాధ్యతా రాహిత్యమే.కాకపోతే మమకారాలు మరీ పెంచుకోకుండా ఈ సంసారం పరిధిలోనే మనకు నచ్చినట్లుగా శేష జీవితాన్నిగడపడానికి ప్రయత్నించాలి.విషయం చాలా గంభీరమైనది కనుక వ్యాఖ్యలో ఇంతకన్నా చెప్పలేము.మీరీ పోస్టుని మంచి ట్విస్టుతో ముగిస్తారని నాకు తెలుసు.

అజ్ఞాత చెప్పారు...

మనసుని కలిచేశారు మాస్టారూ. నవ్వితే నవ్వండి పేరు కింద కన్నీళ్ళు పెట్టించే కథనం రాశారుగా. ఒక్కసారి మీకు వచ్చిన కామెంట్స్ అన్నీ పరిశీలించండి. ఎంత స్కాటర్డ్ గా ఉన్నాయో. ఏం రాయాలో అర్ధం కావడం లేదు. ఇది నిజ జీవిత కథనం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అజ్ఞాత చెప్పారు...

లాభం లేదు సారూ, ఇది మీ బ్లాగులో పెట్టడం కుదర్దు. వేరే "ఏడిస్తే ఏడవండి" అనే బ్లాగ్ మొదలెట్టి అందులో ఈ ఏడుపు ఏడిస్తే బాగుండొచ్చు. అప్పటిదాకా ప్రద్యుమ్నుల వారి ఏడుపు నవ్వడానికి పనికిరాదు. ప్రభావతి గారు ఈ పాటికి అప్పడాల కర్ర ఒక సారి ఝుళిపించి ఉండాలే?

ఇదేదో ఏలూరు నీళ్ళ ప్రభావం కానీ అక్కడా చుట్టల కంపు ప్రభావం కానీ అయి ఉంటుందని నా అంచనా. లేకపోతే ఎక్కడికెళ్ళాలన్నా ఊరినిండా ఉన్న రైల్వే గేట్లు వేసేస్తారని తెల్సి ఇలా పక్కదారిలో ఏడుస్తున్నారా? :-)

జలతారు వెన్నెల చెప్పారు...

ప్రభావతి గారి వాదన, అలోచనా తీరు లో సహజత్వం ఉంది. నాకు నచ్చింది. ఆవిడ తీసుకున్న నిర్ణయం తప్పా , ఒప్పా అన్న judgement pass చెయ్యడం కన్నా, ఇలా ఒక స్త్రీ అలోచిస్తుందా, ఫీల్ అవ్వగలదా అన్న విషయం మీద ద్రుష్టి పెడితే నాకైతే వింత గా ఏమీ అనిపించలేదు. సమాజ కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి, మనిషి సంఘ జీవి కనక, బహుసా ఆవిడ తీసుకున్న నిర్ణయం అందరికీ నచ్చకపోవచ్చు, సమాజం తప్పు పట్టచ్చు. కాని ఇంకా ఆ వయస్సులో బాధ్యతలు అన్నీ తీరిన తరువాత కూడా తన మనస్సుకి నచ్చిన పనులు చేస్తూ, స్వతంత్రం గా జీవించాలనుకోవడం తప్పు కాదు.
ప్రేమ ఉన్న చోట "నీ" "నా" అన్న భేదాలుండవు..నిజమే! కాని భార్యా భర్తల అభిరుచులు ఒకటి కాకపోయినా, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ సహజీవనం చేస్తారు నిజమే! ప్రభావతి గారు చేసినది కూడా అదే! బాధ్యతలను చక్కగా నిర్వర్తించి, మనవలని ప్రేమగా చూసుకుంది..మానసికం గా అలసిపోయి తన కంటూ ఒక జీవితాన్ని, తను కోరుకున్న రీతిలో,జీవించాలనుకుంది.ఇది నిజం గా జరిగినదే అయితే ఆ ప్రభావతి గారి భర్తను, పిల్లలను అభినందించాల్సినదే! ఆమెని అర్ధం చేసుకున్నందుకు.

