ప్రద్యుమ్నుడు - రామకుమారి

ప్రద్యుమ్నుడు చిన్నప్పటినుంచి కూడా నచ్చిన అమ్మాయినల్లా ప్రేమించేసేవాడు. హై స్కూల్ లో మంగ తాయారు, కృష్ణవేణి, భీమవరం కాలేజీ లో లీలావతి, యూనివర్సిటిలో అరుణ, ధనలక్ష్మి, కమల, కనకదుర్గ ఇత్యాదులు నెల కొకరి చొప్పున ప్రేమించాడు. కానీ ఎవరికీ చెప్పే సాహసం చెయ్యలేక పోయాడు. అయినా ప్రేమించడం మానలేదు.

పెళ్లి అయిన తరువాత ఇటువంటి ప్రేమలకు అడ్డుకట్ట వేసేసింది ప్రభావతి. “ నీవే తప్ప ఇతః పరం బెరుగ మన్నింపన్  దగున్ దీనునిన్” అనేటట్టు చేసింది. ఏ మాయ చేసిందో అని ఇప్పటికీ కూడా ఆశ్చర్య పడిపోతుంటాడు ప్రద్యుమ్నుడు.

ప్రేమించడమే కాదు కొంతమంది ఆడపిల్లల మీద కోపం కూడా ఉండేది ప్రద్యుమ్నుడికి. అటువంటి వారిలో అగ్ర తాంబూలం రామకుమారిదే.          

 చిన్నప్పుడు హై స్కూల్ లో చిన్న తరగతులలో ఉండగా ప్రద్యుమ్నుడి మాష్టార్లు ప్రతినెలా ఒక పరీక్ష పెట్టేవారు ముఖ్యంగా లెఖ్ఖల మాష్టార్లు. సాధారణంగా రెండు రోజుల్లో దిద్ది మార్కులు చెప్పేవారు.

ప్రద్యుమ్నుడి  క్లాసులో ప్రద్యుమ్నుడి  అక్కయ్య,  వాళ్ళ పక్కింటి ఎదురింటిలో ఉండే రామకుమారి కూడా ఉండేవారు

లెఖ్ఖల పరీక్ష వ్రాసిన మరుసటి  రోజు నుంచి స్కూల్ కి వెళ్ళేటప్పుడు, ప్రద్యుమ్నుడు  భీమేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయనకి భక్తిగా మొక్కి స్కూల్ కి వెళ్ళేవాడు. ఇప్పుడు పాపం మరిచిపోయాడు  కానీ అప్పట్లో  రెండు మూడు శ్లోకాలు, పద్యాలు కూడా చదివి మరీ దండం పెట్టేవాడు.

స్వామీ భీమేశ్వరా నాకు ఎన్ని మార్కులు వచ్చినా ఫరవాలేదు కానీ రామకుమారికి నాకన్నా కనీసం రెండు మూడు మార్కులు తక్కువ వచ్చేటట్టు చూడు. ఎప్పుడైనా ఐస్ క్రీం కొనుక్కుంటే, ముందు నీకు నైవేద్యం సమర్పయామి అన్న తరువాతే నేను తింటానుఅని లంచం కూడా ఇచ్చే ప్రయత్నం చేసేవాడు ప్రద్యుమ్నుడు.

ప్రద్యుమ్నుడి  అక్కయ్య కన్నా అన్ని సబ్జెక్ట్ ల్లోనూ ప్రద్యుమ్నుడికే  ఎక్కువ మార్కులు వచ్చేవి. మిగతా అన్ని సబ్జెక్ట్ ల లోనూ రామకుమారికన్నా సాధారణంగా ప్రద్యుమ్నుడికే  ఎక్కువ మార్కులు వచ్చేవి ఒక్క లెఖ్ఖలు తప్పఆమె తండ్రి గారు వాళ్ళ  స్కూల్ లోనే లెఖ్ఖల మేష్టారు, పై క్లాసులకి.

లెఖ్ఖల్లో రామకుమారికి ఎక్కువ వస్తే ప్రద్యుమ్నుడికి నష్టం ఏమిటీ? అంటే

మిగతా పరీక్షల మార్కులు ప్రద్యుమ్నుడి  అక్కయ్య ఇంట్లో చెప్పేది కాదు కానీ లెఖ్ఖల మార్కులు  అమ్మగారికి చెప్పేది. “చూశావా అమ్మా,  ఈ వెధవ కన్నా రామకుమారికి ఆరు మార్కులు ఎక్కువ వచ్చాయిఅని. ప్రద్యుమ్నుడి  అమ్మగారు విని ఊరుకునే వారు.  అక్కయ్య మళ్ళీ మళ్ళీ చెప్పేది ప్రద్యుమ్నుడి  అమ్మగారికి కోపం వచ్చేదాకా.

