నా 25567వ సూర్య దర్శనం

ఉదయమే ఏడున్నర గంటలకల్లా ఇంట్లోంచి బయటకు వచ్చి,  ఎదురింటి పెరట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మల సందులో నుంచి సూర్య దర్శనం చేసుకున్నాను. రోజూ ఈ టైములో చేసుకోను. ఉదయం పది, పదిన్నర మధ్య పక్కింటాయనతో బాతాఖానీ చేసేటప్పుడు మాత్రమే ఆ రోజుకి ప్రధమ సూర్యదర్శనం చేసుకుంటాను. కానీ ఈ రోజు నాకు  ముఖ్యమైన రోజు కాబట్టి ముందుగానే చేసుకున్నాను. అల్లాగని ప్రతీ ముఖ్యమైన రోజూ ఇంత తొందరగా దర్శించుకోను. అయినా నా బతుక్కి ముఖ్యమైన రోజులు అంటూ ఏముంటాయి లెండి. అన్ని రోజులు  ఒకేలా ఉంటాయి. రోజూ సుమారు ఏడు గంటలకి లేవడం, కాఫీ అని అరవడం, వస్తున్నా అని ఆవిడ అనడం, అన్న పావుగంటకి ఆమె తేవడం, ఈ లోపున నేను రెండు సిగరెట్లు తగలేయడం, తాగిన తరువాత మరొకటి కాల్చేయడం, (హెచ్చెరిక :- సిగరెట్టు తాగుట మీ శరీరమునకు హానికరము. కాన్సరు కలిగించును. ఊపిరితిత్తులను నాశనము చేయును. ఎదుట, పక్కన ఉన్నవారికి కూడా హాని చేయును.), ఆ తరువాత పేపరు పఠించడం, కాలకృత్యాదులు, ముఖ ప్రక్షాళన తరువాత అల్పాహారం మెక్కడం (అదేమిటో,  మా ఆవిడ మెక్కడానికి దయచేయండి అని బహు గౌరవంగా పిలుస్తుంది.), ఇత్యాదులన్నీ క్రమం తప్పకుండా ఒక అరగంట అటూ ఇటూలలో జరిగిపోతాయి ప్రతీరోజూ.

మరి ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి అంటే, నిజంగా ఏమీ లేదు. నిన్నరాత్రి నిద్ర పట్టక, చేయటానికి ఏమీ లేక ఒక నిర్ణయం తీసుకున్నాను. “రేపటి నుంచి జీవితాన్ని పునరావలోకన చేసుకోవాలని”.  రేపే ఎందుకు అని ఎవరైనా అడిగితే,  25567 వ సూర్య దర్శనం అని చెప్పుకోవటానికి అన్నమాట.  బ్లాగుల్లో నా 239వ దినం (ఇక్కడ)  తరువాత మరే పవిత్ర దినము దొరక్క కూడా.   ఈ అంకె కూడా నిన్న రాత్రే లెఖ్ఖించాను. అరగంట పైన పట్టింది. లీపు సంవత్సరాలు కూడా లెఖ్ఖకట్టి మరీ తేల్చాను ఈ అంకె. నా జన్మ సమయం రాత్రి 11-49   నిముషాలు అవటం వల్ల ఒక రోజు కలపాలా వద్దా అని తీవ్రంగా చింతించాను. ఈ టైం కూడా ఎంత కరెక్టో కూడా తెలియదు. నేను ఈ లోకోద్ధరణ కోసమై అవతరించిన సమయం,   మా నాన్నగారి  జేబు  గడియారం  12-11 అంటే,   మా తాతగారి గోడ గడియారం 11-57   చూపించింది,   మంత్రసాని నడుముకి కట్టుకున్న  గడియారం 11-49  అంటే,   FA చదువుతున్న మా మేనమామ కొడుకు చేతి గడియారం  12-02  చూపించింది.  ఇన్ని గడియారాలు వాటి వాటి సమయాలు అవి చూపిస్తే,  మా ఇంటి సిద్ధాంతి, అన్నిటికి లెఖ్ఖలు కట్టి  11-49 జాతకానికి అన్నిటికన్నా బాగుంది అనడంతో అదే నిర్ణయించారు.  మా పితామహులు,  భూత,  ప్రేత పిశాచాలు  తిరిగే వేళ పుట్టిన వాడికి ఏ టైము అయితే ఏమిటి? అని వాకృచ్చారని  మా మాతావహులు నొచ్చుకున్నారని మా అమ్మగారు చింతించారని మా మేనత్త గారు నాకు చెప్పారు కూడా. అందుకని ఒక రోజు తగ్గించాను.   