ఒక్కటి మాత్రం నిజం... కొన్ని రోజులు పూర్తి స్వతంత్రం అనుభవించినా, తనకు 42 సంవత్సరాల జీవితంలో అలవాటుగా చేసే పనులు అన్ని గుర్తొచ్చి తిరిగి భర్తతో , పిల్లలతో కలిసి జీవించడానికే ఆవిడ మనసు మొగ్గు చూపుతుంది. ఇది సత్యం! This is just a phase!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నేనైతే ప్రభావతి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తాను.
ఆమెని అలా కొన్నాళ్ళు మానసిక విశ్రాంతితో.. గడపనివ్వండి.
తర్వాత 15 ఏళ్ళ అమ్మాయిలా చైతన్యంతో.. తుళ్ళి పడతారు. నిజం.

చాతకం చెప్పారు...

కల్పితం అని చివర్లో రాయటం మర్చిపోయినట్లున్నారు?
సాంబారు పొడి ఆ లేక వండిన సాంబారా? ;)

అజ్ఞాత చెప్పారు...

:(

Pradyumnudu gaaru, pillalu at least valla amma ni ee matram cheyyanicharu. I wish my mom can do this as well. enta naligipothundo ee vayasulo inka inka panulu matalu ekkuvayi.

అజ్ఞాత చెప్పారు...

ఆలోచిస్తున్నా... ఒక్కోసారి ఇలాంటి వైరాగ్యం కలగటం అందరికీ సహజమే.

నేనైతే ఏంచేసేవాడిని? అనుకుంటే...
1)వంట చార్జి తీసుకుని, 3రోజుల్లో నా వంటలతో, బ్రతుకుతీపి అంటే ఏమిటో సోదాహరణంగా చూపించేవాడిని... విహ(వికటాట్ట హాసం)
2) ఆ సదవకాశాన్ని వుపయోగించుకుని మా వూరెళ్ళి మా పాత ఇంట్లో ఒంటరిగా ఓ 6నెల్లు గడిపేవాడిని
3) కోడలితో ఓ 3నెలలు గడపమని, కొడుకింటికి పంపేవాడిని :D
4) 'కాశీకి పోయాను రామాహరే' అంటూ, కమండలం పట్టుకుని కాషాయాంబరధారినై బైరాగులతో పాటు భంగు కొట్టే సదవకాశానికి...
5) ఎవరైనా స్నేహితుడితో మా ఆవిడకు నానడతపై వ్యూహాత్మక గుసగుస చెప్పినేవాడిని.. మళ్ళీ విహ

అజ్ఞాత చెప్పారు...

Don't you think that it is her fault ? She is the one who confined her self to her family.
Her children and husband are supporting her decision ( even though it is a weird decision), don't you think they would have offered her same support even before, if she wants to do something different ( learning something or pursuing her interest)

అజ్ఞాత చెప్పారు...

ఎంత చిన్నగీతైనా దాని పక్కన ఓ పెద్దగీత వుండాలి, అపుడే జీవితం గడిపినట్టుంటుంది అని హెడ్మాస్టరుగా పనిచేసిన పెదనాన్న గారు చిన్నతనంలో అనే వారు. అప్పుడర్థం కాలే... ఇప్పుడు చూచాయిగా అర్థమవుతోంది,ఏ బాధా లేని జీవితాల్లో కూడా ఏదో అసంతృప్తి వుంటుంది.

ఈ విడిపోవడం తాత్కాలికం బహుశ 3నెల్ల లోపే అనిపిస్తోంది, ఈలోపు ఎలాంటి ఎలక్ట్రానిక్ వుపకరణాలతో కాక అత్యవసరమైతేనే తప్ప కార్డు ముక్కలతో మాత్రమే సమాచారం కొనసాగించాలి.

పుట్టపర్తి సాహితీ సుధ - పుట్టపర్తి అనూరాధ చెప్పారు...