ప్రద్యుమ్నుడి తల్లి గారికి కోపం వచ్చిందంటే మొదట ప్రద్యుమ్నుడిని ఆశీర్వదించేవారు. “ వెధవా, శుంఠా, సిగ్గు లేదురా? పని మనిషి రాకపోతే పాపం రామకుమారి 8 – 9 ఏళ్ల పిల్ల,  ఇంట్లో పని అంతా చేస్తుంది. అవసరమైతే చెరువు నుంచి మడిగా చిన్న బిందె తో మంచి నీళ్ళు తెచ్చి పెద్ద బిందె నింపుతుంది. ఇంత పనీ చేసి శ్రద్ధగా చదువుకుంటుంది. నువ్వూ ఉన్నావు, ఎందుకు, చదువుకోరా అంటే వినకుండా అడ్డ గాడిద లాగా ఊరంతా తిరిగి చెరువు గట్టున ఆటలు ఆడి   వస్తావు. చదువు లేదు. రామకుమారి కన్నా తక్కువ మార్కులు వస్తాయి. సిగ్గూ శరము లేని వెధవా ”   అని దీవించి ఆయాసం తీర్చుకోవడానికి ఆగుతారు.

ఇక్కడ ప్రద్యుమ్నుడి అక్క ఇంకో పుల్ల వేస్తుంది అమ్మగారి కోపాగ్ని చల్లారకుండా,

“మొన్న ఆటల్లో  కొత్తది గళ్ళ చొక్కా చింపుకు వచ్చాడు కాదే అమ్మా?” అంటుంది. అంతే అమ్మ గారి కోపం ఇంకో మెట్టు ఎక్కేస్తుంది.

“ వెధవా నువ్వు ఇలా చొక్కాలు చింపుకు వస్తే, రోజుకో  చొక్కా కుట్టించడానికి మీ నాన్నేమైనా జమీందారా?” అంటూ ఆవేశంగా చేతికందిన చీపురో, కర్రో మరేదో తో ప్రద్యుమ్నుడి శరీరం మీద నాట్యమాడించేస్తారు.

ప్రద్యుమ్నుడు పారిపోకుండా అక్క గుమ్మం దగ్గర కాపలా కాస్తుంది.

అక్క గారికి తమ్ముడి మీద ఇంత కోపమెందుకు  అంటే ప్రతీకారం. అక్క గారు పోపుల పెట్టి లోంచో, తండ్రి గారి లాల్చీ జేబు లోంచో కానీ యో అర్ధణాయో దొంగిలించి దాచుకుంటుంది. అక్కయ్య ఆ డబ్బు ఖర్చు పెట్టే లోపులే ప్రద్యుమ్నుడు ఆ డబ్బు కొట్టేసి ఖర్చు చేసేస్తాడు. ఆ కోపం అక్కగారు ఇలా తీర్చుకుంటారు.

రామకుమారికి ఎక్కువ మార్కులు వస్తే ప్రద్యుమ్నుడికి  ఇంతటి  కష్టాలు వస్తాయి.               

అందుచేత  లెఖ్ఖల మార్కులు తెలిసిన రోజున స్కూల్ నుంఛి ఇంటికి వచ్చేటప్పుడు భీమేశ్వరాన్ని కోప్పడేవాడు ప్రద్యుమ్నుడు.

భీమేశ్వరా,  ఆన్ని శ్లోకాలు, పద్యాలు చదివి ప్రార్ధించానే, ఐస్ క్రీం సమర్పయామి అన్నానే  కానీ నువ్వు కనికరించలేదు గదా. ఆన్ని దండాలు మా లెఖ్ఖల మేష్టారుకే పెట్టి ఉంటే, ఐస్ క్రీం ఆయనకే సమర్పించి ఉంటే, నాలుగు మార్కులు ఎక్కువ వేసుండేవారేమో  ఆయన.´ అని.

కానీ షరా మామూలే. మళ్ళీ లెఖ్ఖల  పరీక్ష తరువాత ఈ కధ మళ్ళీ మొదలు.  

ప్రద్యుమ్నుడి  కన్నా, రామకుమారి కన్నా ప్రద్యుమ్నుడి  అక్కయ్యకు తక్కువ మార్కులు వచ్చినా  అక్కయ్యను ఏమీ అనేవారు కాదు ప్రద్యుమ్నుడి  అమ్మగారు.

ఎప్పుడైనా ఉక్రోషం కొద్దీ ప్రద్యుమ్నుడు  అడిగినా, 

 ఇంకో ఆరేడు  ఏళ్లలో దానికి పెళ్లి చేసి పంపేస్తాం. మొగుడికి వండి పెట్టుకుంటే చాలు. ఈ మార్కులు ఏం చేస్తాయి.“ అని అనే వారు ప్రద్యుమ్నుడి  అమ్మగారు.

ఉండబట్టలేక ఒక రోజున అడిగేశాడు ప్రద్యుమ్నుడు  అమ్మగారిని,

నా క్కూడా పెళ్లి చేసి పంపించెయ్యండి మా ఆవిడకి వండి పెడుతూ బతికేస్తానుఅని.

అంతే, కాళికావతారం ఎత్తి, కట్టెపేడు పుచ్చుకుని ప్రద్యుమ్నుడి  వెనకాల పడ్డారు  అమ్మగారు.

ప్రద్యుమ్నుడు  దొరుకుతాడా? అందునా కట్టెపేడు  అమ్మ గారి చేతిలో ఉంటే.  

సాక్షాత్తూ భీమేశ్వరుడే ప్రద్యుమ్నుడి  వెనకాల పరిగెత్తినా దొరికి ఉండేవాడు  కాదేమో.  

10 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Chala Bavundi

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బహుకాల దర్శనం, సర్. పునఃస్వాగతం.
————
// “ ప్రద్యుమ్నుడు పారిపోకుండా అక్క గుమ్మం దగ్గర కాపలా కాస్తుంది.” //

చిన్నప్పటి ప్రతీకారాలు 😁😁😁
———-
బ్రహ్మాండమైన కథతో వచ్చారండి 👌.

Zilebi చెప్పారు...సశేషపు భాగాలకై వెయిటింగు :)జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అజ్ఞాత గారికి ................... ధన్యవాదాలు. మహా

విన్నకోట నరసింహా రావు గారికి .......... ధన్యవాదాలు. ఆ మధ్యన ఎక్కడో రామకుమారి అని పేరు చూశాను. అకస్మాత్తుగా మా క్లాసులో (3rd.form లో అనుకుంటాను) ఉండే రామకుమారి గుర్తుకు వచ్చింది. 3km. దూరం నడుచుకు వస్తుంది అని మా మాష్టారు చెప్పిన గుర్తు. పేరు యదార్ధం. మిగిలినదంతా కల్పితం. ......మహా

జిలేబి గారికి ........ ధన్యవాదాలు. సశేషపు కధా భాగాలేమి లేవండి. నేనే ఇంకా సశేషం గా ఉన్నాను. .....మహా

MURALI చెప్పారు...

గురూజీ,
మీది చాలా స్వచ్ఛమైన హాస్యం. చుట్టూ చవకబారు హాస్యం నడుస్తున్న ఈ రోజుల్లో మీ కథలు చాలా హాయిగా అనిపిస్తాయి. మీరు తీరిక చేసుకుని మరికొన్ని రాస్తే మా అందరికీ సంతోషం.

Sri[dharAni]tha చెప్పారు...

ఇదేవిటి మా స్టారు.. ఎవ రైనా నచ్చిన అమ్మాయి ని ప్రేమిస్తారు. ఆయా ప్రదియుమన గారూ నచ్చిన రమాకౌమరె నే ప్రేమించినాడ్ అని వ్రాసితిరి (ఇహా.. అనగ ఇహిహిహి హాసం), ఏమో.. ఒకపటి ప్రేమలో నిజాయితి, గౌరవం, మర్యాద, విధేయత నవ్వేవి.. మరిపుడో ఏడ్చాయి.. కాల మహిమ..

Sri[dharAni]tha చెప్పారు...

ఇతిహాసం (ఇదేమి నవ్వు అనుకునేరు.. హిస్టరి)
రాధ: నైన్త్ క్లాస్ లో మరియు అరకు టూర్మేట్ (సిఐయసఫ్ వారి కూతురు కనుక ట్రాన్స్‌ఫర్ ఐపోయింది), కమల (ఇంటర్ మొదలు ఇంజినీరింగ్ తుద వరకు ఆపై తనకు వివాహమైపోయింది), ప్రణాలి (మరాఠి అమ్మాయి ల్యూకోపినియా వలన దూరమైపోయింది), ఎమ్ ఎన్ వీ (నన్ను నన్నుగా ఎంతగానో ఆదరించిన తెలుగమ్మాయి, ఐదేళ్ళ స్నేహం, ఆరోగ్యరిత్య అనగ ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ మూలాన దూరం దూరం.. తన ఆనందం కోసం ఒక రోజు మూడు గంటలు కేటాయించి హైదరాబాద్ వచ్చి కలిశా తనని..) కాని ఏ ఒక్కరితోను ఎటువంటి మిస్‌కాండక్ట్ చేయలేదు.. ఇది నేను నమ్మే ఏడుకొండల రేడ ఇచ్చిన స్నేహవరం, మరియు నిమ్నలిఖిత ధరణి తో మూడు తిట్లు ఆరు చీవాట్లుగా సాగుతున్న జీవన పయనం. అదేవిటబ్బాయి మీయావిడంత గయ్యాళియా అని అడిగితే.. ఏమో నాకు ఈ మూడేళ్ళలో తన మూడ్ స్వింగ్స్ తో అలవాటు చేసుకున్న.. ఎలాగంటే మ్యాడమ్ గారి కాపురాన అడ్జస్ట్ ఔతూ, కాంప్రమైజవుతు సజావుగా సాఫిగా సాగిస్తున్న మీ వంటి పెద్దల ఆశిస్సుల అండదండలతో.. ఒకటే అంటుంటా నా భార్యతో.. నిన్ను శాశ్వతంగా విడిచి వెళ్ళేది నా కడసారి యాత్ర జరిగినపుడే అని. ఎంత ఎలెక్ట్రోప్లేటెడ్ మనసైతే మాత్రం అదీను మనసే కదా..

ప్రస్తూతం: ఎలెక్ట్రోప్లేటెడ్ గోల్డ్ మనసు గల లలన నా సహధర్మచారిణి ధరణి (నా తన పేర్ల కలగా పులగం).. ఎంత ప్రేమో అంతకు పదింతలు కోపం.. ఐనా నాకు తానే లోకం.. ఇద్దరు ఆణిముత్యాల్లాంటి పిల్లలు.. ఇంకేమి కావాలి జీవితానికి.. పైన తెలిపిన వారి స్నేహాలు ఒకెత్తు.. నా శ్రీమతి ఒలికించే ప్రేమ మొట్టికాయ, శ్రీకృష్ణసత్యభామీయం మరో ఎత్తు.. ఐనా ఆలుమగలన్నాక గిల్లి కజ్జాలు, గిలే శిక్వే, నిమ్‌డా హర్త బుస్క, దూస్‌రాస్‌టెల్మి, లోకువే అంత షరా మామూలే. (కింద అటు ఇటు దొర్లుతు పొట్ట చెక్కలయ్యే నవ్వు)

ఇంకేటి బులుసాచార్త, మీ ఆరోగ్యం ఎలా ఉంది..! జాగ్రత గా ఉండండి.. ఇలానే నవ్వులు పూయిస్తు ఉండండి..!!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మురళి గారికి. ............. ధన్యవాదాలు. మీ లాంటి మిత్రులు అప్పుడప్పుడు ఇలా వచ్చి పలకరిస్తే చాలా సంతోషం గా ఉంటుంది. ఇంకా కొన్ని వ్రాయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. .......... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

Sri[dharAni]tha గారికి. ....... ధన్యవాదాలు. నిజమైన ప్రేమలో అప్పుడు ఇప్పుడూ కూడా నిజాయతి, గౌరవం, మర్యాదా ఇత్యాదులు ఉంటాయి. కొంతమంది వల్ల మనకేమైనా అసౌకర్యం కలిగితే వారి పట్ల కొంచెం కోపం రావడం సహజమే కదా. పాపం ప్రద్యుమ్నుడికి ఆ అమ్మాయి మీద కించత్తు కోపం.

ఆ వయసులో ప్రమ అంటే అర్ధం తెలియదు అనుకుంటాను. ఒకరిద్దరు ఆడపిల్లల మీద ఇష్టం అభిమానం ఉండేవి. మా కృష్ణవేణి (అసలు పేరు కాదు)అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడూ కూడా అప్పుడప్పుడు గుర్తుకు వస్తే "ఎక్కడ ఉందో ఎలా ఉందో" అనుకుంటూ ఉంటాను.నేను యూనివర్సిటీ చదువులో ఉండగా ఆమెకు పెళ్లి అయి వెళ్ళి పోయింది భీమవరం వదిలి. మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. మీరు కూడా ఇలాంటివి చెప్పారు కదా.

మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఏ మాత్రం పరిచయం లేని నాతో ఏ సంకోచము లేకుండా అస్సాం వచ్చేసింది. మెల్లి మెల్లిగా అభిమానం, ఇష్టం, ప్రేమ తెలియకుండానే వచ్చేశాయి మా జీవితాలలో. అప్పుడప్పుడు కోప తాపాలు వచ్చినా బంధం తొణకదు, సడలదు. అది అంతే. ............ మహా

Sri[dharAni]tha చెప్పారు...

చాలా చక్కగా శెలవిచ్చారు, బులుసు ఆచార్య.. మీ మాటలు ఎపుడూ శిరోధార్యమే..