శర్మకి పెళ్లి కుదిరింది

శర్మకి ఇంకా పెళ్లి కాలేదు. ఇందులో శర్మ లోపం ఏమీ లేదు. తన ప్రయత్నాలు ముమ్మరంగానే చేశాడు. పొద్దున్నే డాక్టర్స్ చెప్పిన బ్రష్ నే వాడేవాడు.   తెలుగు సినిమా హీరోలు వాడే టూత్పేస్టు తోనే రోజు మొదలు పెట్టేవాడు. హీరోలు ఉపయోగించే షేవింగ్ క్రిము, బ్లేడ్ మాత్రమే ఉపయోగించేవాడు. మమ్మీ కాదు బేబీ అని పిలిపించుకోదగ్గ సబ్బులే వాడేవాడు.  ఫెయిర్ అండ్ లవ్లీ క్రీములు, పొగడ్రులు, పెర్ఫుం లు కూడా ప్రసిద్ధ తారలవే కొంటాడు.  అయినా పెళ్లి కాలేదు. చూడ్డానికి శర్మ పాపం బాగానే ఉంటాడు. చాలా బాగుంటాడు అని చెప్పలేము కానీ సగటు మనిషి కన్నా  బాగుంటాడు అని చెప్పచ్చేమో. ఒడ్డు పొడుగు కూడా భేషుగ్గానే ఉంటుంది. కండలు తిరిగిన శరీరం కాదు కానీ  అవయవాలన్నీ సక్రమంగా తగు కొలతలతో హెచ్చు తగ్గులు లేకుండానే ఉంటాయి. మరేంటి సమస్య?  సమస్య ఏమిటో తెలియదు. చదువు కోలేదా అంటే ఇంజినీరింగ్ లో యం. టెక్  చేసి ఖాళీగా ఉండడమెందుకు అని యం.బి.య్యే. కూడా చేసేశాడు.  చదువంతా రేంకులు తోనే పూర్తి చేశాడు.

తల్లితండ్రులు కూడా చాలా కష్టపడ్డారు. ఊళ్ళో ఉన్న వివాహ కంపనీ లన్నిటిలోను పేరు నమోదు చేశారు.  కనిపించిన పేరయ్య లందరినీ  బలాత్కరించారు కూడాను. చాలా సంబంధాలే చూశారు. కానీ ఒక్కటీ కుదరలేదు. వెంకటేశ్వర స్వామి, మల్లికార్జున, కనకదుర్గ ఇత్యాదులే కాక  చుట్టుపక్కల వంద కిమీ ల దూరంలో నున్న దేవతా/  దేవుళ్ళందరినీ భక్తి శ్రద్ధలతో ఆరాధించారు, కొలిచారు, వినమ్రంగా విన్నవించుకున్నారు. రెండు మూడు చోట్ల తండ్రిగారు నీలాలు సమర్పించుకున్నారు కూడానూ.  అయినా రెండేళ్లగా కాలికి బలపం కట్టుకొని తిరిగినా, వెయ్యి కిమీల పైగా దూరం నమోదు అయింది కానీ కుర్రాడికి పెళ్లి చేయలేకపోయాడు తండ్రి. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు నెలకొకటైనా క్రమం తప్పకుండా చేసినా కోడలిని తెచ్చుకోలేకపోయింది తల్లి. ఇంతలో  26 ఏళ్లు నిండిపోయాయి శర్మకి. 

పెళ్లి కాలేదనే బెంగతో ఏం చెయ్యాలో తెలియక,  హైదరాబాద్లో మిత్రుడి దగ్గరకు వచ్చాడు శర్మ. నాల్గైదు రోజులయిం తరువాత  ఆదివారం నాడు కానీ మిత్రుడితో వివరంగా  మాట్లాడడం కుదరలేదు శర్మకి. మిత్రుడు సంతాపం వ్యక్తం చేశాడు. పెళ్లి చేసుకోవటానికి నిరాకరించిన అమ్మాయిలపైనా, వారి తల్లి తండ్రుల పైనా నిరశన తెలియ జేసుకున్నాడు. వరసకి మేనరికాలు లాంటివి లేకపోవడానికి సానుభూతి ప్రకటించాడు.

“ఎవరినైనా ప్రేమించాలేకపోయావా?”  అని ప్రశ్నించాడు.                          
“మా ఊళ్ళో ప్రేమ అంటే మక్కెలు విరగ తన్నుతారు. మా నాన్న పరువు పోతుంది. మా అమ్మ పేరు నాశనమై పోతుంది. అయినా
,  మా ఊళ్ళో  నాకు తగినవాళ్ళు ఉండి ఉంటే,  వాళ్ళ కాళ్ళు పట్టుకొని మా నాన్న పెళ్లి చేసి ఉండేవాడు”  అని విచారం వెలిబుచ్చాడు. “ఇప్పుడు నా పేరు దూర పట్టణాలలో వివాహ బ్యూరో లలో కూడా నమోదు చేయించాడు”  అని తెలియ జేసుకున్నాడు.
“ఇక్కడ కూడా నమోదు చేయిద్దాం”  అని ఆశ్వాసన  కలిగించాడు మిత్రుడు. 

రెండు రోజుల తరువాత వెళ్ళి  నాల్గైదు బ్యూరోలలో  వివాహార్ధియై పేరు నమోదు చేయించుకున్నాడు. మర్నాడు ఉదయమే తన సెల్ కి పూజ చేసుకున్నాడు. వెంకన్నని, మల్లన్నని, అప్పన్నని, దుర్గమ్మని  భక్తితో ప్రార్ధించాడు. నమకం, చమకం చదువుకున్నాడు. నారాయణ కవచం పఠించాడు. దుర్గనీ లక్ష్మినీ స్తుతించాడు. ముత్తాత గారిని తలచుకున్నాడు. ఆయనకి 12 వ ఏటే పెళ్లి అయిందట. సెల్ లో మెసేజ్ లు చూసుకున్నాడు. బ్యూరో లనుంచి ఏమి లేవు. నిరుత్సాహపడ్డాడు. అయినా ధైర్యంగా ఇంకో నాలుగు రోజులు ఎదురు చూశాడు. ఇంకో రెండు మూడు రోజుల తరువాత  రాత్రి మిత్రుడు వచ్చేదాకా కూర్చుని తన గోడు వెళ్ళ బోసుకున్నాడు.

“అప్పుడే ఏం వస్తాయిరా? కనీసం ఇరవై రోజులపైన పడుతుంది రెస్పాన్స్ రావడానికి”  అని తప్పించుకున్నాడు మిత్రుడు. “అంతగా తొందరగా ఉంటే నువ్వే వెళ్ళి బ్యూరోలలో వధువులను వెతుక్కో”  అని సలహా కూడా పాడేసాడు.

ఇదేదో బాగానే ఉందని అనుకున్నాడు. రెండు బ్యూరోలలో వెతికి ఒక పది టెలిఫోన్ నంబర్లు తెచ్చుకున్నాడు. తల్లికి టెలిఫోన్ చేసి ఈ నెంబర్లన్నీ  వివరాలతో సహా ఇచ్చాడు. కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు అని సంతసించింది తల్లి. తన కాళ్ళ మీద నిలబడి తన పెళ్లి సంబంధాలు తనే వెతుక్కుంటున్నాడు కొడుకు అని తండ్రి కూడా సంబర పడ్డాడు. నాలుగు రోజుల తరువాత తల్లి చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఆలోచించి తరువాత చెబుతామన్నారు, మిగతా వాళ్లకి సంబంధాలు కుదిరిపోయాయట అని.

సమస్య మళ్ళీ  మొదటికి వచ్చిందని విచారించాడు శర్మ.  తీవ్రంగా ఆలోచించాడు. తనకేం తక్కువ అని ప్రశ్నించుకున్నాడు. చదువు, ఆస్థి, అందం  అన్నీ భేషుగ్గానే ఉన్నా పెళ్లి ఎందుకు కుదరటం లేదు అని చింతించాడు. సమాధానం దొరకలేదు.  ఒక బ్యూరోకి వెళ్ళి ఒక తల నెరిసిన ఆయన దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ఆయన నవ్వాడు. 
“రోలు వెళ్ళి మద్దెల తో మొరబెట్టుకున్నట్టు ఉంది” అని అన్నాడు.
“మీకు పెళ్లి కాలేదా”  అని ఆశ్చర్యపడ్డాడు శర్మ.
“నలభై ఏళ్లు సీటు కిందకి వచ్చి ఏడాది అయింది. ఎన్నోసంబంధాలు  చూశాను. అయినా కాలేదు పెళ్లి”  అని బోరుమన్నాడు.  అయ్యో పాపం అని జాలి పడ్డాడు శర్మ.
“జుట్టు నెరిసిపోతే వయసు ఎక్కువే అనుకున్నాను. నలభై యేనా”  అని ఆశ్చర్య పడ్డాడు కూడాను శర్మ.
“ఇక్కడ కొంచెం వయసు మళ్ళిన వారిలాగా  కనిపిస్తే కస్టమర్స్ ఎక్కువ వస్తారని జుట్టుకు రంగు వేసుకున్నానండి”  అని వివరించాడు ఆయన. “పెళ్లి కాదని నిశ్చయించుకున్న తరువాతే,  మూడేళ్ళ క్రితం రంగు వేయించుకున్నానండి”  అని కూడా చెప్పాడు. “అయినా మారేజి బ్యూరోలో పని చేసేవాడికి  పిల్ల నెవరిస్తారండి, ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం కదా”  అని మళ్ళీ  విచారించాడు. యధాశక్తి  శర్మ  కూడా ఇంకో మాటు జాలిపడి సానుభూతి ప్రకటించాడు.

“మీరెక్కడ ఉద్యోగం చేస్తున్నారు”  అని ప్రశ్నించాడు ఆయన శర్మని.
“ఉద్యోగమా?  నేనా?”   అని ప్రశ్నల తోనే  మళ్ళీ ఆశ్చర్యపడ్డాడు శర్మ. తనే జవాబు కూడా చెప్పేసుకున్నాడు.  
“నాకు ఉద్యోగం  చేయాల్సిన  అవసరం లేదండి. అప్లికేషన్ లో వ్రాశాను కదా,  వృత్తి వ్యవసాయం అని. మా నాన్న గారు లాండ్ లార్డ్ అని,  బ్రాకెట్లో భూస్వామి అని వ్రాసి ఎందుకైనా మంచిదని మోతుబరి అని కూడా వ్రాసాం  కదండీ”  అని చెప్పాడు శర్మ.

“ఇరవై ఎకరాల మాగాణి, పది ఎకరాల కొబ్బరి తోట, పదిహేను మామిడి తోట, రెండు ట్రాక్టర్లు, నలుగురు పాలేర్లు, పది పాడి పశువులు,  ఒక జీపు కూడా ఉన్నాయండి. రాజమండ్రిలో మూడు ఇళ్ళు, నాలుగు ప్లాట్లు కూడా ఉన్నాయి. హైదరాబాదులో కూడా ఒక ఫ్లాట్ ఉందండి. ప్రస్తుతం మా బంధువులు ఉంటున్నారు అందులో. మా ఊళ్ళో నాలుగు బెడ్రూంల ఇల్లు, ఇంటి ముందు పూల తోట, ఇంట్లో అన్ని అధునాతన సౌకర్యాలు ఉన్నాయండి. రాజమండ్రికి పాతిక కిమీల దూరం అంతే.  ఒకడి దగ్గర ఉద్యోగం చేసే ఉద్దేశం లేదండి”  అని టీకా తాత్పర్య సహితంగా చెప్పాడు.  

బ్యూరో ఆసామీ నవ్వాడు. కొంచెం ఘట్టిగా మళ్ళీ నవ్వాడు. మొదటి నవ్వు మాములుగానే వినిపించినా రెండో నవ్వులో హేళన వినిపించింది శర్మకి. శర్మ ఇంకా అపోహ పడే అవకాశం ఇవ్వకుండా ఆయనే గీతాసారం బోధించాడు.

“మీకు పెళ్లి కాకపోవడానికి మొదటి కారణం, మీకు ఉద్యోగం లేకపోవటం.  పురుషుడికి ఉద్యోగం, సద్యోగం లేకపోతే ఏ ఆడపిల్లా,  ముఖ్యంగా అంతో ఇంతో చదువుకున్న పిల్ల, పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోదు. ఎంత చదువుకున్న పిల్లకి అంత మంచి ఉద్యోగం కావాలి. మీకు ఎంత ఆస్థి ఉన్నా పల్లెటూళ్ళో ఉండడానికి ఏ ఆడపిల్లా ఒప్పుకోవడం లేదండి. ఇది రెండో కారణం. అందులోనూ,  పెళ్ళానికి మల్లెపూలు కొనాలన్నా,  సినిమాకి,  షికారుకి తీసుకెళ్ళాలన్నా తండ్రి దగ్గర చేయి జాపే మగాడిని ఏ ఆడపిల్లా ఒప్పుకోదు. జై కిసాన్ అన్నది ఉపన్యాసాలకే పరిమితం, అని మీరు తెలుసుకోవాలి,  పెళ్ళికి కాదు.  మధ్య తరగతి పిల్లైనా మగడు స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటుంది”  ఉపన్యాసం ఇచ్చి,  కాసిని మంచి నీళ్ళు తాగాడు బ్యూరో ఆసామీ.

స్వల్ప విరామం తరువాత మళ్ళీ మొదలు పెట్టాడు. “మీరు ఒక ముఫై నలభై వేల ఉద్యోగం సంపాదించండి. ఎల్లాగా ఇల్లు ఉందన్నారు కాబట్టి ఒక బైకో,  కారో సమకూర్చుకోండి, కారైతే మరీ మంచిది. ఇవి సమకూర్చుకున్న రెండు నెలల్లో బంగారం లాంటి పిల్లతో మీకు పెళ్లి కుదిర్చే బాధ్యత నాది. హామీ ఇస్తున్నాను. పదేళ్ళ అనుభవం,  పెళ్లిల్లు కుదర్చడంలో నాకు”  అని ముగించాడు.
శర్మ సావధానంగా విన్నాడు. కాబోసు అనుకున్నాడు. ఇంకో పది నిముషాల్లో అవును అని నిర్దారించుకున్నాడు, కుదరబోయి తప్పిపోయిన రెండు సంబంధాలు తలుచుకొని. బహుశా ఇవే కారణాలు అయ్యుండవచ్చు అని నిశ్చయించుకున్నాడు.
“ఆలోచిస్తానండి”  అని బ్యూరో ఆసామీకి  చెప్పి వచ్చాడు.

మిత్రుడితో మంతనాలు చేశాడు. మిత్రుడు కూడా ఉద్యోగం ఉండాలన్నాడు. అదృష్టవశాత్తూ మిత్రుడి కంపనీలోనే ఖాళీలు ఉన్నాయని కూడా చెప్పాడు. మర్నాడే మిత్రుడితో  వెళ్ళి అతని బాసు గారిని కలిసాడు. రెండు రోజుల తరువాత  ఇంటర్వ్యూ అన్నారు. ఆ తరువాత ఇంకో ఇంటర్వ్యూ అన్నారు. ఆ తరువాత ముఖాముఖీ చర్చలు అన్నారు. పది రోజుల తరువాత అప్పాయింట్మెంట్ ఆర్డర్ చేతికి ఇచ్చారు, ముఫై వేల జీతంతో. ఆర్నెల్ల తరువాత పని బాగుంటే నలభై వేలు అన్నారు వాళ్ళు. ఇంకో ఏడాది లో ఏభై వేలు అవుతుందని మిత్రుడు ఆశ్వాసన కలిగించాడు. మంచి కంపనీ కాబట్టి జేరిపోయాడు శర్మ.

జేరిన సాయంకాలం తల్లి తండ్రులకు తెలియచేశాడు సంగతి. అగ్గి గుగ్గిలం అయ్యారు వారు. మన ఇంటా వంటా ఉద్యోగం చేయడం అలవాటు లేదన్నారు. పదుగురిలో పరువు తీసేశావని కోప్పడ్డారు. నువ్వు ఉద్యోగం అని హైదరాబాదులో కూర్చుంటే పొలం పుట్రా ఎవరు చూస్తారని బాధపడ్డారు.  తనకి వయసు వచ్చేస్తోందని గుర్తు చేసుకున్నారు తండ్రిగారు. నాకు వంటింట్లో తోడు ఉండకుండా చేస్తావా అని తల్లిగారు ఆవేదన చెందారు.  శర్మ పట్టుదల వదలలేదు. నాకు పెళ్లి అవాలంటే మరో మార్గం లేదు అని భీష్మించాడు. పేదింటి పిల్లనైనా చూసి పెళ్ళి చేస్తాం రమ్మని చెప్పారు. కనీసం బిఏ చదివిన పిల్లైతేనే పెళ్లి అని శర్మ మనసులో మాట బయటపెట్టాడు. చేసేదేమీ లేక, శర్మ పట్టుదల తెలిసిన వారవటం వల్ల  స్వంత ఊళ్ళో, బంధు మిత్రుల్లో  అవమానం భరించటానికి సిద్ధం అయ్యారు తల్లి తండ్రులు మరో మార్గం లేక.

ఉద్యోగంలో జేరిన నెల్లాళ్ళకి ఇంటినుంచి డబ్బు తెప్పించుకొని మోటారు సైకిలు కొనుక్కున్నాడు శర్మ.  ఇంకో వారం తరువాత బ్యూరో ఆసామీని కలిశాడు. వివరాలు అప్డేట్ చేయించాడు మోటారు సైకిలుతో సహా. మీ ఫోటోకి పెళ్లి కళ వచ్చేసింది అని నమ్మ బలికాడు బ్యూరో ఆసామీ.

ఎలా అయినా ఆర్నెల్లకి జీతం పెంచుకోవాలనే పట్టుదల పెరిగింది శర్మకి. అందుచే ఆఫీసులో పని పెరిగింది.  పెళ్లి గురించి ఆలోచించే తీరికా తగ్గింది.  ఒక నెల తరువాత బ్యూరో ఆసామీ ఫోన్ చేశాడు.

“ఆదివారం ఒకమ్మాయితో డేటింగ్ ఫిక్స్ చెయ్యచ్చా?”  అని అడిగాడు.
“డేటింగా ?”  అని ఆశ్చర్యపడ్డాడు శర్మ.
“డేటింగ్ అంటే పరస్పర అవగాహనా కార్యక్రమం. ఒక నాల్గైదు గంటల ద్వైపాక్షిక సమావేశం”  అన్నాడు బి.ఆసామీ.
“ద్వైపాక్షిక సమావేశమా ? మా వాళ్ళు ఎవరూ లేరు”  అని కూడా వివరించాడు శర్మ.
నవ్వాడు బి.ఆ.
“ద్వైపాక్షిక సమావేశం అంటే మీరు,  ఆ అమ్మాయి ఇద్దరే,  ఎవరూ లేకుండా పరస్పర అభిరుచులు,  రుచులు,  మనోభావాలు,  ఆశలు, ఆకాంక్షలు మొదలైనవి పంచుకునే సమావేశం”  అని వివరించాడు.
అమ్మాయి వివరాలు వివరంగా  చెప్పాడు బి. ఆ.  
“ఎక్కడ డేటింగ్”  అని అడిగాడు శర్మ.
“ఏదైనా ఒక హోటల్ లో కలవండి, భోజనం చేస్తూ మాట్లాడుకోండి. ఆ తరువాత  ఖాళీగా ఉండే ఏ సినిమాకో, ఒంటరిగా కూచునే అవకాశం దొరికే  పబ్లిక్ గార్డెన్ కో,  టాంక్ బండ్ కో వెళ్ళండి. మీ ఫ్రీక్వెన్సీస్ కలిస్తే నాకు  చెప్పండి.  మీరు చెప్పకపోతే మరో సంబంధం చూస్తాను”  అన్నాడు బి.ఆ. 
సరే నన్నాడు శర్మ.

ఆదివారం సికింద్రాబాదులో ఒక హోటల్ లో కలిశారు  పన్నెండింటికి. ఎదురెదురుగా కూర్చున్నారు ఒక కార్నర్ టేబులు చూసుకుని. రెండు నిముషాలు అయింది. ఎవరూ మాట్లాడలేదు.

ధైర్యం చేసి “ఐస్ క్రీం తిందామా”  అన్నాడు శర్మ.
“ఇప్పుడా? భోజనానికి ముందా? సాధారణంగా భోజనం అయిన తరువాత కదా తినేది”  అంది నీలిమ.
“ఇదేమి అధికారిక విందు కాదు కదండీ.  మన ఇష్టం. ఎప్పుడైనా  తినేయచ్చు”  అన్నాడు శర్మ.  అని రెండు ఐస్ క్రీం లు ఆర్డరిచ్చాడు. వైటర్ కూడా అదోలా చూశాడు. శర్మ లక్ష్య పెట్టలేదు. అవగాహనా కార్యక్రమం  ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో వైటర్ మహాశయుడు ఐస్ క్రీం తెచ్చి, మెనూ కార్డ్ కూడా ఇచ్చి వెళ్లాడు.

రెండు స్పూన్లు ఐస్ క్రీం నోట్లో వేసుకున్న తరువాత, మెనూ కార్డ్ నీలిమకి ఇచ్చాడు శర్మ.  
“ఈ పదార్ధాలు నాకు అర్ధం కావండీ. మీరే ఆర్డర్ ఇవ్వండి, మీకు నచ్చినవి, నేను బెండ, దొండ తప్ప అన్నీ  తింటాను”  ఆర్డర్ ఇచ్చింది నీలిమ.

“ఈ పధ్ధతి నాకు కొత్త. ఎలా మొదలు పెట్టాలో అర్ధం కావటం లేదు”  ధైర్యంగా   ఒప్పేసుకున్నాడు శర్మ.
నీలిమ నవ్వింది.
“నవ్వితే ఇంకా బాగుంటారండి మీరు”  మళ్ళీ  ధైర్యం చేశాడు శర్మ.

మళ్ళీ నవ్వింది నీలిమ. “మొదటి పెళ్లి చూపులా మీకు”  అని అడిగింది.
“లేదండి ఐదారు చూశాను మా ఊళ్ళోనూ, చుట్టుపక్కల. ఇటువైపు ఐదారు మంది,  అటువైపు ఐదారు మంది, కోలాహలంగా ఉంటుంది.  ఇలా అవగాహనా కార్యక్రమం ఇదే మొదలు”  

“అవగాహనా కార్యక్రమమా”  అడిగింది నీలిమ.
“ఆశలు, ఆకాంక్షలు,  రుచులు,  అభి రుచులు పంచుకునే  పరస్పర అవగాహనా కార్యక్రమమే నని చెప్పాడు బి. ఆ.” అన్నాడు శర్మ.  

మళ్ళీ నవ్వింది నీలిమ కొంచెం సుదీర్ఘంగా. 
“మీరు ఇలా నవ్వుతూ ఉంటే వెంటనే రిజిష్ట్రారు ఆఫీసు కి తీసుకెళ్ళి పోదామనే బలమైన కోరిక కలుగుతోందండి”  అన్నాడు శర్మ,  ధైర్య సాహసాలు పొంగిపోతుండగా. 
నీలిమ లేచి నుంచుంది.
“ఏమైంది”  అని అడిగాడు కొంచెం అనుమానంతో.
“ఎక్కడికో తీసుకెళ్ళతా నన్నారు గదా”  అని నవ్వింది. ఈ మాటు శర్మ నవ్వాడు ఘట్టిగా.
“ఇంత త్వరగా అవగాహన కలిగిపోతుందని అనుకోలేదండి”  అన్నాడు ఆనందంతో.

“మీ బాసు గారు మా బంధువు. మీ గురించి ఆయనే చెప్పాడు. మీ గుణ గణాలు, ఆస్థి పాస్తులు  అన్నీ  ఆయనే చెప్పాడు. త్వర పడమన్నాడు లేకపోతే మీ ఆఫీసులోనే ఎవరితోనైనా  ప్రేమలో పడే అవకాశం ఉంది”  అని కూడా చెప్పాడు.
చెప్పి మళ్ళీ నవ్వింది నీలిమ. యధావిధిగా ఆనందపడి పోయాడు శర్మ.  

“ఎవరైనా మీకు లైను వేస్తున్నారా”  అని అడిగింది నీలిమ.
“ఏమో,   నాకు ఇలాంటివి తేలికగా అర్ధం కావండీ. రేపటినుంచి గమనిస్తాను శ్రద్ధగా”  అన్నాడు.
“ఇప్పుడు అఖ్ఖర్లేదు లెండి. ఇంకేమైనా అభ్యంతరాలు వస్తే తప్ప. మీ మామయ్య గారు చెప్పారండి మీరు అమాయకులని. ఇప్పుడు నమ్ముతున్నాను.”  

“మా శంకరం మామయ్యా?”
“అవును,  వారిని మీ గురించి వాకబు చేసారండి మా నాన్నగారు ఒక మిత్రుడి ద్వారా.  ఉన్నవాళ్ళ కుర్రాడు కాబట్టి అతని గురించి అన్నీ  తెలుసుకోవాలని మా నాన్న గారు అన్నారండి.”

“అల్లాగా,  మేము కూడా మీ గురించి వాకబు  చెయ్యాలా?” అమాయకంగానే అడిగాడు శర్మ.
“మీ ఇష్టం” అని నవ్వింది నీలిమ.

హుషారుగా భోజనం చేసేశాడు శర్మ. భోజనం చేస్తున్నంత సేపూ మాట్లాడుకున్నారు. భోజనమయి మళ్ళీ  ఇంకో ఐస్ క్రీం తింటున్నప్పుడు శర్మ అడిగాడు,
“మళ్ళీ శనివారం మా ఊరు వస్తారా. మా అమ్మా నాన్నలతో పరిచయం, మా ఊరు చూడడం కోసం.”
“మా వాళ్ళు ఒప్పుకుంటారా? తెలియదు”
“వాళ్ళని కూడా తీసుకెళ్ళదాం. శుక్రవారం రాత్రి బయల్దేరి వెళదాం. శనివారం రాత్రి బయల్దేరి తిరిగి వచ్చేద్దాం. కారు మాట్లాడుతాను. అభ్యంతరం ఉండకపోవచ్చు మీ వాళ్లకి. ఈ లోపుల మా వాళ్ళు కూడా మీ కుటుంబం గురించి వాకబు చెయ్యడం, జాతకాలు చూపించడం చేస్తారు.”
“జాతకాలు సరిపోయాయని మా సిద్ధాంతి గారు  చెప్పారండి.”

శర్మ నవ్వాడు. “మీరు బాగానే ప్రిపేరు అయ్యారు ఈ కార్యక్రమానికి, నేనే ఏ ప్రిపరేషను లేకుండా వచ్చేశాను” కొద్దిగా విచారం వ్యక్తం చేశాడు.
నీలిమ నవ్వింది. “మా నాన్నగారితో మాట్లాడుతానండి మీ ఊరు వెళ్ళే విషయం”

పాన్ షాపు దగ్గర కిళ్ళీలు పలహారం చేసిన తరువాత నీలిమను వాళ్ళ ఇంటి దగ్గర దింపి వచ్చేశాడు శర్మ. వస్తూ వస్తూ బ్యూ.ఆ. దగ్గరనుంచి నీలిమ బయో డాటా,  జాతకం తెచ్చుకున్నాడు.  తండ్రికి కొరియర్ లో పంపాడు. తల్లికి టెలిఫోన్ చేసి వివరంగా వివరాలన్నీ చెప్పాడు. వాళ్ళు ఒప్పుకుంటే శనివారం వస్తామని కూడా చెప్పాడు. తల్లి సంబర పడిపోయింది, కొడుకు ప్రయోజకత్వానికి. తండ్రి కూడా కడుంగడు నానందించాడు.  మర్నాడు నీలిమ తండ్రి టెలిఫోన్ చేశారు, శుక్రవారం బయల్దేరి వెళ్ళడానికి సమ్మతి తెలియచేశారు, తమ కారులో.

“అన్నీ శుభ సూచనలే,  డెందము ఉప్పొంగెనులే” అని  పాడుకున్నాడు శర్మ.  కవిత్వం కూడా వచ్చేస్తోందేమో నని అనుమానపడ్డాడు కూడాను.

శనివారం ఉదయమే ఏడున్నర గంటలకి శర్మ ఊరు చేరుకున్నారు. ఘన స్వాగతమే లభించింది,  నీలిమ, ఆమె తల్లి తండ్రులకు. కబుర్ల కార్యక్రమంలో మునిగి పోయారు. వెళ్ళిన ఒక గంటలో నీలిమ ఒక విషయం కనిపెట్టింది. శర్మ తండ్రి  శర్మని షణ్ముఖా అని పిలుస్తుంటే తల్లి అంజీ అని పిలుస్తోంది. ఇంకో గంట పోయిన తరువాత నీలిమ తండ్రి,  శర్మ తండ్రిని  అడిగారు పేర్ల విషయం. 

“మా నాన్నగారి పేరు  తంగిరాల  షణ్ముఖ శర్మ,  మా మామగారి పేరు  చిలుకూరి ఆంజనేయులు అందుకని మా అబ్బాయి పేరు షణ్ముఖ ఆంజనేయ శర్మ అని పేరు పెట్టుకున్నాం.” అని వివరించారు.

“మా వారి పేరు పావన శర్మ. శర్మ అనే పిలుస్తారు. నేను కూడా. అల్లుడిని శర్మ అని పిలవడం కుదరదు. షణ్ముఖ అని కానీ ఆంజనేయ అని కానీ పిలవడం అంత బాగుండదేమో, ముఖ్యంగా మా అమ్మాయి ఫ్రెండ్స్ దగ్గర” అని అనుమానం వెలిబుచ్చింది లౌక్యంగా నీలిమ తల్లి.
 “పేరు కొంచెం ఇబ్బందిగానే ఉండేటట్టు ఉంది” అన్నాడు నీలిమ తండ్రి.

అనుకోని కోణంలో అవాంతరం వస్తుందేమో నని శర్మ తల్లి భయపడ్డారు. శర్మ తండ్రి ఏమి మాట్లాడలేదు.

రెండు నిముషాల  నిశ్శబ్దం తరువాత  శర్మ గొంతు విప్పాడు,

"నా పేరు షణ్ముఖ ఆంజనేయ శర్మ. మా ఇద్దరు తాతగార్లంటే నాకు  అభిమానం, ప్రేమ. వార్ల పేర్లు  నాకు పెట్టడం నేను గౌరవంగానే భావిస్తున్నాను. మా నాన్నగారి పేరు విశ్వనాధ శాస్త్రి, మా అమ్మగారి పేరు కాత్యాయని. మా పిల్లలకి నా తల్లి తండ్రుల  పేర్లు పెట్టాలని కూడా  నా అభిమతం. నా భార్య తల్లి తండ్రుల పేర్లు కలపడానికి నాకు అభ్యంతరం లేదు.  ఇంకో మాట. మా నాన్నగారికి ఓపిక ఉన్నంతవరకు మా పొలం, ఆస్థి వ్యవహారాలు చూస్తారు. “నాకు ఓపిక లేదురా షణ్ముఖా”  అని వారంటే నేను ఈ ఊరు వచ్చేస్తాను.  అది ఏడాది తరువాత కావచ్చు, పదేళ్ళ తరువాత కావచ్చు, ముఫై ఏళ్ల తరువాత కావచ్చు. మా నాన్నగారే  కష్టపడతారు కానీ ఎప్పుడూ నాకు కష్టం కలిగించలేదు.  మా ఆస్థి అని కాదు, మమ్మల్ని నమ్ముకొని ఇంకో పది కుటుంబాలు ఉన్నాయి ఈ ఊళ్ళో. మా ఊరు అన్నా నాకు ప్రేమే. ఇది మీరు ఆలోచించుకోండి.  మీరు కాదన్నా మనం స్నేహితులుగానే ఉండిపోదాం. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు.”

శర్మ తల్లి తండ్రులు “తొందర పడకురా అబ్బాయీ” అని ఏక కంఠంతో అన్నారు. నీలిమ తల్లి తండ్రులు మాట్లాడలేదు.

భోజనాలప్పుడు ఇంట్లో వాతావరణం గంభీరంగానే  ఉంది. భోజనాల తరువాత రెండు గంటలు విశ్రాంతి తీసుకున్నారు. సాయంకాలం  నాల్గు గంటలకి నీలిమ నవ్వుతూ అంది విశ్వనాధ శాస్త్రి గారితో,

“మామయ్య గారూ,  మన ఊరు చూపించమని మీ అబ్బాయికి చెప్పరూ” అని. అందరూ  నవ్వుకున్నారు..

శర్మ ఎగిరి గంతేసి నీలిమ చెయ్యి పట్టుకుని ట్రాక్టరు మీద కూచోపెట్టి రెండు గంటలు తమ  పొలాలు, ఊరంతా కూడా  తిప్పి తీసుకొచ్చాడు. మధ్యలో కాబోయే భార్యకి  ఐస్ క్రీం తినిపించాడు కూడా. 

అవునండీ, శర్మకి పెళ్లి కుదిరింది.  


గమనిక  : - ఈ టపా మొదటి మాటు ఈ బ్లాగులో 12/ 05/ 2015  న  పబ్లిష్ చేశాను.

17 కామెంట్‌లు:

శివరామ ప్రసాద్ చెప్పారు...

శర్మ కి పెళ్లి గమ్మతుగా కుదిర్చారండి. ఆద్యంతం మీ శైలి నవ్విస్తూ అహ్లాదంగా సాగింది. చాలా సంతోషం.

hari.S.babu చెప్పారు...

చాలా పెళ్ళిళ్ళు ఇల్లాగే కుదురుతాయి,అదేవిటో పాపం!

venkatram rao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
venkatram rao చెప్పారు...

As per latest Indian census statics the age group between (20 to 45) of unmarried Indians there is a difference of 4+ crores of excess male (6+ crore male and 2+ crore female). So naturally demand for brides!!!

అజ్ఞాత చెప్పారు...

Ha ha ha .Chala bagundi Mastaru.Summer lo kool kool hasyam.Thank you.

ఇందు చెప్పారు...

Bhale undandi :) I like the end part :) Bhale cheppadu dhairyanga! aamatram dhairyam cheyalenivallu entamando! pch! :(

sarma చెప్పారు...

బుట్టలో బలే పడేసింది కదా! ఇప్పుడెలా ఉన్నాడో పాపం శర్మ :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

స్పందించిన అందరికీ ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

తిక్క కుదిరినంత సంబరంగా చెప్పారం కదండీ కథని.

Zilebi చెప్పారు...


ఏమండీ బులుసు వారు,

బహుకాల దర్శనం ! బాగు బాగు మళ్ళీ మీరు బాలాగు నీల్గు బ్లాగు లోకం లో కి రావడం !

కుశలమేనా ! కథ సూ 'పీర్' !

ప్చ్ ప్చ్ ! బులుసు వారి నవ్వితే నవ్వండి కి పది కన్నా తక్కువ కామింటు లా ! కాల మహిమ కాకుంటే తెలుగు బ్లాగు లోకానికి ఏమి కడు గడ్డు కాలం వచ్చెను సుమీ !!

మీరు మరిన్ని మంచి రచనల తో, మీ దైన శైలి తో మళ్ళీ బ్లాగు లోకాన్ని సుప్రభావితం చేస్తారని ఆశిస్తో !

చీర్స్
జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పురాణపండఫణి గారికి,
ధన్యవాదాలు.

జిలేబి గారికి,
ధన్యవాదాలు. వ్రాయాలనే ఉంది కానీ వ్రాసినవి నాకే నచ్చటం లేదు.అందుకని పబ్లిష్ చెయ్యటంలేదు. నాకు ఓ మాదిరిగా నచ్చినా ఇక్కడ ఇలా వేస్తున్నాను.
కామెంట్లు రాకపోవడానికి కారణం పాఠకులను మెప్పించలేకపోవడమే అనుకుంటాను......దహా.

Varma చెప్పారు...

చాలా ఆహ్లాదంగా ఉందండి కథ.. నవ్వించినందుకు ధన్యవాదాలు..

Ennela చెప్పారు...

"ఉద్యోగం చెయ్యడం మన ఇంటా వంటా లేదు.. అవమానం స్వీకరించడానికి సిధ్ధపడ్డారు తలితండ్రులు".. ఆహా ఇలాంటి ఉద్యోగ గండమున్న ఇంట్లో పుడితే ఎంత బాగుంటుందో..హమ్మయ్య పెళ్ళి కుదిరింది....పె.హా (పెను హాసమే మాస్టారూ)...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వర్మ గారికి,

ధన్యవాదాలు.

ఎన్నెల గారికి,

ధన్యవాదాలు. నేనూ అనుకున్నానండి. కానీ తప్పలేదు ......దహా.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

పాత కామెంట్లలో “కష్టేఫలి” శర్మ గారి (May 13, 2015) // “ బుట్టలో బలే పడేసింది కదా” // అన్న కామెంట్ చక్కగా సరిపోయింది. నిజంగానే అసాధ్యురాలు 👌.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ......... బుట్టలో పడినట్టు కనిపించినా చివరకు తన మాట నెగ్గించుకున్నాడు కదా షణ్ముఖ ఆంజనేయ శర్మ. ............. మహా

అజ్ఞాత చెప్పారు...

చాలా చక్కగా ఉందండి మీ కద. ఇలాంటి కధలు పెళ్లి చూపులు లో జరిగే గమ్మత్తులు ...అదొక కమ్మటి అనుభూతి