అవును ఆ భావనలు నిజం
ఏళ్ళకు ఏళ్ళు పిల్లలకు చేసి ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే మనకోసం కొన్ని ఘడియలు కూడా మిగలవు ఈ నిర్వేదం సహజమే కానీ అంత సులభంగ తెంచుకుని వెళ్ళటం మాత్రం అసహజం శలభంలా ఇందులో మాడిపోవటమే ఆ స్వేచ్చాభావాలన్నీ. చివరికి వాళ్ళకి మనకోసం ఆలోచించటానికి కాస్త సమయం ఉండదు.

జేబి - JB చెప్పారు...

:-(

ఐతే ముప్పైఏళ్ళ తర్వాత మా ఇంట్లో ఈ మాట రాకుండ ఇప్పటినుండే జాగ్రత్త పడాలి నేను!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీరాం గారికి,

అవును నిజమే ప్రభావతి, ప్రద్యుమ్నుల కధ ముగిసింది.
ధన్యవాదాలు.

శ్రీరామమూర్తి గారికి,

ధన్యవాదాలు. ఈ తరం వృద్ధులవి కొత్త సమస్యలు.

భాను కిరణాలు గారికి,

జంధ్యాల – బులుసు అయ్యేవారేమో......దహా.
ధన్యవాదాలు.

శశికళ గారికి,

ఇంకా సందేహమా ? ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

లక్షీదేవి గారికి,

మీకు నచ్చినందుకు, సహజంగా ఉంది అన్నందుకు ధన్యవాదాలు.

చిన్ని గారికి,

నిజంగా ఈ కధ, నా ఇతర కధల లాగా కల్పితమే. కానీ ఈ సమస్య ఈ తరం వృద్ధులలో ఉంది.
ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,
తప్పైపోయిందండి. ఇక్కడ ఇది వ్రాసి ఉండకూడదు. కానీ ఒక్కొక్కప్పుడు జరిగిపోతుంటుంది.
తొమ్మిది దెబ్బలకి పగలని మహా శిల పదో దెబ్బకి భగ్నమౌతుంది. ఈ తొమ్మిది దెబ్బలు కూడా పదో దెబ్బ వల్ల పగలడానికి దోహదం చేస్తాయి. 40 ఏళ్ల గా పడ్డ ఇక్కట్లు చివరి రెండు మూడేళ్ళకి పక్వానికోచ్చాయేమో.
ధన్యవాదాలు.

శ్రావ్య గారికి,

నిజమే ఇక్కడ వ్రాసి ఉండకూడదు. కధ నచ్చలేదు అన్నందుకు కొంచెం ఘట్టిగా ద్ధన్యవాదాలు....దహా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బోనగిరి గారికి,

అప్పదాసులు, బుచ్చిలక్ష్మిలు మిధునం లోనే ఉంటారు. ఇంకెక్కడా కనిపించరు....దహా.
ధన్యవాదాలు.

నరసింహ గారికి,

మధ్య తరగతి జీవితాల్లో ఈ వాదులాటలు సహజం. బహుశా ఒక రకమైన వినోదం కూడా.
ధన్యవాదాలు.

కావ్యాంజలి గారికి,

నవ్వండి అని పిలిచి మిమ్మల్ని బాధ పెట్టినందుకు చింతిస్తున్నాను.
ఈజీ గా కాదు బాధతో, మరో మార్గం తోచక తీసుకున్న నిర్ణయం. ఇది తప్పో రైటో ప్రభావతికే తెలియదు.
ధన్యవాదాలు.

sbmurali2007 గారికి,

నిజమేనండి. ఆ తరాలలో ప్రశ్నించేవారు కాదు. తన కోసం కాకుండా తన వాళ్ళకోసం కష్టపడేవారు. కాలం మారింది. ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. సమాధానాలు దొరకటం లేదు.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కష్టేఫలే గారికి,

వ్రాయండి. ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ధన్యవాదాలు.