అందరూ పూర్ణ చంద్ర దర్శనం లెఖ్ఖలు వేస్తారు కదా, మీరేమిటి సూర్య లెఖ్ఖలు వేశారు అనే సందేహం మీకు రావచ్చు. సూర్యుడు నాకు మల్లె కష్టజీవి. రోజూ వస్తాడు. తన పని తను చేసుకుపోతాడు. చంద్రుడు నెలకి ఒక రోజు శలవు పెడతాడు. కొన్ని రోజులు ఆలశ్యంగా డ్యూటీకి వస్తాడు. కొన్ని రోజులు పెందరాళే వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు ఇలా వచ్చి సంతకం పెట్టి అలా వెళ్ళిపోతాడు.  వచ్చిన వాడు తన పని చేసుకోకుండా చుక్కలతోటి సరాగాలాడతాడు. నేను కూడా సూర్యుడికి మల్లె శలవులు పెట్టకుండా డ్యూటికి వెళ్ళేవాడిని. శని, ఆదివారాలైనా ఆఫీసులోనే గడిపేవాడిని. ఇంటి కన్నా ఆఫీసే పదిలం, క్షేమకరం అనుకునే వాడిని. అందుకనే సూర్యుడే నాకు మార్గదర్శి. 

సూర్య దర్శనానంతరం జీవితం లోకి వెనక్కి టైం ట్రావెల్ చేశాను.  మరీ ఆరేడు సంవత్సరాల వయసుకి వెళ్ళిపోయాను కాబట్టి ఏమీ గుర్తుకు రాలేదు. నాకు మతిమరుపు ఎక్కువ. అందులోనూ చిన్నప్పటి విషయాలు అసలు గుర్తుకు రావు. అయినా చిన్నప్పుడు ఏమున్నాయి కనక గుర్తుకు తెచ్చుకోవటానికి.  కరెంటు, రేడియో, లాంటివి లేవు. క్రికెట్ లాంటి ఆటలు లేవు. ఎప్పుడైనా నెలకి ఒక సినిమా.  మా ఇంటి దగ్గర వీరమ్మ చెరువు, అక్కడ ఆడిన చెడుగుడు, బచ్చాలాట తప్ప మరేమి లేవు. చొక్కాలు చింపుకోవడం, ఇంటికి వచ్చి తన్నులు తినడం లీలగా గుర్తుకు వచ్చాయి. ఆలోచించగా ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఆ వయసులో తరుచుగా నన్ను ఒక ప్రశ్న వేసేవారు పెద్దవాళ్ళు. “పెద్దైన తరువాత ఏ ఉద్యోగం చేస్తావురా?” తడుము కోకుండా చెప్పేవాడిని. “లారీ డ్రైవర్” అని. వాళ్ళు నవ్వేవారు. అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగేవారు. నేను అదే సమాధానం చెప్పేవాడిని. వాళ్ళు మళ్ళీ మళ్ళీ నవ్వుకునేవారు. మా ఇంటి పక్కన ఒక లారీ యజమాని ఉండేవాడు. రెండు మూడు రోజులకొకమాటు లారీ తీసుకొని డ్రైవర్ వచ్చేవాడు. వాడు లారీ ఎక్కడం నాకు మహా గొప్పగా అనిపించేది. ఒక కాలు చక్రం మీద వేసి,  ఒక చేతితో తలుపు పట్టుకొని సీట్లోకి జంపు చేసేవాడు రెండో చేతిలో బీడితో, బీడి నుసి కూడా రాలకుండా.  నాకది సర్కసు ఫీటులా అనిపించేది. ఆ ఫీటు చెయ్యడానికే నేను లారీ డ్రైవరు నవ్వాలని కోరుకునే వాడిని.

నాల్గైదు ఏళ్ల తరువాత సినిమా ఆపరేటర్ కానీ సినిమా హాల్లో గేటు దగ్గర టికెట్ చింపే ఉద్యోగం కానీ చెయ్యాలనుకునే వాడిని. ఆ రోజుల్లో  సినిమాలు బ్రహ్మండంగా విడుదల అయ్యేవి. త్వరపడండి,  నేడే చూడండి అని రోజూ  అనేవారు రిక్షాలో కరపత్రాలు పంచుతూ. నెలకో,  నెలా పదిహేను రోజులకో మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఈ లోపున సినిమాలు మారిపోయేవి. మా భీమవరంలో   మూడు హాళ్ళు,   మారుతి, స్వామిజీ, వెల్కం ఉండేవి.  సినిమాలు తరుచుగా చూడాలనే కోరికతో ఆ ఉద్యోగాలు చేయాలనుకునే వాడిని.

ఇంకో రెండేళ్ళ తరువాత మా ఇంట్లో నా మీద ఆశలు పెంచేసుకున్నారు మా వాళ్ళు. మా నాన్న నేను ఇంజనీరు కావాలనుకునే వారు. మా అమ్మ డాక్టరు నవ్వాలని చెప్పేది. మా బామ్మ కలెక్టరు కావాలని అనేది. మా అక్కయ్య దగ్గర డబ్బులు కొట్టేసి దొరికిపోయినప్పుడు “అడుక్కు తింటావురా వెధవా” అని దీవించేది.  వీటిలో ఏ ఉద్యోగం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచించేవాడిని.  చివరిదే నీకు సూటవుతుందనే వారు మిత్రులు, తెచ్చుకున్న తాయిలాలు నాకు కనిపించకుండా దాచేసుకొని.   

ఇంకో రెండేళ్ళ తరువాత నాకు కొద్దిగా బుద్ధి,  జ్ఞానం వచ్చే సమయానికి, హైస్కూల్ వదిలి కాలేజికి రావడం, ఆ పై ఏడాది యూనివర్సిటీలో అడుగు పెట్టడం జరిగిపోయింది. యూనివర్సిటీ లోకి అడుగు పెట్టగానే చెయ్యాల్సిన  రెండు ఉద్యోగాలు మాయమైపోయాయి,  ఇంజనీరు, డాక్టరు. ఆప్షన్లు   కలెక్టరు, అడుక్కు తినేవాడు మిగిలాయి. కొత్తగా లెక్చరర్ జేరింది, కెమిస్ట్రీ ఆనర్స్  లో చేరిన తరువాత.  ఫైనల్ ఆనర్స్ లో ఉండగా నలుగైదురు మిత్రులం సివిల్స్ కి తయారు కావాలనుకున్నాం. పుస్తకాలు, గైడ్స్ అవీ తెప్పించాము.  అవన్నీ చూసిన తరువాత నేనూ,  మరో ఇద్దరూ రంగం లోంచి తప్పుకున్నాం.  ఆ విధంగా కలక్టరు ఉద్యోగం కూడా నా లిస్టు లోంచి మాయమయ్యింది. లెక్చరరు, అడుక్కు తినే  ఉద్యోగం మిగిలాయి.

ఎమ్మెస్సీ అయిన తరువాత మూడు ఉద్యోగ ఆఫర్స్ వచ్చాయి లెక్చరరుగా. ఒకటి భీమవరం కాలేజి, ఇంకోటి కాకినాడ కాలేజి, మరొకటి వరంగల్లు మెడికల్ కాలేజి. భీమవరంలో మా నాన్న గారు, కాకినాడలో చాల దగ్గర  బంధువులు ఉన్నారు. ఉద్యోగం వచ్చినా,  స్వతంత్రం ఉండదని అక్కడ జేరకుండా  వరంగల్లు మెడికల్ కాలేజిలో జేరాను. ఆ విధంగా అడుక్కు తినే ఉద్యోగం కూడా మాయమయ్యింది. 

వరంగల్ కాలేజిలో ఇప్పుడు సరిగ్గా గుర్తు లేదు కానీ 280 రూపాయలు జీతం వచ్చేది. ఒక ఆరేడు నెలలు పని చేసిన తరువాత Regional Research Laboratory,  హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. జీతం సుమారు నాల్గు వందలు. ఎగిరి గంతేసి జేరిపోయాను. లెక్చరరు ఉద్యోగం మాయమై  రిసెర్చ్ లో పడ్డాను. ఇంకో ఏడాది పైన రెండు నెలల తరువాత  Regional Research Laboratory, జోర్హాట్ లో ఉద్యోగం వచ్చింది. జీతం సుమారు ఏడు వందలు 1966లో.  ఈ మాటు ఎగిరి, లంఘించి,  రెండు రాష్ట్రాలు దాటి అస్సాం వెళ్లాను. మా వాళ్ళకెవరికి ఇష్టం లేదు. మా ఆమ్మగారు  రెండు రోజులు సత్యాగ్రహం చేశారు. మా నాన్నగారు బతిమాలారు, మిత్రులతో చెప్పించారు.  అయినా నేనూ వినలేదు.  ఒక ఏడాదిలో I fell in love with Assam. వాతావరణం, ప్రజలు, మంచి మిత్రులు, మంచి బాసులు, అస్సాం వదిలి వెళ్ళాలనిపించలేదు.

మొదట్లో జీతం కోసమే ఉద్యోగం చేసేవాడిని.  సిన్సియర్ లవర్ ఆఫ్ మై పే అన్నమాట.   క్రమ క్రమంగా ఉద్యోగం మీద ఇష్టం పెరిగింది.  ఉద్యోగంలో ఎత్తుపల్లాలు సహజం. నాకూ ఉన్నాయి,  ముఖ్యంగా పెట్రోలియం డివిజను హెడ్ అయిన తరువాత. అవన్నీ చెప్పుకోవాలంటే ఒక గ్రంధం అవుతుంది. ఇక్కడ అప్రస్థుతం.  95 మార్చిలో నేను వాలంటరీ రిటర్మెంట్ కి పెట్టాను. జూలైలో రిలీవ్ చేశారు.

ఆగస్ట్ లో వైజాగ్ లో ఒక పెట్రోకెమికల్ కంపనీలో జేరాను.  97లో హైదరాబాదులో ఒక కంపనీలో GMగా జేరాను. ఆ తరువాత ఒక ఏడాది తరువాత  టెక్నికల్ డైరక్టరు నయ్యాను. 2001లో విబేదాల వల్ల రిజైన్ చేశాను.  ఇంకో ఆరు  ఏళ్లు కన్సల్టంట్ గా కొన్ని కంపనీలకు (రిజైన్ చేసిన కంపనీకి కూడా ఏడాది పైగా) చేశాను. విసుగొచ్చి మానేశాను. ఒక మిత్రుడి కంపనీలో   డైరక్టరుగా(ఆనరరి గానే)  ఉండేవాడిని.  ఏలూరు వెళ్ళే ముందు,  అది కూడా 2011లో వదిలేశాను.  

ఇన్ని ఉద్యోగాలు చేశాను. చిన్నప్పుడు అనుకోని సైంటిస్ట్ ఉద్యోగంలో నా జీవితంలో సహభాగం పైగా  గడిపాను.  కానీ  ఎప్పుడూ కధా  రచయిత నవుతానని అనుకోలేదు. నేను  తెలుగులో కధలు వ్రాయగలనని అంతకు ముందు ఎప్పుడూ అనుకోలేదు. 2007 నుంచి మిత్రుల ప్రోత్సాహంతో  వ్రాసిన నాలుగైదు కధలు వెయ్యడానికే  బ్లాగుల్లోకి 2010  జూన్ లో వచ్చాను.  నా కధలు కనీసం కొంతమందైనా చదివారు అనే నమ్మకం కలిగింది.  బహుశా అది మరి కొన్ని వ్రాయడానికి ప్రేరేపించింది.  గత నాలుగు ఏళ్లకి  పైగా బ్లాగుల్లో ఉన్నాను. బ్లాగుల్లోకి వచ్చిన కొత్తలో ఇంతకాలం ఉంటానని అనుకోలేదు.  ఇన్ని కధలు వ్రాయగలనని అనుకోలేదు.   ఇప్పటికి 69 టపాలు వేశాను. ఒక్కొక్క టపా సగటున 1200  మందికి పైగా చదివారు. జాల పత్రికలు  ‘ఈ మాట’,  ‘మాలిక’  లకు  కధలు వ్రాశాను. మీ అందరి ఆదరాభిమానాలు పొందాను. గురువుగారూ అని ఆప్యాయంగా పిలిచే శిష్యులు దొరికారు. ఈ నాలుగున్నర ఏళ్లు నాకు పూర్తి సంతృప్తి కలిగింది.  ఇప్పుడు కూడా నేను ఒక కధా రచయిత నని అనుకోవటం లేదు. నేను వ్రాసినవి,  చదివి వీలైతే నవ్వుకొని ఆ పై మర్చిపోయేవే. నలుగురు గుర్తు పెట్టుకునే కధలు నేను వ్రాయలేదు. ప్రయత్నమూ చేయలేదు.  బహుశా చేత కాదు.   అయినా,  నా అంచనాలకు మించి మీరందరు అభిమానించారు. అదే నాకు  సంపూర్ణ  సంతృప్తి కలిగించింది.     

అన్నట్టు,  ఆగస్టు 2014లో నా కధల సంకలనం, “బులుసు సుబ్రహ్మణ్యం కధలు”   ఒకటి  పబ్లిష్ చేశాను. ఈ పుస్తకం నవోదయా బుక్ హౌస్,  కాచిగూడ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లలోను దొరుకుతుంది. అంతర్జాలంలో kinige.com  లోనూ దొరుకుతుంది, (ebook,  ప్రింటు  బుక్కు కూడా). 

ఇంత సోది చెప్పిన తరువాత అసలు సంగతి కూడా చెపుతాను. ఈ వేళ ఈ టపా వేయడానికి ముఖ్య కారణం,  ఈ రోజున (నవంబరు, 4)  నాకు డెబ్భై ఏళ్లు నిండాయి.  ఇంకెంత కాలం ఉంటానో తెలియదు. ఇప్పటికే నాలుగు స్టెంట్లు నా శరీరం లో అమరాయి. షుగరు, బి.పి. లు స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి.  సిగరెట్లు వదలటం లేదు. “ఏ నిముషానికి ఏమి  జరుగునో” అనే పాట మైండ్లో రింగు మంటోంది. దీపం ఉండగానే మీ అందరికీ కృతజ్ఞతలు,  ధన్యవాదాలు చెప్పుకోటానికి ఈ టపా.
  
(పుట్టిన రోజు అని చెప్పటానికి ఇన్ని పేజీలు  అవసరమయ్యాయా ?  అని తిట్టుకోకండి . . . . .  ద హా) 

 నన్ను ఆదరించి, అభిమానించిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు పేరు పేరునా  చెప్పుకుంటున్నాను.

27 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సప్తతి శుబాకాంక్షలు గురువుగారూ...

Dantuluri Kishore Varma చెప్పారు...

మీ సూర్యదర్శన వృత్తాంతం చాలా బాగుంది. మీరు మరో పాతికవేల సూర్యదర్శనాలు సునాయాసంగా, ఆనందంగా జరుపుకోవాలని అభిలషిస్తూ... పుట్టినరోజు శుభాకాంక్షలు.

తృష్ణ చెప్పారు...

Wishing you a very happy birthday bulusu gaaru :)

తార చెప్పారు...

ఒకప్పుడు మీ టపాలన్ని చదివేవాడ్ని. (కొన్నేళ్ళు అయ్యిందా?) ఇప్పుడు అనుకోకుండా ఎవరిమీదో అలిగి (ఎవరిమీద అలిగితే ఎవరూరుకుంటారు, నా మీదే) ఇవాల ఏపనీ చెయ్యను అని టైంపాస్ చేయ్యడానికి అలోచిస్తుంటే మీ బ్లాగ్ గుర్తొచ్చింది శిధిలాల్లోనుంచి లింక్ వెతికి తెరిచాను, కొత్త టపా కనపడింది, ఇవాటికి గిట్టుబాటు అయ్యింది. :)

హైద్రాబాదా, మహా చిరాకు నాకు ఆ ట్రాఫిక్. మహా మహులు, చెయ్యి, పెన్ను, పేపరు తిరిగిన రచయితలు అని పిలవబడేవారికన్నా మీ రచనలు చాలా బాగుంటాయి. పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు, నాకెక్కడా నా పేరు కనపడలేదే..?

ఎప్పటిలానే టపా బాగున్నది.

పెద్ద కామెంట్ రాద్దమనుకున్నా కానీ సారి ఇవాలా ఏ పనీ చెయ్యడం లేదు కదా !!

Happy birthday చెబుదామంటే ఎప్పుడో శరత్తుగారు రాసిన ఒక టపా గుర్తొస్తున్నది. ఐనా Happy Birthday

హరే కృష్ణ చెప్పారు...

హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు గురూజీ :)

sreelu చెప్పారు...

పుట్టినరోజు శుభాకాంక్షలు........

Unknown చెప్పారు...

Happy birthday andi
Radhika (nani)

వేణూశ్రీకాంత్ చెప్పారు...

పుట్టిన రోజు శుభాకాంక్షలు గురూజీ :-)

నాగరాజ్ చెప్పారు...

మీ సూర్యదర్శన థియరీ, ఉద్యోగాల వేట, కథాకమామిషు అన్నీ భలే ఉన్నాయండీ.
పుట్టినరోజు శుభాకాంక్షలు గురూజీ!

మైత్రేయి చెప్పారు...

Many Many Happy Returns of the day :)

శ్రీలలిత చెప్పారు...

మీరు మరో పుస్తకం ప్రచురించాలనీ, చదివి ఆనందించేసి సమీక్ష రాసేయ్యాలనీ కోరుకుంటున్నానండీ. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ...

..nagarjuna.. చెప్పారు...

శతాధిక వసంతాలు కూడా దర్శించేయాలని కోరుకుంటూ, మీ బ్లాగునందు మాకు సహస్రటపా దర్శనం అవాలని కూడా కోరుకుంటూ హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు గురూజీ :)

రాజ్ కుమార్ చెప్పారు...

పుట్టిన రోజు శుభాకాంక్షలు గురూజీ..
✨🎈✨🎈✨🎈✨
🎈🌟🎉🎂🎉🌟🎈
✨🎉🎁🌟🎁🎉✨
✨🌟🌟✨🌟✨✨
✨🌟🌟🌟✨
✨🌟✨
✨ 🌟 ✨
🔥
💗❤💗
💗❤❤❤💗

SD చెప్పారు...

ఇదేమిటండీ గురువుగారూ? మొదట్లో భలే నవ్వు వచ్చే టపా ప్రారంభించి చివర్లో వేదాంతం కొట్టేరు? అలా నవ్వే టపాలు వేస్తూ ఉంటే సుబ్బరంగా ఇంకో డభ్భై ఏళ్ళు బతుకుతారు. స్టెంటులూ, గాడిదగుడ్లూ అన్నీ మర్చిపోయి ప్రభావతి గారితో చెప్పి ఓ కేకు కట్ చేయండి. అయినా మీరు ఇప్పుడు లారీ డ్రైవ్ చేస్తే చూడాలని ఉంది. ఓ సారి ట్రై చేయరాదూ? :-)

నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ అనే పాట గుర్తుకురావట్లే? అన్నట్టూ చెప్పడం మర్చిపోయానండోయ్, పుట్టినరోజు హార్ధిక శుభాకాంక్షలు. కొత్త బట్టలు కొనుక్కున్నారా? పంచెల చాపు కాదండోయ్, అసలైన రేమాండ్స్ బట్టలు.

SD చెప్పారు...

ఇదేమిటండీ గురువుగారూ? మొదట్లో భలే నవ్వు వచ్చే టపా ప్రారంభించి చివర్లో వేదాంతం కొట్టేరు? అలా నవ్వే టపాలు వేస్తూ ఉంటే సుబ్బరంగా ఇంకో డభ్భై ఏళ్ళు బతుకుతారు. స్టెంటులూ, గాడిదగుడ్లూ అన్నీ మర్చిపోయి ప్రభావతి గారితో చెప్పి ఓ కేకు కట్ చేయండి. అయినా మీరు ఇప్పుడు లారీ డ్రైవ్ చేస్తే చూడాలని ఉంది. ఓ సారి ట్రై చేయరాదూ? :-)

నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ అనే పాట గుర్తుకురావట్లే? అన్నట్టూ చెప్పడం మర్చిపోయానండోయ్, పుట్టినరోజు హార్ధిక శుభాకాంక్షలు. కొత్త బట్టలు కొనుక్కున్నారా? పంచెల చాపు కాదండోయ్, అసలైన రేమాండ్స్ బట్టలు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

(కొంచెం ఆలశ్యంగా చూశాను)
డబ్బైయవ పడిలో పడ్డారన్నమాట. సంతోషం. జన్మదిన శుభాకాంక్షలు.

మీరు చెప్పిన "ఏ నిమిషానికి ఏమి జరుగునో" లాంటి పాటలు బుర్రలోంచి తుడిచేసి, బదులుగా ఐయాం సెవెంటీ గోయింగ్ టు బి ఎయిటీ అని హాపీగా హం చేసుకుంటూ ఉండండి ప్రస్తుతానికి. తర్వాతి కాలంలో గోయింగ్ టు బి నైంటీ, గోయింగ్ టు బి హండ్రెడ్ అండ్ లాంగర్ అని కూడా తప్పక పాడుకుంటారు.

మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.

sarma చెప్పారు...

పుట్టిన రోజు శుభకామనలు.
ఊళ్ళో లేను, నిన్న ఉదయమే మనవరాలు జన్మ దిన శుభకామనలు చెప్పింది, అప్పుడు వెంటనే గుర్తొచ్చింది, మీ పుట్టిన రోజే! నవ్వుతూ నవ్విస్తూ బతికేద్దాం, మరొకసారి జన్మ దిన శుభకామనలు.

Zilebi చెప్పారు...



మీ ఈ 25567 నెంబరు టైటిల్ లో జూసి ఏమబ్బా సెన్సెక్స్ ఇరవై ఎనిమిది వేలలో ఉన్నదే బులుసు వారేమో మరి ఇరవై ఐదు వేల చిల్లర పెట్టేరు టైటిల్ అని అనుకుని వచ్చా !!

ఇది పెర్సనల్ బులుసు వారి సౌర్యోదయ ఇండెక్స్ అన్న మాట బీ ఎస్ ఈ !!

బులుసు సౌర్యోదయ ఇండెక్స్ !!

శుభకామనల తో
మీరు బీ ఎస్ ఈ సెన్సెక్స్ ని అధిగమిస్తారని ఆశిస్తో !!

జిలేబి

www.apuroopam.blogspot.com చెప్పారు...

శ్రీ సుబ్రహ్మణ్యం గారికి, ముందుగా 70 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.కొన్నాళ్ళ పాటు ఊరిలో లేక పోవడం తర్వాత ఇంటి పనుల్లో తీరక మీకు ఫోన్ చేసి మాట్లాడాలనకున్నది వాయిదా వేస్తూ వచ్చాను. తప్పకుండా పోన్ చేసి మీతో మాటలాడుతాను.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పురాణపండఫణి గారికి,

దంతులూరి కిషోర్ వర్మ గారికి,

తృష్ణ గారికి,

ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

తార గారికి,

మీ పేరు కనిపించలేదా? ఈ టపాలో ఇచ్చిన పాత లింక్ లో మీ పేరు ప్రస్తావించాను. చూడండి....దహా.
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

హరే కృష్ణ గారికి,

ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీలు గారికి,

రాధిక (నాని) గారికి,

వేణూ శ్రీకాంత్ గారికి,

నాగరాజ్ గారికి,

మైత్రేయి గారికి,

ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

అజ్ఞాత చెప్పారు...

శ్రీలలిత గారికి,

ఈ పుస్తకం కాపీలే అటకెక్కాయి. మళ్ళీ ఇంకోటా. అబ్బే ఛాన్సే లేదు.....దహా.
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

నాగార్జున గారికి,

అయ్యబాబోయ్. శతాధిక వసంతాలు, సహస్ర టపాలు అంటే నేను మరో జన్మ ఎత్తాలి.....దహా.
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

రాజ్ కుమార్ గారికి,

మీరు వ్రాసిన భాష అర్ధం కాలేదు కానీ మీ హృదయంలో మాట అర్ధం అయింది.....దహా.
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

DG గారికి,

వానప్రస్థంలో వేదాంతం కాక మరేమిటి ఉంటుంది. రేమండ్స్ కాలం వెళ్ళిపోయింది....దహా.
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

విన్నకోట నరసింహా రావు గారికి,

అబ్బే అంత కాలం ఉండే ఇచ్ఛ లేదండి...దహా.
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

శర్మ గారికి,

ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి,

BSE బాగుందండి. బులుసు సౌందర్య ఇండెక్స్ అంటే ఇంకా బాగుండేదేమో......దహా.
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

పంతుల గోపాలకృష్ణ రావు గారికి,

మీ దక్షిణ భారత యాత్రల వివరాలు FB లో చదువుతున్నాను....దహా.
ధన్యవాదాలు. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుడిని.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీలలిత గారికి,
నాగార్జున గారికి,
రాజ్ కుమార్ గారికి,

మీకు పైన ఇచ్చిన జవాబు అనానిమస్ పేరుతో పొరపాటున పబ్లిష్ అయింది.అది నేనే, నేనే,నేనే...దహా.

అజ్ఞాత చెప్పారు...

నేను బ్లాగ్స్ చదవడం మొదలు పెట్టిన తర్వాత పెడుతున్న మొదటి కామెంట్. ఎందుకంటే ఈ బ్లాగ్స్ గురించి నాకంత అవగాహన లేదు. నేను కూడా నెల క్రితం ఒక బ్లాగ్ మొదలు పెట్టాను కాబట్టి ఇప్పుడిప్పుడే ఇలాంటివి అలవాటుఅవుతున్నాయి.

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు.

అజ్ఞాత చెప్పారు...

నేను బ్లాగ్స్ చదవడం మొదలు పెట్టిన తర్వాత పెడుతున్న మొదటి కామెంట్. ఎందుకంటే ఈ బ్లాగ్స్ గురించి నాకంత అవగాహన లేదు. నేను కూడా నెల క్రితం ఒక బ్లాగ్ మొదలు పెట్టాను కాబట్టి ఇప్పుడిప్పుడే ఇలాంటివి అలవాటుఅవుతున్నాయి.

హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు.