సతీ ద్రౌపదీ పాకం (ఆడ వారికి మాత్రమే)

పెళ్ళై కొత్తగా కాపురానికి వెళ్ళేటప్పుడు మాఅమ్మ చెప్పింది, మగాడి హృదయానికి దగ్గిర దారి వాడి పొట్ట అని. మామూలుగా అందరు తల్లులు చెప్పినట్టుగానే “మగడి అడుగుజాడలలోనే నడవాలి. అతని కను సన్నల లోనే మెలగాలి. మొగుడు ముండాకొడుక్కి ఏకష్టమూ రాకుండా చూసుకోవాలి” అని కూడా చెప్పింది. అప్పట్లో అమాయకపు వెర్రిపిల్లని కాబట్టి, కామోసు అనుకొని అల్లాగే నడవడానికి ప్రయత్నించాను. కాలం గడిచే కొద్ది, మగరాక్షసుడు ఆడఇస్త్రీని ఎంతగా అణగ తొక్కుతున్నాడో అర్ధం చేసుకోసాగాను. ఈనికృష్ట, నీచ, స్వార్ధ మగ ప్రపంచ౦లో స్త్రీని సమిధల లాగ వాడుకొంటున్నారని అర్ధం అవసాగింది. ఏఆడది ఐనా “ఓరి నాకొడకా, నీ భార్య అడుగు జాడల లోనే నడవాలి. ఆమె మాటకు ఎదురు చెప్పకూడదు” అని బోధిస్తోందా అని నేను మిమ్ములని ప్రశ్నిస్తున్నాను. మనం మారి తీరాల్సిన సమయం ఆసన్నమయింది అని నేను నొక్కి వక్కాణిస్తున్నాను. మగపురుగులను జయించి, అణగదొక్కి, మన కాలుకింద చెప్పులాగ చేసుకొని, మనటామీ పక్కన కట్టిపడేయాలి. అంత దాక లేదు మనకి విశ్రాంతి అని తీర్మానించుకున్నాను. నిద్రాహారాలు మాని ఈ విషయం మీద తీవ్రంగా, నిశితంగా మరియూ దీర్ఘంగా ఆలోచించుట కుపక్రమించితిని. చించగా, చించగా మాపెరట్లో కరివేపాకు మహా వృక్షము కింద నాకు జ్ఞానోదయమై౦ది. ఆహా! మహా వృక్షములుండునది న్న్యూటన్, గౌతముడు, నేను లాంటి మహాత్ములకు జ్ఞానోదయము కలుగుటకే కదా! మగాడిని జయించటానికి కూడా వాడి పొట్టే గతి అని గ్రహించాను. అప్పటినించి వంటలమీద సమగ్ర పరిశోధనలు, ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను. పురాతన తాళపత్ర గ్రంధాలు చదివాను. హిమాలయ పర్వతాల్లో కందమూలాలు మాత్రమే తిని తపస్సు చేసుకొనే మునుల పత్నులతో చర్చలు జరిపాను. ఈవిధంగా సంపాదించిన జ్ఞానాన్ని మీ అందరితో ప౦చుకొందామని ఈ నా ప్రయత్నం.