జ్యోతిర్మయి గారికి,

నిజమేనండి. నాకూ నచ్చలేదు. కానీ మరో మార్గం నాకు తట్టలేదు. భర్త రెండు మాట్లు నిద్ర లేస్తే, నాలుగు మాట్లు దగ్గితే అంతగా ఆందోళన చెందే స్త్రీలకి విశ్రాంతి ఎప్పుడు? ఎలా? ఆ తరం వారి ఆలోచనా విధానం మారటం లేదు. విడిగా ఉంటే కూడా ఆలోచనలు మారవు. ఎదురుగా లేకుంటే కొంచెం ఆందోళన తగ్గుతుందేమో? కొంతలో కొంత విశ్రాంతి దొరుకుతుందేమో? తెలియదు.
అందరూ అల్లా లేరు. వారి సంఖ్య స్వల్పమే. కానీ సంఖ్య వేగం గా పెరుగుతోంది. అశాంతి పెరుగుతోంది.

క్షమాపణలు ఎందుకండీ. సమస్య కి ఇదో సమాధానం అనుకున్నాను. కాదని మీరు అంటున్నారు. అంతే....దహా.
ధన్యవాదాలు.

పంతుల గోపాలకృష్ణ రావు గారికి,

తమాషాకి కాదుగాని కధ కల్పితమే.
వ్యధా పూరితమైన సంసారాన్ని త్యజించి సన్యాసి అయ్యే వెసులుబాటు పురుషులకి ఉంది. స్త్రీలకి ఇది తక్కువేమో. వివాహ వ్యవస్థ లో కుటుంబం ఒక ముఖ్యమైన భాగం. ఒక తరం వారికే ఈ మమకారాలు, అనుబంధాలు ఎక్కువేమో అనిపిస్తుంది. కుటుంబంలో బంధాలు సడలుతున్నాయి. కొన్ని సందర్భాలలో నిలబెట్టడం కష్టమౌతోంది. సమాధానాలు దొరకడం లేదు.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పురాణపండఫణి గారికి,

ఇది పూర్తిగా కల్పితమే. ప్రభావతి, ప్రద్యుమ్నుడు రెండు కల్పిత పాత్రలే. మీ మనసుకు కష్టం కలిగించి నందుకు సారీ. నేను బ్లాగు శీర్షిక మార్చాలేమో?...దహా.
ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

మరీ అంత కోపమెందుకు మాష్టారూ. నవ్వండి అంటే వచ్చారు కానీ రండి ఏడుద్దాం అంటే వస్తారా మీరు?
ధన్యవాదాలు.

జలతారు వెన్నెల గారికి,

మీరు ప్రభావతి ఆలోచనా సరళి ని బాగా సమర్ధించారు. అందుకు అనేక ధన్యవాదాలు.
నేను కొంతమందిని చూసాను. కట్టుబాట్లు అనే చట్రంలో వాళ్ళు అలాగే విశ్రాంతి లేకుండా బతికేస్తున్నారు.

వనజవనమాలి గారికి,

మీకు కూడా అనేక ధన్యవాదాలు. నాతొ ఏకీభవించినందుకు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

చాతకం గారికి,

కల్పితమే. నిజంగా కల్పితమే.
వండిన సాంబారే. సందేహించకండి........దహా.
ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

నిజమేనండి. ఇటువంటి వారు మన చుట్టూ ఉన్నారు.
ధన్యవాదాలు.

SNKR గారికి,

ఇవన్నీ ప్రద్యుమ్నుడు కూడా చేసాడండి. అయినా కధ అంగుళం కూడా ముందుకు కదలలేదు.....దహా.
మీ పెద నాన్నగారు సరిగ్గానే చెప్పారు. ‘కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును’ అని అన్నారు ఓ సినీకవి.
కొన్ని గీతలు మనమే గీసుకుంటాము. కొన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్ల గీతలు ఉంటాయి. ఇవి దాటడమా , పరిధి లో ఉండడమా అన్నది సమస్య అవుతుంది, కొన్నిమాట్లు.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గారికి,

ఆ తరం సామాన్య స్త్రీలు కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా, వ్యక్తిగత అభిరుచులకి అంతగా ప్రాముఖ్యం ఇచ్చేవారు కారనుకుంటాను. ఎక్కడో ప్రతిభాశాలులు తప్ప.
ధన్యవాదాలు.

