ఏమండోయ్ అలా వెళ్లి పోతున్నారేమిటి, ఇలా రండి.

ఇలా రండి అనగానే చేతులు ఊపేసుకుంటూ వచ్చేయడమేనా? 

అల్లా వెళ్ళండి ఏలూరు RR పేట మెయిన్  రోడ్ లో మా ఇంటినుంచి రెండు వీధుల అవతల స్వీట్ షాప్ ఉంది. అక్కడనుంచి ఒక kg స్వీట్ తీసుకోండి, కొంచెం ముందుకు వస్తే పళ్ల దుకాణం ఉంది అక్కడ ఒకఅర డజను ఏపిల్ లో, ఒక పరక రసాలో పట్టుకురండి. పరక అంటే 14(13+1) ఇస్తాడు, లెఖ్ఖపెట్టండి.   

అంతా అవే పట్టుకు రాకండి. అక్కడ అంగూరు, నల్ల ద్రాక్ష కూడా ఉన్నాయి. అవికూడా తీసుకు రావచ్చు రెండేసి kgలు.  

నేనన్నది నల్ల ద్రాక్ష, నల్లగా ఉన్నవన్నీ ద్రాక్షలు కావు. మీరు పట్టుకు వచ్చినవి నేరేడు పళ్ళు. అవి ఇచ్చేసి మరొకటి తీసుకు రండి. 

చవకగా వచ్చాయని బూందీ లడ్డూలు పట్టుకు వస్తారుటండీ ఎవరైనా. బందరు లడ్డు, జీడిపాకం ,  బాదం హల్వా,  ఏలూరు లో కూడా కాజు బర్ఫీ బాగానే ఉంటుంది.

ఆ వచ్చారా, స్వీట్లు పళ్ళు రెండూ పట్టుకు వచ్చారా , ఆ కుర్చీలో కూచొండి. 

ఏమిటీ మీకు పళ్ళు దొరకలేదంటారా కొంచెం ప్రయత్నిస్తే నాలుగు అడుగులు వేస్తే దొరకక  పోతాయా. సరే వెళ్ళి ఆ బెంచీ లో కూర్చోండి . 

ఇక్కడ క్రెడిట్ కార్డ్ లు నడవవండి. ఆ మాత్రం కాష్ మీ జేబులో లేదా. లేకపోతే యేం, వేలికి ఉంగరం ఉందికదా, బంగారం  కొట్టు లో తాకట్టు పెడితే డబ్బు ఇచ్చేవాడు కదా. ఆ మాత్రం తెలియదా మాష్టారూ,  వెళ్ళి ఆ నేల మీద కూర్చోండి. ఏం చేస్తాం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహా దేవా అన్నారు.  

ఏంటమ్మా చిట్టీ, ఆయన మన దొడ్లో గులాబీ పూవు కోసుకు వచ్చాడా. ఆయన్ని గేటు దగ్గర నిలబెట్టేద్దాం తల్లీ. 

భలేవారండి రెండు కే‌జిలు స్వీట్స్, పాతిక పళ్ళు పట్టుకు వచ్చారా. ఒరేయ్ ఈయనని స్టేజ్ మీద సోఫా లో కూర్చొబెట్టు.  

ఓ ఓ రెండు అరటి  పళ్ళు పట్టుకొని ఊపుకుంటూ వచ్చేస్తున్నారే, అరటి పళ్ళు అక్కడ పెట్టి వెళ్ళి నేలలో కూర్చోండి. 

అమ్మయ్య  రావాల్సిన  వాళ్ళు  అందరూ వచ్చేశారా. మిమ్మలని అందరినీ ఈ వేళ ఇలా ఆహ్వానించడానికి కారణం చెప్పేముందు రెండు ముక్కలు చెప్పాల్సిన అవసరం పడింది. ఏమిటి మాష్టారూ దీన్ని ఆహ్వానం అంటారా అని గొణుక్కోకండి. ఇది కొంచెం వెరైటీ గా ఉంది కదా. మార్పును ఆహ్వానించడం నేర్చుకోవాలి. 

నేల మీద కొంచెం ఇరుకు గానే ఉన్నట్టుంది. కొంచెం ఓపిక పట్టండి.  ఈ వేళ ఈ శుభ సందర్భంలో చెప్పడానికి  6 పేజీల ఉపన్యాసం తయారు చేసుకున్నాను. కానీ మీ అందరినీ  ఇలా చూసిన తరువాత మొదటి పేజీ అనవసరం అనుకున్నాను. 

భాయియోమ్,  బెహనోమ్ మీ కందరికి నామీద ఇంతో అంతో అభిమానం ఉందనే అనుకున్నాను. కానీ ఈ వేళ కుర్చీల్లో  ముగ్గురు, బెంచిలో ఐదుగురు కనిపిస్తున్నారు. నేలలో ఒక 40-45 మంది ఇరుక్కుని కూర్చున్నారు. దీన్ని బట్టే తెలుస్తోంది నా మీద మీకు ఎంత ప్రేమ, అభిమానం, ఆదరణ ఉన్నాయో.  నా మీద మీకు ఉన్న ఈ అన్నిటికి నేను కరిగి నీరైపోయాను అని వ్రాసాను మొదటి పేజీలో . ఇప్పుడు అది తీసేశాను.

ఇంతకీ ఈ వేళ ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశానంటే ఈ వేళ నా బ్లాగు కి  366 వ దినం. 

ఏడాది కాలం వీడిని మనం భరించామా అని  కన్నీరు మున్నీరు అవాల్సిన దినం అని మీరు అనుకుంటే,  ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు అని మనవి చేసుకుంటున్నాను. గతం గతః . కంగారు పడకండి. బ్లాగు లో ఇన్ని రాశాను. అంతమంది చదివారు. ఇంతమంది కామెంటారు అన్న లెఖ్ఖలు చెప్పను. 

ఎందుకంటే ఏ బ్లాగు లోనైనా ఇవే అంకెలు ఒక 10% అటూ ఇటూ గా. ఒక్క బ్లాగరు చెప్పితే 100 బ్లాగర్ల కధ అదే.  అదీకాక ఈ మధ్యనే 239 వ దినం కూడా చేసుకున్నాము. అందుకని ఈ వేళ ఏం చెబుదామా అని ఆలోచించాను. ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందంటే, ఇక్కడ   చూడండి. 


అందుకని  సింహావలోకనం, ఆత్మ శోధనం, అంతర్మధనం మొదలు పెట్టాను.  మొదటగా బ్లాగుల్లో కామెంట్లు, ప్రతి కామెంట్లు అంటే కామెంటుకి జవాబు కామెంట్లు మొదలైన వాటిని గురించి పరిశోధించి,   ఆలోచించాను. నేను  ఇతరుల బ్లాగుల్లో పెట్టిన కామెంట్లు చూస్తే  నాకొక విషయం అర్ధమైనది. కడుంగడు  విచారించితిని,  విచారించి  బాధపడితిని,  బాధపడి దుఃఖించితిని. నాకు తెలియకుండానే నేను ఇంత పాపము చేయుచున్నవాడనా అని మళ్ళీ విచారించి, బాధపడి, దుఃఖించితిని. 

ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నాను.  ఇకపై నేను ఎవరి బ్లాగులోనూ, బజ్ లోనూ కామెంటు పెట్టకూడదని ఒట్టు పెట్టుకున్నాను.


ఎందువలనా   అంటే

నా చిన్నప్పటినించి కూడా  నా పాదం  యొక్క గొప్పదనం బాగా ప్రసిద్దికెక్కింది.  
పరమ యోగులకు పరమొసగెడి  నీ  పాదము  అని పాడుకొనేవారు.  

ఎవరికైనా వంట్లో బాగాలేదని తెలిసి  వాళ్ళని చూడడానికి నేను వెళితే, నేను వారి వీధి గుమ్మం దాటకుండానే ఇంట్లో  ఘెల్లుమనేవారు.  

ఆ తరువాత నేను అంతా అయిపోయిన తరువాతే పరామర్శ కి వెళ్ళేవాడిని.  

నేను బాన్ వాయేజ్ అంటే వాడి విమానం ఎక్కడో కూలుతుంది.  బెస్ట్ విషెస్ చెపితే వాడికి మూడిందన్నమాట. 

ఇప్పుడు బ్లాగుల్లోకి వచ్చిన తరువాత, ఎవరి బ్లాగులోనైనా నేను మొదటి కామెంటు పెట్టితే ఆపైన కామెంట్లు ఉండవు.  ఇల్లా కాదని మధ్యలో కామెంటు పెట్టితే అక్కడితో ఆగి పోతాయి కామెంట్లు.  చివర పెడుదామని ఆగితే ఆ బ్లాగులో కామెంట్లు ఆగవు,  అలా వస్తూనే ఉంటాయి .  

కామెంట్లు పెట్టకుండా ఉందామంటే  చేతి దురద ఎక్కడో అక్కడ  గోకకపోతే  కానీ  తీరేది కాదు.

బజ్ ల్లో కూడా మన ప్రభావం డిటో. సుమారు 20 %  బజ్ లో నాదే చివరి కామెంటు. 

హాహాహాహ్హ.  నేనేమి  చేయవలే ?  What do i do ?  ముఝే  క్యా  కర్నా  హై ?

అని మూడు భాషల్లోనూ విచారించి తీసుకున్న నిర్ణయం అన్నమాట. అమ్మయ్య వీడు కామెంటు పెట్టడు కాబట్టి వీడి బ్లాగు లో కామెంటు పెట్టఖ్ఖర్లేదు అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.  మీరు కామెంటు పెట్టకపోతే నేను , ఒట్టు తీసి గట్టు మీద పెట్టి  మీ బ్లాగు లో కామెంటు పెట్టేస్తాను.  మీ కామెంటు బాక్స్ లో ఇంకేమీ పడవు. నా కత్తికి రెండు వైపులా పదును అని మీరు  గ్రహించ వలెను. హాహాహ్హ.

తరువాత  ఇంకో  క్రూర నిర్ణయం  ఘోరంగా తీసుకున్నది  ఏమిటంటే   ముందు ముందు నేను ఈ జోకరు వేషం తీసేసి పండితుడి వేషం వేద్దామని. మొన్న ఒకాయన నన్ను చూసి మీరు వ్రాసినవి చదివితే నవ్వు రావడం లేదు కానీ మిమ్మలని చూస్తే నవ్వు ఆగటం లేదండీ అని పడి  పడి నవ్వాడు. అందుచే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. 

అంతా మిధ్య,  ఆత్మ = పరమాత్మ, త్వమేవాహం అనే పద్ధతిలో వేదాంతం బోధిస్తూ వ్రాసేద్దామని. మీ సందేహాలకి సమాధానాలు చెప్పేస్తాను. మీ జాతకాలు చెప్పేస్తాను.  మిమ్మలని సన్మార్గం లో నడిపించే గురుతర బాధ్యత తీసుకుందామని నిర్ణయించుకున్నాను.   

పేరు కూడా మార్చేసు కుంటాను.  శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ.  

ప్రస్తుతం 4 సంస్కృత శ్లోకాలు, ఒక పది తెలుగు పద్యాలు, ఇంకో పది పాటలు నేర్చుకొనే  కార్య క్రమం లో ఉన్నాను. ఇవి నేర్చుకున్న తరువాత కార్య రంగములోకి దూకుతాను.

ఒక వేళ ఏ కారణము చేతనైనా పై అవతారం కుదరకపోతే (అంటే కాషాయ వస్త్రాలు నా మొహానికి సూట్ కాకపోతే)  మారు వేషం వేసుకుని,  దుఃఖభరితమై, విషాదాంతమై, గుండెలను పిండి, మనసును ఎండబెట్టే, జీవిత సత్యాలను అనగా TV సీరియల్ కధలని   మీ ముందు నుంచోపెట్టి  మీ జేబు రుమాళ్లను తడిపి ఆరేసుకునేటట్టు  రచించాలని నిర్ణయం కూడా తీసుకున్నాను.

అందుచే నేను నా బ్లాగు శీర్షిక మారుద్దామా  లేక ఇంకో బ్లాగు తెరుద్దామా అని  ఆలోచిస్తున్నాను. కొన్ని శీర్షికలు అండర్ కన్సిడరేషన్,

ఏడిస్తే  ఏడవండి,  ఏడవకపోతే మీ మీదే ఒట్టు,  ఇక్కడకొచ్చి ఏడవండి,  రండి ఏడిపించి పంపుతాను,  ఏడుపు మేడు ఈజీ,   ఇవి TV  ఏడుపు బ్లాగు కి సంబంధించినవి.

నా ఆత్మే మీ పరమాత్మ,  నాలో మీ దేవుడు, మీ బంగారం లో నా పరమాత్మ,  మీ పర్సు నాకివ్వండి నా ఆశీస్సులు మీకిస్తాను,  అనేవి నా వేదాంతం బ్లాగులు కి సంబధించినవి.

ఇంకా మంచివి మీకేమైనా తోస్తే నాకు చెప్పండి.  ఏదో ఒక అవతారం ఎత్తుదామని డిసైడ్ అయిపోయాను.  ఏదీ  అన్నది మీరే చెప్పండి.

అవునూ  ఆ  పై శీర్షిక ఏమిటీ  ఇక్కడ  వ్రాసినదేమిటీ అని ? మార్కు మొహం పెట్టకండి.  TV సీరియల్లా మజాకా నా.      అదండీ సంగతి.

All said and done అదేమిటి ఇంగ్లీష్ లో అంటే, ఏడ్వాల్సిన ఏడుపు అంతా తెలుగు లో ఏడ్చేసిన తరువాత మీకు అర్ధం కాకుండా ఇంగ్లీష్ లో ఏడుద్దామనుకున్నాను. కానీ మీరు కోప్పడితే  తెలుగులోనే కానిచ్చేస్తాను.  

ఈ ఏడాదిలో 30 టపాలు వ్రాసాను. ఇందులో 5 కధలు,   స్నేహ సమాఖ్య, సౌత్ ఎండ్ పార్క్ , L. B. నగర్  వారి  వార్షిక సంచిక  లిఖిత  లలో ప్రచురించబడ్డాయి.  మిగిలిన  25 కధలు బ్లాగు కోసమే ఈ ఏడాది కాలం లో  వ్రాసుకున్నవి. 

1980 ల దాకా అంతో ఇంతో తెలుగు సాహిత్యం తో పరిచయం ఉంది. నేను 80 ల తరువాత తెలుగు సాహిత్యం ఎక్కువగా చదవలేదు. చదివిన ఇంగ్లిష్ ఫిక్షన్ కూడా కాలక్షేపం కోసం రైలు ప్రయాణాల్లోనూ, ఎయిర్ పోర్ట్ లో వెయిటింగ్ టైమ్ లో చదివినవే.    

82 లో మా నాన్న గారు పోయిన  తరువాత తెలుగులో ఉత్తరం కూడా వ్రాయలేదు. 

అటువంటిది నేను తెలుగులో కధలు వ్రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు.  నేను తెలుగులో వ్రాయ గలను అనే నమ్మకం కలిగించిన మిత్రులు చాలా మంది ఉన్నారు బ్లాగుల్లో.  ఈ కింది టపా లు నా లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.


బులుసు గారూ మీకిది తగునా?
 

బులుసు బ్లాగు, లాగు, స్పాటు, లాఫూ!


బులుసేరియా మరియూ దాని పర్యవసానాలు.. 

 
జ్యోతి గార్కి, మలక్పేట రౌడీ గార్కి, జిలేబి గార్కి, కార్తీక్ గార్కి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేసు కుంటున్నాను.   

గత ఏడాది కాలం గా బ్లాగుల్లో అనేక మంది సహృదయులతో పరిచయం కలిగింది.  అందరూ నా మంచిని కోరుకున్న వారు , నన్ను ప్రోత్సహించిన వారు.  వీరందరికి, నన్నాదరించి,  ప్రోత్సహించిన పాఠక మహా శయులందరికి మనః పూర్వకం గా కృతజ్ఙత లు,  ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 


గమనిక :- ఇది మొదటగా 14/06/2011 న ఈ బ్లాగులో ప్రచురించబడింది. 

                       

67 కామెంట్‌లు:

SHANKAR.S చెప్పారు...

గురువు గారూ మీ కోసం ఓ ప్పాతిక కేజీల కాకినాడ కాజా, రెండు బుట్టల ద్రాక్షపళ్ళు, మూడు బస్తాల యాపిళ్ళు, ఒక పున్జీడు పూల దండలు, నాలుక్కావిళ్ళు నూజివీడు రసాలు పురమాయించా. ఇంకా అందలేదా? అన్నట్టు నన్నేక్కడ కూర్చోమంటారు? అన్నట్టు ఎలాగూ శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ అని పేరు మార్చేసుకున్నరుగా ఓ మంచి సెంటర్లో పాతికెకరాలు సింగిల్ బిట్ ల్యాండ్ చూసి ఆశ్రమం పెట్టేద్దాం. ఇరవై మీకు, ఐదు నాకు.

రాజ్ కుమార్ చెప్పారు...

గురువు గారూ.. మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు..
బ్లాగ్ పుట్టినరోజు నాడు వేసే రొటీన్ పోస్ట్ లాగా కాకుండా కొత్తగారాసారు. సూపరు..
>> ఏడిస్తే ఏడవండి, ఏడవకపోతే మీ మీదే ఒట్టు, ఇక్కడకొచ్చి ఏడవండి, రండి ఏడిపించి పంపుతాను, ఏడుపు మేడు ఈజీ,>>

ఇవికేకా... మీరేనా డైరెట్రుకూడా?? హిహిహి..

మీరు కామెంట్ పెడితే మీదే లాస్ట్ కామెంట్ అని ఎందుకు అనుకుంటున్నారూ..? ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకోకండీ.. కావాలంటే నా బ్లాగ్ చూడండీ..;);)

మీరు గొప్ప గొప్ప కామెడీ పోస్ట్ లు ఎన్నో మరెన్నో రాసి మమ్మల్నందర్నీ నవ్వుల్లో ముంచాలని కోరుకుంటున్నాను..


శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ కీ జై...

Apparao చెప్పారు...

శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ గారికి అభినందనలు

Sravya V చెప్పారు...

మీ బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు !
నాకు తెద్దామంటే, స్వీట్స్ , పళ్ళు ఏమి దొరకలెండి , పైగా నా వెలికి ఉంగరం కూడా లేదు , ఈ సారికి ఇలా కానిచ్చేయండి :)

Apparao చెప్పారు...

>>>ఇంకా మంచివి మీకేమైనా తోస్తే నాకు చెప్పండి. ఏదో ఒక అవతారం ఎత్తుదామని డిసైడ్ అయిపోయాను. ఏదీ అన్నది మీరే చెప్పండి
గురువు గారూ ......
అందరూ తెచ్చే పళ్ళూ, స్వీట్స్ నాకు ఇచ్చేయండి
నేను సగం ధరకి అమ్ముకోస్తా
మన ఇద్దరికీ సగం సగం

మాలా కుమార్ చెప్పారు...

బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలండి .

MURALI చెప్పారు...

బులుసా బుడుగా? ఏంటో నాకీ కన్‌ఫ్యూజన్. బులుసు బుడుగవ్వచ్చు. బుడుగు బులుసూ అవ్వచ్చు.
"ఎవరూ రమణగారా. రాండి"
"ఏంటో? శతమానం భవతా? అలాగలాగే.."

తులసిరామ్ చెప్పారు...

haha nice effort continue.

హరే కృష్ణ చెప్పారు...

బ్లాగు జన్మ దిన శుభాకాంక్షలు గురువు గారు..మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం

SJ చెప్పారు...

మీ పోస్ట్లు నవ్వులో తడిసి ముద్దా అయ్యాము ...మీకు అబినందనలు ...కీప్ గోయింగ్...జై స్వామిజి కి !!

వాత్సల్య చెప్పారు...

కాషాయ వస్త్రాలు ఓల్డ్ అండీ, పట్టు పంచ కట్టుకుని ఉయ్యాల మీద అలా ఊగుతూ,నుదుటి మీద ఇంత మందం విభూతి రేఖలతో కళ్ళు మూసుకున్న ప్రద్యుమ్నానంద స్వామి ని ఊహించుకున్నా :)).
బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జూన్ 28 కి అడ్వాన్స్ శుభాకాంక్షలు

శ్రీలలిత చెప్పారు...

మీరు స్వామీజీ అవతారం ఎత్తితే వచ్చి కానుకలు చదివించుకుని ఆశీర్వాదం తీసుకుంటా..
TV సీరియల్స్ వైపు వెడితే నాకూ ఓ ఛాన్స్ యిమ్మని మీ వెనకాల పడతా...
ఈ రెండూ బాగానే వున్నాయి,
కాని దయచేసి "దాదా" మటుకు అవకండి..
మిమ్మల్ని అనుసరించే ప్రయత్నంలొ నేను రౌడీని కాలేను.. హహహ్హ...
బ్లాగ్ ప్రథమ వార్షిక శుభాకాంక్షలతో...

మనసు పలికే చెప్పారు...

గురూ గారూ... బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు..:)
మరేమో నేనేమో ఏలూరు బస్సెక్కానా, ఏలూరులో దిగానా, అక్కడ స్వీటు షాపులు, పళ్ల కొట్లు కనిపించలేదు..:( అయినా సరే మీ దగ్గరికి ఏమీ లేకుండా రావద్దని (కింద కూర్చోవద్దని..;)) ఏలూరు అంతా తిరిగేసి ఒక 2 కేజీల మినప సున్నుండలు, మరో రెండు కేజీల పూత రేకులు, ఇంకో రెండు కేజీల మడత కాజాలు తెచ్చాను. అదే చేత్తో, ఓ 20 ఆపిల్స్, ఓ 50 మామిడి పళ్లు, మరో 5 పనసపళ్లు తెచ్చాను..;) శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ కీ జై అని చెబుతూ..

అయినా మీరు మమ్మల్ని నవ్విస్తేనే బాగుంటుంది గురూగారూ. మీరిలాగే ఉండండి అవతారం ఏమీ మార్చొద్దు..;) ముఖ్యంగా ఆ ఏడుపుకి సంబంధిచిన అవతారం..:P

గిరీష్ చెప్పారు...

Congratulations బులుసు గారు.
మీరిలాగే మాంచి మాంచి టపాలు వ్రాస్తూ మమ్ములను హాస్యసముద్రంలో ముంచెయ్యాలని ఆశిస్తూ..

మీ అభిమాని.

పుట్టపర్తి అనూరాధ. చెప్పారు...

స్వామీజీ అవతారం ఎత్తాక పళ్ళు ..స్వీట్లూ..తింటూ కూర్చుంటారాండీ ఎవరన్నా ఆనక..కాసిని నిద్ర మాత్రలు కలిపిన గంజి నీళ్ళు తాగి ..తొంగోవల్సొస్తుంది జాగ్రత్త..!!! ఎలాగూ స్వామీజీ అవతారానికి డిసైడై పోయారు కాబట్టీ..ముందు తొరగా వెళ్ళి స్విస్ బాంకులో అకౌంటొకటి ఓపన్ చేసుకోండి..తొరగా..భక్తులొచ్చే టైమైంది..

తృష్ణ చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ అభినందనలు. ఇలానే నవ్విస్తూ ఉండండి.

అజ్ఞాత చెప్పారు...

పోనీలే, ఏదో తెలిసినవారూ, ఈసారి అటువైపు వచ్చినప్పుడు పొనీ కలుసుకుందామా అనుకుని, మీతో మొన్న ఫోనులో చెప్పాను. కానీ, మీ బందరు లడ్డూలూ, కాజూ బర్ఫీలూ..వగైరాలు చదివిన తరువాత ఉద్దేశ్యం మార్చుకున్నాను.

భమిడిపాటి సూర్యలక్ష్మి చెప్పారు...

ఆయన అలాగే అంటారండీ. ఎంతైనా మనమూ మనమూ, ప.గో.జి. వాళ్ళం.నేను వచ్చి మిమ్మల్నీ, మీ శ్రీమతిగారినీ తప్పకుండా కలుస్తాను.

beekay చెప్పారు...

:) మీకు మీరే సాటి. బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

కృష్ణప్రియ చెప్పారు...

:) 366 వ రోజు శుభాకాంక్షలు.. మమ్మల్ని మీ ఆశ్రమ ట్రస్టీ మెంబర్స్ గా చేర్చుకోండి చాలు. అనురాధ గారు చెప్పినట్టు మిగతావి అన్నీ మేం చూసుకుంటాం.

RATNAMALA చెప్పారు...

బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

పద్మవల్లి చెప్పారు...

మీ బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాగే అందర్నీ నవ్విస్తుండాలని ..
నాకు ఏలూరు కొత్త, అందుకని ఏ షాపుకి దారి తెలీలేదు. మీ ఇంటి పెరట్లో నుండే ఒక మందార పువ్వు కోసుకొచ్చాను, నన్నెక్కడ కూర్చోపెడతారో ఏమో మరి. :-(

kiran చెప్పారు...

బులుసు గారు - మీకు అభినందనలు..
మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..:))
నేను లారి నిండా పండ్లు తీసుకొచ్చ...కాస్త గేటు తెరవండి..:)

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ కీ జై..

వేణూశ్రీకాంత్ చెప్పారు...

మీకు అభినందనలు మరియూ మీ బ్లాగుకు పుట్టిన రోజు శుభాకాంక్షలూనూ బులుసుగారు :-)

జేబి - JB చెప్పారు...

గురువుగారికి అభినందనలు. మీరు పూయించిన నవ్వుల పువ్వులు తప్ప నాదగ్గరేమి లేవండీ మీకిచ్చుకోవడానికి. మీరు మరిన్ని హాస్యపు గుళికలిచ్చి మీ నవ్వులతో రత్నాలు రాలిస్తే వచ్చే సంవత్సరం బహుమతి విలువ పెంచుతా!

జేబి - JB చెప్పారు...

గురువుగారికి అభినందనలు. మీరు పూయించిన నవ్వుల పువ్వులు తప్ప నాదగ్గరేమి లేవండీ మీకిచ్చుకోవడానికి. మీరు మరిన్ని హాస్యపు గుళికలిచ్చి మీ నవ్వులతో రత్నాలు రాలిస్తే వచ్చే సంవత్సరం బహుమతి విలువ పెంచుతా!

కొత్తావకాయ చెప్పారు...

ఏవిటీ, 366 వ దినమూ, మళ్ళీ ఆర్భాటాలూనా? ఏం చోద్యమో ఏమో, మా కాలంలో ఎరుగుదుమా?

