మృత్యు ముఖం లో నాలో నేను

మొన్న ఏలూరు మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు , హఠాత్తుగా , అనుకోకుండా, ఊహించని విధంగా మృత్యు ముఖంలోకి వెళ్ళాను. అంతా అయిపోయింది అనే అను కున్నాను . 

ఇలా మృత్యు ముఖము లోకి వెళ్ళడం దీనితో కలిపి నాలుగో మాటు. అంటే, అంతో ఇంతో అనుభవం గడించేసాను అన్నమాట. సమయం సందర్భం కలిసి వచ్చింది కాబట్టి ఆ మూడు అనుభవాలు ముందుగా చెపుతాను. 



మొదటిమాటు 1970 లో గౌహతి నుంచి కలకత్తా  వస్తుండగా  జరిగింది.

 అప్పుడు చిన్న విమానాలు  ఉండేవి. 1966 లో మొదటిమాటు నేను జోర్హట్ వెళ్లినప్పుడు డకోటా లు ఉండేవి. కలకత్తా నుంచి జోర్హట్ కి టికెట్ ధర  Rs. 164/   అక్షరాల నూట అరవై నాలుగు రూపాయలు.  

2,3 ఏళ్ల తరువాత ఫోకర్ విమానాలు వచ్చాయి. 


గౌహతి లో బయల్దేరిన 15- 20 నిముషాలకి ఉన్నట్టుండి విమానం ఒక 100-150 అడుగులు కిందకి పడింది.   

అప్పుడు తీరుబడిగా, నింపాదిగా మూడు భాషలలోనూ, మీ సీటు బెల్ట్ లు కట్టుకోండి. సిగరెట్టులు కాల్చకండి. ధన్యవాదాలు అని చెప్పింది గాలి (లో) అతిధి సత్కారము ఛేయు స్త్రీ. 

చెప్పిన వెంటనే మళ్ళీ ఇంకో 100 అడుగులు కిందకు పడింది. 

అప్పుడు విమానమును తోలు వాడు, “ఈ విమానము గాలి క్షోభము లో చిక్కు కున్నది. మీ విమానము తోలు వారు, ఇరువురును, కడు అనుభవము గలవారు. కావున మీరు ఆరాధించు మీ దేవుళ్ళను ప్రార్ధించుకోండి" అని సలహా ఇచ్చారు. 

వారు చెప్పి న వెంటనే మళ్ళీ ఇంకో 100 అడుగులు డుబుక్కు జర జర మే అంది విమానం. 

అప్పుడే ప్రయాణికులను,  విమానము తోలు సిబ్బంది ని వేరు ఛేయు తలుపు హఠాత్తుగా  తెరుచుకొనెను.  

చల్, హరి, ఫ ఫ , అను పదములు  ముందు సీట్లో కూచున్న నాకు వినపడెను.  నేను ఆశ్చర్యపోతిని. 

ఈ శబ్దములు నాకు తెలియును.  మేము మా తాత గారి ఊరు,  కానూరు అగ్రహారం వెళ్ళునప్పుడు, మా తాత గారు నిడదవోలు స్టేషను కు రెండెడ్ల బండి పంపిచే వారు. బండి తోలు వాడు తొట్టిలో కూర్చుండి ఎడ్లను ఇటులనే అదిలించెడి  వాడు. 

నాకు అప్పుడు మొదట మాటు భయము వేసెను. ప్రయాణికులలో చాలామంది భయ భ్రాంతులై ఉన్నారు. నలుగురైదుగు రికి  గాయము లయినవి. 

రామ భజనలు, సాయి భజనలు, హనుమాన్ చాలీసాలు గానము చేయబడు చున్నవి. 

నా పక్కన కూర్చున్నాయన ఇంత విభూతి తీసి తను రాసుకొని, నాకు కూడా పూసెను. 

ఉన్నట్టుండి విమానం ఒక 150 అడుగులు లేచి మళ్ళీ ఒక 50 అడుగులు గిర్గాయా హై. అప్పుడు హాహా కారముల స్థాయి పెరిగెను. 

శ్రీ వెంకన్న గారికి నిలువు దోపిడీలు, ముడుపులు ఎక్కువ అయ్యాయి.  

విమానం తోలు వారు హరి,ఫఫ,చల్ మంత్ర జపం చేయుచున్నారు.

నేను కూడా Oh this could be the end  అని ఆంగ్లమున అనుకొంటిని. 

మనంబున,   పెళ్లి కాకుండానే గోవింద కొట్టేస్తానా అని అనుకుంటిని. 

అసలు సంగతి చెప్పడం మరిచిపోయాను. నేను పెళ్ళికి వెళ్ళుతున్నాను. ఆ,  నా పెళ్లికే. 

అమ్మయ్య పెళ్ళికి చేసిన అప్పులు తీర్చనఖ్ఖర్లేదు అని కూడా సంతోషించితిని.  

నా హాండ్ బాగేజీ లో సుమారు 11-12 వేలు ఉన్నాయి. అవి అన్నీ కాలిపోతాయా, లేక బంగ్లాదేశ్ లో గాలికి కొట్టుకు పోతాయా? విమానము నకు నిప్పు అంటుకొనునా లేక కిందపడి ముక్కలగునా ? ప్రాణములు గాలిలోనే పోవునా లేక కిందపడి శరీరము ముక్కలగునా ? అను ఆలోచనలు చెలరేగుచుండెను. 

ఆశ్చర్యముగా, నా కాబోయి తప్పిపోవుచున్న భార్య ఏమనుకొనును. విచారించునా లేదా?  అను అనుమానం  కూడా వచ్చెను. 

మా అన్నగారి మీద జాలి వేసెను కూడా. మా చెల్లెలి వివాహ బాధ్యత పూర్తిగా వాడే ఎత్తవలె కదా అని.  

ఏర్లైన్స్ వారు 3-4 లక్షలు ఇచ్చుదురు కదా అని మరల అనుకొంటిని. ఆహా మా నాన్నగారు లక్షాధికారులు అవుతారు  అని స్వాంతన చెందితిని. 

ఇటువంటి ఊహాలే వచ్చాయి కానీ భయం ఎక్కువగా వెయ్య లేదు అనుకుంటాను.  

కొంచెం సేపు తరువాత,  పడుతూ లేస్తూ, విమానం సానుకూల వాతావరణము లోకి ప్రవేశించెను. సుమారు 10  నిముషాలు ప్రాణములు అరచేతిలోనే ఉన్నవి. 

ఈ పది నిముషాలలోనూ కనీసం  మూడు నాలుగు  మాట్లు this is it అనుకున్న క్షణాలు ఉన్నాయి. విమానం ఆ తరువాత క్షేమము గానే కలకత్తా లో దిగింది.

అదృష్టవశాత్తూ,  ఈ గండము,  ఆ యొక్క వివాహ ముహూర్త బలము వలననూ, నేను ప్రభావతీ దేవి గారి మెడలో తాళి కట్టవలెనని బ్రహ్మ గారు లిఖించుట వలననూ,   మున్ముందు ఆ యొక్క ప్రభావతి గారు ప్రదర్శించు పాతివ్రత్య మహిమల సంకేతముగా యగుట వలననూ, ప్రమాదము గట్టెక్కినది అని ఆడపెండ్లి వారు ఉద్ఘాటించిరి.  హరి ఓం తత్సత్.



రెండవది కూడా విమాన ప్రమాదమే, అదియును కూడా గౌహతి నుండి కలకత్తా వెళ్ళు విమానమే. 1985/86  లో అనుకుంటాను. ఈ మారు విశాల శరీరము గల బోయింగ్ విమానము. మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరవలసిన విమానం సాయంకాలం 6-30 కి బయల్దేరినది. అంతా చీకటి కమ్ముకున్నది. 

రన్వే కి కొంచెం దూరం గా గడ్డి మేయుచున్న మహిషా శిరోమణి ఇంటికి వెళ్ళదామని  నిర్ణయించుకొని, ఎటు నుంచి వెళ్ళుటయా అని ఆలోచించుచున్నది. 

విమానం రన్వే చివరకు ప్రయాణించు చున్నది. 

ఆ చప్పుడేమిటో చూద్దామని గేదా స్త్రీ రత్నం రన్వే మీదకు వేంచేశారు. 

అక్కడ విమానం వెనక్కి తిరిగి పరుగు  వేయుటకు సిద్ధముగా నున్నది. 

ఈ చివర గేదె గారికి హ్రస్వ దృష్టి వలన పక్కనున్న చిన్న దీపములకన్నా వారి దూర దృష్టి వల్ల దూరముగా యున్న విమాన లైట్స్ చూసి, అదిగో ద్వారక,  అని పరుగు మొదలుపెట్టింది. 

ఇటు విమాన చోదకుడు ముందుకు దూకించారు.

అటు శ్రీమతి గేదె పరుగు పెడుతోంది. 

ఇటు విమానం క్షణ క్షణానికి వేగం పెంచుకుంటోంది. 
అటు మహిషా మణి స్టెడీ గా పరుగు పెడుతోంది. 
విమానం
 గేదె
 గేదె
విమానం,
మళ్ళీ విమానం
మళ్ళీ  గేదె

తమ తమ పరిధిలో పరిగెడుతున్నాయి. విమాన చోదకునికి దూరం గా కదులుతున్న నల్లని ఆకారం కనిపించింది.  

