బులుసు సుబ్రహ్మణ్యం కధలు


ఏదైనా స్వానుభవం అయితే కానీ లోతు తెలియదు అంటారు. నిజమే ముమ్మాటికి నిజమే అనిపించింది. పుస్తకం ప్రచురించాలంటే ఉత్సాహమే కాదు,  భాష మీద పట్టు, అంతో కొంతో వ్యాకరణ జ్ఞానం, వీటికి తోడు శ్రద్ధ, ఓపిక కూడా పుష్కలంగా ఉండాలని కూడా తెలుసుకున్నాను. అన్నిటికన్నా తెలుగు మాష్టారికి తప్పులు వెతకడంలో ఉండే సునిశిత దృష్టిలో పదో వంతైనా కనీసం ఉండాలి, అని కూడా అర్ధం అయింది. మిత్రులు సహకరించారు. సూచనలు చేశారు. కొన్ని పాటించాను. కొన్ని మరిచిపోయాను. కొన్నిటికి అశ్రద్ద చేశాను.  నాలుగు  కాపీలు కరక్షన్స్ చేశాను. అయినా వ్యాకరణ,  అక్కడక్కడ  భాషా దోషాలు ఉన్నాయేమో నని అనుమానం. అనుమానమేమిటి ఉండే యుంటాయని నమ్మకమే. వ్యాకరణం ముఖ్యంగా సంధులు గట్రా నేర్చుకొని పదాలకి ముడి పెట్టేద్దామనుకున్నాను. కానీ ఒక్క పుస్తకానికి ఇంత కష్టపడాలా, వద్దులే  అని విరమించుకున్నాను.  అన్నట్టు అక్షయపాత్ర అంటే ఏమిటో కూడా తెలిసి వచ్చింది. అదేమిటో,  వెతికిన కొద్దీ తప్పులు దొరుకుతూనే యున్నాయి.  కానీ ఇవేవి కదాగమనానికి గానీ, హాస్యానికి గానీ అడ్డు రావనే అనుకుంటున్నాను. ఈ లోపాలు సవరించి ఉండాల్సింది కానీ ఓపిక సన్నగిల్లింది. ఆలస్యం అవుతోందనే  అనే అంశం తొందరపెట్టింది.  చివరికి విసుగొచ్చి ఇంక ఎవరికీ చూపించను, ఇదే ఫైనల్, అంతే అని నిర్ణయించుకున్నాను. ప్రింటండి అని ప్రింటర్ కి చెప్పేశాను.   

బ్లాగుల్లో వ్రాసేటప్పుడు వీటి మీద శ్రద్ధ పెట్టలేదు. అయినా పాఠకులు చదివారు, ఆదరించారు. శా యా, సా యా, ఉండు అని యుండాలా, యుండు అని ఉండాలా, లాంటి సందేహాలతో ఒక మిత్రుడిని విసిగించాను కూడా. విసిగి, వేసారి ఆ మిత్రుడు బ్రహ్మోపదేశం చేశాడు.  “వత్సా,  పాఠకుడికి  నవ్వు వచ్చిందా నవ్వుకుంటాడు, నవ్వుకి వ్యాకరణ, భాషా  దోషాలు ఉండవు. ఇందులో దోషం ఉంది కాబట్టి నవ్వను అని భీష్మించుకోడు. నవ్వు రాలేదా, దోషాలు చూసి నవ్వి పోతాడు. ఎలాగైనా విజయం నీదే”  కళ్ళు తెరుచుకున్నాయి. కదా అని ఆనందపడ్డాను. అయినా పంటి కింద రాయిలా ఏ దోషమైనా కష్టపెడితే  క్షమించమని పాఠకులను వేడుకుంటున్నాను.


(నిజం చెప్పాలంటే తెలుగులో రచనలు  (హాస్యం అయినా సరే) చేసే అర్హత నాకు ఉందా? తగుదునమ్మా అంటూ వ్రాసిన వాటిని పబ్లిష్ చేయడం భావ్యమా అని కూడా రెండు మూడు మాట్లు అనుకున్నాను. ఇది నా మనసులో మాట. ఎవరితోనూ అనకండి ప్లీజ్.) 
    
పుస్తకం అమ్మకానికి పెట్టకూడదనే మొదట్లో అనుకున్నాను. ఒక రెండు – మూడు  వందలు కాపీలు వేయించి బంధు మిత్రులకి పంపిద్దామని అనుకున్నాను. ఒక 35 కధలు ఎంచుకున్నాను. మొత్తం 250 పేజీలకు చేరింది. ప్రింటరు చెప్పిన ధర 250 కాపీలకు నన్ను ఆలోచింపచేసింది. అనుకున్న దానికన్నా ఎక్కువ, చాలా ఎక్కువ కావడంతో మానేద్దామా అని కూడా అనుకున్నాను. ఆరు కధలు తీసేసి  208  పేజీలకు కుదించాను. ఆర్టిస్ట్ ఖర్చులు మిగిల్చి కవర్ పేజీ మీద నా ఫోటో పెట్టి (పాఠకులు భయపడినా సరే అని ధైర్యం చేసి),   ఆ విధంగా ముందుకు పోదామని ఆలోచన చేశాను. 300 కాపీలకి నేను అనుకున్న బడ్జెట్ దరిదాపులకు వచ్చింది.  ఇంకో రెండు మూడు వేలు అటైనా ఫరవాలేదు అని ధైర్యం చేశాను.

ఈ లోపున కొంతమంది మిత్రులు అన్నారు  “మీ బంధు, మిత్రగణంలో లేనివారు పుస్తకం కావాలంటే కాపీలు ఉంటాయా?” అని. “ఒక 75 - 100 కాపీలు ఉంటాయేమో” అని జవాబు ఇచ్చాను. “అంతకన్నా ఎక్కువ మంది కావాలంటే?” అని కొచ్చెను మార్కు కూడా పెట్టారు. నేను నవ్వేశాను. ఘట్టిగానే నవ్వాను. “మనకంత సీను లేదు. మిగిలిన పుస్తకాలు ఆటక మీదే ఉంటాయి” అని ఇంకో మాటు నవ్వాను, ఇంకా ఘట్టిగా.  “ఏమో దురదృష్టం కమ్ముకొచ్చిన పాఠకులు అడగవచ్చు గదా”  అని లేనిపోని సందేహాలు నా మనస్సులో కలిగించారు. కనీసం ఇంకో రెండు వందల పుస్తకాలు వేయించండి. ధర కూడా తగ్గుతుంది గదా. ఒక eబుక్ కూడా తీసుకు రండి. మీకు ఖర్చు తగ్గుతుంది. కావాలనుకున్న పాఠకులకు పుస్తకం దొరుకుతుంది” అని ఉత్సాహం కలుగజేశారు. “ఏ పుట్టలో ఏ పాముంటుందో, ఏ సలహాలో ఏ ఔచిత్యముంటుందో, ఎవరికెరుక” అనుకొని ఇంకా బాగా ధైర్యం చేసి, తెగించి ఐదువందల కాపీలు వేయిద్దామని నిర్ణయించాను. 

eబుక్  గురించి ఆలోచిస్తున్నాను. కినిగె వారిని సంప్రదించాను. “ ప్రింటర్ ఇచ్చిన పిడిఎఫ్  కాపీ, కవరు పేజీ, రెండూ  మాకు పంపండి. మేము పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము” అన్నారు. బహుశా ఇంకో రెండు మూడు రోజుల్లో వారికి అవి పంపి, వారి నిర్ణయం కోసం చూస్తాను. 

ఒక వేళ ఏదీ కుదరక పొతే, ఏం చెయ్యాలో ప్రణాళిక కూడా వేసుకున్నాను. ఇంకొన్ని రోజుల్లో పుస్తక ప్రదర్శనల సీజను మొదలవుతుంది కదా, ప్రదర్శన బయట పాతిక పుస్తకాలు నెత్తిమీద పెట్టుకుని “కధల పుస్తకం బాబూ కధల పుస్తకం, నవ్వుకుందామనుకున్నా, నవ్వి పోదామనుకున్నా, సరసమైన ధరకు  అమోఘ అవకాశం” అని అరుస్తూ అమ్మటానికి ప్రయత్నిస్తాను. 
 
అన్నట్టు పుస్తకం పేరు  “బులుసు సుబ్రహ్మణ్యం కధలు”.   
    
ఈ నెల రెండవ వారంలో ప్రింటరు పుస్తకాలు ఇస్తారు అని అనుకుంటున్నాను. వచ్చిన తరువాత మిగిలిన వివరాలతో  ఇంకో టపా వేస్తాను.

పుస్తకం వేస్తానన్నారు కదా ఏం చేశారు? అని ఒకరిద్దరు అడిగారు. అందుకని ఈ టపా ఇప్పుడు.

అదీ సంగతి.

9 కామెంట్‌లు:

telugutarang చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారు Allthe best

hari.S.babu చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
hari.S.babu చెప్పారు...

మొత్తానికి హాస్య కధల్ని ప్రచురించదంలో కూడా ఇన్ని హాస్య కష్తాలు భరించా రన్నమాట!

ALL THE BEST!!

Narsimha Kammadanam చెప్పారు...

శుభంభూయాత్.
అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.
ఆంగ్లము వాడటం తగ్గిద్దామని తెలుగు లో చెప్పా....

karthik చెప్పారు...

గురువుగారూ,
ప్రింట్ పుస్తకం కినిగెలో పెట్టగలరేమో చూడండి.. మా లాంటి వాళ్ళకు తెప్పించుకోవడం సులభమౌతుంది.

lakshman చెప్పారు...

శుభంభూయాత్

హనుమంత రావు చెప్పారు...

అటకమీద పెట్టేలోపు ఒక్క పుస్తకమైనా... బాబ్బాబూ, నాకోటి ఇవ్వండి.. మర్చిపోకండి... డబ్బులా.. భలేవారే !

Zilebi చెప్పారు...

ఏవిటో ఈ మానవుని వెర్రి వ్యామోహం - పుస్తక ప్రచురణ కి !!

చీర్స్
జిలేబి

Unknown చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ, నమస్కారం! మీ కథల పుస్తకం తొలి ప్రచురణ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మీరు పడ్డ కష్టానికి తప్పక ప్రతిఫలం దొరుకుతుంది. అంతర్జాలానికి సోపానం లేని హాస్యప్రియులందరి దరికీ మీ పుస్తకం చేరి వారందరి కడుపులూ పూర్తిగా ఉబ్బించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను :)

భవదీయుడు
వర్మ