సెలవ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సెలవ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

పాఠకులందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంక సెలవు.


 సుమారు రెండున్నర ఏళ్ల క్రితం అనుకోకుండా  కూడలి లో  అడుగుపెట్టాను. ఇక్కడ ఇలాంటి ప్రపంచం ఉందని అంతకు ముందు  నాకు తెలియదు. తెలుగు బ్లాగులు  చదవడం అలవాటు అయింది. ఓ శుభ ముహూర్తాన నేను కూడ బ్లాగ్ ఓపెన్ చేసాను. కానీ ఏం రాయాలో తెలియలేదు.  అప్పటికే మా కాలనీలోని  ‘స్నేహ సమాఖ్య’  ప్రచురించే  ‘లిఖిత’  కోసం మూడు నాలుగు కధలు వ్రాయడం జరిగింది.   ‘అవి ఇందులో వేసేద్దాం. ఆ తరువాత చూద్దాం’  అనుకొని మొదటి టపా వేసాను. అది నేను చేసిన మొదటి పొరపాటు. ఆ టపా శీర్షిక కొంచెం పెద్దదే.

‘మీ సమస్యలకు వాస్తు భీకర, జ్యోతిష భయ౦కర, మానసిక భీభత్స సుబ్రహ్మణ్యావధానులుగారి సమాధానాలు’ 

ఇది చదివిన తరువాత,  నేను నేనుగానే వ్రాస్తున్నాను అనే అభిప్రాయం అందరికీ కలగటం లో ఆశ్చర్యం లేదు. పైగా నాకు  మొదటి పురుష (First person) లో వ్రాయడం అలవాటు అయిపొయింది.  ఆ తరువాత  ‘తెలుగదేలా అనే అంటాం’  లోనూ  ‘వీరీ వీరీ గుమ్మడి పండు, వీరి పేరేమి’  లోనూ కూడా సుబ్రహ్మణ్యం అనే పేరునే ఉపయోగించడం జరిగింది. నా తెలివితక్కువ తనాన్ని గ్రహించి,  నేను ఆ తరువాత టపాల్లో,  నేను నేను కాదు. నేను వేరే,  కధలో వాడు వేరే అని సంజాయిషి ఇచ్చుకున్నాను.

 “నీ మొహం,  మేం నమ్మం,
నువ్వు = వీడు = వాడు,
దేర్ ఫోర్, నువ్వు = ఆల్”
  
అని లెఖ్ఖలేసి  మరీ చెప్పారు  కొందరు పాఠకులు.  అప్పుడు నేను దీర్ఘంగా ఆలోచించి, నిశితంగా పరిశీలించి, క్షుణ్ణంగా పరిశోధించి, సమగ్రంగా  క్రోడికరించి,  ప్రద్యుమ్నుడు  &  ప్రభావతి  అనే రెండు పాత్రలని ప్రవేశ బెట్టాను. కధ నేను గా వ్రాసినా, 

నేను = ప్రద్యుమ్నుడు,
మా ఆవిడ = ప్రభావతి,
దేర్ ఫోర్,   నేను = నేను కాదు,

అని చెప్పాను. ఆ పేర్లే ఎందుకు పెట్టాను అంటే  అప్పుడు నేను ప్రభావతి ప్రద్యుమ్నం చదువుతున్నాను. ఆ పేర్లే నోటిలో నలుగుతున్నాయి కాబట్టి  అవే పెట్టానన్నమాట. అయ్యా/అమ్మా అదీ సంగతి.

సరే ఇప్పుడీ గోలెందుకు అంటున్నారా ? వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా. చివరాఖరన సినిమాలో పతాక సన్నివేశానికి ముందు సీనులో, చచ్చే తన్నులు తిని, పశ్చాత్తాప పడిన విలన్ ని క్షమించేసి,  చిరునవ్వు నవ్వే గుమ్మడి, కన్నాంబల లాగ మీరు కూడా నన్ను మన్నించేసి,

 ‘నేను వేరు, కధలో ప్రద్యుమ్నుడు వేరు’ 

అని నమ్మేసారని నమ్మకంగా నమ్మేసాను. 

అయినా,   అప్పుడప్పుడు కొందరు, 

కధలో ప్రద్యుమ్నుడు = నిజంగా నేను, 
  
అనే భావనతో కామెంటు పెట్టినా, నేను విశాలహృదయంతో అర్ధం చేసుకొని, “పాపం, వీరికి చరిత్ర తెలియదు” అని సమాధాన పడ్డాను. ఒకటి రెండు మాట్లు  మళ్ళీ

నేను నేను కాదు, వీరు వేరే, వారు వేరే, నేను వేరే 

అని మొర పెట్టుకున్నాను. కుయ్యో మొర్రో అని ఆక్రోశించాను.  నమ్ముమా నా మాటా ఓ పాఠకా అని శంకరాభరణ రాగం లో పాడేను. (క్షమించాలి, శంకర శాస్త్రి గారి పుణ్యమా అని అది  నాకు తెలిసిన రెండో  రాగం. (మొదటిది, మీరందరూ కూడా నిష్ణాతులైన ఆరున్నొక్క రాగం).

అయినప్పటికీ కూడా  కొద్ది మంది, బహు కొద్ది మంది నన్ను ఇంకా అనుమాన దృక్కులతో వీక్షిస్తున్నారని,  తెలిసినా  చేసేదేమీ  లేక దుఃఖాక్రాంతుడనై,   బ్లాగు జనుల మనంబున గల అనుమానమును నివృత్తి చేయుమని  ఆ యొక్క శ్రీమన్నారాయణుడిని  ప్రార్ధించుచూ బ్లాగులలో కాలము గడిపేస్తున్నాను .

మొన్న 2012 డిసెంబర్ నాలుగవ తారీఖున మాములుగానే, 
 
అను శీర్షిక తో  ఒక టపా వేసాను .  ఆనాడు కామెంట్లు చూసి జీవిత సత్యమును  గ్రహించాను.  ఒకరిద్దరు టెలిఫోన్ చేసారు. ఏలూరు లోనే ఉన్నారన్న మాట అని ఆనందించారు.  ఒకరిద్దరు టెలిఫోన్ చేసి,  మమ్మల్ని అడుగుతున్నారు మీ గురించి “ వాట్ డు ఐ డు ?”  అని ప్రశ్నించారు.

పుట్టి మునిగింది , మిన్ను విరిగి మీద పడింది. ఉల్కాపాతం జరిగింది , నక్కలు  ఊళలు వేశాయి,  తీతువులు అరిచాయి, గుడ్లగూబలు  మరియూ గబ్బిలములు  పట్టపగలు ఎగిరేయి, అగ్ని పర్వతములు బద్దలు అయ్యాయి , భూకంపాలు  వచ్చాయి , సముద్రాలు అల్లకల్లోల మయ్యాయి ,కారు మేఘాలు కమ్ముకున్నాయి, ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిసాయి, కుంభ వృష్టి కురిసింది,  నదులు, వంకలు, వాగులు, పొంగి ప్రవహించాయి , ఫెళఫెళా  రావములతో మహా వృక్షములు కూలాయి . (కొంచెం ఆయాసం తీర్చుకోనియ్యండి).

జీవిత సత్యమనగా, 

రాజనాల = రాజనాల = రాజనాల 

అనగా రాజనాల ను విలన్ గానే చూస్తారు కానీ మరోలా ఉహించుకోలేరు.  

పాతాళ భైరవి మాయల ఫకీరు రంగారావు ని, ఆత్మ బంధువులో  అనగనగా ఒక రాజు గానూ, మిస్సమ్మలో మంచివాడుగాను గుర్తించగలరు,  కానీ రాజనాలని  మంచి వేషం వేయనివ్వరు.
 
చాలా మంది కధలో,

నేను = ప్రద్యుమ్నుడు 
     
ప్రద్యుమ్నుడు ఈజ్ నాట్ = సుబ్రహ్మణ్యం

అని గుర్తించరని  నాకు  నిర్ద్వందంగా, నిస్సంశయంగా, నిస్సందేహంగా, నిరంకుశంగా , నిరాఘాటంగా , నిరాటంకంగా, నిశ్శేషం గా. నిర్మొహమాటంగా , నిశ్చయంగా     అవగతమై పోయింది.

ఇది పూర్తిగా నా స్వయంకృత అపరాధమే నని తెలుసు. కధలలో జోర్హాట్ అన్నాను. అస్సాం అన్నాను, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నాను. నాకు పుట్టిన భూమి మీద ఎంత మమకారం ఉందో, 30 ఏళ్లు ఉద్యోగం చేసిన ఊరి మీద కూడా అంతే మమకారం ఉంది.  అందుకని,  నా ఆలోచనలలో, ఉహల్లో  జోర్హాట్ ఎక్కువగా ఉండేది. అందుకని నా వ్రాతల్లో కూడా వచ్చేది.  

తెలుగులో వ్రాయాలనే సరదాయే కానీ వ్రాయడం లో అనుభవరాహిత్యం వల్ల,   ఈ పొరపాటు జరిగింది.  ఆ పొరపాటు తప్పించుకుందా మనుకున్నా తప్పుకోకుండా  కొనసాగింది.

ప్రద్యుమ్నుడు, ప్రభావతి విడాకులు తీసుకున్నారని చదివి, అది మాకే అన్వయించుకొని  
బాధపడ్డవారందరికీ  క్షమాపణలు చెప్పుకుంటున్నాను.  

ఇదివరలో కధలో పాత్రగా నన్ను గుర్తించడం వల్ల  నాకు బాధ కలగలేదు,  కానీ ఈ టపా వల్ల ఇప్పుడు  కొంచెం ఇబ్బంది అనిపించింది.  ఈ ప్రద్యుమ్నుడిగా గుర్తింపు నుంచి బయటకు వెళ్లాలనిపించింది.  ఇది రెండవ  కారణం. 

ప్రభావతీ ప్రద్యుమ్నులు ఎలాగూ విడిపోయారు. కలిసే అవకాశాలు కనిపించటం లేదు. అందుచే బ్లాగులో నేను  వ్రాయటానికి ఏమీ లేదు.  వ్రాయాలంటే  నేను మరో టాపిక్ వెతుక్కోవాలి. ఇది ఇప్పుడు అవసరమా అనిపించింది. ఇది మొదటి కారణం.

{భావోద్వేగ వివశుడ నైనందున [(అర్ధం అడగకండి ) ఈ మధ్యన మా మనవరాళ్ళ కి లెఖ్ఖలు నేర్పే  ప్రక్రియ లో బ్రాకెట్లు పెట్టడం మాత్రమే  నేర్చుకున్నానని తెలుపుటకు గర్వించు చున్నాను ]  రెండవ కారణం మొదట వ్రాయడమైనది. క్షమించగలరు.}

అందువల్ల ఇందుమూలంగా,  నవ్వితే నవ్వండి పాఠకులకు, అభిమానులకు, బ్లాగుబంధువులకు, మిత్రులకు, సకల జనానీకానికి తెలియచేయునది ఏమనగా ఇకపై ఈ బ్లాగులో నేను ఏమీ వ్రాయను. ఇక పై,  టపాలు ఈ బ్లాగులో ఉండవు.

బ్లాగునే డిలీట్ చేద్దామనుకున్నాను కానీ, ఎప్పుడైనా నేను చదువుకొని నవ్వుకుందామని, నాలాగా ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవాలంటే ఉండాలని  అట్టే పెట్టేస్తున్నాను.

రెండున్నర  ఏళ్ళగా నన్ను అభిమానించి, ప్రోత్సహించిన  పాఠకులకు, మిత్రులకు, బ్లాగ్ బంధువులకు, గురువుగారూ అని ఆప్యాయంగా పిలిచే శిష్యులందరికీ బ్లాగ్ముఖంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

కూడలి, మాలిక, జల్లెడ,హారం, సంకలిని,   తెలుగుబ్లాగులు, వంద తెలుగు బ్లాగులు ఇత్యాది సంకలినులకు, నా బ్లాగును వారి వారి బ్లాగుల్లో చూపించిన మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.

కామెంట్లలో కానీ మరెక్కడైనా కానీ,  ఎప్పుడైనా తెలియకుండా,  ఎవరికైనా కష్టం కలిగించేటట్టు వ్రాసినా, ప్రవర్తించినా పెద్దమనసుతో నన్ను క్షమించమని కోరుతున్నాను.

మీ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ,
                        నేను శలవు తీసుకుంటున్నాను.