మే డే,  మే డే అందామనుకొని ఇంకా మార్చి నెలే అని గుర్తుకు వచ్చి ఆగి పోయాడు. 

ఇప్పుడు టేక్ఆఫ్ చేస్తే కుదురుతుందా, చేస్తే ఆ ఆకారం పైనుంచి వెళ్ళుటకు వీలవుతుందా అని ఒక క్షణం ఆలోచించాడు. 


అప్పుడే,   ఇల్లు చేరుతున్నామని ద్విగుణీకృతోత్సాహం తో  శ్రీమతి మహిషము వేగము రెట్టింపు చేసెను.
గత్యంతరము లేదని గ్రహించిన చోదకుడు,  మేడే మేడే  అని అరచుచూ బ్రేకులు ప్రయోగించెను.
విజృంభించి వేగము అందుకున్న గేదామణి దూసుకు వచ్చు చుండెను . 

మరలా గేదె, విమానము, విమానము,  గేదె. 

విమాన భూతల నిర్దేశకుడు తగు చర్యలు తీసుకొని అందరినీ సమాయత్తపరిచెను. 

గేదె గారు దగ్గరగా వచ్చేశారు. 

చోదకుడు హైదరాబాదు ఆటో వాని వలె పక్కనుండి దూసుకుపోదామని విమాన దిశ కొద్దిగా పక్కకు  మార్చెను. 
అదే క్షణములో గేదె గారు కూడా అపాయము శంకించినదై తను కూడా దిశ మార్చెను. 

వేగము తగ్గిన విమానము, గేదామణి  పరస్పరము  ఢీకొన్నారు.

విమానము రన్వే పక్కగా గడ్డిలో ఒక 15 - 20 mts. ప్రయాణము చేసి ఆగెను. 


చదువరీ ఇచట నొకింత నాగుము. ఏలనన ఈ సంఘటనలో ఇంకొక కోణము కూడా ఉన్నది గదా.  

విమానములో మంద్రస్వరము తో సంగీతము వినిపించుచున్ననూ, 4 గంటల పైగా ఆలస్యము అయినందుకు ప్రయాణికుల మోము నందు విసుగు, చిరాకు, కోపము వ్యక్తమగుచుండెను. 

పాపము గాలి సత్కారమును చేయు స్త్రీ రత్నము లెంతగా నవ్వినను, చాక్లెట్టులు లంచమొసిగి నను, చల్లని మంచి నీరు ఇచ్చినను ప్రయాణికుల మోము నందు ప్రసన్నత కానరాదాయె.  

విమానము గాలిలో ఎగురుటకు పరుగు పెట్టునప్పుడు వారి ముఖారవిందముల కొంత ఉపశమనము గోచరించెను. వారందరును సీటు బెల్టులు కట్టుకొని  కూర్చుండిరి. నేను స్మోకింగ్ జోన్ లో  వెనకగా కూర్చుంటిని. ఇంకో 5,6, నిముషములలో ధూమపానము చేయవచ్చును గదా అని సంతసించు చుంటిని. 

తల 180 డిగ్రీల కోణములో వెనక కి తిప్పి గాలి సుందరి ని చూచుటయా, లేక నిటారుగా కూర్చుని, మెడ నిక్కించి మూడు సీట్ల ముందున్న కన్యకా మణి ని వీక్షించుటయా  అను ధర్మ సందేహమున కొట్టు మిట్టు లాడు చుంటిని. 

ఉన్నట్టుండి విమానము పెద్ద కుదుపు నకు లోనయ్యెను. పరుగు పెడుతున్న విమాన వేగము హఠాత్తుగా తగ్గినట్టు అనిపించెను. కదలికలో అపస్వరము ధ్వనించెను. ఏమగు చున్నదో అర్ధం కాలేదు. విమానము పక్కకు తిరిగినట్టు అనిపించెను. 

ఇంతలో విమానము ఆగెను. 

విమాన రెక్క వైపు కూర్చున్న పధికుడొక్కడు మంట అని అరిచెను. 

అంతలో విమాన చోదకుని స్వరము వినిపించెను. అత్యవసర పరిస్థితి వల్ల విమానము ఆపివేసితిని. మీ  రందరూ    అత్యవసర ద్వారము ద్వారా క్రమ పద్ధతిలో దిగి విమానము నకు దూరముగా వెళ్లవలెనని విజ్ఙప్తి చేసెను. 

ఒకే భాషలో చెప్పెను. 

అతని స్వరము ఆగక ముందే స్త్రీ రత్నము లు పరుగున వచ్చి ద్వారము తెరిచి, జారు విధానము మరల మరలా చెప్పుచుండిరి.   

ప్రయాణికులలో కంగారూ, భయము కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. 

మొదట  పిల్లలు, స్త్రీలు ఆ తరువాత మొగవారు బయట పడుచుంటిరి. బయట పడి దూరముగా పరిగెడుతుండిరి.  

ఇంతలో అగ్నిమాపక దళము వచ్చినది. ఆ వెనకనే ఇంకొక రెండు వాహనములు వచ్చినవి   కొలది  దూరములో  సెక్యూరిటి వాహనము తో సహా.  

అపాయము అని మాకు తెలిసిన  4, 5, నిముషాలలో ప్రయాణికులందరు దిగిపోయారు. బహుశా ఇంకా ముందే నేమో కూడా. 

మేము  ఒక 200 mts. పరిగెట్టి వెనక్కి చూసేటప్పటికి అగ్ని మాపక దళం చాలా సమర్ధవంతంగా పని చేస్తోంది అనిపించింది. మంటలు ఎక్కడా కనిపించలేదు.

ఈ నాల్గైదు నిముషాల ప్రమాద కాలము లో నేనేమీ ఆలోచించలేదు అనుకుంటాను. ఎంత త్వరగా బయట పడుదామా అన్న ఆలోచన తప్ప మరొకటి రాలేదు అనుకుంటాను.  

స్త్రీలను పిల్లలను ముందుకు పంపటంలో నేనూ కొంత చేశాననుకుంటాను. చివరగా దిగిన 6,7 మందిలో ఉన్నాను. చివరగా స్త్రీ రత్నములు దిగారు.  ఆ క్లిష్ట సమయములో కూడా వారి మొహంలో చిరునవ్వు చెదరలేదు. మిగతా క్రూ ఎప్పుడు దిగారో నేనూ చూడ లేదు. 


రన్వే పైకి గేదె రావడం లో నిర్లక్ష్యము కొట్ట వచ్చినట్టు కనిపించిననూ,    ఈ సంఘటన తరువాత నాకు ఇండియన్ ఏర్లైన్స్ , ఎయిర్పోర్టు అథారిటీ వారి మీద గౌరవము చాలా పెరిగిపోయింది. 


ఆ తరువాత టూరు మానుకొని మర్నాడు నేను ఇంటికి తిరిగి వచ్చితిని.  



నా మాట :  రెండు ప్రమాదములు  గురించి ఇప్పటికే   పెద్ద హరికధ ఆగుటచే ఇంతటి తో ఇది సమాప్తము. మిగిలిన రెండు ఉదంతములు వీలు చూచుకొని వ్రాయబడును.


ఈ రెండు ఘటనలు జరిగాయి. వాటిలో నేను ప్రయాణము చేయుట  కూడా యదార్ధము.  సంవత్సరాలు సరిగా గుర్తు లేవు.  మిగిలిన కధ చాలా మట్టుకు కల్పితమే ఏదో మీరు కొంచెం  నవ్వి  పెడతారని..    విటహా (వికటాట్టహాసము). 
  

గమనిక: ఇది మొదటగా జూలై 12, 2011 న ఈ బ్లాగులో ప్రచురించబడింది.         

39 కామెంట్‌లు:

MURALI చెప్పారు...

బులుసుగారు అంత భయంకరమైన సంఘటనలని ఎంత హాస్యంగా చెప్పారు. పదిమందిని నవ్వించే మీకు భగవంతుడు ఆరోగ్యంతో కూడిన చిరాయువునివ్వాలని కోరుకుంటున్నా.

Rishi చెప్పారు...

బాగుంది అని చెప్పడం రొటీన్ కాబట్టి ఇంకో మాట చెప్తాను. ఓ పది రోజుల క్రితం చిలకమర్తి వారి గణపతి చదువుతోంటే మీరే గుర్తొచ్చారండీ. బ్లాగ్లోకపు చిలకమర్తి గా మిమ్మల్ని డిక్లేర్ చేసెస్తున్నా అంతే. మంగళం మహత్..శుభం..

sai krishna alapati చెప్పారు...

Nice ....aithe meru mrutyunjayudu anna mata guruvu garu anta pedda pedda pramadala nunchi bayata paddaru...kani padamawathi gari chetiki chikku konnaru....ade vidhi vichitram

Ravitheja చెప్పారు...

అటు శ్రీమతి గేదె పరుగు పెడుతోంది.

ఇటు విమానం క్షణ క్షణానికి వేగం పెంచుకుంటోంది.
అటు మహిషా మణి స్టెడీ గా పరుగు పెడుతోంది.
విమానం
గేదె
గేదె
విమానం,
మళ్ళీ విమానం
మళ్ళీ గేదె

-----------------------------
రక్తపోటు రెట్టింపయ్యింది ఈ సన్నివేశంలో


ఆఫీసు లో చదవడం వాళ్ళ మనస్పూర్తిగా నవ్వుకోలేకపోయాను

తరువాయి బాగం కోసం ఎదురు చూస్తూ

మీ భాదితుడు

రవికిరణ్ పంచాగ్నుల చెప్పారు...

టపా అదిరింది సార్!

air hostess = గాలి సత్కారమును చేయు స్త్రీ రత్నము :-)

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బ భయపెట్టారు కదండీ....ఇప్పుడు నవ్వుతూ చెబుతున్నారుగానీ ఆ సమయములో చాలా టెన్షన్ వచ్చి ఉంటుంది కదా!

అంతా ప్రభావతిగారి జాతకం మహిమ....మీరు లక్కీ! (సు.చి.న)

అజ్ఞాత చెప్పారు...

Air Hostes = గాలి (లో) అతిధి సత్కారము ఛేయు స్త్రీ

ఒక పది స్మైలీలు....

క్రాంతి చెప్పారు...

భలే రాసారండి! తరవాతి భాగం కోసం ఎదురు చూస్తున్నాము.

రాజ్ కుమార్ చెప్పారు...

గురువు గారూ. కూసింత భయపెడితే పెట్టారు గానీ.. మీ స్టైల్లో కుమ్మేశారు.. సూపరంతే..
తర్వాతి భాగం కోసం వెయిటింగ్ అండీ.. ;)

హరే కృష్ణ చెప్పారు...

గురూజీ హాస్యం తో అదరగొట్టేసారు
లాంటి సాహసాలను తలచుకుంటేనే ఏదోలా ఉంటుంది
గండం గడిచిపోయిందని ఊపిరి పీల్చుకుంటే మీరు మళ్లే మరి రెండు జర్క్రక్ లు ఇస్తామని ముందే హెచ్చరికలు చేసేస్తున్నారు :((

ఇకమీదట మీకు ఎటువంటి కష్టం లేకుండా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

మురళి చెప్పారు...

మిగిలిన రెండు ప్రమాదములలోనూ ఒకటి సుమన్ బాబు యొక్క ప్రీమియర్ షోను వీక్షించుటయని నా సందేహము..
ఏది ఏమైనను, విధి బలవర్ధకము.. (బలీయము రొటీన్ కదండీ అందుకు) శ్రీమతి ప్రభావతి దేవి మరియు తెలుగు బ్లాగరులు అదృష్టవంతులు!!

కొత్తావకాయ చెప్పారు...

విషయమేమిటంటే మీ బ్లాగు ఓపెన్ చేసేసరికే నవ్వు మొహం మీద అతుక్కుకూర్చుంటుంది. అది అలా ఉండడం, కాసేపున్నాక ఇంకొంచెం చెవుల దాకా సాగడం, మధ్య మధ్యలో చిన్న చిన్న శబ్దాలు మొదలుకొని మీరు "డుబుక్కు మే" వంటి పద ప్రయోగాలు చేసినపుడు కిసుక్కు, పక పక, కిచ కిచా రావములతో కూడి విజృంభించి, చివర కామెంటులూ కూడా చదివిన తదుపరి కుంచెం నెమ్మదిస్తుంది. బ్లాగు మూసేసి మన పని మనం చేస్కుంటున్నా రన్వే మీద గేదె కనిపించి కిచకిచలాగకుండుట మా మనసిక దౌర్బల్యమా? మీ హాస్య చతురతా? ప్రభావతీ ప్రాణవల్లభా! చిరాయురస్తు.

రెండవ భాగం త్వరలో విడుదలగునని చేసిన ప్రమాణమును వంకాయ పప్పు భళా వలె మరిచిపోకుందురు గాక!

krishnaveni చెప్పారు...

Mr Subramaniam,
This is a great post since you were all praise for IA/AI. I still have a great sense of belonging and attachment to the organization till date since I worked there for long many years. Great to see that someone like you appreciate the efforts and the hardwork and the long hours which the personnel put in to make the passengers comfortable. Wonderful post.
P.S. I could have written it in Telugu but I could not possibly expressed it as well. So I apologize for that.

ఇందు చెప్పారు...

గురువుగారూ...

గేదెగారిని వివిధనామధేయములతో....పలువిధములుగా కీర్తించిన మీరు కేకస్య! :))

ఆ గేదె..విమానము...గేదె...విమానము...దృశ్యం కళ్ళముందు ప్రత్యక్షమైందంటే నమ్మండీ....

ఎలాగైతేనేం....మమ్మల్ని ఇలా నవ్వించాలని ఆ ప్రమాదములనునండి సురక్షితముగా బైటపడ్డారన్నమాట :)

నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ :)

జేబి - JB చెప్పారు...

>>>మొన్న ఏలూరు మెయిన్ రోడ్డు...

మీరు ఇపుడు క్షేమమే అని తెలియగానే కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి.

ప్రభావతిగారి పాతివ్రత్య మహిమతో పాటు మేము ఎపుడో చేసుకున్న పుణ్యముగూడ మీరు బ్లాగులద్వారా ఇలా మాకు నవ్వులు పంచాలని బ్రహ్మ మీ ఖాతాలో వందేళ్ళు రాసివుంటాడు.

buddhamurali చెప్పారు...

బులుసు గారు మీరు ఐదు దశాభ్దాల క్రితమే విమానం ఎక్కానని బహు చక్కగా చెప్పితిరి ( ఆహా ... బాగా రాశారని మీకు ఆందరూ చెప్పినట్టు చెబితే అభిప్రాయాన్ని కాపి కొట్టా నను కుంటారు , అలా చెప్పక పొతే చదివింది అర్థం కాలేదేమో అని నన్ను అనుమానిస్తారు అందుకే ఇలా చెప్పాను )

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ హ గురువు గారు.. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూపించేశారు సార్.. రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నాను.. ఈ ప్రమాదాలనుండి మిమ్మల్ని క్షేమంగా బయటపడేసినందుకు దేవుడికి ప్లస్ ఆ పైలట్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మురళి గార్కి,

జరిగిపోయిన ఘటనలు కాబట్టి ఇపుడు నవ్వుకోవచ్చు, అప్పుడు భయపడినా. ధన్యవాదాలు మీ అభిమానానికి.

రిషి గార్కి,

ధన్యవాదాలు. హాస్యానికి ఒక కొత్త వరవడి ని సృష్టించిన చిలకమర్తి వారితో మనకి పోలిక లెందుకండి.

సాయి కృష్ణ గార్కి,

చూసారా మరి, విధి విలాసమన నిదె కదా. ఒక చోట తప్పించుకున్నా మరొక చోట చిక్కుకుంటాము... చిన.(చిరు నవ్వు). ధన్యవాదాలు.

రవితేజ గార్కి,

రక్త పోటు పెంచుకోకండి. మనకి ట్రాజెడీ లు వ్రాయడం కుదరదు. ధన్యవాదాలు.... చిన

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రవి కిరణ్ గార్కి,

ధన్యవాదాలు. అంతకన్నా ఏమనాలో తెలియలేదండీ. మహా. (మందహాసం)

ఆ.సౌమ్య గార్కి,

ఏమౌతోందో తెలియని పరిస్థితుల్లో కొంచెం టెన్షన్ తప్పదు కదండీ. నేనూ, నా జాతకం హుళక్కేనా, అంతా ప్రభావతి మహిమేనా. ఏంచేస్తాం. ధన్యవాదాలు... న.న.న

అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు. నావికూడా కొన్ని దరహాసాలు.

క్రాంతి గార్కి,

ధన్యవాదాలు.

వేణూ రాం గార్కి,

ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం భయం వేసినా తరువాత నవ్వు పుట్టిస్తాయి.. రెండవ పార్టు త్వరలోనే . ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హరే కృష్ణ గార్కి,

సాహసం నేను చేయలేదు. వారే చేయించారు. సీరియల్ కధలలాగానే నా ప్రమాదాలు అనుకుంటాను. దహా. ధన్యవాదాలు మీ గుడ్ విషెస్ కి.

మురళి గార్కి,

సుమన్ బాబు ఇచ్చిన షాక్ కి ఒక టపా వేసేశాను కాబట్టి మళ్ళీ రిపీట్ చెయ్యను. వేచి చూడండి మిగతా రెండిటి కోసం. విధి బలవర్ధకమైనది కాబట్టే నాకు డోసులు ఎక్కువైయ్యాయి. ధన్యవాదాలు.

కొత్తావకాయ గార్కి,

మీరంతా నవ్వుతారా, నవ్వి పోతారా, ముత్యాలు దొర్లిస్తారా, లేదా అనే ఆదుర్దా నాది. నా హాస్య చతురత సామాన్యమే. మీ అందరి అభిమానమే నాకు శ్రీరామ రక్ష.
రెండవ భాగం త్వరలోనే ఒకటి రెండు నెలల్లో. వంకాయ పప్పుకూర భళా కూడా వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. ధన్యవాదాలు.

కృష్ణవేణి గార్కి,

ధన్యవాదాలు. అత్యవసర పరిస్థితుల్లో మన ఏర్లైన్స్/AAI ఉద్యోగులు ఎవరికీ తీసిపోరనే నా అభిప్రాయం.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇందు గార్కి,

ఆ క్షణాల్లో యముని మహిషపు లోహ ఘంటలు వినిపించేసిందండి ఆ గేదా రత్నం. మిమ్మల్ని అందరినీ ఇలా హింసించాలని బయట పడ్డా నన్నమాట.. చిన. ధన్యవాదాలు.

జేబి-JB గార్కి,

మీరు కూడా ప్రభావతి గారి మహిమే అంటున్నారా. నాదేమీ లేదంటారు. ఏంచేస్తాం కానివ్వండి. వందేళ్లు వద్దు సార్. ఇలా నవ్వగలిగినంత కాలం చాలు. ధన్యవాదాలు.

బుద్దా మురళి గార్కి,

మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా సారూ. మీరెంత చతురులో మీరు నిరూపించేసుకున్నారు. . దహా. ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ గార్కి,

మూడు నాలుగు సినిమా కధలు వ్రాసేశాను కాబట్టి ఇది వ్రాయడానికి అనుభవం వచ్చేసింది. ప్రయాణికులు క్షేమంగా బయట పడడంలో, దేవుడికన్నా పైలట్ల పాత్రే ఎక్కువ ఉందనుకుంటాను ఈ రెండు ఘటనల్లోనూ. మీ అభిమానానికి ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

Ee assaamu vaallaki andulonu aandhra raashtram ninchi assaaamu udyoga reethya vellina vaariki ee 'gaali escapade' lu tappavanu kuntaanu. Maa silchar calcutta air travel by indian airlines vaari sahrudaya sahakaaralato mee 'flightu plaatlu' swaanubhavam. Baavundi. Vinayaka Chaviti kathala poti ki pampinchara bulusu gaaru?

cheers
zilebi
http://www.varudhini.tk

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

జంఘాల శాస్త్రి గారి టైపులో హాస్యాన్ని బాగా దట్టించారు గురువుగారు :-)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ అనబడు జిలేబి గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మీరు సిల్చార్ వాసులా. సంతోషం.
లేదండీ పంపలేదండీ. ఈ బ్లాగు లోనే నెలకి ఒకటో రెండో వేసుకోవడమే ఒక పోటీ లాగుంది నాకూ నా బద్ధకానికి. మీ అభిమానానికి, మీ నమ్మకానికి కృతజ్ఙుడిని.

లోకేష్ శ్రీకాంత్ గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

హనుమంత రావు చెప్పారు...

"...మున్ముందు ప్రభావతిగారు ప్రదర్శించనున్న పాతివ్రత్య మహిమ" యూ ఆర్ సో కేర్ ఫుల్ అన్ద్ టైమ్ కాన్షస్...
పెళ్ళికి చేసిన అప్పు తీర్చలేదనుకున్న మీ వేదాంత ధోరణి.....మీ మార్క్ హాస్యం చాలా బాగుంది. అని చెప్దామంటే నా బాధనీకు హాస్యంగా ఉందా అంటా రేమోనన్న బాధ అన్డ్ భయం...అయినా మీ ఎయిరోప్లేన్స్ అనుభవం ఏలూరు రోడ్స్ మీద
పనిజేసింది...ఎలాగైనా నిన్నటి చేదు అనుభవాలు నేటి
తీపి గుర్తులు...(ఇక్కడినుంచి సీరియస్) మీరు చెప్పిన ప్రమాదము యొక్క ఇబ్బందులు అధిగమించి కోలుకున్నారని నమ్ముతూ...హాస్యభరిత ఆపద కథ కనడానికి మిత్రులతో పాటు నేనూ ఎదురు చూస్తున్నాను...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హనుమంత రావు గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మీరు చాలా గడుసు వారు. అనేదంతా అనేసి అలా అనకూడదు గదా సారీ అంటారా. దరహాసం.
మీ అభిమానానికి ధన్యవాదాలు.

చాణక్య చెప్పారు...

మిగతా రెండూ కూడా తొందరగా రాసెయ్యండి. వెయిటింగ్ ఇక్కడ..

నా అంతరాత్మ: దుర్మార్గుడా..! ఆయన అంత పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడితే సానుభూతి తెలపడం మానేసి, ఇంకా రాయమంటావా. నువ్వు మనిషివేనా..?

నేను: పోవోయ్.. మనిషిని కాబట్టే చదివి పగలబడి కిందామీదా పడి ఇంక పడితే పళ్ళూడిపోతాయని కుదురుగా కూర్చుని నవ్వుకుంటున్నాను. బులుసు గారు, ఇవేవీ పట్టించుకోకండి. మీరు మిగతావి రాసెయ్యండి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ది చాణక్య గార్కి,

ధన్యవాదాలు మీకు, మీ అంతరాత్మ గారికి కూడా.
రెండు ప్రమాదాల నుంచి తప్పించు కున్న వైనం వ్రాసిన తరువాత కొంచెం విరామం లేకపోతే ఎలాగండి. వెంటనే వ్రాసేస్తే, ప్రమాదాలు కూడా నా హాబీలు గా మీరు అనుకొనే ప్రమాదం ఉంది. కాబట్టి కొంత కాలం ఆగవలిసిందే. అదీకాక నా ప్రమాదాల గురించి మీరు అంత ఘట్టిగా నవ్వితే మీకు ఏమైనా ప్రమాదం కలిగే అవకాశం లేకపోలేదు. అమంగళము ప్రతిహతమగు గాక.

చాణక్య చెప్పారు...

నా అంతరాత్మ- : )))))))))

నేను- :DDDDDDDDD

హనుమంత రావు చెప్పారు...

హా హతవిధీ! క్షీర ఘటమున చంద్రుని చూసిన దాఖలాలు లేవు . ఐనను గడసరి నని అపవాదు పడినది.. ఏమి చేయుట. ? ఇదివరలో మీరు బ్లాగులో వ్రాయు ఉల్లేఖనము మెయిలులో చూసేడివాడను. అది ఏమి చోద్యమో ఈసారి అటుల కానిపింపని కారణాన ఆలస్యముగా చూచుట, ఇలా స్పందించుట...
ఎలావున్నారు సార్? ఆక్సిడెంట్ విషయం వివరించలేదు..ఏదో నవ్విస్తున్నారని అని ఆనందిస్తాముకాని మీ వివరం తెలియలేదు.
నేను అదే అడిగా. బాగా కోలుకున్నారని తలుస్తా. ప్రమాదం ఎలా జరిగింది ? బాగా కోలుకున్నకనే బ్లాగులోకి రండి.త్వరలో మీరు కోలుకోవాలని మా దైవం ఆంజనేయస్వామి ని ప్రార్థిస్తున్నా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ది చాణక్య గార్కి,

ధన్యవాదములు రెండు అట్టహాసములతో.

హనుమంత రావు గార్కి,

ధన్యవాదములు. కుక్క మొరిగిన ఆర్నెల్లకి దొంగ పడడం అంటే ఏమిటో అనుకున్నాను. ఎప్పుడో 25-20 ఏళ్లక్రితం జరిగిన వాటికి ఇప్పుడు పరమర్శా? వెయ్యండి సార్ జోకులు నా మీద, ఏం చేస్తాం దొరికి పోయాను.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అందుకే సర్, రూటు బస్సులు ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్న కాలంలో బస్సు లోపల "దేవుని స్మరింపుము" అనే సలహా / హెచ్చరిక వ్రాసుండేది. విమానాల్లోనూ, రైళ్ళల్లోనూ ఆ concern కనబడదు కదా 🙁 😀.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. ఈ మధ్యన విమానాలు ఎక్కడం లేదు కానీ బస్సు, రైలు చివరికి సైకిల్ ఎక్కినా దైవప్రార్ధన తప్పని సరి ఎవరికైనా. ఇదివరలో కొంచెం తెలివిగా ప్రార్ధించేవాడిని మా కాలనీ లోని శివయ్యని, నా వరకూ ఏ ఆజ్ఞా ఇవ్వవద్దు అని. ....... మహా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

😀😀

Pavan Kumar Reddy Rendeddula చెప్పారు...

4 విమాన ప్రమాదాలా మీరెక్కిన ఫ్లైట్స్ లో. ఈ సారి మీరు ఏక్కే ఫ్లైట్ ఏదో చెప్తే పొరపాటున కూడా నేను టికెట్ బుక్ చేసుకోను 😀

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పవన్ కుమార్ రెడ్డి గారికి. ....... ధన్యవాదాలు.

నా పోస్ట్ మళ్ళీ నా చేత పూర్తిగా చదివించారు గదా మాష్టారూ. నాలుగూ విమాన ప్రమాదాలు అని నేను వ్రాయలేదు అని నిర్ధారణ చేసుకుందుకు. అయినా ఈ మధ్య విమానాలు ఎక్కడం లేదు. మీరు కంగారు పడఖ్ఖర్లేదు. ........ మహా

సీతాదేవికే అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అనే సందేహం వచ్చేది చిన్నప్పుడు. జాతక ప్రభావం సార్. అంతే. ..... మహా

Lalitha చెప్పారు...

ఇప్పుడు చెప్పుకోవడానికి, విటహా చేయడానికి బానేవున్నా పాపం! అప్పుడెంత భయపడి వుంటారో కదా!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

లలితా TS గారికి. ....... అప్పుడు అంతగా భయం వేయలేదండి. ......... మహా

అజ్ఞాత చెప్పారు...

Hi to all, how is the whole thing, I think every one is getting more from this site,
and your views are good for new people.