నవ్విస్తున్నారయ్యా? చచ్చేలా నవ్విస్తున్నారు. కొండమీద కూర్చున్న దేముడూ కాదు, కండలు పెంచిన హీరోలూ కాదు, కన్నవాళ్ళో, కట్టుకున్నవాళ్ళో కాదు.. ఎవరూ ఇంత నవ్వించి రక్తపోటు దింపిన పుణ్యాన పోలేదు. అంత నవ్విస్తున్నారు. అయితే ఏంటీ?

పక్కింటివాడెప్పుడైనా "ఏం రాసావయ్యా నీ బ్లాగులో .. అబ్బో. భేషని" మెచ్చుకున్న పాపాన పోయాడా? ఐరన్ లెగ్గవనీ, అరిటి తొక్కవనీ ఏదో "నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతానని" పరస్పర గోకుడు కామెంట్లే రాస్తున్నారనుకో.. సో వాట్?

ఏంటీ.. ఏడుపు మేడు ఈజీ, నాలో మీదేముడు, మీ బంగారంలో నా పరమాత్మ..హ్హాహ్హాహ్హాహ్హో.. మీ ఇల్లు బంగారం గానూ.. ఎవరక్కడ .. ఈ పెద్దాయన నోట్లో కాస్త పంచదార పోసి ప్లాస్టర్ అంటించి, ఓ గుమ్మడికాయ దిష్టి తీసిపడెయండయ్యా..

( సారీ మాస్టారూ, మిమ్మల్ని పొగడకూడదనుకున్నాను, నిందా స్తుతి నా వల్ల కాలేదు. ఇంత మంది ప్రేమ మూట గట్టేసుకుంటున్నారు. మీ లెగ్గ్గేమో కానీ, మా కళ్ళు మంచివేనంటారా?) Happy blogging! :)

నేస్తం చెప్పారు...

నేను మాత్రం మీ ఇంటికొస్తే నాకేం పెడతారు మా ఇంటి కొస్తే నాకేం తెస్తారు టైపు .....నేను ఏలూరు వస్తున్నాను ..మీ ఇంటికి వస్తాను..మరి నాకోసం చిన్న రసాలు ,సుగంధి సోడా ఇంకా ఊ సమయానికి గుర్తురావడంలేదు ..మీరు రెడీ చేసి ఉంచండి మరి..

>>>>>గురువు గారూ మీ కోసం ఓ ప్పాతిక కేజీల కాకినాడ కాజా, రెండు బుట్టల ద్రాక్షపళ్ళు, మూడు బస్తాల యాపిళ్ళు, ఒక పున్జీడు పూల దండలు, నాలుక్కావిళ్ళు నూజివీడు రసాలు పురమాయించా

శంకర్ గారు ఇలా నోరు ఊరిస్తారా :-((

Apparao చెప్పారు...

గురువు గారూ
మీకు "శిష్య కోటి పరమాణువులు" తయారు అయ్యారు
మీరు స్విస్ బ్యాంకు లో ఎకౌంటు ఓపెన్ చెయ్యకండి
ఇప్పుడు NDA వాళ్ళ అజెండా అదే
కనుక వేరే ఇంకేదన్నా బ్యాంకు లో ఎకౌంటు ఓపెన్ చెయ్యండి
మీ ఆర్ధిక లావాదేవీ లను చూసేందుకు నన్ను నియమించండి
:))

ఆ.సౌమ్య చెప్పారు...

శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ జై.
కొంచం ఆలీసం అయినాదీ, సెమించండి. అయినా నిన్ననే నా బజ్జులో చెప్పేసా శుభాకాంక్షలు...కాబట్టి వాకే.

మొదటినుండీ, అంటే మరీ మొట్టమొదటి కాదుగానీ మూడో పోస్టు నుండీ మిమ్మల్ని ఫాలో అవుతూ అన్నీ క్రమం తప్పకుండా చదువుతూ, నలుగురి చేత చదివిస్తూ మీ బ్లాగు హిట్లు పెంచినందుకుగానూ నన్ను నేనే మొదటి శిష్యపరమాణువుగా ప్రకటించేసుకుంటున్నానొహో. కాబట్టి గురువుగారూ...మనం ఒక మఠం స్థాపిద్దాం. అందులో కొత్తగా, వెరైటీగా ఏడిపించే తత్వ బోధనలు చేద్దాం.

శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ వారి మఠానికి వచ్చి ఏడవండి, ఏడుపు రాకున్నా ఏడిపించి పంపుతారు, ఆలశించిన ఆశాభంగం అని ప్రచారం కల్పిద్దాం, ఏమంటారు?

నేను మీ మొట్టమొదటి శిష్యపరమాణువుని కాబట్టి పళ్ళు, స్వీట్లు అవీ ఏమీ తెలీదు. అయినా నాకు సోఫాలు, బెంచీలు, నేల టికెట్లు అక్కర్లేదండీ. మీ పక్కన చేతులు కట్టుకు నిలుచుని ఏడుస్తూ నా భక్తి ప్రదర్శించుకుంటాను...అది చాలు.

ఇకటాలు ఆపేస్తా :)...మీరిలాగే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ, హాయిగా ఆనందంగా, ప్రభావతిగారి కనుసన్నలలో మసులుతూ అదుపాజ్ఞలలో జీవిస్తూ బ్లాగు రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. :) మీ అన్ని పోస్టులలోనూ ఇప్పటికీ నా ఫేవరెట్ పోస్ట్ "తెలుగదేల అనే అంటాం"...దానికి సాటి మరోటి లేదు.

జై శ్రీశ్రీశ్రీ సుబ్రహ్మణ్య సచ్చిదానంద భారతి స్వామీజీ...జై జై!

శివరంజని చెప్పారు...

గురువు గారూ.. .

నాకయితే మీ పోస్ట్ లు చదువు తున్నంత సేపు సేపూ నాకు *బారిస్టర్ పార్వతీశం* గుర్తుకు వస్తూ ఉంటారు


......... లేట్ గా కామెంట్ పెట్టినందుకు sorryఅండి ............ మీరు ఇలాగే చాలా చాలా పోస్ట్ లు రాస్తూ మమ్మల్ని నవ్విస్తూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మురళి చెప్పారు...

367 వ రోజు శుభాకాంక్షలు.. :)) :))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శంకర్ గార్కి,

రాజాధిరాజ రాజమార్తాండ మూరుగండర గండడు శ్రీ శ్రీ శ్రీ శంకర్ రాజ పుంగవులు వేంచేస్తున్నారహో బహు పరాఖ్, బహు పరాఖ్. ఎర్ర తివాచీ పరచుడు. పూవులు చల్లుడు. ఆ మణిరత్న ఖచితమైన సింహాసనం మీద ఆసీనులు కండి.
ఐదు లో ఒకటి అంటే కొంచెం ఎక్కువేమో ఆలోచిద్దాం. మీరు పానీయము సేవింపుడు. ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గార్కి,

ధన్యవాదాలు. అయితే TV కధలే వ్రాయమంటారా. నేను రచయితను మట్టుకే. డైరక్షన్ గట్రా వెతకాలి. ముందు కధ తయారయిం తరువాత కదా మిగతా హంగులన్నీ. నాకు జై అన్న మీకూ జై.

అప్పారావు శాస్త్రి గార్కి,

ధన్యవాదాలు. 25% కి ఒప్పేసుకోండి. ఈ మాటికి ఇల్లా కానిచ్చేయ్యండి.

శ్రావ్య V. గార్కి,

కానివ్వండి. ఏంచేస్తాం. 368 వ రోజుకు తప్పకుండా తీసుకు రండే. మర్చిపోకండి. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మాలా కుమార్ గార్కి,

ధన్యవాదాలు.

మురళి గార్కి,

బులుసు బులుసే బుడుగు బుడుగే. శతమానం వద్దులెండి. ఇంకో రెండు మూడేళ్లు ఇల్లాగే నవ్వుతూ చాలు. ధన్య వాదాలు.

తులసి రాం గార్కి,

ధన్య వాదాలు.

హరే కృష్ణ గార్కి,

ధన్యవాదాలు. అల్లాగల్లాగే :))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సాయి గార్కి,

ధన్యవాదాలు.

రిషి గార్కి,

ముందర కాషాయం తోనే మొదలు పెట్టాలి. ఆ పైన మీ ఇష్టం. ధన్యవాదాలు.

శ్రీ లలిత గార్కి,

ప్రజాభిప్రాయం స్వామీజీ కే ఉందండి. అల్లాగల్లాగే ఆశీర్వచనములు. (కానుకలు ఘనం గా ఉండాలి. గుర్తు పెట్టుకోండి.) ధన్యవాదాలు.

మనసు పలికే గార్కి,

రండి రండి. ఆ సోఫాలో కూర్చోండి. మొత్తం మీద ఏలూరు అంతా తిరిగారన్నమాట. సంతోషం. ఇంత శ్రమపడి తెచ్చినందుకు మీకు ఇంకో రెండు ఆశీర్వచనాలు ఎక్కువగా ఇస్తాను. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

గిరీష్ గార్కి,

ధన్యవాదాలు.

అనూరాధ గార్కి,

ధన్యవాదాలు. మెల్లిగా చెప్పండి. మిమ్మలని ఆర్ధిక వ్యవహారాలు చూసే ట్రస్టీగా నియమిస్తున్నాను. అవన్నీ మీరే చూడండి.

తృష్ణ గార్కి,

ధన్యవాదాలు.

హరే ఫాలా గార్కి & సూర్య లక్ష్మి గార్కి,

ఆహా ఏమి నా భాగ్యము. లక్ష్మి నారాయణులు ఇద్దరూ కలసి మా బ్లాగుకు విచ్చేశారు. ధన్యోస్మి.
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష... ఎక్కడికైనా వెళితే పళ్ళు ఫలహారాలు తీసుకెళ్లాలని నీతులు చెప్పింది మీరు. అంతే లెండి తనదాకా వస్తే కానీ తెలియదు.
మీరు వచ్చేయ్యండమ్మా, ఆయన ఎల్లా రారో చూద్దాం.
ఇద్దరికీ ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బీకే గార్కి,

ధన్యవాదాలు.

కృష్ణ ప్రియ గార్కి,

ధన్యవాదాలు. ఏమిటో అందరూ అన్నీ చూసుకుంటామంటున్నారు. చివరికి నాకు మిగిలేది నెత్తిమీద ఒక టోపీ యేనా. హతొస్మి.

రత్నమాల గార్కి,

ధన్యవాదాలు.

పద్మవల్లి గార్కి,

కూర్చోవడమా నో నో, ఆడవాళ్ళ గేటు దగ్గర నుంచోడమే. ధన్యవాదాలు.

కిరణ్ గార్కి,

వెల్కొమ్ము, వెల్కోమ్ము . రండి రండి. గేటు బార్లా తెరిచాము. మీరు ఇటు వచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోండి. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

లోకేష్ శ్రీకాంత్ గార్కి,

ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ గార్కి,

ధన్యవాదాలు.

జేబీ-JB గార్కి,

మీరు పూయించే నవ్వులే నాకు వరాలు. ధన్యవాదాలు.

కొత్తావకాయ గార్కి,

మీ అందరి కళ్ళు చాలా మంచివి. కాబట్టే ఇలా ఇంకా బ్లాగుల్లో ఉన్నాను. ధన్యవాదాలు థాంక్యూ అంతకు మించి నేనేమీ చెప్పలేకపోతున్నాను.

నేస్తం గార్కి,

ఒరేయ్ ఎవరక్కడ గేటు వేసెయ్యండి. ఆవిడని లోపలికి రానివ్వకండి. ఏమి తీసుకు రాకపోగా శంకర్ గారు తెచ్చిన వన్నీ తినేస్తారుట. జాగ్రత్తగా కాపలా కాయండి.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అప్పారావు శాస్త్రి గార్కి,

మిమ్ము అప్పుడే స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్ చూసుకోమని చెప్పాను కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఇంకొకరికి ఇచ్చేశాను. చూద్దాం ముందు ముందు ఖాళీలు వస్తే. ధన్యవాదాలు.

ఆ.సౌమ్య గార్కి,

ధన్యవాదాలు. మీ లాంటి మిత్రులు దొరకడం నా అదృష్టం. మొదటినించి కూడా మీరు అందించిన ప్రోత్సాహం నేను మర్చిపోలేను. ఇంకేమి చెప్పగలను. థాంక్యూ.

శివరంజని గార్కి,

ధన్య వాదాలు.

మురళి గార్కి,

ధన్యవాదాలు.

హనుమంత రావు చెప్పారు...

బా గుం దం డీ ...మీ పుట్టినరోజు నిర్ణయం..మహ గొప్పగా వుందండి.గోదావరిజిల్లాకు వలసవచ్చాక మీరు మారిపోయారండి బాబు!"ఆమధ్యనేమో బ్లాగుల మధ్య బార్టర్ సిస్టమ్.మీరు బాగుందన్నారు కనక మీది బాగుందంటున్నా"మన్నారు.ఇప్పుడేమో "మీకు నేను కామెంట్స్ నో" అని తేల్చి చెప్పారు.పైగా కాషాయం అంటున్నారు.రాజకీయాలు చదివి కాషాయందే రాబోవు కాలమని డిసైడయిపోయారా ఏమిటి? అయినా గురువుగారు మీకు బోల్డు ఫాలోయింగు.వద్దన్నా వ్యాఖ్యలే వ్యాఖ్యలు.కాకినాడ కాజాలు, బస్తాలతో ఏపిల్సూనూ.మా బోంట్లబ్లాగులు నచ్చినా నచ్చక పోయినా కామెంటేది మీరొక్కరే.మీ అంతటి వాళ్ళే బాగుందన్నారు కనుక బాగుండే వుంటుందని బాగోదంటే బాగోదని బాగుందనేవారు ఒకరో అరో.ఆ కాస్త అదృష్టం కూడా ఇంక లేదంటున్నారు.గట్టిగా అడుగుదామంటే లోపల సోఫాలవారికే.ఏలూరు తివాచీ.నాలాంటివాడికి గోదావరి డెల్టా మట్టే కదా గేటుదాకా? ఏంచేస్తాం? ఈ 366 రోజుల్లో ఏ కొద్ది రోజులో మాగురించి ఆలోచించిన మీ సౌజన్యానికి కృతఙ్ఞతలు తెలుపుకుంటూ. ఆగండాగండి.మా బ్లాగులకు మీరు వ్యాఖ్యానాలు వ్రాసినా... యక పోయినా మీరు కొల్లాయికట్టినా కాషాయంకట్టినా,మీరు హాస్యం పండిస్తూనే వుండాలి.మేమానందిస్తూనే వుండాలి..... శుభాభినందనలు...

జ్యోతి చెప్పారు...

మేము సిబిఐ నుండి వచ్చాం. స్వామీజీ ముసుగులో మీరు స్వీట్లు, పళ్లపేరుతో డైమండ్స్, డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. యూ ఆర్ అండర్ అరెస్ట్, ఈ బహుమతులు ఇచ్చినవారి వివరాలు కూడా తెలుసుకోండి. ఈ వస్తువులన్నీ సీజ్ చేసి మా ఇంటికి తరలించంఢి. స్వామివారిని శిష్యులతో సహా శ్రీకృష్ణజన్మస్ధానానికి తీసుకెళ్లండి..

అజ్ఞాత చెప్పారు...

మీ పోస్ట్ వంటకానికి ,కామెంట్స్ తాలింపు ఘుమాయించిపోయింది అనుకోండి ఒహటే ఖళ్,ఖళ్ మీ బ్లాగ్ కి శుభాకాంక్షలు

పద్మవల్లి చెప్పారు...

హుం... అయితే నన్ను నించోబెట్టేసారన్న మాట. పోన్లెండి గుడ్డిలో మెల్ల, మా ఇంట్లో పువ్వులే కోస్తావా అని గోడకుర్చీ వెయ్యించలేదు.

అజ్ఞాత చెప్పారు...

Best wishes to your blog.Keep blogging.

మేధ చెప్పారు...

నేను ఏమీ తీసుకురాలేకపోయాను.. నించోబెడతారా, లేక గోడ కుర్చీ వేయిస్తారా... :P

మల్టిపుల్ ఛాయిస్ ఎందుకు - టి.వి., వేదాంతం రెండూ మొదలుపెట్టండి.. టి.వి. సీరియల్స్ చూసి విరక్తి వచ్చి వేదాంతానికి వచ్చేస్తారు.. అప్పుడు రెండూ సూపర్-డూపర్ హిట్ట్ :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హనుమంత రావు గార్కి,

మార్పు సహజం మాష్టారు. అందుకే వేషం మారుస్తున్నాను. ఎన్ని వేషాలు వేసినా మీలాంటి ఆత్మీయుల దగ్గర ఎప్పుడూ ఒకటే. ధన్యవాదాలు.

జ్యోతి గార్కి,

మీరు CBI నుంచి వచ్చినా FBI నుంచి వచ్చినా లైన్ లో రండి. అరెస్టు చేస్తామంటూ చాలా మంది వచ్చారు. అదిగో ఆ గదిలో కూర్చుని ఔషధ సేవ చేస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి మంత్రిగారు వస్తున్నారు. ధన్యవాదాలు.

అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పద్మవల్లి గార్కి,

గోడ కుర్చీ వేయిస్తే గోడ మాసిపోతుందని .. .. ... ధన్యవాదాలు.

అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు.

మేధ గార్కి,

అవునండోయ్ ఈ ఐడియా బాగానే ఉంది. రెండూ మొదలు పెట్టేస్తాం. ఇంత మంచి ఐడియా ఇచ్చారు గదా నేల టికెట్ లో కూర్చోండి. ధన్యవాదాలు.

మధురవాణి చెప్పారు...

బులుసు గారూ,
ఇలాక్కాదు గానీ, ఇక్కడికొచ్చేయ్యండి. ఎంచక్కా బీర్ ఫెస్ట్ లో సెలెబ్రేట్ చేస్కోవచ్చు మీ బ్లాగు పుట్టినరోజు పండగని..
ఆ.. ఇప్పుడు చెప్పండి.. నన్నెక్కడ కూర్చోమంటారు మరి? ;)

Ennela చెప్పారు...

బులుసు గారూ, బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలండీ...
మీ మఠం తాలూకు కెనడా బ్రాంచీ నేను చూసుకుంటా...ఆల్రెడీ ఇక్కడ సన్నాహాలు పూర్తి అయిపోయాయి.ఇనాగరేషన్ ఘనంగా జరిగింది .భక్తులు రావడం మొదలెట్టారు...యీ కానుకలన్నీ ఎక్కడ దాచమంటారూ?ఓహో , సగం నన్ను తీసుకోమంటారా..సరే సరే, కనకం విత్తం నా వంతు, ఫలం పుష్పం మీ వంతు..మీ వంతు మీకు నేల మాళిగ లో దాస్తున్నా..వచ్చినప్పుడు జాగ్రత్తగా అప్పచెబుతా...ప్రిసర్వేటివ్స్ వేసా లెండి..ఫ్రెష్ గానే ఉంటాయి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మధురవాణి గార్కి,

ధన్యవాదాలు. అక్టోబర్ ఫెస్ట్ కి ఇంకా 3 నెలలు ఉంది కాబట్టి , ఈ లోపుగా రెండు పీపాలు ఇక్కడికి దొర్లించెయ్యండి. మీ సీటు పక్కా. పీపాలో నేను, పైన మీరు. :))

ఎన్నెల గార్కి,

ధన్యవాదాలు. ధన, కనక, వస్తు, వాహనాదులు లో ఆదులు నాకూ మిగతావి మీకు నా. బాగుందండీ. గురువును మించిన శిష్యులు. వస్తే నాకు నేలమాళిగ లోనే బస ఏర్పాటు చేసేటట్టున్నారే మీరు. :))

కొత్త పాళీ చెప్పారు...

Happy blog birthday

సమీర చెప్పారు...

mee blag ippude modatisaarigaa chadivaanandi.
baaga navvinattunnanu. moothi chevulaku antukupoindandi.
namaskaaram pettanemo chetulu antukkupoyayandi.
andukani emee teleka poyaanu. mari nannu ekkada koorchommantaarandi?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొత్త పాళీ గార్కి,

ధన్యవాదాలు. మీ లాంటి వారి ప్రోత్సాహం తోనే ఇంత దూరం నడవ గలిగాను.

