ప్రతీ మనిషిలోనూ ఎంత మంచితనమున్నా, అంతో ఇంతో రాక్షస గుణాలు కూడా ఉంటాయి. ఇవి కొంతమంది లో నిఘూఢమై ఉండవచ్చు. కొంతమందిలో సమయ సందర్భాలని బట్టి బయట పడతాయి. మరి కొంత మందిలో మంచితనం ముసుగు వేసుకున్న రాక్షసత్వం ఉండవచ్చు. ఇంకొంత మంది బాహాటంగానే తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తారు.
అసలు ఈ దేశం లో వేలిమీద లెఖ్ఖ పెట్టాల్సిన మేధావులలో
నేను ఉన్నానని మీకు తెలుసా. తెలియకపోవడం మీ దౌర్భాగ్యం. నేను చాలా తెలివైనవాడిని. బుద్ధిమంతుడిని. నా
అంతటి వాడు లేడని మీకు తెలిసినా మీరు వెంటనే ఒప్పుకోకపోవడం ఈ దేశం లోని సంకుచిత మనస్థత్వాలకి నిదర్శనం
మరియూ తార్కాణం అని ఉటంకిస్తున్నాను.
ఇప్పటికైనా అర్ధం అయిందా నేను మైక్ పట్టుకుంటే మైకాసురుడుని &
బాకాసురుడిని. రెండికి తేడా ఏమిటంటారా . మైక్ దొరకగానే ప్రేమగా పట్టుకొని రెండు
ముక్కలు చెపుతాను అని ఒక్కొక్క ముక్క కి కనీసం ఒక్కో గంట తీసుకునేవాడిని
మైకాసురుడు అందురు. అందులో కూడా
ఒకవాక్యానికి రెండో వాక్యానికి లింకు లేకుండా మాట్లాడగలిగేవాడు మహామైకాసురుడు
అనబడును. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లో ఉంటారు. తనగురించి తన వాళ్ళగురించి మాత్రమే
మాట్లాడగలిగేవాడు బాకాసురుడు. సబ్జెక్ట్ ఏమైనా బహు నిపుణతతో తనమీదకి తిప్పుకొని
తనగురించి మాత్రమే బాకా ఊద గలిగేవాడు బాకాసురుడు.
మైక్ అంటే నాకు ఇంత ఇష్టం ఎల్లా పుట్టిందో నాకు తెలియదు. అసలు
చిన్నప్పడినించి నాకు మాట్లాడడమంటే ఇష్టం. కిట్టని వాళ్ళు లొడ లొడ వాగుతుంటాడు అని
అనేవారు. కానీ పుట్ట గానే పరిమళించాలని
పూవు కి తెలియదా? అదేదో పెద్దగా కొటేషన్ పెట్టి పరిమళించును అంటే
కానీ పరిమళించదా.
చిన్నప్పుడినించి కూడా నేను స్కూలు చర్చల్లో పాల్గొనేవాడిని.
కత్తి గొప్పదా కలం గొప్పదా దగ్గరనించి, స్త్రీ
కి స్వాతంత్ర్యం కావాలా వద్దా దాకా, మాట్లాడేసేవాడిని. దురదృష్టవశాత్తూ ఆకాలంలో మైక్ లు ఉండేవి కావు. గొంతు చించుకొని
అరవడమే తప్ప. అదేమిటో ఎంత చించుకున్నా ఒక్కమాటూ బహుమతి రాలేదు. ఆ కోపం, కసి నాలో పేరుకుపోయాయి. కొద్దిరోజులయిన తరువాత
నన్ను అసలు మాట్లాడనిచ్చేవారు కాదు. పెద్దవుతున్న
కొద్ది ఎప్పుడైనా అవకాశం దొరికితే నా
ఉపన్యాసాల తో జనాలని హింస పెట్టడం అలవాటు చేసుకున్నాను.
ఉపన్యాసాల మీద ఎంత ఎక్కువ ఇష్టం ఉన్నా మొదటి మాటు పెద్ద సభలో మైక్ పట్టుకున్నప్పుడు కాళ్ళు, చేతులు, గొంతు అన్నీ వణికాయి. ఆ సందర్భం అల్లాంటిది. మొదటి మాటు ఒక సెమినారులో ఒక పరిశోధనా పత్రం ప్రెజెంటు చేస్తున్నప్పుడు.
అది కూడా మా ఇన్స్టిట్యూట్ లోనే. అప్పటికే
మనకి వీరేశం అని పేరు. అంటే వీర ఆవేశం
కలవాడు అని అర్ధం అన్నమాట. వాదనలు వస్తే మనం మడమ తిప్పని వీరులం. సాధారణం గా
సెమినారు అంటే మూడు నాల్గు హాల్స్ లో
సెషన్స్ జరుగుతాయి. ఒక్కో హాలు లో ఒక 20-25 దాకా ఉంటారు. నేను వాగవలిసిన హాలులో మా
dept. వాళ్ళు అందరూ
కూడా చేరారు, అవకాశం వస్తే ప్రశ్నోత్తరాల సమయం లో వీడిని ఇరుకులో
పెట్టవచ్చు అని వచ్చిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. నేను ఎక్కడ నోరు జారుతానోనని
మా బాసు గారు వేంచేసి ఎదురుగా మొదటి వరుసలో
కూర్చున్నారు.
షెడ్యూల్ ప్రకారం 11-30 కి నేను ఉపన్యసించాలి. ముందు వాళ్ళు పీకి,
సాగదీసి నందు వల్ల నేను స్టేజి ఎక్కేటప్పటికి 12-30 దాటి ఒక ఇరవై నిముషాలు అయింది. నేను మైకు పట్టుకొని ప్రేమగా
నిమిరి, ఎఫ్ఫెక్ట్ కోసం మైక్ మీద వేలితో మీటి, ఒన్, టు, త్రీ
అని పని చేస్తోందా హి హి హి అని
కూడా అడిగి మరీ మొదలు పెట్టేను. “ఫ్రెండ్స్
నా పేపర్ titled ‘Evaluation of flow improvers on some Indian crude oils’. As you know, majority of the Indian
crudes are high waxy and pose considerable problems in transportation
particularly during winter. ఇక్కడి దాకా బాగానే గత వారం రోజులుగా ప్రాక్టీసు చేసినట్టే చెప్పేశాను.
హాలు లోకి జనం రావడం మొదలు పెట్టేరు. నేను రెండు మూడు వాక్యాలు చెప్పే టప్ప టికి
జనం మరీ ఎక్కువగా రావడం మొదలు పెట్టేరు, అందులోనూ హేమా హేమీలు, పెట్రోలియం రిసర్చ్ లో కురు వృద్దులు అనబడే వారు
కూడా విచ్చేశారు. నాకు కంగారు మొదలైంది. మాటలు కొంచెం తడబడడం మొదలైంది. అయినా
ధైర్యం గానే ఒక మూడు నిముషాలు ఉపన్యసించాను.
ఇంతలోనే హాలు నిండి పోయింది. జనం నుంచుని మరీ వినేస్తున్నారు. ఎదురుగుండా మా బాసు పక్కాయనతో చేతులు తిప్పుతూ మాట్లాడే స్తున్నాడు. నేను
గుండె చిక్క బట్టుకొని crude oil rheology కి వచ్చాను.
సాధారణంగా
ఉపన్యాసం అయ్యేదాకా ప్రశ్నలు వెయ్యరు.
కానీ ఒక కురు వృద్ధుడు లేచి “How does conditioning compare with flow improver treatment and are all oils amenable to conditioning ?” నా కంగారు పరాకాష్ట కి చేరుకుంది. నన్ను పీకి
పాకం పెట్టటానికి వచ్చినట్టున్నారు అనిపించింది ఆ క్షణం లో. చేతులు కాళ్ళు తోటి తనవు కూడా వణకింగ్ అన్న మాట. కురుసైన్యాన్ని
చూసిన ఉత్తర కుమారుడి లాగా. మాటలు తడబడడమే కాక పొంతన లేని వాక్యాలు కూడా ఒకటి
రెండు వచ్చేశాయి. అస్త్ర సన్యాసం చేసిన ద్రోణాచార్యుడి పరిస్థితి . ఇంతలో మా బాసు
గారు లేచి సమాధానం చెప్పి కూర్చున్నారు. మళ్ళీ నేను బెబ్బే దేదే అంటూ మొదలు పెట్టేను.
ఆశ్చర్యం గా జనం వెళ్ళడం మొదలు పెట్టేరు. చూస్తుండగానే ఖాళీ అయిపోయింది హాలు. నేను, సెషన్ ఛైర్మన్ , మా వాళ్ళు ఇంకో 10 మంది, నా తరవాత చదవాల్సిన వారు ఇద్దరు, మిగిలాం.
మాబాసు గారు కూడా కురువృద్ధుడితో వెళ్ళిపోయారు. పక్కకి చూస్తే అందరూ భోజనాల
దగ్గర ఉన్నారు. అప్పుడు అర్ధం అయింది. 12-45
to 1-30 లంచ్
టైమ్. మా హాలు డిన్నర్ హాలు పక్కన ఉంది. అక్కడ రెడీ కాకపోవడం వల్ల అందరూ నన్ను
వినిపెడదామని ఇటు వచ్చారు. అక్కడ గంట కొట్టగానే పోలో మని అక్కడికి వెళ్ళిపోయారు.
అదన్న మాట సంగతి. వాళ్ళ భోజనం ఆదుర్దా నాకు ఇంత కష్టం తెచ్చిపెట్టింది.
ఆ తరువాత నేను రాటు తేలాను. నో ఫియర్ మై డియర్ వీరేశం అనుకుంటూ
విజృంభించేశాను. అదే టైమ్ లో నేను మా స్టాఫ్ క్లబ్బు సెక్రెటరీ గా పనిచేశాను. ఏ
సభలోనైనా సెక్రెటరీ రిపోర్ట్ అని పెట్టేవాడిని. అందులో నేను ఎల్లా క్షణం తీరికలేకుండా
కష్టపడ్డానో , ఎంతమంది దుర్మార్గులు ఎన్ని ఆటంకాలు సృష్టించారో, అవన్నీ నేను ఎంత చతురతో అధిగమించానో, మరొకడైతే
అసలేమీ చెయ్యలేకపోయే వాడని ఒక గంట ఉపన్యాసం ఇచ్చేవాడిని. ఒకమాటు ప్రారంభోపన్యాసం
ఇవ్వటానికి ఒక పెద్దాయనను పిలిచాము. మామూలు గానే ఒక గంట ఆలస్యం గా మొదలు పెట్టాం. నేను
మాములుగానే రిపోర్ట్ మొదలు పెట్టాను. కొంచెం సేపయిం తరువాత ఆయన అసహనం గా కదిలాడు
సీట్లో. ఒక అర గంట చూసి లేచి వచ్చి నా చెవిలో రహస్యం గా చెప్పేడు. నేను
వెళ్లిపోవాలి మీరు ముగిస్తే నాల్గు ముక్కలు చెప్పి వెళ్లిపోతాను అని. అల్లాగే అల్లాగే అంటూ నేను మాములుగానే ఇంకో
ముప్పావు గంట తీసుకున్నాను. ఆయన పాపం ఎప్పుడు వెళ్ళి పోయాడో కూడా చూడ లేనంత గా నా
ఉపన్యాసం లో లీనమై పోయాను. ఆయన లేడు కాబట్టి ప్రారంభోపన్యాసం కూడా నేనే
ఇచ్చేశాను. ఈ విషయం మా బాసు గారికి
తెలిసి నువ్వు మళ్ళీ మైకు పట్టుకుంటే ఉద్యోగం లోంచి డిస్మిస్ చేస్తానన్నాడు. అయినా
నేను లెఖ్ఖచేయలేదు.
పాపం మా బాసుగారు తగు జాగ్రత్తలు తీసుకునేవారు. తప్పనప్పుడు
మాత్రమే నాకు మైకు పట్టుకునే అవకాశం ఇచ్చేవారు. ఇచ్చిన రెండు నిముషాలకి మైకుకు
అందకుండా ప్రద్యుమ్నా ముగించెయ్యి అనేవారు. ఇంకో రెండు నిముషాల తరువాత మైకులోనే
చెప్పేవారు ముగించెయ్యి అని.ఇంకో రెండు నిముషాల తరువాత ఇంకా చాలామంది మాట్లాడాలి
ఆపెయ్యి అని, ఇంకో రెండు నిముషాల తరువాత నా తరువాత మాట్లాడేవాడిని పిలిచేవారు.
వాడికి నాకు మైకు యుద్ధం జరిగేది. వాడికి అందకుండా నేను, నా చేతిలో మైకు
లాక్కోనడానికి వాడు స్టేజి అంతా కలయ తిరిగేవారం.
మా భంగిమలు కూచిపూడి నృత్యనాటకం లాగా ఉంటాయి అనేవారు ప్రేక్షకులు. ఆ తరువాత తప్పనప్పుడు
నన్ను వోట్ ఆఫ్ థాంక్స్ కి పరిమితం చేసేవారు. అయినా నేను తగ్గేవాడిని కాను. హాలులో
కూర్చున్న వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళిపోయేదాకా చెపుతూనే ఉండేవాడిని.
ఆ తరువాత నేనూ నిశితంగా ఆలోచించాను. నెలకో మాటో రెండు మాట్లో
జేరే వందమందిని ఒకమాటు హింసించే బదులు రోజూ ఒక పదిమందిని హింసిస్తే మన
కీర్తిపతాకలు ఇంకా ఎక్కువగా వ్యాపిస్తాయి గదా అని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచి
మైకాసురత్వాన్ని తగ్గించుకుని బాకాసురత్వాన్ని పెంచుకున్నాను. బాకా ఊదడానికి
ఇద్దరు ముగ్గురున్నా చాలు. నలుగురైదుగురు ఒకేచోట దొరికితే భేషుగ్గా
ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే మనకి పండగే. రోజుకి కనీసం రెండు మూడు అవకాశాలు
తేలికగా దొరకపుచ్చుకోవచ్చు.
మనం బాకా ఊదడానికి మనం
గొప్పవాళ్ళం కానీ వారి అనుచరులం కానీ
కానఖ్ఖర్లేదు. మనలో ఏ ప్రత్యేకత లేకున్నా గుండె నిండా ధైర్యం ఉంటే చాలు.
ధైర్యం ఎందుకంటే అబద్ధాలు చెప్పటానికి ధైర్యం కావాలి. మనం చెప్పేది ఎదుటి వాళ్ళు
నమ్మరు అని తెలిసినా చెప్పటానికి శౌర్యం
కావాలి. విన్న వాళ్ళు చాటున ఎగతాళి చేస్తున్నారని అర్ధం అయినా మన గొప్పలు చెప్పుకోడానికి సాహసం కావాలి. మనం చెప్పేది ఎదుటి వాళ్లెవరు నమ్మటం లేదు అని
అర్ధం అయినా మనం చిన్నబుచ్చుకోకూడదు. అయినా
మన పంధాలో కొనసాగాలి. ధైర్యం, శౌర్యం, సాహసం కలవాళ్ళే బాకాసురులుగా ప్రసిద్ధి చెందుతారు.
నేను బాకా ఊదడం అప్పటికే మొదలు పెట్టినా అది కుటీర పరిశ్రమ
లెవెల్లోనే ఉండేది.
“ డెబ్భై ఏళ్ల క్రితం మేము మా స్వంత ఊరిలో ఉన్నప్పుడు మా
ఇంట్లో రోజూ కనీసం పదిమంది భోజనం చేసేవారు. ఊరికి వచ్చినవాళ్ళు మా ఇంట్లోనే భోజనం
చేసేవారు, మా ఇల్లు లంకంత ఉండేది,
ఇంటిముందు ఎకరం పూలతోట ఉండేది, ఎవరింట్లో పెళ్లైనా కూరగాయలు మా పొలంలోంచే
వెళ్ళేవి, మా ముత్తాత గారి మాట మీదే మా ఊరు నడిచేది, ఇత్యాదులు విరివిగానే జనం
చెవిలో ఉదేవాడిని.”
క్రమక్రమంగా ధైర్య, సాహసాలు పెరగడంతో ముత్తాత దగ్గరి నుంచి తాత,
వారి దగ్గర నుంచి నా పిల్లల దాకా కూడా
గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టేను. చెప్పిందే పది మాట్లు చెపితే జనం నమ్ముతారు
అని గోబుల్స్ గారు కూడా నిరూపించారు. వారి
అడుగుజాడల్లో అనేకమంది నడిచారు. మనం మన గొప్పలు చెప్పుకోవడంలో తప్పులేదు అని నమ్మాను. అతిశయోక్తులు కల్పించి, అది
ఆచరణలో విజయవంతంగా పెట్టాను. కుటీర పరిశ్రమను హెవీ
ఇండస్ట్రీ గా అభివృద్ధి చేసుకున్నాను.
మనం ఏదైనా చెపితే సాధారణంగా ముఫై – నలభై శాతం
నమ్మేస్తారు. అందుకనే వాళ్ళని మాబ్ అంటారు. వారు ఎక్కువుగా ఆలోచించరు. పదిహేను
శాతం తటస్థంగా ఉంటారు. ఇరవైశాతం మంది
పట్టించుకోరు. ఒక ఇరవై శాతం మంది నిరూపించుము అంటూ ప్రశ్నిస్తారు. మిగతా వారు ఏదీ నమ్మరు. ఎంత విశ్వాసం కలిగించినా, ఎన్ని
రుజువులు , ఉదాహరణలు చూపించినా, నమ్మరు.
వారి నైజం అది. మీరు నమ్మరా? ఒక ఉదాహరణ
చెబుతా వినండి. నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా మిత్రుడు ఒకడు పైథాగరస్
సూత్రాన్ని నమ్మేవాడు కాదు. మాష్టారు ఎన్ని మాట్లు సూత్రం చెప్పి, అడిగినా అన్ని మాట్లు వేరు వేరు జవాబులు
చెప్పేవాడు. ఒక రోజున మా మేష్టారు వాడిని బల్ల మీద నుంచోపెట్టి “వీడు పైథాగరస్
సిద్ధాంతాన్ని నమ్మడు” అని ప్రకటించారు కూడాను. నేను కూడా లెఖ్ఖల్లోనూ, వ్యాకరణంలోనూ కొన్ని సూత్రాలు నమ్మేవాడిని కాదు. నా నమ్మకాలు
వేరుగా ఉండేవి. అప్పుడప్పుడు మా మాష్టారు నేను నమ్మక తప్పని పరిస్థితులు
కలిపించేవారు. నా శరీరం మీద నాకు ప్రేమ
ఎక్కువగా ఉండడం వల్ల నమ్మక తప్పేది కాదు.
