పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంక సెలవు.


 సుమారు రెండున్నర ఏళ్ల క్రితం అనుకోకుండా  కూడలి లో  అడుగుపెట్టాను. ఇక్కడ ఇలాంటి ప్రపంచం ఉందని అంతకు ముందు  నాకు తెలియదు. తెలుగు బ్లాగులు  చదవడం అలవాటు అయింది. ఓ శుభ ముహూర్తాన నేను కూడ బ్లాగ్ ఓపెన్ చేసాను. కానీ ఏం రాయాలో తెలియలేదు.  అప్పటికే మా కాలనీలోని  ‘స్నేహ సమాఖ్య’  ప్రచురించే  ‘లిఖిత’  కోసం మూడు నాలుగు కధలు వ్రాయడం జరిగింది.   ‘అవి ఇందులో వేసేద్దాం. ఆ తరువాత చూద్దాం’  అనుకొని మొదటి టపా వేసాను. అది నేను చేసిన మొదటి పొరపాటు. ఆ టపా శీర్షిక కొంచెం పెద్దదే.

‘మీ సమస్యలకు వాస్తు భీకర, జ్యోతిష భయ౦కర, మానసిక భీభత్స సుబ్రహ్మణ్యావధానులుగారి సమాధానాలు’ 

ఇది చదివిన తరువాత,  నేను నేనుగానే వ్రాస్తున్నాను అనే అభిప్రాయం అందరికీ కలగటం లో ఆశ్చర్యం లేదు. పైగా నాకు  మొదటి పురుష (First person) లో వ్రాయడం అలవాటు అయిపొయింది.  ఆ తరువాత  ‘తెలుగదేలా అనే అంటాం’  లోనూ  ‘వీరీ వీరీ గుమ్మడి పండు, వీరి పేరేమి’  లోనూ కూడా సుబ్రహ్మణ్యం అనే పేరునే ఉపయోగించడం జరిగింది. నా తెలివితక్కువ తనాన్ని గ్రహించి,  నేను ఆ తరువాత టపాల్లో,  నేను నేను కాదు. నేను వేరే,  కధలో వాడు వేరే అని సంజాయిషి ఇచ్చుకున్నాను.

 “నీ మొహం,  మేం నమ్మం,
నువ్వు = వీడు = వాడు,
దేర్ ఫోర్, నువ్వు = ఆల్”
  
అని లెఖ్ఖలేసి  మరీ చెప్పారు  కొందరు పాఠకులు.  అప్పుడు నేను దీర్ఘంగా ఆలోచించి, నిశితంగా పరిశీలించి, క్షుణ్ణంగా పరిశోధించి, సమగ్రంగా  క్రోడికరించి,  ప్రద్యుమ్నుడు  &  ప్రభావతి  అనే రెండు పాత్రలని ప్రవేశ బెట్టాను. కధ నేను గా వ్రాసినా, 

నేను = ప్రద్యుమ్నుడు,
మా ఆవిడ = ప్రభావతి,
దేర్ ఫోర్,   నేను = నేను కాదు,

అని చెప్పాను. ఆ పేర్లే ఎందుకు పెట్టాను అంటే  అప్పుడు నేను ప్రభావతి ప్రద్యుమ్నం చదువుతున్నాను. ఆ పేర్లే నోటిలో నలుగుతున్నాయి కాబట్టి  అవే పెట్టానన్నమాట. అయ్యా/అమ్మా అదీ సంగతి.

సరే ఇప్పుడీ గోలెందుకు అంటున్నారా ? వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా. చివరాఖరన సినిమాలో పతాక సన్నివేశానికి ముందు సీనులో, చచ్చే తన్నులు తిని, పశ్చాత్తాప పడిన విలన్ ని క్షమించేసి,  చిరునవ్వు నవ్వే గుమ్మడి, కన్నాంబల లాగ మీరు కూడా నన్ను మన్నించేసి,

 ‘నేను వేరు, కధలో ప్రద్యుమ్నుడు వేరు’ 

అని నమ్మేసారని నమ్మకంగా నమ్మేసాను. 

అయినా,   అప్పుడప్పుడు కొందరు, 

కధలో ప్రద్యుమ్నుడు = నిజంగా నేను, 
  
అనే భావనతో కామెంటు పెట్టినా, నేను విశాలహృదయంతో అర్ధం చేసుకొని, “పాపం, వీరికి చరిత్ర తెలియదు” అని సమాధాన పడ్డాను. ఒకటి రెండు మాట్లు  మళ్ళీ

నేను నేను కాదు, వీరు వేరే, వారు వేరే, నేను వేరే 

అని మొర పెట్టుకున్నాను. కుయ్యో మొర్రో అని ఆక్రోశించాను.  నమ్ముమా నా మాటా ఓ పాఠకా అని శంకరాభరణ రాగం లో పాడేను. (క్షమించాలి, శంకర శాస్త్రి గారి పుణ్యమా అని అది  నాకు తెలిసిన రెండో  రాగం. (మొదటిది, మీరందరూ కూడా నిష్ణాతులైన ఆరున్నొక్క రాగం).

అయినప్పటికీ కూడా  కొద్ది మంది, బహు కొద్ది మంది నన్ను ఇంకా అనుమాన దృక్కులతో వీక్షిస్తున్నారని,  తెలిసినా  చేసేదేమీ  లేక దుఃఖాక్రాంతుడనై,   బ్లాగు జనుల మనంబున గల అనుమానమును నివృత్తి చేయుమని  ఆ యొక్క శ్రీమన్నారాయణుడిని  ప్రార్ధించుచూ బ్లాగులలో కాలము గడిపేస్తున్నాను .

మొన్న 2012 డిసెంబర్ నాలుగవ తారీఖున మాములుగానే, 
 
అను శీర్షిక తో  ఒక టపా వేసాను .  ఆనాడు కామెంట్లు చూసి జీవిత సత్యమును  గ్రహించాను.  ఒకరిద్దరు టెలిఫోన్ చేసారు. ఏలూరు లోనే ఉన్నారన్న మాట అని ఆనందించారు.  ఒకరిద్దరు టెలిఫోన్ చేసి,  మమ్మల్ని అడుగుతున్నారు మీ గురించి “ వాట్ డు ఐ డు ?”  అని ప్రశ్నించారు.

పుట్టి మునిగింది , మిన్ను విరిగి మీద పడింది. ఉల్కాపాతం జరిగింది , నక్కలు  ఊళలు వేశాయి,  తీతువులు అరిచాయి, గుడ్లగూబలు  మరియూ గబ్బిలములు  పట్టపగలు ఎగిరేయి, అగ్ని పర్వతములు బద్దలు అయ్యాయి , భూకంపాలు  వచ్చాయి , సముద్రాలు అల్లకల్లోల మయ్యాయి ,కారు మేఘాలు కమ్ముకున్నాయి, ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిసాయి, కుంభ వృష్టి కురిసింది,  నదులు, వంకలు, వాగులు, పొంగి ప్రవహించాయి , ఫెళఫెళా  రావములతో మహా వృక్షములు కూలాయి . (కొంచెం ఆయాసం తీర్చుకోనియ్యండి).

జీవిత సత్యమనగా, 

రాజనాల = రాజనాల = రాజనాల 

అనగా రాజనాల ను విలన్ గానే చూస్తారు కానీ మరోలా ఉహించుకోలేరు.  

పాతాళ భైరవి మాయల ఫకీరు రంగారావు ని, ఆత్మ బంధువులో  అనగనగా ఒక రాజు గానూ, మిస్సమ్మలో మంచివాడుగాను గుర్తించగలరు,  కానీ రాజనాలని  మంచి వేషం వేయనివ్వరు.
 
చాలా మంది కధలో,

నేను = ప్రద్యుమ్నుడు 
     
ప్రద్యుమ్నుడు ఈజ్ నాట్ = సుబ్రహ్మణ్యం

అని గుర్తించరని  నాకు  నిర్ద్వందంగా, నిస్సంశయంగా, నిస్సందేహంగా, నిరంకుశంగా , నిరాఘాటంగా , నిరాటంకంగా, నిశ్శేషం గా. నిర్మొహమాటంగా , నిశ్చయంగా     అవగతమై పోయింది.

ఇది పూర్తిగా నా స్వయంకృత అపరాధమే నని తెలుసు. కధలలో జోర్హాట్ అన్నాను. అస్సాం అన్నాను, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నాను. నాకు పుట్టిన భూమి మీద ఎంత మమకారం ఉందో, 30 ఏళ్లు ఉద్యోగం చేసిన ఊరి మీద కూడా అంతే మమకారం ఉంది.  అందుకని,  నా ఆలోచనలలో, ఉహల్లో  జోర్హాట్ ఎక్కువగా ఉండేది. అందుకని నా వ్రాతల్లో కూడా వచ్చేది.  

తెలుగులో వ్రాయాలనే సరదాయే కానీ వ్రాయడం లో అనుభవరాహిత్యం వల్ల,   ఈ పొరపాటు జరిగింది.  ఆ పొరపాటు తప్పించుకుందా మనుకున్నా తప్పుకోకుండా  కొనసాగింది.

ప్రద్యుమ్నుడు, ప్రభావతి విడాకులు తీసుకున్నారని చదివి, అది మాకే అన్వయించుకొని  
బాధపడ్డవారందరికీ  క్షమాపణలు చెప్పుకుంటున్నాను.  

ఇదివరలో కధలో పాత్రగా నన్ను గుర్తించడం వల్ల  నాకు బాధ కలగలేదు,  కానీ ఈ టపా వల్ల ఇప్పుడు  కొంచెం ఇబ్బంది అనిపించింది.  ఈ ప్రద్యుమ్నుడిగా గుర్తింపు నుంచి బయటకు వెళ్లాలనిపించింది.  ఇది రెండవ  కారణం. 

ప్రభావతీ ప్రద్యుమ్నులు ఎలాగూ విడిపోయారు. కలిసే అవకాశాలు కనిపించటం లేదు. అందుచే బ్లాగులో నేను  వ్రాయటానికి ఏమీ లేదు.  వ్రాయాలంటే  నేను మరో టాపిక్ వెతుక్కోవాలి. ఇది ఇప్పుడు అవసరమా అనిపించింది. ఇది మొదటి కారణం.

{భావోద్వేగ వివశుడ నైనందున [(అర్ధం అడగకండి ) ఈ మధ్యన మా మనవరాళ్ళ కి లెఖ్ఖలు నేర్పే  ప్రక్రియ లో బ్రాకెట్లు పెట్టడం మాత్రమే  నేర్చుకున్నానని తెలుపుటకు గర్వించు చున్నాను ]  రెండవ కారణం మొదట వ్రాయడమైనది. క్షమించగలరు.}

అందువల్ల ఇందుమూలంగా,  నవ్వితే నవ్వండి పాఠకులకు, అభిమానులకు, బ్లాగుబంధువులకు, మిత్రులకు, సకల జనానీకానికి తెలియచేయునది ఏమనగా ఇకపై ఈ బ్లాగులో నేను ఏమీ వ్రాయను. ఇక పై,  టపాలు ఈ బ్లాగులో ఉండవు.

బ్లాగునే డిలీట్ చేద్దామనుకున్నాను కానీ, ఎప్పుడైనా నేను చదువుకొని నవ్వుకుందామని, నాలాగా ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవాలంటే ఉండాలని  అట్టే పెట్టేస్తున్నాను.

రెండున్నర  ఏళ్ళగా నన్ను అభిమానించి, ప్రోత్సహించిన  పాఠకులకు, మిత్రులకు, బ్లాగ్ బంధువులకు, గురువుగారూ అని ఆప్యాయంగా పిలిచే శిష్యులందరికీ బ్లాగ్ముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

కూడలి, మాలిక, జల్లెడ,హారం, సంకలిని,   తెలుగుబ్లాగులు, వంద తెలుగు బ్లాగులు ఇత్యాది సంకలినులకు, నా బ్లాగును వారి వారి బ్లాగుల్లో చూపించిన మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.

కామెంట్లలో కానీ మరెక్కడైనా కానీ,  ఎప్పుడైనా తెలియకుండా,  ఎవరికైనా కష్టం కలిగించేటట్టు వ్రాసినా, ప్రవర్తించినా పెద్దమనసుతో నన్ను క్షమించమని కోరుతున్నాను.

మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ,
                        నేను శలవు తీసుకుంటున్నాను.  


Comments

Narsimha said…
వయసు మీరి విశ్రాంతి తీసుకుందాం అని బ్లాగు మానేస్తే పర్వాలెదు.....మీ శ్రేయొభిలాషులం కనుక సర్దుకుపోతాం మీ టపాలు లెకుంటే పాతవే నెమరు వెసుకుని చదువుకుంటాం......కాని ఒక్క మాట నిజం మీ టపాలు లేకపోతే....ఊహించలెకున్నాను,మీరెక్కడో ఏలూరు నేను మీ బ్లాగుని మొదటి సారి చూసింది కలకత్తా లో... ఇప్పుడు బెంగులూరు లో...సొంత ప్రదేశం హైదరాబాద్ ....మీ బ్లాగు వల్ల కష్ట కాలం లో కూడా నవ్వ గలిగాను చాలా కృతఙతలు


ఏప్పటీలానే కథ లో మలుపుల లాగా మీరు మళ్ళీ రాస్తారని ఆశిస్తూ....
Chinni said…
సుబ్రమణ్యం గారు,
క్షమించాలి మీరు = ప్రద్యుమ్నుడు అని అనుకున్న వాళ్లలో నేను కూడా ఉన్నాను. ఇప్పుడే మీ వివరణ చదివిన తర్వాత బాధగా అనిపించింది. మీరు ప్రభావతి,ప్రద్యుమ్నుల కథని ముగించారు కాబట్టీ దానికి మాత్రమే సెలవంటే బావుండేది. ఈ విరామం కొన్ని రోజులే అవ్వాలని..మళ్లీ మంచి మంచి నవ్వులతో మా ముందుకు వస్తారని ఆశిస్తూ...
గురువుగారు ఈ తలుపు మూసినా మరో కొత్త తలుపు తెరిచి రచనావ్యాసంగాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
Anonymous said…
అమ్మయ్య! నాకో మార్గదర్శకులు దొరికారోచ్!! "టపాలు ఈ బ్లాగులో ఉండవు" ఇదేదో అనుమానాన్ని సూచిస్తూ ఉంది. మరొక బ్లాగులో కనపడతారనమాటా!!!
బులుసు గారు.. మీ ఈ పోస్ట్ చదివిన తర్వాత ఒక విషయం చెప్పాలనిపించింది.

ఒక రచయిత ఏదైనా కథ వ్రాసేటప్పుడు.. కథ వస్తువు ఏదైనా.. ఆ కథలో వచ్చే పరిసరాలు, చుట్టూరా ఉండే మనుషుల స్వభావాలు గురించి చెప్పాలంటే..ఆ రచయిత వ్యక్తిగత అనుభవాలు,రచయితకి పరిచయం ఉన్న ప్రదేశాలు లేదా రచయిత నివశిస్తున్న ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని వర్ణిస్తారు. అతనికి ఆ ప్రదేశాలు ఆ మనుషులతో ఉన్న అనుబంధం అలాంటిది.

తన స్వీయ అనుభవంని రచనలో జొప్పించడం సర్వసాధారణం. అందువల్ల ప్రతి రచన అతని స్వంత అనుభవమే అయిఉండదు.

చాలా కథలు నేను వ్రాసినప్పుడు ..అవి నావ్యక్తిగతం అనుకుని ఊహించుకున్న వారు ఉన్నారు. మనకే కాదు ప్రతి రచయితకి అలాంటి అనుభవం ఎదుర్కోక తప్పదు. అందుకే నేను చేపుతూ ఉంటాను.

"రచన ని రచనగానే చూడండి. రచయితకి ఆపాదించకండి " అని.

మన పాఠకుల ఆలోచనా విధానం మారనంతవరకు .. రచయిలకి ఇలాంటి పాట్లు తప్పవు.
అది అర్ధం చేకుంటే బావుంటుంది.

మీ పై అభిమానం తో.. మిమ్మల్ని పలకరించి మీ రచన మీ స్వంతం కాదని రూడీ పర్చుకున్నవారు అందరూ..మీ అభిమానులే అయి ఉంటారు. క్షమించేయండి..

యదావిధిగా నవ్వులు పూయించండి . మీ posts కొరకు ఎదురు చూస్తుంటాం.
Anonymous said…
సచిన్ కంటే గొప్ప decision తీసికున్నారు...
anrd said…
This comment has been removed by the author.
anrd said…
This comment has been removed by the author.
అయ్యా జుబోర్ మన్ వాన్ మం గారు ఈరోజు ఏప్రిల్ 1 కాదే ....పోనీ dec 22 న యుగాంతం కుడా లేదు అంటున్నారు ...మరెందుకు మీరు ఇంతంటి కఠిన నిర్ణయం తీసుకున్నారు ..... నేనైతే ప్రద్యుమ్నుడిని ఘ్రాతాచి అభిమానిగాను మిమ్మన్ల్ని మీగానే చుసా మహాప్రభో ...........
Anonymous said…
నలభై ఏళ్ళు కాపురం చేసి, ముఫ్ఫై ఏళ్ళు అస్సాం లో ఉండీ మీకు చర్మం దళసరి కాలేదంటే ఏమి చెప్పమంటారు? ఒక్క పోస్ట్ వేసారు, ఎవరో ఏదో అన్నారుటా, ఇప్పుడే తోక ముడిచేసి పారిపోతున్నారు. సిగ్గు సిగ్గు గురువుగారు. చొక్కా విప్పి భీకర ధండ ధధాండ ధాండ .. అని మళ్ళీ మీరు ఇంకో పోస్ట్ రాయకపోతే ఈ బ్లాగులోకమ్మీద ఒట్టే. అలా రాస్తూ ఉండకపోతే మాకు నవ్వుకోడానికి ఏమిటీ దిక్కు?

ధైర్యం అంటే పెళ్ళాం చేతిలో నెలాఖర్న జీతం పోయడం, సిగరెట్లు కాల్చడం కాదు గురూగారూ. ధైర్యం అంటే చలికాలం ఏలూరు ఎండల్లో చొక్కా విప్పి కంప్యూటర్ ముందు కూర్చుని ప్రపంచం అంతా సర్దాగా నవ్వుకునే ఒక పోస్ట్ రాయడం (వెనకనుంచి ప్రభావతి గారు గుణుస్తున్నా సరే). అర్ధం అయిందాండి? లేకపోతే బెత్తం పట్టుకుని ఏలూరు రమ్మంటారా?
anrd said…
* సర్ ! నేను క్రిందటి టపాను చదివాను కానీ, వ్యాఖ్యానించలేదండి.
* వనజ గారు చెప్పినట్లు రచయితలు వ్రాసేది వారి స్వంత అనుభవాలే కానవసరం లేదు. సమాజంలో జరుగుతున్న సంఘటనలను గురించి, మనకు తెలిసిన వారి జీవితాల నుంచి, కొన్ని ఊహించి కూడా రాస్తుంటాము.
* అవన్నీ చదివి , రచయిత స్వీయ అనుభవం కాబోలు అని కొన్ని సార్లు పాఠకులు అపోహపడుతుంటారు.
* గుండెనొప్పి అంటే ఎలా ఉంటుందో అనుభవించే తెలుసుకోనవసరం లేదు. గుండెనొప్పితో గిలగిలలాడే వ్యక్తులను చూసినా ఎదుటివారికి ఆ బాధ తెలుస్తుంది.
* అలాగే కధలను రాయాలంటే స్వీయానుభవమే కానవసరం లేదు. సమాజంలో జరిగే సంఘటనలను చూసి కూడా విశ్లేషించి చక్కటి కధలను వ్రాయవచ్చు.
* సమాజంలో జరుగుతున్నట్లే , బ్లాగుల్లో కూడా అపోహపడటం, తరువాత అర్ధం చేసుకోవటం సాధారణమే అని భావించి, దయచేసి, మళ్ళీ మీరు చక్కటి రచనలను అందిస్తారని ఆశిస్తూ....

చాతకం said…
You are punishing majority of good followers of blog due to a few minority critics? It's their fault if they don't understand the difference between reality and fiction. May be a disclaimer would help (kalpitam) in the end or header of blog.
-- we miss you Sir. Like me, you too can continue posting on blogs/comments with anonymous pen name instead of real name, no headaches at all. ;) Wish you all the best!

"ఏంటండీ.. మీరు మరీనూ...
హత్యల గురించి రాసేవారందరూ హత్యలు చేసే రాస్తున్నారా..మరీ చోద్యం కాకపోతే...హన్నా..."
అని మిమ్మల్ని ఎవరైనా కోప్పడితే ఎంత బాగుండునూ..
మీరు బ్లాగు మొదలుపెట్టినప్పుడు శుభాకాంక్షలు చెప్పాను కదా...నా శుభాకాంక్షలకి అస్సలు విలువ లేకుండా చేస్తారా.. కాస్త అదైనా గుర్తు చెసుకోండీ.. ద.హా..
Anonymous said…
Please dont stop writing.
Maku blogs thappa vere time pass ledu.
మీరు రాయకపోతే మమ్మల్ని ఎవరు నవ్విస్తారు? ఎవరు నవ్వును గుర్తుచేస్తారండీ?

మాకోసం కాకపోయినా మీకోసమైనా మీరు రాస్తూ ఉండండి. అవి మాకు కనిపించకుండ ప్రైవేటుగా పెట్టండి, లేదా మీకు నచ్చిన, చదవాలని కోరుకుంటున్న నావంటివారిపై దయ ఉంటే కోద్దిమందికి మాత్రమే కనిపించేటట్లు సెట్టింగ్స్ మార్చండి.

అలాగే మీ దహాలు, విహాలు మామీద వదలడం మాత్రం మానకండి.
స్పందించిన మిత్రులందరికీ నమస్కారం. ధన్యవాదాలు.

నేను ఈ బ్లాగులో రాయలేక పోవడానికి మొదటి కారణం, నేను చెప్పిందే. ప్రద్యుమ్న ప్రభావతీయం సమాప్త మవడమే. ప్రభావతీ ప్రద్యుమ్నుల మీద చాలా కధలే వ్రాసాను. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు వ్రాసేవాటిలో వైవిధ్యం కనిపించటం లేదు. నిజం చెప్పాలంటే నేను వ్రాసినవి నాకే నచ్చటం లేదు. ఒకే సబ్జెక్ట్ మీద ఎక్కువగా వ్రాయడం కూడా బాగుండదని భావించాను.

ప్రద్యుమ్న ప్రభావతీయం సమాప్తం చేయడానికే ‘ఔను వారిద్దరూ విడిపోయారు’ వ్రాసాను. అందుకనే అదే మొదటి కారణం అని కూడా వ్రాసాను.

ఈ బ్లాగులో చివరి టపా సీరియస్ గా వ్రాయకూడదు అనే కోరిక వల్ల రెండవ కారణం హైలైట్ అయింది. కొంతమంది నిజంగానే చాలా బాధపడ్డారు అన్న విషయమే నాకు ఇబ్బంది కలిగించింది. వారికి క్షమాపణలు చెప్పుకునే ఉద్దేశ్యం తోనే ఆ కారణం హైలైట్ చెయ్యడం జరిగింది.

ఇది నా పొరపాటు. ఈ బ్లాగు మూసెయ్యడానికి, కొంతమంది నిజమే అనుకున్నారు అన్నది ప్రధాన కారణం కాదు.

ఈ చివరి టపా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమించండి. అందరికీ మరోమారు మనఃపూర్వక ధన్యవాదాలు.

ఏమో గుర్రం ఎగరనూ వచ్చు. మంచి సబ్జెక్ట్ దొరికితే ఇంకో బ్లాగులో, చాతకం గారి సలహా ప్రకారం, మరో పేరుతో నేను రానూ వచ్చు. మీరంతా నవ్వుతూ ఉండాలి అని నా కోరిక. నవ్వుతూనే ఉండండి.

ఈ బ్లాగులో కామెంట్లు డిసేబుల్ చేస్తున్నాను. మన్నించండి. ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా email--- srisubrahlaxmi@gmail.com