అనురాధ గారికి,

ధన్యవాదాలు ప్రభావతి తో ఏకీభవించినందుకు.
శలభాలలా మాడిపోవడమే ఇప్పటిదాకా సాధారణం గా జరుగుతోంది. కొంత స్వేచ్ఛ కలిగించగలమా అన్నది ఈ టపా ఉద్దేశ్యం.

జేబి-JB గారికి,

మరీ అంత ముందు జాగ్రత్త అవసరం లేదేమో మాష్టారు....దహా.
ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

మీరు వాస్తవాన్ని తలకిందులు చేశారనిపిస్తుంది. మద్యతరగతి ప్రజలు తల్లితండ్రులను ఓల్డ్ హొం లొ చేరుస్తారు తప్ప వాళా అంతట వాళ్ళే వెళ్ళరు పైకి వాళ్ళంటట వాళ్ళే వెళ్ళినట్టు కనిపించినా దాని వెనుక కుటుంభ సబ్యుల పాత్ర వుంటుంది. తల్లితండ్రులను చుచుకొవలసిన బద్యత వాళ్ళది కానట్టె వ్యవహరిస్తారు. అనేక అవమానాలకు గురిచేస్తారు. వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపొయెటట్టు చేస్తారు.

ఇక అట్టడుగు వర్గాలలొ అలాంటి ఆలొచనే రాదు.ఉన్నా అంత డబ్బుకర్చుపెట్టి చేర్పించే స్తొమత వుండదు. మంచాన పడివున్నప్పుడు కుడా చాలా జాగ్రత్తగా చుచుకుంటారు. బాగా బలిచిన కుటుంబాలలొ వాళ్ళుకుడా ఓల్డ్ హొం లొ చేర్పించరు డబ్బు పులిచిపొతూ వుంటుంది కాబట్టి మనుషుల్నిపెట్టి చేయిస్తారు. అటూ ఇటూ కాని మద్యతరగతి ప్రజలలొనే ఈ జాడ్యం ఎక్కువ. మీరన్నట్టు వాళ్ళంతట వాళ్ళే వెళ్ళరు.

Kottapali చెప్పారు...

sir, just want to say - Namaste!

అజ్ఞాత చెప్పారు...

maa daddy ki ,.. mavayagariki mee post fwd chesaanu.. tasmaath jaagartha ani :) nice post..

Swathi SY చెప్పారు...

Its really good and very realistic.
I feel the same way as prabhavathi feels... even I am just 29.

Swathi SY చెప్పారు...

Its really good and very realistic.
I feel the same way as prabhavathi feels... even I am just 29.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గారికి,

జీవన విధానాలు మారుతున్నాయి. పిల్లలకి, ప్రేమ అభిమానం ఉన్నా, కొంతమంది తల్లి తండ్రులు వృద్ధాశ్రమాలకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అన్ని తరగతులు వారు వెళుతున్నారు. బాగా డబ్బున్న వాళ్ళకి సకల సౌకర్యాలతో రిసార్ట్స్ లాంటి హోమ్స్ ఉన్నాయి. బాగానే నడుస్తున్నాయి అని విన్నాను.
ధన్యవాదాలు.

నారాయణ స్వామి గారికి,

ధన్యవాదాలు. థాంక్స్.

అనానిమస్ గారికి,

ధన్యవాదాలు. ఇందులో పిల్లల బాధ్యత కూడా ఉంది.

స్వాతి గారికి,

ధన్యవాదాలు. ప్రభావతి తో ఏకీభవించినందుకు సంతోషం.

CP చెప్పారు...

చాలా బాగా ఉందండీ. కుటుంబంలో ఆనాటికీ ఈనాటికీ ఒక స్త్రీ పరిస్థితి ఇలాగే ఉంది అనిపిస్తుంది. ప్రేమాభిమానాలు కరువని నేను అనను కానీ, తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోలేని పరిస్థితిలోనే ఇంకా మహిళలు ఉన్నారు. మానసిక విశ్రాంతి? ఎంత చక్కగా చెప్పారు!