ఏక వాక్య టపా


నేను బాగా వ్రాశానని అనుకున్నా పాఠకులు నాతో ఏకీభవించక పోవడం వల్ల నా బ్లాగు చదవడానికి అతి కొద్దిమందే రావడం వల్ల చింతాక్రాంతుడనై ఏమి చెయ్యడానికి పాలుపోక ఇంకా బాగా వ్రాసే సత్తా లేకపోవడం వల్ల ఇంకేమి చెయ్యవలెనని సుదీర్ఘంగా నాలోచించగా కొంచెం వెరైటీగానూ  ప్రత్యేకంగానూ విలక్షణంగానూ కఠినంగానూ కొరుకుడు పడని విధంగానూ అర్ధంకాని పద్ధతిలోనూ ఏక వాక్య టపా వ్రాయాలని మదిలో మెరుపు మెరవగా నొక మిత్రుడిని ఏకవాక్య టపా ఎటుల వ్రాయాలని అడగగా వారున్నూ సుదీర్ఘ కాలం తమ సమయం వెచ్చించి పరిశోధించి ఆలోచించి మేధో మధనం చేసి ఒకే ఒక్క ఫుల్లు స్టాపు తో అదియున్నూ చివర  పెద్దగా పెట్టి మధ్యలో అనేకానేక నీ చిత్తం మెచ్చినన్ని నీ శక్తి సామర్ధ్యములను పదును బెట్టి నీ ఉహా శక్తికి మేధస్సు ను జోడించి  అది నీకు లేదని నాకు తెలిసినను మాట వరసకే చెప్పుచుంటినని కడు దీర్ఘముగా ఘట్టిగా నొక్కి వక్కాణిస్తూ  అనేకానేక  ,  ;  “ ”  ? !  ( )  ’  ఇత్యాదులను విరివిగా ఉపయోగిస్తూ నీకు వీలైనన్ని పేజీలు వ్రాయమని ఉపదేశించగా విన్న నా తోటి మిత్రుడొకడు కడుంగడు నాశ్చర్య చకితుడై నీవు  పాఠకులను దుఃఖిత మానసులను చేయ సంకిల్పింప కారణమేమియో  యని ప్రశ్నింపగా నేను పెదవులను ఈ చివరి నుంచి ఆ చివరకు సాగదీసి సుదీర్ఘ చిరునవ్వును వెలయించి తద్దినము ను జరుపుటకు యని జవాబివ్వగా వాడు మరల నాశ్చర్యముం బొందిన వాడై ఏ తద్దినము యని మరల ప్రశ్నింపగా ఈ మారు నేను వికటాట్టహాసం చేసి నిన్న 14వ తారీఖున  నా బ్లాగు నవ్వితే నవ్వండి మొదలు పెట్టిన  ఐదవ తద్దినం అని ఈ వేళ జ్ఞప్తికి వచ్చినదని   క్రూరంగా ఘోరంగా కర్కశంగా ఉద్ఘాటించగా యచట నున్న మిత్రులందరూ ముక్త కంఠముతో నవ్వితే నవ్వండి బ్లాగు పాఠకులందరికీ వారి సానుభూతి ప్రకటించగా వారి సానుభూతికి నాది కూడా జోడించి నా టపాలు చదివే సాహసం చేసిన చేస్తున్న కష్టపడి చదివి అవస్థ పడ్డ లేక అవస్థ పడుతూ చదివి కష్టపడ్డ  పాఠక దేవుళ్ళకు   ఈ ఏక వాక్య టపాలో మా సానుభూతి తెలియచేసుకుంటున్నాను

అదన్నమాట సంగతి. టపా పొడిగించుటకు కారణమేమనగా  , ; !  ఇత్యాదులు పెట్టుట మరచిపోయితిని. మీరు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ మీకు నచ్చినవి పెట్టుకొనవలెనని ప్రార్ధించుచున్నాను.

6 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

పానుగంటి వారి "సాక్షి" వ్యాసాల్లో సుదీర్ఘ వాక్యాల్లా ఉంది మీ టపా :)
మీ బ్లాగ్ ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు అభినందనలు.

Zilebi చెప్పారు...

ఎంత చిన్న వాక్యం లో మీ బా లాగు 'తత్' దినం గురించి ఎంత బాగా జెప్పేరండి :)


జిలేబి

Zilebi చెప్పారు...ఎంత చిన్న వాక్యం లో మీ బా లాగు 'తత్' దినం గురించి ఎంత బాగా జెప్పేరండి :)


జిలేబి

శ్రీలలిత చెప్పారు...


బ్లాగు అయిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలండీ..(ఇంతకన్న చిన్న వాక్యం నాకు రాదు మరి..)

yallapragada hyma kumar చెప్పారు...

వామ్మో ఎందిది.భటులారా వీరిని ఈబ్లాగు చదివిన వారిని కారాగారములో పడవేయుడు..
మూర్ఖభటులార నన్ను పట్టుకు పోవుచున్నారు ఏమిరా
తమరు కూడా చదివితిరి కదా ప్రభూ..

KGK SARMA చెప్పారు...

టపా కి ఎన్ని వాక్యాలన్నది కాదు కొశ్చిను
ఆ వాక్యం ఎంత పొడుగన్న దే పాయింటు