మా ఆవిడ ముచ్చట్లు

కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట. మాపెళ్ళైన మరుసటి రోజు మనుగుడుపులు, మిగతా కార్యక్రమం నిమిత్తం మాఆవిడ, ఆమె బంధువులు నలుగురైదురుగురు మాఇంటికి విచ్చేసారు, రాత్రి సుమారు పది గంటలకి. భోజనాలు చేసి వెంటనే పడకలు వేసేసారు. మాఆవిడతో మాట్లాడదామని ప్రయత్నించాను కాని కుదరలేదు. నాజాతకం అల్లాంటిది లెండి. నో పెళ్ళిచూపులు. మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట. పెళ్ళికి ముందు మాఆవిడ నాఫొటో చూసింది కాని నాకు ఆభాగ్యం కూడా కలుగలేదు. పెళ్ళికి సరిగ్గా పన్నెండు రోజుల ముందు మా పితాశ్రీ గారు నాకు ఓ టెలిగ్రాము పంపారు. మారేజి ఫిక్స్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అని. ఆటెలిగ్రాము పట్టుకొని మాబాసుగారి దగ్గరకెళ్ళి చూపించాను. శలవా కుదరదు అన్నాడు. ఇప్పటికే నువ్వు రెండు మాట్లు పెళ్ళి అని శలవు పెట్టావు అని కోప్పడ్డాడు. ఒక్కమాటే సారూ, మాఅన్నయ్య పెళ్ళికి అదీ రెండేళ్ళ క్రితం అని అన్నాను. సరే ఓ వారం తీసుకో అన్నాడు. ఆయనతోటి బేరమాడి ఎల్లాగైతేనేం, 15రోజులకి ఒప్పించాను. జోర్హాట్ నించి రావడానికి, పోవడానికి ఓవారం తీసేస్తే మిగిలేది ఓవారం అన్నమాట. .ఆవిషయం మానాన్నగార్కి కూడా తెలియపర్చాను. అందువల్ల కార్యక్రమాలన్నీ వెంటవెంటనే ఏర్పాటు చేసేరన్నమాట. సరే అసలు కధలోకి వస్తే, తెల్లవారి నేను డాబామీద నించి కిందకి వచ్చేటప్పటికి, ఇల్లంతా హడావడిగా ఉంది. ఇంట్లోవాళ్ళంతా నన్నుజాలిగా చూసారు. మాబావ “పాపం పసివాడు” అని నవ్వాడు. నాకు అర్ధంకాలేదు. సిగరెట్టు కాల్చుకోడానికి వీధిలోకి వచ్చాను. అప్పుడు చూసాను ఓచెంబు, రెండుగ్లాసులు, ఓచాప పెట్టుకొని మాఆవిడ వీధి అరుగు మీద కూర్చుంది. పక్కనే కొంచెం దూరంగా కుర్చీలో వారిఅక్కగారు ఆసీనులయ్యారు. అప్పుడు అర్దం అయింది నాకు. ఔరా అనుకున్నాను, కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఏంచెయ్యాలో తోచలేదు. అప్పుడు మాఅవిడతో అన్నాను. కొంచెం జాగ్రత్త పడవచ్చు గదా అని. వారి అక్కగారు కిసుక్కున నవ్వేరు. మాఆవిడ అక్కకేసి చూసింది, ఆకాశంకేసి చూసింది, మాఇంటిఎదురుగా ఉన్న చెరువుకేసి చూసి, నాకేసి చూసి అంది “ మీ మొహం, మీకేం తెలుసండి” అని. ఇవి మాఆవిడ నాతో మాట్లాడిన మొదటి మాటలు, ప్రేమ సంభాషణ, తొలి పలుకులు, లవ్ నతింగ్స్, మొహబ్బతికి బాతేం. మొదటిసారి పతిదేవుడితో సతీపతివ్రత మాట్లాడిన వాక్యం విన్నప్పుడే అనుకున్నాను మదీయ కొంప కొల్లేరు అవుతుందని. మళ్ళీ రెండునెలల దాకా ముహూర్తాలు లేవురా, మళ్ళీ రావల్సిందే అని మానాన్నగారు నిర్ణయం చెప్పేసారు. మాబావ “పాపం వీడి పునస్సంధాన ముహూర్తం లస్కుటపా అయింది” అని జాలిపడ్డాడు.

మళ్ళీ మాబాసుగారిని బతిమాలి, ప్రాధేయపడి ఆర్నెల్లతర్వాత 15రోజులు శలవు తీసుకొని, వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని, హనీమూన్ రైల్లోనే కానిచ్చేసి, కాపురానికి జోర్హాట్ తీసుకొచ్చేసాను. మర్నాడు మాఆవిడ వంట మొదలు పెట్టింది. పొద్దున్నే ఉప్మా చేయడానికి ఉపక్రమించింది. నేను ఆఫీసు కి వెళ్ళడానికి రెడీ అయ్యి కూర్చున్నాను ఉప్మాకోసం. మాఆవిడ వంటింట్లోంచి వచ్చి కరివేపాకు తీసుకురాలేదా అంది. నువ్వు రాసిన లిస్టులో సామాన్లన్నీ తీసుకొచ్చాను. నువ్వుకరివేపాకు రాసిఉండవు నేను తీసుకు రాలేదు అన్నాను. పెళ్ళానికి మల్లెపూవులు తీసుకురావాలని, కూరల్లోకి కరివేపాకు తీసుకురావాలని కూడా చెప్పాలటండి అంది. నాకూ గుర్తు లేదు అంటూ నేను రాజీకి వచ్చేసాను. మాఆవిడ నాకేసి చూసింది, బెడ్ రూములో వాళ్ళ గ్రూపుఫొటొకేసి చూసింది, (జొర్హాట్ వచ్చిన రోజునే బెడ్ రూములో మేకుకొట్టి వాళ్ళ ఫొటొ ఒకటి తగిల్చేసింది.) వంటింట్లో గూట్లో కూర్చున్న రమాసహిత వెంకటేశ్వరస్వామిని చూసింది, ఆకాశంలోకి చూసింది. చూసి “ఇల్లాంటి వారిని కట్టపెట్టే వేమిరా దేవుడా” అని విచారంగా అంది. ఇది నాకు అనుభవంలోకి వచ్చిన రెండో ఊతవాక్యం. గమనించారో లేదో మీరు, మాఆవిడ దేవుడిని కూడా ఏకవచనంలో సంభోదించిది, పైగా రా అనికూడా అంది, నన్నుమటుకు ‘వారి’ అనే అంది. పతివ్రతా లక్షణాలు లేకపోలేదు అనుకొని సంతోషించాను (ఇంతటి అల్ప సంతోషివి కాబట్టే అది నిన్ను అల్లా ఆడించేస్తోందిరా అని మావాళ్ళు అంటారు). సరే కరివేపాకు రహిత ఉప్మానే సేవించి నేను ఆఫీసు కెళ్ళి పోయాను. ఆఫీసు కెళ్ళాక ఒక సందేహం వచ్చింది. ఊతవాక్యాలు అనేటప్పుడు మాఆవిడ దిక్కులు, వాళ్ళకేసి, వీళ్ళకేసి ఎందుకు చూస్తుందీ అని. ధైర్యంచేసి మాఆవిడను అడిగేసాను. సినీమాలు చూడరా అంది. నాగేశ్వరరావు ఏంచేస్తాడు? గుమ్మడికేసి చూస్తాడు, సావిత్రికేసి చూస్తాడు, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తాడు. ఆతర్వాత వాళ్ళు కూడా ఈయనకేసి చూస్తారు. అప్పుడుకాని బరువైన డైలాగు వదలడన్నమాట అంది. ఐ సీ అనుకున్నాను. నేను నాగేశ్వరావు వీరాభిమానిని అనికూడా చెప్పింది. నాగేశ్వరరావుకి ప్రేమలేఖ కూడా వ్రాసిందిట. ఆయన కాకపోతే ఎవడైతే ఏంటి అని నన్ను పెళ్ళి చేసుకునేందుకి ఒప్పుకుందిట.

ఓరోజున నేను ఆఫీసు నించి వచ్చేటప్పటికి చాలా సీరియస్ గా ఉంది మాఆవిడ. మద్యాహ్నం వాళ్ళ అమ్మ గారింటి నించి ఉత్తరం వచ్చింది. ఏంటి సంగతులు అని అడిగాను. “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా” అంది. మాపెళ్ళి సంబందం కుదిరేముందు, ఇంకోఆయన ఈవిడని చూడ్డానికి వచ్చాడుట. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడట, ఐదారు వందలు తెచ్చుకుంటున్నాడట. నిశ్చయం చేసుకుందా మనుకుంటున్న సమయంలో మాసంబంధం తెలియడం జరిగిందిట. అప్పటికే నేను నాలుగు అంకెల జీతం తీసుకుంటున్నానని నన్ను పెళ్ళి చేసుకుందిట. ఇప్పుడు ఆ శేఖరంగారు సివిల్స్ కి సెలక్టు అయ్యాడట. రేపో మాపో IAS ట్రైనింగు కు వెడుతున్నాడట. ఏంచేస్తాం “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా” నాఖర్మ ఇలాగయింది అని అంది.

ఈ ఊతవాక్యాలు రోజుకి కనీసం ఒకటి రెండు మాట్లైనా అనకపోతే ఆవిడకు తోచదు. ఇవికాక ఇంకా కొన్ని ఉన్నాయి. కాని వీటంతటి తరుచుగా ఉపయోగించదు. భరించువాడు భర్త అంటారు. కాబట్టి ఆవిడ ఏమన్నా భరించక తప్పుతుందా.


26 comments:

poornimaBontha said...

Hello andi,

Nenu poornima nu. Chala bagunnai mi avida muchatlu. so nice.

Good going...
Bye

Vinay Chakravarthi.Gogineni said...

gud one.......

Anonymous said...

మరే చేసుకున్నవారికి చేసుకున్నంత

Krishnapriya said...

:)

Bulusu Subrahmanyam said...

పూర్ణిమ గార్కి,
మీ కామెంటు కి ధన్యవాదాలు. సరదాగా కాలక్షేపానికి రాస్తున్న కధలు మీకు నచ్చినందుకు థాంక్స్.

వినయ్ చక్రవర్తి గార్కి,
కృతజ్ఞతలు మీకామెంటు కి.

Anonymous గార్కి,
అంతే సారూ, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే గదా మరి.మీ వాఖ్యలకు ధన్యవాదాలు.

Bulusu Subrahmanyam said...

కృష్ణప్రియ గార్కి,
హహ్హహా, థాంక్యూ మీ చిరునవ్వుకి.

ఆ.సౌమ్య said...

ఇంతకీ మీ బ్లాగుని ఆవిడ చూస్తారా?

Bulusu Subrahmanyam said...

ఆ.సౌమ్య గార్కి,
ఆవిడ అంటే ఏవిడ? మా ఇంట్లో అప్పడాల కఱ్ఱలు నిండు కున్నాయి. మీరేమైనా పంపిస్తే అప్పుడు చెప్తాను ఆవిడకి నాబ్లాగు గురించి. మీ Ph.D కష్టాల కన్నా ఎక్కువే నా కష్టాలు. మళ్ళీ ’నా గురించి’ మార్చేసాను. చూసారా. థాంక్యూ.

ఆ.సౌమ్య said...

"ఆవిడ" అంటే ఘృతాచి అనుకుని క్షణకాలం సంతోషపడిపోయారేం....అన్ని ఆశలొద్దు :)

అయినా ఈ పోస్ట్ చదివాక అప్పడాలకర్రేం పనికి వస్తుందండీ, ఏ రోకలో, పొత్రమో, గూటమో కావాలిగానీ.

అబ్బా నా PhD కష్టాలతోనే పోల్చారూ సరిపోయింది......అయితే భార్యావిధేయత చివరికి సంతోషాన్నే మిగిల్చిందన్నమాట...భేషో!...ఈనాటి కుర్రకారుచేత ఈ సూక్తిని భట్టీయం వేయించాలని నా కోరిక

ఒహో "మీ గురించి" మార్చేసారా!
హహహ ఏ ఎండకాగొడుగులాగ "ఏ టపాకాముందుమాట" అని చెప్పుకోవాలేమో ఇప్పుడు :)

Anonymous said...

ఇది నేను అజ్ఞాత రూపంగా పెడుతున్నాను. కాబట్టి తవికలు, కేసులు వేసుకున్నా నాకేమీ సంభంధం లేదు

సేమియాని నేపాలీ లో ఏమంటారో తెలియదు కానీ, బెంగాలీ లోనూ, అస్సామీ లోనూ sewai అనే అంటారనుకుంటాను

అని నాకు ఎవరూ చెప్పలేదు..

ఒక అజ్ఞాత

JB - జేబి said...

సుబ్రహ్మణ్యంగారు:
మీ బ్లాగులన్నీ ఇప్పుడే చదివానండీ; నాకు చాలా బాగా నచ్చాయి. కొన్ని ఉదంతాలు నా తల్లిదండ్రులమధ్య జరిగినవి గుర్తు చేసాయి.

- మిమ్మల్ని పేరుతో పలకరించినందుకు మెచ్చుకోకపోయిన (మీ పాత పోస్ట్ ప్రకారం) క్షమిస్తారనుకుంటున్నానండీ.

madhuri said...

adirindi!

Bulusu Subrahmanyam said...

సౌమ్య గార్కి,
అన్యాయం, నన్ను ఘృతాచి దగ్గరకు పంపడానికి మీరు తొందర పడుతున్నారా?
ఇప్పుడు నాకు X-Ray ఖర్చులు తగ్గిపోయాయి. డాక్టరు దగ్గరికి జిరాక్స్ లే తీసుకెళ్ళుతున్నాను.
మాఆవిడకు కొత్త ఐడియాలు ఇవ్వకండి. రోకళ్ళు, పొత్రాలు అంటూ.
థాంక్యూ మీ కామెంట్లకి.

Bulusu Subrahmanyam said...

తార గార్కి,
మాఇంటికి సాయిబాబా వచ్చాడని మెయిలు వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. కుట్ర జరుగు తోందని.సేమియాను ఏమందురు అని ఇంకో మెయిలు వచ్చినపుడు డౌటు కన్ఫర్ము అయింది.ఇది ఇప్పుడు సి.బి.ఐ కో ఎఫ్.బి.ఐ కో ఇవ్వాల్సిందే, అజ్ఞాత ఎవరో తెలుసుకోవడానికి.
థాంక్యూ ఫర్ మీ కామెంటు కమ్ స్టేట్మెంటుకి.

Bulusu Subrahmanyam said...

జె.బి గార్కి,
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు.నా పేరు బాగానే వ్రాసారు, మరి పలకడంలో ఏంచేస్తారో చూడాలి. అయినా ఎవరు ఎల్లా పిలిచినా పలికేస్తానని నిర్ణయం తీసేసుకున్నాను.నా రచనలు మీకు నచ్చినందుకు థాంక్స్.

Bulusu Subrahmanyam said...

మాధురి గార్కి,
మీ వ్యాఖ్యలకి కృతజ్ఞతలు.థాంక్యూ.

Raghupathi Raju Yagalla said...

Hello Subrahmanyam garu .....

nice narration andi chala bagundi

Bulusu Subrahmanyam said...

రఘుపతి రాజు గార్కి,
మీ వ్యాఖ్యలకు ధన్యదాలు.థాంక్యూ.

Srikanth G said...

చాలా బాగుందండీ మీ బ్లాగు మరియు అందులొని టపాలు.

'స్వచ్చమైన తెలుగు ' లోకం లో విహరిస్తున్నట్లు ఉంది.

Bulusu Subrahmanyam said...

శ్రీకాంత్ గార్కి,
మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

కొత్త పాళీ said...

Brillaint.
ఎవరో పేరుమోసిన కథకునిదే ఒక కథ ఉంది, ఈ మధ్యనే చదివాను. కథకుని పేరు గుర్తు రావట్లేదు. అందులోకూడా ఇలాగే తప్పిపోయిన పెళ్ళికొడుకు IAS ఐ మళ్ళి తారసపడతాడు.
Anyway, that's neither here, nor there. Your narration is in a calss by itself.

Anonymous said...

మీరు ఉద్యోగంలో ఉన్నప్పటి ముచ్చట్లు వ్రాశారు. రిటైరయినతరువాత పరిస్థితి ఎలా ఉందో వ్రాయండి !

Bulusu Subrahmanyam said...

హరేఫాలా గార్కి,
ధన్యవాదాలు. పెళ్ళైన తర్వాత ఆడువారికి జ్ఞానం పెరుగును, మగవారికి తరుగును అని ఓ సన్యాసి నాకు చెప్పాడు. కాబట్టి రిటైరయిన తరవాత కధలుండవు, వెతలు తప్ప. థాంక్యూ.

కొత్తపాళీ గార్కి,
ఈ సబ్జెక్ట్ మీద నేను ఒక నవలే చదివాను, 70 లలో.అప్పుడు బోల్డు నవలలు రాసేవారు రచయిత్రులు. గుర్తులేదు. ఆ తర్వాత నేను చదవడం కూడా తగ్గిపోయింది. ఇది చాలా కామన్ సబ్జెక్ట్ అనుకుంటాను. థాంక్యూ.

Vinay Chakravarthi.Gogineni said...

maastaru..dont add garu at end.....plz...........

Sunil said...

అయ్యబాబోయ్ పెళ్ళి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా? నేనేమో గారలు తినడం అనుకున్నాను......

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

మీరు ఫన్నీగా రాయాలని ఎంత ప్రయత్నించినా లోలోపల దాగున్న బాధంతా కనబడుతోంది పదాల్లో :)

Ultimate...
నాగేశ్వరరావు ఏంచేస్తాడు? గుమ్మడికేసి చూస్తాడు, సావిత్రికేసి చూస్తాడు, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తాడు. ఆతర్వాత వాళ్ళు కూడా ఈయనకేసి చూస్తారు. అప్పుడుకాని బరువైన డైలాగు వదలడన్నమాట అంది.

ఈ రోజు బ్లాగులో నా 239 వ దినం, వచ్చి నాల్గు అక్షంతలు వేసి వెళ్ళండి.

గమనిక : - మొదట ఈ టపా ఫిబ్రవరి 7, 2011 న పబ్లిష్ చేశాను. కానీ ఆ మధ్యన నా పొరపాటు వల్ల ఈ టపా డిలీట్ అయింది. టపాతో పాటు కామెంట్లు కూడా పోయాయి....