కామాక్షి, కామన్నారాయణ ఇద్దరూ కూడపలుక్కొని
ప్రేమించేసుకున్నారు. ప్రేమకేముంది, ఎంతమంది ప్రేమించుకోవటం లేదూ అంటూ సాగదీయకండి.
వీళ్ళ ప్రేమలో కొంచెం తేడా ఉంది.
కా.., కా....., ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు
కాదు. కనీసం ఎప్పుడూ, ఏ క్లాసు కలిసి చదువుకోలేదు. ఒకే ఊరిలో ఉన్నా పేటలు వేరు.
వారి ఇంటికి వీరి ఇంటికి ఐదు కిలోమీటర్స్ దూరం ఉంది. ఇద్దరూ అంతర్జాలంలో, ముఖ
పుస్తకంలో పరిచయం అయ్యారు. కా.....
స్నేహితుడి, స్నేహితుల లిస్టులో కా..
ఉంది. కా.. ఒక రోజున ఆ లిస్టు తెరిచి చూసింది యదాలాపంగానే. కా..... పేరు చూసి
ఆశ్చర్యపోయింది. ఇంకా ఇలాంటి పేర్లు గల కుర్రాళ్ళు ఉన్నారే అని ఒకింత సంభ్రమానికి
గురైంది. తన పేరు అంటే తనకి ఇష్టం లేదు. పేరు మార్చుకోవాలని అనుకుంది గానీ తండ్రి
ససేమిరా అన్నాడు. తన అమ్మమ్మ పేరు మార్చుకోవడానికి వీల్లేదు అని శాసనం చేసాడు. ఆయన
కారణాలు ఆయనకి ఉన్నాయి. పూట గడవని
రోజుల్లో, వారి అమ్మమ్మగారు, కా.. తండ్రికి రెండు ఎకరాలు ఇచ్చింది. ఆ కృతజ్ఞతా భావంతో
పూర్తిగా ఒంగిపోయిన కా..తండ్రి తన కూతురికి అమ్మమ్మ పేరు కామాక్షి అని పెట్టేసాడు. 1989 లో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో
చేరిన రోజునుండి కా..కి తన పేరు మీద కోపం పెరిగిపోయింది. స్నేహితురాళ్ళ
పేర్లు అందంగా ఉన్నాయి. తన కిలాంటి పేరు
పెట్టిన తండ్రి మీద కూడా కోపం కలిగింది. పెద్దైనా, తండ్రి మీదా, పేరు మీదా కోపం తగ్గలేదు.
కా..... పేరు చూసినప్పుడు, తనలాంటి అభాగ్యుడు మరొకడు ఉన్నాడని కొంచెం ఊరట
కలిగింది. అతని కధా కమామీషు తెలుసుకోవాలనే కోరికా కలిగింది. ముఖపుస్తకంలో
స్నేహితురాలిగా చేర్చుకొమ్మని అభ్యర్ధన పంపింది. కా..... చేర్చుకున్నాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు కాని
పరిచయం పెరగలేదు. ముఖపుస్తకంలో ఫోటోలు చూడడమే తప్ప మరేమి తెలియదు ఒకరి గురించి
మరొకరికి. స్నేహితులయ్యారు కానీ, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలని ఉన్నా,
తెలుసుకునే ధైర్యం చేయలేకపోయారు.
కానీ విధి బలీయమైనది. కానున్నది జరిగి
తీరుతుంది. ఏమీ తోచక, సినిమాకి వెళ్ళే డబ్బులు లేక, త్యాగరాయ కళామందిర్ లో సంగీతం
వినడానికి వెళ్లాడు కా..... సంగీతం పిచ్చి ఉన్న స్నేహితురాలి అక్క బలవంతం వల్ల,
ఆమెకి తోడుగా కా.. వచ్చింది త్యా.క.మం. కి.
తలలు ఊపుతూ, తొడలు చరుచుకుంటూ, చేతులు తిప్పుతున్న శ్రోతలని, ఒకే పదాన్ని
పదిమాటులు పాడుతున్న గాయకుణ్ణి, చూసి, చూసి, ఇద్దరూ విధివశాన్న ఏకకాలంలో బయటకు
వచ్చారు. ఒకరినొకరు చూశారు. ఎక్కడో చూసినట్టుందే అని మళ్ళీ
చూసుకున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని ఆశ్చర్యపడ్డారు. మీరు
కా..... నా అని ఈవిడంటే, అవును మీరు కా..
నా అని వీరు ప్రశ్నించారు.
నేను కామాక్షినే అని ఆమె, నేను కామన్నారాయణని అని వీరు,
పరిచయం చేసుకున్నారు. కుశలప్రశ్నలు వేసుకున్నారు. హౌ ఆర్ యూ అంటే ఐ యాం ఫైన్ అని చెప్పుకున్నారు.
ఇద్దరూ అక్కడికి వచ్చిన కారణాలు చెప్పుకొని, సంగీతమంటే ఇద్దరికీ ప్రాణం కాదని
తెలుసుకొని ఆనందించారు. జేబులు నిండుకున్నాయి అని నిర్మొహమాటంగా చెప్పిన కా.....,
కా.. కి నచ్చేడు. తనకిష్టం లేకపోయినా తోటివారి సంతోషం కోసం మూడుగంటల పాటు
శాస్త్రీయసంగీతం వినడానికి సిద్ధపడిన కా.. ఔదార్యం కా.....కి నచ్చేసింది.
యం.ఎస్.సి, జూ, చేసి మూడేళ్ళగా ఉద్యోగం వెతుకుతున్నానండి. ఎక్కడ
ఉందో ఇంకా కనిపించలేదండి అని కా..... విచారిస్తే, బి.ఎస్.సి. బి.ఇ.డి. చేసి
ఏడాదిగా స్కూళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నానని కా.. నిట్టూర్చింది. ఇద్దరం
ఒకే పడవలో ప్రయాణిస్తున్నామా అని మళ్ళీ ఆశ్చర్యపడ్డారు. ఫస్ట్ క్లాసులో పాసైన
వాళ్ళే ఇంకా రోడ్లు కొలుస్తుంటే, సెకండ్ క్లాసు వాడిని నన్నెప్పుడు ఉద్యోగం
కనికరిస్తుందో నని బెంగగా ఉందండి అని కా..... వాపోతే, తెలుగు మీడియం స్కూళ్ళు
ఎప్పుడు వస్తాయో యని ఎదురు చూస్తున్నానని కా..బాధపడింది. నాలుగేళ్ల క్రితం మిగిలిన
ఒక ఎకరం అమ్మి, అప్పులు తీర్చి ఓ ఆటో కొన్నాడు మా నాన్న అని కా.. చెపితే, మా నాన్న
ఒక కాంట్రాక్టర్ దగ్గర గుమాస్తాగా చేస్తున్నాడండి. ఏడాదికి ఓ మూడు నాలుగు వందల
కన్నా ఆయన జీతం పెంచడండి, అది తప్ప మరో ఉద్యోగం ఈయనకి చేతకాదండి. ఆ కాంట్రాక్టర్ దగ్గరే అప్పు చేసి
చదివించిన కొడుకు ఇంకా ఆయనకి ఉపయోగపడలేక పోతున్నాడు అని కా..... దిగులుపడ్డాడు. ఇద్దరి
ఇళ్ళ మధ్య ఐదు కిలోమీటర్స్ ఉన్నాయి అని తెలుసుకున్నారు.
ఇల్లాగే మరి కొన్ని కష్టాలు చెప్పుకున్నారు. విడివిడిగానూ,
సంయుక్తంగానూ, దీర్ఘంగానూ, హస్రంగానూ కూడా పలుమార్లు నిశ్వసించారు. ఈ నిట్టూర్పుల నుంచి ఎప్పుడు విముక్తి
దొరుకుతుందో అని ఇంకోమారు నిట్టూర్చారు. ఇంక ఉపిరితిత్తులకు పని చెప్పలేనండి,
వెళతాను అన్నాడు కా..... సరే వెళ్ళి రండి. నేను ఇంకో గంట ఇలాగే గడపాలి అంది కా..
రెండు అడుగులు వేసి వెనక్కి వచ్చాడు కా..... మళ్ళీ నిట్టుర్చాడానికి ఏమైనా
చెపుతాడేమో నని సందేహించింది కా.. మీ సెల్
నంబర్ ఇస్తారా అని అడిగాడు కా..... ఇద్దరూ సెల్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు.
పది రోజులు గడిచాయి. సెల్ నంబర్లు ఇచ్చి
పుచ్చుకున్నారు కానీ ఎవరూ కాల్ చెయ్యలేదు. పదకొండో రోజున తెగించి, ధైర్యం చేసి
కా..... మిస్సుడ్ కాల్ ఇచ్చాడు. చూశాను
కానీ టాక్ టైం లేనందున కాల్ చెయ్యలేకపోయాను అని ఎస్ యం ఎస్ ఇచ్చింది కా.. మర్నాడు.
చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది కానీ నా పరిస్థితి అంతే నండి అని sms చేశాడు కా..... మర్నాడు. నిట్టూర్పు అని sms చేసింది, కా.. కొంచెం దీర్ఘంగా డిటో అండి అని జవాబు ఇచ్చాడు,
కా.....
ఇంకో రెండు మూడు మాట్లు SMSలలో
నిశ్వసించిన తరువాత కా..... కాల్ చేసాడు. మీరు రేపు సాయంకాలం నాలుగు గంటలకి మీ
పక్క కాలనీ సాయినాద కాలనీ లోని శివాలయంకి
రండి అని చెప్పాడు. ద కాదండీ ధ అని కా.. చెప్పెలోపునే కా..... పెట్టేసాడు.
ఎందుకు పిలిచాడో అని ఆలోచించింది. కొత్త
కష్టాలు ఏమైనా వచ్చాయేమో నని కంగారు పడింది. మొన్న మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా
కష్టాలు నిట్టూర్పులే తప్ప మరేవి మాటల్లో రాలేదని అనుకుంది. ఈ రోజు ఆట్టే నిట్టూర్చకూడదని నిర్ణయించుకుంది.
కష్టమైనా చిరునవ్వులే చిందించాలనుకుంది. ఐదు నిముషాలు ముందుగానే శివాలయం చేరుకుంది. అప్పటికే కా.....
వచ్చేసాడు.
నమస్కారమండి
నమస్కారం
బాగున్నారా
ఆ, మీరెలా ఉన్నారు
బాగానే ఉన్నానండి
నాకైతే అర కిలోమీటరు. మీరు పాపం నాలుగున్నర కిమీలు నడిచి వచ్చారు
ఫరవాలేదండి. నాకు అలవాటే.
ఒక రెండు నిముషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది.
రండి. దర్శనం చేసుకొద్దాము
పదండి.
దర్శనం చేసుకున్నారు. ఇద్దరినీ చూసి
పూజారి గారు ఒక కొబ్బరి చిప్ప ఇచ్చాడు, కొబ్బరికాయ కొట్టకపోయినా. ఒక చోట కూర్చుని
చిప్ప పగలకొట్టి తినడం మొదలుపెట్టారు.
ఎందుకో రమ్మనారు అంది కా.. ఉండబట్టలేక.
చిన్నగా నవ్వాడు కా.....
నాలుగు రోజులక్రితం ఉద్యోగంలో చేరానండి అన్నాడు కా.....
అభినందనలు. ఎక్కడా?
అభినందనలు చెప్పేంటంతది కాదండీ. మా
ఇంటిపక్కన ఇద్దరు పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నానండి. నిన్ననే ఇంకో
ఇద్దరు చేరేరండి. నాలుగు ఇంటూ రెండు, ఎనిమిది వందలు వస్తుందండి నెలకి. నిన్ననే వాళ్ళ
తల్లితండ్రుల దగ్గర అడ్వాన్స్
తీసుకున్నానండి. నాలుగు వందలు.
సంతోషం. నిజంగా చాలా ఆనందంగా ఉందండి
అంది ఉత్సాహంగా కా..
థాంక్స్ అండి. యంఎస్ సి చదివి రెండో
క్లాసు పిల్లలకి ట్యూషన్ చెపుతున్నావా అని నవ్వారండి మా స్నేహితులు. నిన్న రాత్రి నాలుగు వందలూ మా
నాన్నకి ఇచ్చానండి. ఆయన కళ్ళలో నీళ్ళు. అందులో రెండు వందలు నాకు ఇచ్చారండి. ఎందుకో
నా కళ్ళలోనూ నీళ్ళు వచ్చాయండి. రెండు వందలు నన్ను అట్టేపెట్టుకొని మిగతాది ఇంటికి ఇమ్మంది మా అమ్మ.
“ఇంత చదువూ చెప్పించి చివరకి
చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పుకోవల్సివచ్చిందా నాయనా. ఓ ఏభై వేలు ఇచ్చి నీకొక మంచి
ఉద్యోగం కూడా కుదర్చలేకపోయాము” అని మా
అమ్మ ఏడ్చేసిందండి.
వద్దనుకుంటూనే నిట్టూర్చింది కా..
కా..... కూడా నిట్టూర్చాడు.
ఈ పని ఒక రెండేళ్ళ ముందే ఎందుకు చేయలేదా
అని అనిపించింది నాకు అన్నాడు కా.....
దేనికైనా టైం రావాలండి అంది కా..
మీతోటి పరిచయం తరువాతే ఇలా నిర్ణయం
తీసుకున్నానండి. మీకు థాంక్స్ చెప్పుకోవాలి. అన్నాడు కా.....
నాకా ఎందుకు? అని ఆశ్చర్యపడింది కా..
మీకు మిస్సుడు కాల్ ఇచ్చినప్పుడు
అనిపించింది. ఏదో విధంగా ఎంతో కొంత సంపాదించాలని. అనుకోకుండా ఈ ట్యూషన్ మాష్టరు
ఉద్యోగం దొరికింది. ఈ వేళే వంద రూపాయల టాక్ టైం వేయించానండి. వారానికి ఒక పది
నిముషాలు మాట్లాడుకోవచ్చండి అని నవ్వాడు కా.....
కా.. కూడా నవ్వింది. పార్టీ ఇవ్వాలండి అంది.
సరే నని గుడి బయట రెండు బజ్జీలు చెరొకటి
తిని ఒక చెరుకురసం ఇద్దరూ తాగారు. ఇంతకన్నా ఎక్కువగా ఇవ్వలేనండి అని మళ్ళీ నవ్వాడు
కా.....
ఇంకా ఉంది.
గమనిక :- ఈ టపా మొదటి మాటు 21/10/2014 ఈ బ్లాగులో ప్రచురితమైనది.
గమనిక :- ఈ టపా మొదటి మాటు 21/10/2014 ఈ బ్లాగులో ప్రచురితమైనది.
11 కామెంట్లు:
ఇంతేలే నిరుపేదల బతుకులు అని డ్యూయట్ పాడుకోలేదాండీ...
కా. కా. ల ప్రేమ కథ భలే ఉందండీ!
కొన్ని నిట్టూర్పులతో మలిభాగం కోసం వేచి చూస్తాం :)
ఈ కా ప్రేమ కేక
కథ కి పేరు 'కాకావళీ' అని పెడితే బాగుంటుందేమో నండీ !!
గులేబకావళీ కథ లా 'కాకావళీ' కథ అన్న మాట ||!!
చీర్స్
జిలేబి
చివర్లో రెండు బజ్జీలు కొనడం బావోలేదండి. ఒక బజ్జీ కొని, రెండు ముక్కలు చేసి ఇద్దరూ చెరోముక్కా తింటే బావుండేది. అలాగే సోడానూ.
ఇంతకీ కా. కా ని ప్రేమించిందా? ఇద్దరూ కల్సి ఇంకో ట్యుటోరియల్ కాలేజీ స్థాపించి కోట్లు కూడబెట్టారా? ఇంత అర్ధాంతరంగా ఆపేసి నాకు టెన్షన్ కలిగించినందుకు మీ మీద దావా వేసేను. మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి, మంచినీళ్ళివ్వకుండా, ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం మూడు ఎండు మిరపకాయ బజ్జీలు తినిపించకపోతే చూసుకోండి.
చక్కెర పూత పూసిన హోమియో మాత్రలా ఉంది...
మొత్తానికి లక్ష వొత్తుల నోము మొదలెట్టారు.నే చెప్పలా, మాకు వొత్తుకి పది నవ్వులని - బాగానే గిట్టుబాటయ్యింది!
మొత్తానికి లక్ష వొత్తుల నోము మొదలెట్టారు.నే చెప్పలా, మాకు వొత్తుకి పది నవ్వులని - బాగానే గిట్టుబాటయ్యింది!
శర్మ గారికి,
ధన్యవాదాలు. నిరుడు పేదల బతుకులు ఇవి.....దహా.
నాగరాజ్ గారికి,
ధన్యవాదాలు. మలిభాగం ఇంకా కుదరలేదండి. కొంచెం ఓపిక పట్టాలి మీరు......దహా.
అనానిమస్ గారికి,
ధన్యవాదాలు.
జిలేబి గారికి,
ధన్యవాదాలు. కాకావళి అంటే ఏదో కాకి గోల అని చదవరేమో నని భయం.....దహా.
DG గారికి,
ధన్యవాదాలు. రెండో భాగం వ్రాస్తే నన్ను ఎండాకాలం బజ్జీ మూకుడులో వేయించేస్తారా ఏమిటి? నా జాగ్రత్తలో నేనుంటాను.....దహా.
పురాణపండఫణి గారికి,
ధన్యవాదాలు. ఇంతకీ మాత్ర పనిచేసిందా?...దహా.
హరి బాబు గారికి,
నోము మొదలైంది. ఎంతకాలం సాగుతుందో. చూడాలి.......దహా.
నేను ఇంతకు ముందే చెబుదామనుకున్నాను. ఇప్పుడు మీరే "కాకి గోల" ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి చెప్తాను. హీరో కి "కామేశ్వరరావు" అని, హీరోయిన్ కి ఏ "కిరణ్మయి" / "కిన్నెర" అనో పేర్లు పెడితే మొదటి అక్షరాలతో కలిపి "కా...కి..." వెరసి "కాకి గోల" అనుండచ్చు :) :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి