రామాయణంలో పిడకల వేట – 2

రామాయణంలో పిడకల వేట మొదటి భాగం

ఇక్కడ 

చదవండి  


“నీ కొడుకు నిన్ను గుర్తు పట్టాడా?”  మళ్ళీ అడిగాడు ప్రద్యుమ్నుడు.

“లేదు. ఎక్కడో చూశానని అనిపించిందేమో కానీ గుర్తు పట్టినట్టు లేదు.”

“అంటే ఇది ఒక వైపు పూర్వ జన్మ స్మృతి,  అంతేనా?”

“ప్రస్థుతానికి అలాగే అనిపిస్తోంది. ప్రయత్నించాలి వాడికి పూర్వ జన్మ స్మృతి కలిగేటట్టు”

“మీ పూర్వ జన్మ కధ చెబితే వాడికి గుర్తు వస్తుందేమో. నీ కాలజ్ఞానంతో తెలుసుకున్న పూర్వ జన్మ కధలు చెప్పి చూడు. మొదటి జన్మ అనుబంధం తో మొదలు పెట్టు”  సరదాగానే అన్నాడు ప్రద్యుమ్నుడు.

“మొట్ట మొదటి తల్లీ కొడుకుల అనుబంధం రామాయణ కాలం లో కలిగింది.” సీరియస్ గానే చెప్పింది ప్రభావతి.

“రామాయణ కాలంలోనా” మహదాశ్చర్యాన్ని ప్రకటించాడు ప్రద్యుమ్నుడు.

“అవును, అప్పుడు నేను, నా పతి శ్రీ శ్రీ శ్రీ  శంఖుతీర్ధులు వారు, మా అబ్బాయి  పంచవటిలో ఉండేవారం”

“పంచవటిలోనా” సంభ్రమాశ్చర్య చకితుడయ్యాడు మళ్ళీ ప్రద్యుమ్నుడు.

“అప్పటి మా వారు శ్రీ శ్రీ శ్రీ శంఖు తీర్ధులు వారు చిన్న ముని.”

“మూడు శ్రీ ల శంఖు తీర్ధుల వారు చిన్న మునా?” ప్రద్యుమ్నుడు సందేహ సందోహుడయ్యాడు.

“అవును, త్రికరణ శుద్ధిగా గౌరవిస్తున్నానని తెలియడం  కోసం మూడు శ్రీలు పెట్టేదాన్ని”

“నా కెప్పుడూ ఒక్క శ్రీ కూడా పెట్టలేదు,  పైగా పద్దూ గాడు అనికూడా అంటావు” విచారం వ్యక్తం చేశాడు ప్రద్యుమ్నుడు.

“త్రేతాయుగ పతివ్రతా ధర్మం అటువంటిది.” తేల్చేసింది ప్రభావతి.

“చిన్న ముని అన్నావు. పొట్టిగా ఉండేవాడా” సంశయం వెలిబుచ్చాడు. దీర్ఘంగా నిట్టూర్చింది ప్రభావతి.

“మీకు చాలా చెప్పాలి.  రౌతు చెప్పినట్టు గుర్రం నడుస్తుంది. లెఫ్ట్ టర్న్ అంటే లెఫ్టుకి టరనుతుంది  పీఛేముడ్ అంటే పీఛే మూడుతుంది.  మనస్సును కోరికలు అలా నియంత్రిస్తాయి. కోరికలని చంపుకుంటే సన్యాసి అవుతాడు. సన్నాసి  యోగి అవుతాడు. యోగి తపస్సు చేస్తే తాపసి అవుతాడు. ఎక్కువుగా తపిస్తే   ముని అవుతాడు. ముని ఘోరంగా తపస్యిస్తే  ఋషి అవుతాడు.  ఇంకా ఘోరంగా, క్రూరంగా తపస్సు చేస్తే మహర్షి  అవుతాడు. మహర్షి బ్రహ్మ జ్ఞానం సంపాదిస్తే బ్రహ్మర్షి అవుతాడు. మహర్షులు కొద్దిమందే ఉంటారు. బ్రహ్మర్షులు చాలా చాలా కొద్ది మందే ఉంటారు.”

“ఋషులు  మహర్షులు మధ్య తేడా తెలుసు కోవటం ఎలా?” చర్చలోకి వచ్చాడు ప్రద్యుమ్నుడు.  

“ఋషులు  తపస్సు చేస్తుంటే అప్సరసలు వచ్చి నృత్యం చేస్తే   వారు మహర్షులు అయినట్టు లెఖ్ఖ” ఓపికగా సమాధానమిచ్చింది ప్రభావతి. “అయినా ఇప్పుడు ఆ చర్చ ఎందుకు శ్రీ శ్రీ శ్రీ శంఖు తీర్ధుల వారి గురించి కదా మీరు అడిగింది.”

“అవునవును. వారి గురించే చెప్పు.” బుద్ధిగా బాసిం పట్టు వేసుకొని కూర్చున్నాడు ప్రద్యుమ్నుడు.

“అప్పుడు మా ఆశ్రమం పంచవటిలో ఉండేది. మా వారు తపస్సు చేసుకునేవారు. నేను పతివ్రతా ధర్మం నిర్వర్తించేదానిని. మా అబ్బాయి వీలైతే వ్యవసాయం చేసి, లేనిచో ఆకులు, అలములు, పండ్లు అడవిలోంచి తెచ్చేవాడు. అప్పుడప్పుడు జనపధములలోకి వెళ్ళి భిక్ష తెచ్చేవాడు. అలా  కాలం జరుగుతుండగా ఒక రోజు మా ఆశ్రమానికి కొద్ది   దూరంలో ఆ దశరధాత్మజుడు, జానకి మనో వల్లభుడు, కోదండ రాముడు, కౌసల్యా తనయుడు, లక్ష్మణాగ్రజుడు, శ్రీరామ చంద్రుడు పర్ణ కుటీరం కట్టుకున్నారు. సీతా లక్ష్మణులు, వన్య దేవతలు  సేవిస్తూ ఉండగా కొలువు తీరారు.”

“ఏమిటి? శ్రీరాముడే?” ఆశ్చర్యాంభుధిలో మునిగిపోయాడు ప్రద్యుమ్నుడు.

“అవును, ఆ ముని జన వందుడే, రావణాంతకుడే, సుగ్రీవ మిత్రుడే, ఇన కుల సూర్యుడే, మర్యాదా పురుషోత్తముడే” కొంచెం ఆయాసం తీర్చుకోటానికి ఆగింది ప్రభావతి.

“మీ ఇంటికి కొద్ది దూరంలోనా? అయినా రాముడిని అన్ని పేర్లతో పిలవాలా?” ద్విగుణీకృత ఆశ్చర్యంతో ప్రశ్నించాడు ప్రద్యుమ్నుడు.

“అవును. రామ సంకీర్తనం మోక్ష దాయకం. ఆయన  కుటీరం కట్టుకునే ముందు మా వారి అనుమతికోసం లక్ష్మణుడిని పంపారు తెలుసా? అందుకనే వారిని మర్యాదా పురుషోత్తముడు అంటారు.”

“మీ వారి అనుమతి తీసుకున్నందుకు మర్యాదా పురుషోత్తముడు అయ్యాడా ఆయన?” ప్రద్యుమ్నుడి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది.

ప్రభావతి పట్టించుకోలేదు. కధ కొనసాగించింది.

“శ్రీరామ చంద్ర మహా ప్రభువు దర్శనం చేసుకోవాలని అనుకున్నాం మేము. నేను కేజీడు నేరేడు పళ్ళు భక్తితో కొరికి అట్టే పెట్టుకున్నాను”

“నేరేడు పళ్ళా?”  ఈ మాటు  అంతానికే   అంతం లేని ఆశ్చర్యంతో  పృచ్చించాడు ప్రద్యుమ్నుడు.

“రేగిపళ్ళకే భక్త శబరి అయితే నేరేడు పళ్ళకి మహాభక్త శాలిని అనిపించుకుందామని”

“నీ పేరు శాలిని యా”  అడిగాడు. హాస్యానికి అంటోందో లేక సీరియస్సుగానే అంటోందో తెలియలేదు ప్రద్యుమ్నుడికి. 

“అవును, నేను శాలిని నామధేయురాలిని, మా పుత్రశ్రీ పేరు మరుద్వంతుడు” సీరియస్సుగానే కొనసాగించింది ప్రభావతి. “ఒక రోజు మా కుమార మణి అడవిలో దుంపలు తవ్వుతుండగా అటువైపు వచ్చిన శ్రీరామప్రభువు కనిపించారుట. నడుస్తున్న శ్రీరాముడి కాలిలో ముల్లు గుచ్చుకుందిట. మా అబ్బాయి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన కాలిలో ముల్లు తీసేసాడట. ముల్లు తీసి మా వాడు ఆయన పాదాలు ఒత్తేడట. శ్రీరామ చంద్రుల వారు ఆశీర్వదించి,   ధన్యవాదాలు తెలిపి వెళ్ళి పోయారుట. మా వాడు ఆ పరవశంతో ఆ చేతులు అలానే పట్టుకొని ఇంటికి వచ్చాడు. మా వారు తపస్సుకి వెళ్లారు. ఇంట్లో నేనే ఉన్నాను. మా అబ్బాయి, “జననీ ఇవి పురుషోత్తముడు శ్రీరాముని పాదాలు ఒత్తిన చేతులు” అంటూ ఆ చేతులతో నా పాదాలు స్పృశించాడు. 
 నా శరీరంలో పరవశం ప్రవాహమై ప్రవహించింది. మనస్సు ఉద్విగ్న భరితమైంది. శరీరం   తేలికై , ఇంకా  తేలికై , మరింత తేలికై, ఆ ఆనంద భరిత క్షణాలను తట్టుకోలేక,   తనువు చాలించింది.” ఉపిరి తీసుకోడానికి ప్రభావతి, వాక్ప్రవాహం  ఆపింది. 

ఆశ్చర్యం పడడానికి అధోలోకాలలో కూడా లోతు లేక, మెదడు మొద్దుబారి  పాపం ప్రద్యుమ్నుడే నోట మాట రాక తనే కింద పడిపోయాడు కుర్చీలోంచి.

ఆ విధంగా మా మొదటి  అనుబంధం తెగిపోయింది” ప్రభావతి వ్రాక్కుచ్చింది.  


“ఆ తరువాత అనుబంధం ఎప్పటిదో?”  ప్రశ్నించాడు ప్రద్యుమ్నుడు.

“కాలజ్ఞానంలో తరువాత గుర్తుకు వచ్చింది కుశలవుల తరువాత ౧౨ వ తరంలో కోసలధేశం లో జన్మ.”  

“ధేశం ఏమిటి? దేశం అనాలి కదా?”  

“అప్పటి జనం నిష్ఠాగరిష్టులు, ఉద్యద్దినకరులు,  ధైర్య శౌర్య పరాక్రములు, తాళ ప్రమాణులు,  మాట మీద నిలబడే వాళ్ళు అవటం వల్ల ప్రతిదీ నొక్కి వక్కాణించే వారు.”  అని సంజాయషి ఇచ్చింది ప్రభావతి.

అర్ధం కాకపోయినా తలాడించాడు ఎప్పటి లాగానే ప్రద్యుమ్నుడు.  

“కుశలవులు అన్నావేమిటి? లవకుశ అంటారు కదా? ఆ పేరుతోనే సినిమా కూడా వచ్చింది కదా”    అజ్ఞానం మళ్ళీ వెళ్ళకక్కాడు ప్రద్యుమ్నుడు.

“పతిదేవా ప్రద్యుమ్నా,  కుశుడు పెద్దవాడు లవుడు చిన్నవాడు. నాగయ్య, నాగేశ్వరరావు కూడా కుశలవులు అనే నామకరణం చేసారు, ఇద్దరికీనీ.”

“మళ్ళీ మధ్యలో వాళ్లెవరు రామాయణం లో.”

“అదీ తెలియదా పతీ పరమేశ్వరా, లవకుశ, రామరాజ్యం సినిమాల్లో వాల్మీకులు.”

“మరి లవకుశ అని ఎందుకు అంటారు?”                

“ఆంగ్లేయులు కుశలవుల కధ విన్నారు. అందులో ఒకడికి కుశుడు, అతని పరాక్రమం   బాగా నచ్చింది. ఐ లవ్ కుశ అన్నాడు. అప్పటినుంచి లవకుశ అని అనడం మొదలు పెట్టారు.”

“ఇద్దరూ సమాన పరాక్రమం కలవారే కదా?” ప్రద్యుమ్నుడి సందేహం తీరటంలేదు.  

“లవుడిని శత్రుఘ్నుడు ఓడించాడు. కుశుడు అంజలీ దేవీ దగ్గర శపధం చేశాడు “... అనుజన్మునిన్  విడిపించి  తెచ్చెద...”  అని  గుర్తు లేదా?”

“ఉంది,  ఉంది  అంజలీ దేవీ కూడా “... పతి పదాంబుజ  తత్పరత తప్ప అన్యమెరుగని  ఇల్లాలి నగుదునేని....”  నీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదిస్తుంది కదా?”

“శత్రుఘ్నుడిని ఓడించి  లవుడిని విడిపించి తెచ్చాడు కదా కుశుడు. అందుకనే ఐ లవ్ కుశ అన్నాడు ఆంగ్లేయుడు.”  

“ఐ సీ” అన్నాడు  ఇంకేమనాలో తెలియక. 

“ఇంతకీ వారికి ౧౨ తరాల తరువాత నువ్వు ఎవరు?”  అడిగాడు ప్రద్యుమ్నుడు. 

“అప్పుడు నేనొక సామాన్య వర్తకుడి ఇంట పుట్టాను. మరొక సామాన్య వర్తకుడి పుత్రుడిని పెళ్లి చేసుకుని సామాన్య జీవనం గడిపాను. బహు సంతానం కలిగారు. అందులో పెద్దవాడు నారాయణ శ్రేష్ఠి,  ఈ పూర్వ జన్మ వాసన వాడు. వాడు పెరిగి పెద్దై తండ్రి వ్యాపారం కొంత  అభివృద్ధి చేశాడు. కానీ సామాన్య వ్యాపారిగానే ఉన్నాడు.  తల్లి తండ్రులన్నచో వాడికి బహు ప్రేమ, అభిమానం, ఆదరణ,  మీదుమిక్కిలి  గౌరవము ఉండేవి. సోదరీ సోదరులను కూడా అప్యాయంగా చూసేవాడు. వాడికీ పిల్లలు పుట్టారు. ఆ జన్మలో నేను పోయేటప్పటికి వాడు సామాన్య వ్యాపారిగానే ఉండిపోయాడు.”

“అదేమిటి పాపం,  సామాన్య జీవితమే గడిపావా ఆ జన్మలో.”

“అవును సామాన్య జీవితం గడపడానికి మేమేమి సిగ్గుపడలేదు. ఆనందంగానే జీవితం వెళ్ళదీశాము. ఈ జన్మలో మట్టుకు ఏముంది? సామాన్య జీవితమే గదా. స్విట్జర్లాండ్ తీసుకెళ్లారా?   అమెరికా చూపించారా?  కాశ్మీరు కాకపోయే  కనీసం ఊటీ తీసుకెళ్లారా? పుట్టాను,  పెరిగాను,  మిమ్మల్ని పెళ్ళాడాను.  ఏముంది? సాధారణ జీవితం కాక. ఎన్ని నోములు నోస్తే ఏమిటి? ఎన్ని పూజలు చేస్తే ఏమిటి? మొగుడి జాతకం అలా ఉంటే పెళ్ళాం బతుకింకెలా ఉంటుంది.”  

ఉరుమురిమి మంగలం మీద పడే సూచనలు కనిపించాయి ప్రద్యుమ్నుడికి.  మాట మార్చే వృధా ప్రయత్నం చేశాడు. ప్రభావతి కొనసాగించింది.

“అసలు మీ జాతకం సరియైనదే ఇచ్చారా మాకు పెళ్ళికి ముందు? ఆ జాతకం ప్రకారం అంగ రంగ వైభవంగా ఉండాలి నా జీవితం. ఇలా ఉందంటే మీరు తప్పుడు జాతకం ఇచ్చి ఉండాలి”  నిర్ధారణకి వచ్చేసింది ప్రభావతి.

ఏం చెప్పాలో తెలియలేదు ప్రద్యుమ్నుడికి. 


అదృష్టవశాత్తు తలుపు చప్పుడైంది. లేచి తలుపు తీశాడు. ఎవరో అపరిచిత వ్యక్తి ఒక పాకెట్టు పట్టుకుని నుంచున్నాడు.

“ప్రభావతి గారిల్లు ఇదేనా” అని అడిగాడు.

“అవును,  లోపలి రండి”  అని ఆహ్వానించాడు ప్రద్యుమ్నుడు.

“నేను వెంకటేశ్వరా సారీస్, కొత్తపేట నుండి వచ్చానండి”  అంటూనే ప్రభావతిని చూశాడు.

“అమ్మగారూ,  మీరు ఎంచుకున్న రెండు చీరలు. మా సేఠ్ ఇచ్చి రమ్మన్నాడు”  అని చీరల పాకెట్టు ఆవిడ చేతిలో పెట్టి,  బిల్లు ప్రద్యుమ్నుడి  చేతిలో పెట్టాడు.

బిల్లు చూశాడు. పద్దెనిమిది వందల అరవై.

ప్రద్యుమ్నుడి  గుండె రెండు లబ్ డబ్ లు మిస్ అయ్యింది. ఏమీ అనలేక, అంటే మళ్ళీ జాతకాలు, ఊటీ,  అమెరికా అంటుందేమో నని భయపడి బిల్లు చెల్లించేశాడు, ప్రద్యుమ్నుడు.

ప్రద్యుమ్నుడు  టిప్ ఇవ్వనందువల్ల నేమో తలుపు ధబేల్ మని వేసి వెళ్ళిపోయాడు వాడు.

“నలభై తక్కువ పంతొమ్మిది వందలకి ఇంత పూర్వజన్మ వృత్తాంతమా”  అని ఆక్రోశించాడు ప్రద్యుమ్నుడు.

“మీరే కాదు మేమూ కధలల్లగలం”  అని ముక్తాయించింది ప్రభావతి.                              

11 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

వ్వితే నవ్వండి లేకపోతే లేదు మీ చావు మీరు చావండి అంటున్నారు గానీ చదివాక నవ్వకపోతే చస్తామండి!

hari.S.babu చెప్పారు...

నవ్వితే నవ్వండి లేకపోతే లేదు మీ చావు మీరు చావండి అంటున్నారు గానీ చదివాక నవ్వకపోతే చస్తామండి!

SD చెప్పారు...

>>ఐ లవ్ కుశ అన్నాడు
I khoosh love అని ఎందుకన్లేదో మరి? హైద్రాబాదులో పుడితే అని ఉండేవాడేమో ఎందుకంటే అక్కడ డ్రైవర్లు ఆటో ఎక్కేటప్పుడో భాషా దిగేటప్పుడో భాషా మాట్లాడి డబ్బులకోసం నానా అశుద్ధాలూ తింటారు కదా? అయినా గురూ గారూ చీరకొనాలంటే ఇన్నేళ్ళ బంధమా? చంపేసారండి. ఏదో కాసిని డబ్బులు (ఆ ఏడుస్తూనే లెండి) పారేస్తే పోయేదానికి!

బైదవే మీ ఒకటో భాగానికీ రెండో దానికీ బాగా గేప్ వచ్చేసింది. మొదటిది వెనక్కి వెళ్ళి చదుకోవాల్సి వచ్చింది. అంత గేప్ ఇచ్చారంటే హైద్రాబాద్లో ఎండలు మండిపోతున్నాయనుకోవాలా? కులాసాయేనా?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హరిబాబు గారికి,

ధన్యవాదములు. నవ్వించాలనే ప్రయత్నం. అప్పుడప్పుడు బెడిసికొట్టే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అందుకనే ఆప్షన్ మీకే. నవ్వితే నవ్వండి .....కుదరకపోతే తిట్టండి........దహా.

DG గారికి,

ధన్యవాదములు. అగ్రజుడి తరువాతే అనుజుడు కదా. అందుకే లవకుశులకి జవాబు వెతకాల్సి వచ్చింది. చీర కాదు ముఖ్యం. ప్రభావతి కధలల్లడం ముఖ్యం........దహా.

hari.S.babu చెప్పారు...

ఇంతకీ అసలు కధేమిటో ఇప్పటి కెక్కెంది ట్యూబులైటునా నేను?
చీర ఖరీదు విని షాకవ్వకుండా అంతకన్న షాకింగుగా ఉండే కధలు చెప్పాలన్నమాట - గట్టి ప్లానే!

Unknown చెప్పారు...

అద్భుతః

KGK SARMA చెప్పారు...

నవ్వితే నవ్వండి అంటే కళ్ళు తుడుచుకుంటూ నవ్వమనా??????😢😢😢😢😢😢😢😢😢

Chiru Dreams చెప్పారు...

“ఋషులు తపస్సు చేస్తుంటే అప్సరసలు వచ్చి నృత్యం చేస్తే వారు మహర్షులు అయినట్టు లెఖ్ఖ”

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

Chiru Dreams గారికి. ....... ధన్యవాదాలు. ఆ కామెంటు తప్పో ఒప్పో నాది (రచయిత) కాదు. కధలో ప్రభావతిదే. ....... మహా

Zilebi చెప్పారు...


ముక్తాయింపు అదిరెను :)
చాలాకాలం మునుపు కతా పద్దెనిమిది వందల సారీ తో సరిబెట్టేసుకుంది :) ఇప్పుడైతే ఓ అర లకారం పై మాటే గా :)


జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి. ....... ధన్యవాదాలు. ఇప్పుడైనా అర లకారం అంటే ప్రద్యుమ్నుడి లాంటి వారి బడ్జెట్ కి మించినదే. ఉన్నవాళ్ళ వంటి మీద చూసి ఆనందించడమే తప్ప కట్టుకునే అదృష్టం ప్రభావతి లాంటి వాళ్లకు ఉండదు. ......... మహా