సమీర గార్కి,

అంతా అయిపోయి, స్వీట్స్, పళ్ళు కూడా అరిగిపోయిన తరువాత వచ్చి ఎక్కడ కూర్చోమంటారూ అని అడుగుతా రేమిటండీ ? ధన్యవాదములు. నవ్వితే నవ్వండి కి స్వాగతం. నవ్వుతూనే ఉండండి.

జయ చెప్పారు...

నేను కూడా మీకు బ్లాగ్ జన్మ దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తున్నానండి. ఇవాల్టికి ఎన్నో రోజో లెఖ్ఖేసుకొని అన్ని అభినందనలు తీసుకోండి. హైద్రాబాద్ నుంచి ఏలూరు లో కన్నా చాలా మంచి మంచి స్వీట్సే పట్టుకొని బయలుదేరానండి. కాని అనుకోకుండా అన్నీ దొంగలెత్తుకుపోయారండి. ఏదో మా ఇంట్లోనే కాసేపు ఎక్కడో అక్కడ కూర్చుంటా లెండి. ఏంచేస్తాం మరి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జయ గార్కి,

>>> కాని అనుకోకుండా అన్నీ దొంగలెత్తుకుపోయారండి.

మీకు దొంగ రక్షణ తాయెత్తు ఒకటి పంపిస్తాను. దొంగల దేముడుకి పూజ చేసి ప్రసన్నం చేసుకోవాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది. ఇంక మీకు దొంగల భయం ఉండదు. కావాలంటే ఖర్చు వివరాలు పంపుతాను. :))

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

అజ్ఞాత చెప్పారు...

Navya vaara patrika vinayaka chaviti haasya kathala potiki prayatninchandi bulusu gaaru

cheers
zilebi.
http://www.varudhini.tk

అజ్ఞాత చెప్పారు...

nannu sir anaddu annarani daniki oka buzz rasestara.. :O. Ivvale chusanandi mi buzz. Work lo gmail login block chestaru, so I have to comment as anon.

Mi next post eppudu?

Ammayi.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గార్కి,

మీ సలహా కి ధన్యవాదములు. పత్రికలకీ వ్రాయాలని ఎప్పుడు అనుకోలేదండీ. ఏదో తోచినది వ్రాయడం. బాగుందనుకుంటే పబ్లిష్ నొక్కడం. బాగాలేదనుకుంటే ఫైల్ డిలీట్ చెయ్యడం. ఫరవాలేదనుకుంటే ఇంప్రూవ్ చెయ్యడానికి ప్రయత్నించడము. మీరందరూ చదివి ఆనందిస్తే అదే మహాద్భాగ్యం నాకు. మీకు అభ్యంతరం లేకపోతే నాకో మెయిల్ పంపగలరా. srisubrahlaxmi@gmail.com.

అనానిమస్ అమ్మాయి గార్కి,

అనుకోకుండా ఆ వేళ ఆ విషయం బజ్ లో పెట్టానండి, సరదాకే. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

KGK SARMA చెప్పారు...

శ్రీ శ్రీ శ్రీ భ్లాగానంద స్వామి గార్కి,
అనగా బ్లాగుల ద్వారా ఆనందింప జేయువారు అనగా బులుసు గార్కి
మీ బ్లాగు బాగుంది కనుక అందరూ బాగుందని ఎల్లాగూ పొగుడుతున్నారు కనుక నేను కూడా బాగుందని అంటే బాగుండదేమోనని ఇదేదో బాగుందని నలుగురికీ చేబితే బాగుంటుందని వారుకూడ మీ బ్లాగు చదివి బాగుందని అంటే బాగుంటుంది కదా అని నాకు తెలిసిన కొంతమందికి పంచు (షేర్) చేశాను.
అయ్యబాబోయ్! మీ బ్లాగులు చదివి నేను కూడ బ్లాగులు రాస్తానెమో! ఎనీవే మీ బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు!

భవదీయుడు
కె జి కె శర్మ

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శర్మ గారికి,

చెప్పడానికి ఏమి లేదంటూనే చెప్పాల్సినదంతా చెప్పేసి పైగా నన్ను చెప్పమంటే, చెప్పడానికీ ఏమీలేదని చెప్పలేక చెప్పుతున్నాను.

నా బ్లాగును మరికొంత మందికి పరిచయము చేసినందుకు, మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

చాతకం చెప్పారు...

Congratulations for completing one year. మీ బ్లాగు చాలా బాగుందండి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

చాతకం గార్కి,

ధన్యవాదాలు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మరికొన్ని --> ఏడుపు అన్-లిమిటెడ్; కరువుదీరా ఏడవండి 🙂.
అదరగొట్టేసారు స్వామీజీ. అవునూ ఈ ఎనిమిదేళ్ళ లోనూ His Holiness అవతారానికి స్వస్తి చెప్పినట్లున్నారే?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ........ ధన్యవాదాలు.
మిత్రుల ఆదేశానుసారం ఏడుపు బ్లాగు, స్వామీజీ బ్లాగుల ఉద్దేశం అప్పుడే విరమించుకున్నాను. ఎప్పటిలాగానే జోకర్ గానే మిగిలిపోయాను. .......... మహా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఎవరండీ మిమ్మల్ని "జోకర్" అనేది, హన్నా☝️?
మీరు జోకులు బాగా చెబుతారండీ అంటూ పొగుడుదామనే సదుద్దేశంతోనే .. ఆంగ్లం సరిగ్గా రాక .. మీరు మంచి జోకర్ సార్ అన్నాడట వెనకటికెవడో (పాత జోకే లెండి) ..... అలా ఉంది మీరన్నమాట 😀.
పోనీలెండి, ఏడుపు సీరియళ్ళు, ఆధ్యాత్మిక కనువిప్పు కలిగించడం ... లాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండడం బ్లాగులోకంలోని హాస్యప్రియుల అదృష్టం, థాంక్స్ 🙏.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు.

9 ఏళ్లగా బ్లాగుల్లో ఉన్నాను. వ్రాసినవి బాగున్నాయని కొంతమంది అంటే ఫరవాలేదు ఇంకొంచెం ప్రయత్నిస్తే బాగానే వ్రాయగలవు అని ఇంకొంత మంది అభిప్రాయపడ్డారు. అబ్బే అసలు ఏం బాగాలేవు, కొంత కాలం మీరు ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది అని కొంతమంది అన్నారు.
హాస్యంలో నవ్వడానికి నవ్వి పోవడానికి మధ్య సన్న గీత ఉందిట. ఆ గీత దాటిన సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. దాటినప్పుడు జోకర్ నే కదా.

మీలాంటి మిత్రుల అభిమానం, ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపిస్తోంది. ............ మహా