మగవాళ్ళని మంచివారని, చెడ్డవారని వేరుగా చూడవద్దు. రాముడైనా, రావణాసురుడైనా మగాడే. మనం ఇద్దరినీ జయించాలి. మగాళ్ళు ముఖ్యంగా మొగుళ్ళు రెందు రకాలుగా ఉంటారు. పాషాణహృదయులు, వెన్న సమాన మానసులు అని. మళ్ళీ ఇందులో subcategories ఉంటాయి. వెన్నలో అప్పుడే చేసినవెన్న, ఫ్రిజ్ లో దాచిన వెన్న, గేదెవెన్న, ఆవువెన్న ఇత్యాదులు. వీటి గట్టితనంలో తేడాలుంటాయి. అల్లాగే, పాషాణాలలో కూడా, ఇటుక, రాయి, గ్రానైట్, బండరాయి మొదలైనవి.. ఏమగాడైనా వెన్నగాడో పాషాణంగాడో ఎల్లా తెలుస్తుంది. మామూలుగా అయితే అనుభవం మీద తెలుస్తుంది. అనుభవించి తెలుసుకోవాలంటే టైము పడుతుంది. ఈలోపల వాడు ఏకు మేకై కూర్చుంటాడు. మరీ ఆలస్యం అయితే వాడు గేస్ లీక్ చేయించేస్తాడు. అందుకనే సాధ్యమైనంత త్వరగా మొక్కగా ఉండగానే వంచాలి. మొక్కని ఏ పరిస్తితుల్లోనూ మాను కానీయ రాదు. తేలిగ్గా కనిపెట్టటానికి ఒక పద్ధతి ఉంది. సినిమాల్లో హీరో లాగ ప్రవర్తించే వాళ్ళు సర్వసాధారణంగా పాషాణ హృదయులని నా ధృఢ విశ్వాసం. ఎ౦దు కంటారా, హీరోని చూడండి, ఎడా పెడా జనాలని, అదే, గూండాలని, విలన్లని ఉతికి పారేస్తుంటాడు. చేతితోనూ, కాలితోనూ అప్పుడప్పుడు తలతో ఎద్దులాగ కుమ్మేస్తుంటాడు. గాడిదలాగ కాళ్ళు వెనక్కివిసిరి తన్నేస్తుంటాడు. నేలమీద నడుస్తూ, పరిగెడుతూ కొట్టేస్తుంటాడు. ఈమధ్యన గోడలమీద, కప్పులకింద కూడా నడుస్తూనూ, ఎగిరి గాలిలోనూ గూండాలని ఉతికేయడం మొదలు పెట్టేడు. ఇహ, విలనుగారో, వాడి ఎస్ బాసుగాడో తుపాకీ కాల్చేస్తుంటాడు. ఎప్పుడైనా గుండు హీరోగారి గుండెలోనో, కాలిలోనో మరెక్కడైనాకాని దిగబడి పోతుంది. అయినా డోంట్ కేర్. ఈయన అల్లాగే కుమ్మేస్తుంటాడు. పటకా కత్తితో కొట్టినా, కత్తితో గుండెలో పొడిచినా ఈయన తనపని మానడు. ఉతుకుడే ఉతుకుడు. కత్తి గుండెలో దించినా, తుపాకితో కాల్చినా ఏమాత్రమూ నొప్పిలేనివాడు పాషాణహృదయుడేనని నాగట్టి నమ్మకము.

సినిమాల్లో హీరోయిన్ బీదతండ్రి లాంటివాళ్ళు వెన్నసమానమానసులు అని నా అనుమానం. ఈయనికి చీమ కుట్టినా నెత్తురు కారిపోతుంది.. కాలి మీద కుట్టినా నోట్లోంచి ముక్కులోంచి రక్తం కారిపోతూంటుంది. అర్జంటుగా ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సివస్తుంది. ఆసుపత్రిలో డాక్టర్లు తెగ కంగారు పడిపోతారు, పెట్టేస్తారు. హీ.తం. కి రక్తం ఎక్కించేస్తారు. ఓ ఫుట్ బాల్ బ్లాడరు లాంటిది ఈయనకు తగిలించేస్తారు. అందులో గాలి నిండుతూ ఉ౦టుంది, వెంటనే ఖాళీ అవుతూంటుంది. ఎందుకో మనకి అర్ధంకాదు. మనకేంటి వాళ్ళకే అర్ధంకాదు. నర్సమ్మ దాని కేసి దీర్ఘంగా, విషాదంగా చూస్తూంటుంది. ఎందుకైనా మంచిదని ఆయనికి ఓ మిషను తగిలించేస్తారు. అందులో ఓ తెల్లగీత అడ్డ దిడ్డంగా పరిగెడుతూంటు౦ది. అప్పుడు డాక్టరు  గారు గంభీరంగా, భారంగా, విషాదంగా కళ్ళు తుడుచుకుంటూ చెప్పుతాడు. హీ.తం. కి ’యాంట్ కుటింగ్ ఫోబియా’. అర్జంటుగా ఆపరేషన్ చేయాలి. లక్షా ముఫ్ఫైఆరువేల పద్ధెనిమిది రూపాయల నలభై పైసలు అవుతుంది. అర్జంటుగా కట్టేయండి అని చెప్పేసి, వెంటనే వెళ్ళిపోతాడు, ఎవరూ ఏమీ ప్రశ్నించకుండా. హీ. దగ్గర సరిగ్గా పద్ధెనిమిది రూపాయల నలభై పైసలు మాత్రమే ఉంటాయి. హరిలోరంగ హరి అనిపాడుతూ పరుగు లంకి౦చుకుంటుంది మిగతాడబ్బుకోసం. ఆపైకధ మీరు ఏసిన్మాలో చూసినా తెలిసిపోతుంది. మన కధకొస్తే, చీమకుడితేనే ఇంత కంగారుపడి, కంగారుపెట్టే మనిషి వెన్నమనసుగాడేనని నేను నమ్ముతాను.

ఈపద్ధతిలో కనిపెట్టినపుడు, అప్పుడప్పుడు, ఘోరమైన తప్పిదాలు జరుగుతుంటాయి. మగాళ్ళలో గోముఖ వ్యాఘ్రాలు, పులిచర్మం కప్పుకొన్న నక్కలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. తేలిగ్గా కనిపెట్టడానికి కొన్ని కొండ గుర్తులున్నాయి. వంకాయ కూర మాఅమ్మమ్మ చేస్తేనే బాగుంటుంది. మానాన్నమ్మ బెండకాయ ఇగురు చేసింద౦టే గిన్నెకూడా నాకేస్తాము. మా అమ్మలాగ వంట ఎవరూ చెయ్యలేరు అని గొణుక్కొనేవాడు పాషాణం గాడు. వెన్నగాళ్ళు ఉప్పుకొంచెం తక్కువయిందనో, పులుపు చాలలేదనో సలహాలు పాడేస్తూ, ఫరవాలేదనో, బాగానే ఉందని సాగదీస్తూ లాగించేస్తారు. లేలేతవెన్నగాళ్ళు మనం ఏంచేసినా, ఎల్లాచేసినా అమృతంలా ఉందంటూ ముక్కుమూసుకొని తినేస్తారు. వీళ్ళని మనమేం చేయనఖ్ఖరలేదు. వాళ్ళే ఓగొలుసు తెచ్చుకొని కట్టేసుకొని మనకుక్క పక్కన పడి ఉంటారు. కాని వీళ్ళతో మనకి విజయగర్వం ఉండదు. యుద్ధంచేసి గెలిస్తే వచ్చే ఆనందమే చిదానందం. కొన్ని హృదయాలు అంతుబట్టవు. వాళ్ళు పెళ్ళాంతోటే కాదు, అమ్మ, తోబుట్టువులతో కూడా అంతగా మాట్లాడరు. ఏంపెట్టినా తినేసి వెళ్ళిపోతారు. మనసులో ఏముందో బయటకు చెప్పరు. చిన్నపాము నైనా పెద్దకర్ర తోటే కొట్టాలన్న సూత్రం వీళ్ళకి వర్తింపచేయాలి.

మొగాళ్ళని ఇలా ఏరకం  గాడో కనిపెట్టేసిన తర్వాత మనం శస్త్రాలను, అస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. వెన్న మానసులకి శస్త్రాలు చాలు. అస్త్రాలు అఖ్ఖర్లేదు. మనలో కూడా కొంతమంది శాడిస్ట్స్ ఉండవచ్చు. వాళ్ళు శస్త్రాలతో మొగుడిని ఆట పట్టించి, ఏడిపించి, చివరకు అస్త్రాలతొ పడగొట్టవచ్చు. తేలికగా విజయం సాదించాలా లేక అట ఆడుకుంటూ కొట్టేయాలా అన్నది మన ఇష్టం. ఇప్పుడు ఆగ్నేయాస్త్రం లాంటి వంటకం ఒకటి తయారుచేసే విధానం చెబుతాను. ఇది వెన్నమనస్కుల దగ్గరిని౦చి గ్రానైటు గాళ్ళదాకా ’వైడ్ స్పెక్ట్రమ్ ఏంటిబయాటిక్’ లాగ పనిచేస్తుంది. దీని  పేరే ’ సతీ  ద్రౌపదీ  పాకం’. ఇది  ఒక్కమాటు తింటే చాలు, నిర్వీర్యుడై, నిస్తేజుడై, నిరాసక్తుడై మన్నుతిన్న పాములాగ, మీమాట దాటకుండా పడిఉంటాడు. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ద్రౌపది ఈవంటకం చేసిందని, అది తిన్న పాండవులు మూర్ఛపోయారని మునిపత్నులు నాకు చెప్పారు. అప్పుడే ధర్మరాజు ద్రౌపదిని వంట డ్యూటీ నించి తప్పించి భీమసేనుడికి వంట వార్పుల డ్యూటీ అప్పగించాడని ప్రతీతి. ఈవిషయం బయటకు పొక్కకుండా శ్రీకృష్ణుడు చాలాజాగ్రత్తలు తీసుకొన్నాడని నాపరిశోధనలలో తేలింది.

సతీ ద్రౌపదీపాక౦ చేయడం చాలాతేలిక. ఏకూరగాయ కనిపిస్తే అది వాడవచ్చు. ఆకుకూరైనా బాగానే ఉంటుంది. రె౦డూ కలిపి కూడా వేయవచ్చు. ఏది లేకపోయినా డోంట్ వర్రీ, నిన్నమిగిలిన కూరైనా సరిపోతుంది. ఇదీలేకపోతే పక్కింటివాళ్ళు పాడేసిన పుచ్చువంకాయలు, పండిపోయిన అరటికాయలు, ఎండిపోయి పురుగుపట్టిన తోటకూర ఏదైనాసరే నిరభ్యంతరంగా వాడవచ్చు. స్టవ్ వెలిగించి, పైన ఒకమూకుడు పెట్టి ఎంతో కొంత నూనె వెయ్యండి. నూనె కాగిం తర్వాత మనం వేయాలనుకున్న ఆకు కూరలు, కూర గాయలు ఇత్యాదులన్నీ కలిపి  వేయండి. అతర్వాత ఎంతో  కొంత అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటొ, కొత్తిమీర, కరివేపాకు లలో ఏమి ఉంటే అవి వెయ్యండి. ఈ వంటకంలో  గొప్పతన మేమిటంటే వేటికీ  కొలతలు చూడ నఖ్ఖరలేదు. ఇవన్నీ ఉడకడానికి టైము పడుతుంది కాబట్టి, మీరు వెళ్ళి హాయిగా టివి పెట్టుకొని ఒక సీరియల్ చూసేయండి. సీరియల్ చూసి ఏడ్చి ముక్కు చీదుకున్న తర్వాత, స్టవ్ మీది మూకుడు మీదకు ఓ లుక్ పారేయండి. నూనె పొగలు కక్కుతూంటుంది. వేసిన పదార్ధాలు నలుపు రంగులోకి మారుతూంటాయి. ఈమాటు ఇంత పప్పు, ఎండుమిర్చి, ఉప్పు వేసి, అవసరమనుకొంటే మరింత నూనె పోసి మళ్ళీవచ్చి టివి లో లీనమై పొండి. మళ్ళీకొ౦చెం సేపు ఏడ్చింతర్వాత, మిమ్మల్ని మీరే ఓదార్చుకొని వచ్చి ఇన్నిమెంతులు, ఆవాలు, ధనియాల పొడి, మసాలా పొడి వేసి చూడండి. మూకుడులో పదార్ధం నల్ల నల్లగా, జిగురు జిగురుగా అదో రకమైన కంపు కొడుతూంటుంది. బాగాకలియపెట్టి ఇంత పెరుగు పోసి వచ్చేయండి టివి దగ్గరకు. టివి లో ’ విప్పండి చీర, గెలవండి లంగా’ కార్యక్రమం అయిం తర్వాత వచ్చి స్టవ్ ఆర్పేసి మూకుడు దింపేయండి. సువాసన కోసం ఇంత ఏలకుల పొడి, లవంగాల పొడి తగిలించండి. సతీ ద్రౌపదీపాకం రెడీ. ముఖ్యగమనిక:- ఇది పొరపాటున కూడా మీరు రుచి చూడకండి.

మీశ్రీవారికి ఇది ప్రేమగా అన్నంలొ కలిపి పెట్టండి. మీఆయన వచ్చేటప్పటికి ఇది కలిపి అట్టేపెట్టండి. లేకపోతే నల్ల నల్లగా, తెల్ల తెల్లగా, జిగురుగా ఉన్న కూరలాంటి పదార్ధాన్ని అన్నంలో కలుపుకోడానికి గురుడు ఇష్ట పడక పోవచ్చు. అవసరం ఐతే ఇంత శృంగారాన్ని ఒలకబోసి శ్రీవారిని మత్తులో దించి వాడి నోట్లో మూడు నాలుగు ముద్దలు కుక్కేసి నోరూ ముక్కూ మూసేయండి. ఊపిరాడక, దిక్కుతోచక వెఱ్ఱి మొగుడు నోట్లోది, గొంతులోంచి పొట్టలోకి ట్రాన్స్ ఫర్ చేసేస్తాడు. అంతే ఫినిష్. మీరు జయించినట్లే. ఒక్కమాటు అమాంతంగా పైకిలేస్తాడు. మీకేసి కౄరంగా కసిగా చూస్తాడు. కంగారుపడకండి. అంతేవేగంగా వాడి కడుపులో గుడగుడా మెదడులో బడబడా మొదలైపోతుంది. తట్టుకోలేక, ఆయొక్క శ్రీమన్నారాయణుడి దివ్యసాక్షాత్కారం పొందిన భక్తుడి లాగ నిశ్చేష్టుడయి పోతాడు. మంచినీళ్ళు గడగడా తాగేస్తాడు. కిందపడి దొర్లుతాడు. ఈస్థితిలో మీరు కొంచెం కఠినంగానే ఉండాలి. జాలిపడ్డారో మీపని అయి పోయిందన్నమాటే. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు, నోట మాట రాదు, కంటి నుండి నీరు కారి పోతూంటుంది. నువ్వు ఇంత పని చేసావా అన్నట్టు చూస్తాడు. పేగుల్లో శివతాండవం, మెదడులో కదాకళి జరిగిపోతూంటుంది. ఈస్థితిలో వీలైతే వారిని బెడ్ రూములోనికి నెట్టి తలుపు గడియ పెట్టేయండి. వచ్చి టివి సౌండు బాగా పెంచేయండి. బెడ్ రూములో ఆయన వింత వింత శబ్దాలు చేస్తుంటాడు. డోంట్ వర్రీ. రెండు మూడు గంటల తరువాత బెడ్ రూము తలుపు తెరవండి. గురుడు అప్పటికి కొంచెం స్థిమితపడ్డట్టు కనిపిస్తాడు. మాట పలుకుతుంది.. బహుశా “ఇంక నీవు వంట చెయ్యవద్దు డియర్” అంటాడు. రెండు మూడు రోజులు గురుడు అదోలా ఉంటాడు. మత్తుగా నీరసంగా ఉంటాడు. తిండి సరిగా తినడు. మరేం ఫర్వాలేదు.  నాలుగో రోజుకి  కొంచెం తేరు కుంటాడు. కాని తలుచు కొన్నప్పుడల్లా కడుపులో తిప్పేస్తుంది. అప్పటినించి మీరు వంట చేస్తానంటే బెదురుతాడు. తనే వంట చేస్తాడు. లేకపోతే హొటలు నించో, ఏదైనా మెస్ నుంచో కేరియరు తెప్పిస్తాడు. వంట చేస్తానని బెదిరిస్తే చాలు మీకు కావల్సినవన్నీ నిముషాలమీద తెచ్చి పడేస్తాడు. మీరు హాయిగా “మీర జాల గలడా నాయానతి సతీ ద్రౌపదీ పాక మహిమన్” అని పాడు కుంటూ పొద్దుటి నించి రాత్రిదాకా టివి చూస్తూ ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ కాలం గడిపేయవచ్చు.

అస్త్రశస్త్రాలు తయారు చేసే విధానాలు, ఏది ఎప్పుడు ఎల్లాగ ప్రయోగించాలో మొదలైన వివరాలన్నీ “వంటలూ- వాంతులు” అనే నాపుస్తకంలో వ్రాసాను. చదివి ప్రయోగించండి. ఈపుస్తకం ప్రచురించిన తరువాత, అఖిల భారతీయ పూటకూళ్ళ సంఘం, హొటలువాళ్ళు, కేటరింగువాళ్ళు అంతాకలసి నాకు ఘనసన్మానం చేసారు. మగాళ్ళమీద అంకాళమ్మ లాగ విరుచుకు పడిపోతానని “అంకాళమ్మ” అనే బిరుదు కూడా ఇచ్చారు. అడ్డ గాడిద లందరికి, అడ్డగోలు యూనివర్సిటీలు డాక్టరేటులు ఇచ్చేస్తుంటే తప్పేంటి అంటూ నాకూ ఓ డాక్టరేటు ఇచ్చేసారు. ఈపుస్తకం బహుళ ప్రాచుర్యం పొందితే ఇంక ఏ పడతీ ఇంటిలో వంట చేయదు కాబట్టి మాదే సామ్రాజ్యం అని వాళ్ళంతా మురిసిపోతున్నారు. వాళ్ళే నా పుస్తకం ఫ్రీగా ఇస్తున్నారు. తెచ్చుకోండి. బానిస బతుకు నించి విముక్తులు కండి. జయ జయ అంకాళమ్మా అని నాకు జేజేలు పలకండి.

                             సర్వే భర్తాః దుఃఖినో భవంతు

                             సర్వే భార్యాః సుఖినో భవంతు

ముందుమాట చివర వ్రాస్తున్నాను. సుమారు పాతికా ముఫ్ఫై ఏళ్ళ క్రితం గౌహతి నించి హౌరా, రైలులో వెళుతూ బంగాయ్ గాం స్టేషనులో దోశల పేకట్టు కొన్నాను. అవి ఒకటిన్నర పేజీల తెలుగు పత్రిక లో కట్టాడు. దోసలు తిన్నతర్వాత జాగ్రత్తగా చట్నీ, నూనె మరకలు తుడిచి ఆ కాగితం చదివాను. హౌరా చేరేలోపు కనీసం ఒక అరడజను మార్లు చదివాననుకుంటాను. నవ్వు ఆపుకోవడం చాలా కష్టం అయింది. పక్కన కూర్చున్న వాళ్ళు నాకేసి వింతగా చూసారు. ఆ రచన ఎవరు వ్రాసారో తెలియలేదు. పూర్తి కధ చదవలేదు. ఆతర్వాత దానికోసం ప్రయత్నించాను కాని దొరకలేదు. ఆ పత్రిక ఏదో గుర్తు లేదు. నాల్గేళ్ళక్రితం  నేను తెల్గులో వ్రాసిన మొదటి రచన ఇది. ఈ నా రచన ఆరోజు నేను చదివిన కదకు అనుకరణ. ఆకధకు దీనికి పోలికలు ఉండవచ్చు.  ఆ తర్వాత దీన్ని రెండు మాట్లు తిరగ వ్రాసాను.  ఐనా చదివిన ఆ రచన, పోలికలు,  వాసన పోలేదు అనుకుంటాను.
 మొదటి రచన మీద మమకారంతో, నాకు పేరు కూడా తెలియని ఆ రచయితకు క్షమార్పణలు చెపుతూ ఇక్కడ ఇది అతికించడానికి సాహసిస్తున్నాను. ఇది చదివి ఎవరైనా బాగుందని అభిప్రాయ పడితే అది ఆయనకే చెందుతుంది.

23 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Super!! ఈలలు, చప్పట్లు, పొర్లిగింతల నవ్వులాటలు :)))

అనిర్విన్ చెప్పారు...

మీరు హాయిగా “మీర జాల గలడా నాయానతి సతీ ద్రౌపదీ పాక మహిమన్” అని పాడు కుంటూ పొద్దుటి నించి రాత్రిదాకా టివి చూస్తూ ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ కాలం గడిపేయవచ్చు.

hahhahaha

E.V.Lakshmi చెప్పారు...

హాహా !చాలా చాలా బాగుంది. మరి వంటలు -వాంతులు పుస్తకం నాకు పంపించగలరా?మా ఆయన మీద ప్రయోగించాలి.
e.v.lakshmi
ongole

అజ్ఞాత చెప్పారు...

మధ్య మధ్యలో టాపిక్ బాగా అడ్డదారులు తొక్కినట్టుంది, అంటే ఫోకస్ చెడింది అని అర్థం. ఓ సారి నవ్వవచ్చు. హీ హీ. హాస్యం పక్కనుంచితే, మీరొక లేడీ మార్తాండ గారేమో అనిపిస్తోంది. దయచేసి అవునని చెప్పండి, మోనోపొలీ నుంచి బ్లాగ్లోకాన్ని రక్షించిన వారవుతారు. :)

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హ్హా.. సూ....పర్..:) నవ్వలేక చచ్చాను..:))))
నాకు కూడా కావాలి ఆ పుస్తకం..:)

అజ్ఞాత చెప్పారు...

e.v.lakshmi గారు మీది ఒంగోలా? అయితే ఒంగోలు శీను తెలుసా

E.V.Lakshmi చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
E.V.Lakshmi చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
E.V.Lakshmi చెప్పారు...

రచయిత గారు ,దయచేసి నా కామెంట్ ఒక్కటే ఉంచగలరు .by mistake మూడు సార్లు పడింది.
.lakshmi

అజ్ఞాత చెప్పారు...

రచయిత గారు lakshmi కామెంట్ ఒక్కటే మూడు సార్లు ఉంచగలరు .by mistake ఒక్కసారి పడింది.

అజ్ఞాత చెప్పారు...

నాకు ఒంగోలు గిత్త తెలుసు. దానిపేరు చీను అని తెలియదు.

శ్రీనివాస్ చెప్పారు...

అల్లో అల్లో అల్లో ఇక్కడెవరో నన్ను తల్చీసుకుంటన్నారని అభిజ్ఞ వర్గాల బోగాట్టా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మొదటి Anonymous గార్కి, అనిర్విన్ గార్కి,
మీవ్యాఖ్యలకి ధన్యవాదాలు. థాంక్యూ.

ఇ.వి లక్ష్మి గార్కి,
ధన్యవాదాలు. పుస్తకం ఇప్పుడు out of stock.కొత్త స్టాకు వచ్చింతర్వాత పంపిస్తాను. అంత దాకా మీరే వంట చెయ్యాలనుకుంటాను.థాంక్యూ ఫర్ ది కామెంట్స్.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రెండవ Anonymous గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. రెండు మూడు మాట్లు తిరగ వ్రాసినందుకు బహుశా, మీరన్నట్టు కొంచెం దారి తప్పిందనుకుంటాను.నేను నేనే. మీరన్నవారెవరో నాకు తెలియదు.తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు. థాంక్యూ ఫర్ ది కామెంట్స్.

మనసు పలికే గార్కి,
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు.పుస్తకానికి ఈ రోజు బుక్ చేసుకుంటే రెండు ఏళ్ళ తరవాత దొరుకుతుంది.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మూడవ,నాల్గవ,ఐదవ Anonymous గార్లకు,

అయ్యలారా మీరందరూ ఒకరే నని నాకనిపిస్తోంది. శీను గారి గురించి నాబ్లాగులో ఎందుకు వెతుకుతున్నారో నాకు అర్ధం కావటంలేదు. వారు మీకు త్వరలో దర్శనమివ్వాలని కోరుకుంటున్నాను.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీనివాస్ గార్కి,

స్వాగతం. మీకోసం దారితప్పిన ఎనానిమస్ గారు నాబ్లాగులో వెతుకుతున్నారని తెలిసి ఇక్కడకు వచ్చినందుకు థాంక్స్.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కామెంట్స్ చేసే వారందరికి ఒక విన్నపం, విజ్ఞప్తి,

దయచేసి నా రచన/టపాకి సంబంధించినంత వరకు మాత్రమే వ్యాఖ్యానించమని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.ఎనానిమస్ గారి కామెంటు డిలీట్ చేస్తున్నాను. క్షమించండి

Narayana చెప్పారు...

దీన్ని ఆడవాళ్ళెవ్వరూ చదవకపోతే బాగుండు. కానీ మా ఆవిడ చదివేసినట్లుందే.. ఏం చెయ్యను?

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ పాకం అదిరిపోయిందండీ బాగా నవ్వించారు :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నారాయణ గార్కి,
ఇది ఆడవారికి మాత్రమే అని రాస్తే మీరెందుకు చదివారు సార్. సతీ ద్రౌపదీ పాకం తిను భాగ్యం కలుగుగాక. ధన్యవాదాలు.

వేణు శ్రీకాంత్ గార్కి,
మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు. థాంక్యూ.

ఆ.సౌమ్య చెప్పారు...

మీరు సరదాగా రాసినా.....మగవాళ్ళ మీద వేసిన సెటైర్ సూపరు...చాలా బాగుంది

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆ.సౌమ్య గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.