మనం, పైన చెప్పిన మొదటి
మూడు రకాల వాళ్లనే టార్గెట్ చేసుకోవాలి. మిగతా రెండు రకాలవారు తటస్థ పడినా లెఖ్ఖ
చెయ్యకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి నిర్ధారిత నియమాలు ఏమి లేవు. ఎవరికి వీలైన
పద్ధతులు వారు ప్రయత్నించవచ్చు. కొంతమంది వారి తాతలు నేతులు తాగిన విధానాలు
ప్రయోగిస్తే, మరి కొంతమంది వారి తండ్రుల గొప్పతనాన్ని తమకు అన్వయించుకోవచ్చు,
ఇంకొంతమంది తమకు ఇచ్చం వచ్చినట్టు తమ గొప్పతనం చెప్పుకోవచ్చు. భార్యా పిల్లల
తెలివితేటలు, గుణగణాలు విచ్చలవిడిగా ప్రదర్శించవచ్చు. మీరు శ్రద్ధగా గమనిస్తే మీ
చుట్టుపక్కల ఇలాంటివారు తరచుగా
కనిపిస్తూనే ఉంటారు. నేను చెప్పుకున్న గొప్పలు కొన్ని చెప్పి ముగించేస్తాను.
౧. మా నాన్న గారు గొప్ప వేద పండితులు, జ్యోతిష వేత్త
కూడాను. నా చిన్నప్పుడు, ఎక్కడో , గుర్తులేదు కానీ, రాష్ట్రపతి మా నాన్నగారి పాండిత్యానికి
ముగ్ధులైపోయి, పండిత సభలో వెయ్యి నూట పదహార్లు ఇచ్చి, శాలువా కప్పారు. ఆ శాలువా మొన్నటిదాకా మా
ఇంట్లోనే ఉండేది. మీరు చూసే ఉంటారు,
ఎర్రగా ఉండేది. పాతబడి చిరిగిపోవడం వల్ల కిందటి మాటు వెళ్ళినప్పుడు మా
ఊర్లో దానికి అంత్యక్రియలు కూడా జరిపించాము.
౨. రాజకీయ నాయకులు, కవులు, సాహితీ వేత్తలు చాలామంది మా ఇంటికి
వచ్చేవారు. ప్రకాశం గారిని నేను మామయ్యా అని పిలిచేవాడిని. శ్రీనివాసరావు గారు, మా నాన్నగారి ఆశీర్వచనం తీసుకునే, తన కావ్యం వ్రాయడం మొదలు పెట్టారు. మా ఊరి మున్సిపల్ చైర్మన్ మా
నాన్నగారు చెపితే తప్ప కాలు కదిపేవారు కాదు.
౩. మొన్న ఢిల్లీ మీటింగ్ కి వెళ్ళినప్పుడు మా మంత్రిగారు నా గురించి తెలుసుకొని, ఫలానా వారి అబ్బాయా
మీరు? అని నాచేతులు పట్టుకొని, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు మా నాన్నగారిని
తలుచుకొని.
ఈ విధంగా అనేక మార్లు నేను, మా నాన్నగారి గురించి, నా గురించి, నా భార్య , పిల్లల గురించి నానా
గొప్పలు చెప్పుకున్నాను. గొప్పలు చెప్పుకుంటూనే ఉంటాను. కిట్టని వాళ్ళు
కోతలు కోస్తున్నాడు అంటారు. మీరు వాళ్ళని నమ్మకండి.
4 కామెంట్లు:
బాకాసురుణ్ణి వదిలేశారాలేదా? వమ్మో మళ్ళీ మొదలెట్టకండి అ.హా
అప్పుడు బాకాసురులే ఇప్పటి బ్లాగాసురులయ్యరన్న మాట .సూపెరు .
" కిట్టని వాళ్ళు కోతలు కోస్తున్నాడు అంటారు. మీరు వాళ్ళని నమ్మకండి. " ... aay. Ok andi. Nammam. da. haa.
వీటిలో ట్రైనింగ్ ఇచ్చే ఆలోచన ఏమైనా వుందాండీ? ముఖ్యంగా మైకాసురులు అవ్వడం ఎలా అన్నదాన్లో. :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి