1968 మే నెలలో ప్రద్యుమ్నుడు అన్నగారి పెళ్ళికి భీమవరం వెళ్లి, జూన్ మొదటి వారంలో జోర్హాట్ కి తిరిగి వచ్చేసాడు.
అన్నగారి పెళ్ళిలో ఇద్దరు ముగ్గురు ప్రద్యుమ్నుడిని చూసి ముచ్చట పడ్డారు. అమ్మాయిలు కాదు. అమ్మాయిల తల్లి తండ్రులు. అన్నగారి పెళ్ళిలో తనకి కూడా పెళ్లికళ వచ్చేసిందని సంబర పడిపోయాడు ప్రద్యుమ్నుడు.
అందులో ఒకాయన ప్రద్యుమ్నుడు జోర్హాట్ తిరిగి వచ్చేలోపులే భీమవరం వచ్చి మాట్లాడి వెళ్లారు. అమ్మాయి జాతకం, ఫోటో కూడా ఇచ్చి, ప్రద్యుమ్నుడి ఫోటో జాతకం తీసుకు వెళ్లారు. జాతకాలు కుదిరితే తెలియపరుస్తామని చెప్పారు. అబ్బాయి దసరాకో సంక్రాంతికో వచ్చినప్పుడు పెళ్లి చూపులు కార్యక్రమం పెట్టుకోవచ్చని ప్రద్యుమ్నుడి తండ్రిగారు ఆయనకు చెప్పారు అమ్మాయి ఫోటో చూసి ప్రద్యుమ్నుడు మురిసిపోయాడు. ఇంట్లో అందరికీ కూడా ఫోటోలోని అమ్మాయి నచ్చింది. అమ్మాయి పేరు రాధ. BA చివరి సంవత్సరం చదువుతోంది. రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరు వాళ్ళది. పిల్ల తండ్రి తెలుగు మాష్టారు. వేదం కూడా చదువుకున్నారు. ప్రద్యుమ్నుడి నాన్నగారు ముచ్చట పడ్డారు. కానీ అమ్మగారు “వీడికి కాబోయే మామగారు కూడా తెలుగు మాష్టారేనా, వేదం కూడానా” అని నిరుత్సాహపడ్డారు.
పిల్ల తండ్రి వెళ్ళిన తరువాత ప్రద్యుమ్నుడు మొహమాట పడ్డాడు “అప్పుడే నాకు పెళ్ళా?” అని.
“ఇప్పటికే 25 ఏళ్లు నిండాయి. ఇంకా ఎప్పుడూ చేసుకుంటాడుట? నెత్తిమీద తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఇంకో రెండు మూడేళ్ళు అయితే పిల్ల నివ్వడానికి ఎవరూ రారు” అని తీర్పు చెప్పేసారు ప్రద్యుమ్నుడి తండ్రి గారు.
మొహమాటానికి మొహమాట పడ్డా, పెళ్లి చేసుకోవాలని ప్రద్యుమ్నుడు కూడా తొందర పడుతున్నాడు, కాబట్టి తల ఊపేసాడు. ఆ మద్యాహ్నం ఆంతరంగిక సభ జరిగింది. ఆ సభలో పెద్దక్క గారు తేల్చి చెప్పేసారు.
“పెద్దాడి పెళ్లిలో లాగా ఆడపడచు లాంఛనాలు రెండు వందలు చేతిలో పెడితే కుదరదు. చిన్నాడి పెళ్ళిలో మాకు తలా వెయ్యి ఇవ్వాల్సిందే. అమ్మకు అత్తగారి లాంఛనాలు రెండు వేలు ఇవ్వాలి”
“నలుగురికీ నాలుగువేలు అత్తగారికి రెండు వేలు, మొత్తం ఆరు వేలు అంటే దాదాపు కట్నం అంత అవుతుంది. అంత ఆశ పెట్టుకోకండి. నేనూ నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాను. కష్టసుఖాలు నాకు తెలుసు.” అని ఇంకో తీర్పు చెప్పారు ప్రద్యుమ్నుడి తండ్రిగారు.
“పెద్దాడి మామగారు నీ బాల్య స్నేహితుడని, ఆయన ఏమన్నా నువ్వు ఒప్పుకున్నావు. చిన్నాడి పెళ్ళిలో అలా కుదరదు. మాటలకి వెళ్ళినప్పుడు నేను కూడా వస్తాను ఈ మాటు” కరాఖండిగా చెప్పింది ప్రద్యుమ్నుడి పెద్దక్క. అంతటితో ఆగలేదు ఆవిడ,
“ఒరేయ్ పద్దూగా, వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వు మిగిలింది వేసి వెయ్యి రూపాయలూ ఇవ్వాల్సిందే” అని కూడా నొక్కి వక్కాణించింది. “లేకపోతే నీ పెళ్ళికి మేం రాము” అనికూడా చెప్పింది.
“సరే అలాగే లే” అని ఒప్పేసుకున్నాడు ప్రద్యుమ్నుడు.
సభ తరువాత అరుగు మీద కూర్చుని ధూమ పానం చేస్తున్నప్పుడు, జాలి పడ్డాడు ప్రద్యుమ్నుడి పెద్ద బావగారు.
“మాకు పెళ్లి అయిన తరువాత కష్టాలు మొదలయితే, వీడికి పెళ్లి కాకుండానే మొదలవుతున్నాయి”
“అదేమిటి? హాయిగా సంసారం చేస్తున్నారు కదా. మీకేం కష్టాలు?” ఆశ్చర్యపడ్డాడు ప్రద్యుమ్నుడు.
“కనిపించేది అంతా సత్యం కాదు ప్రద్యుమ్నా. మీ నాన్న మీ అక్కయ్యకు పసుపు కుంకుమ గా ఇచ్చిన అర ఎకరం మొన్న అమ్మితే పదిహేను వందలు పూర్తిగా రాలేదు” అని నవ్వాడు పెద్దబావగారు.
“మేం అది ఎప్పుడో అమ్మేసాం” అని వంత పాడారు మిగతా బావలు కూడా.
అప్పుడు హితబోధ చేశారు బావలు నలుగురు,
“నాయనా ప్రద్యుమ్నా, పెళ్లి అనేది ఒక ఆకర్షణ. ఆ ఆకర్షణ వ్యామోహంలో ముందు ముందు జరిగే విపరీత పరిణామాలను అజ్ఞానులు గ్రహించలేరు. పెళ్లికి పర్యవసానం బానిసత్వం. స్త్రీ అయస్కాంతం లాగా ఆకర్షిస్తుంది కానీ పెళ్లి అయిన స్త్రీలు అణుబాంబులా పరివర్తనం చెందే అవకాశాలు ఎక్కువ. అసలు ఆడపిల్లలు వయసుకు రాగానే ఈ పరివర్తనం మొదలవుతుందని, అందుకనే వారి తల్లి తండ్రులు శాయశక్తులా ప్రయత్నించి వీలైనంత త్వరగా పెళ్లి అనే పేరుతో ఆ అణుబాంబుని ఇంకెవరి ఇంట్లోనో వేసి ఊపిరి పీల్చుకుంటారనీ జ్ఞానులు బోధిస్తారు. అందుకే కట్నాలు ఇస్తారు, ఆడపడచు లాంఛనాలు, అత్తగారి లాంఛనాలు ఇస్తారు. అల్లుడు అలిగితే సైకిల్ కూడా కొనిపెడతారు. మగవాడు నిమిత్తమాత్రుడు. అయస్కాంత శక్తికో అణు ధార్మిక శక్తికో బలై పోతూనే ఉంటాడు. కాబట్టి బుద్ధి తెచ్చుకుని పెళ్లి అనే ఆడ పిల్లల తల్లితండ్రుల కుతంత్రం లో పడకు” అని ఉపదేశించారు.
“పెళ్లి చేసుకొని సంసారసాగరంలో మునిగేవాడు పురుషుడే. భార్యా పిల్లలు ఒడ్డున కూర్చుని వేడి వేడి వేరుసెనక్కాయలు తింటూ చప్పట్లు కొడతారు కానీ నీకు చేయ అందివ్వరు” అని కూడా బోధించారు.
“ఎంత వీరోచితంగా పోరాడినా సంసారం అనే మహా యుద్ధంలో పురుషులు బాలచంద్రులు, అభిమన్యుల లాగే అవతారం చాలించాల్సి ఉంటుంది.” అని కూడా ఉద్భోదించారు.
పోగాలము దాపురించిన వారు హిత వాక్యములు వినరు అని ఎవరో అన్నారు. ప్రద్యుమ్నుడు కూడా వినలేదు. పెళ్లి చేసుకొని సంసారసాగరాన్ని విజయవంతంగా ఈది, ముందు తరాలవారికి మార్గ దర్శనుడ నవుతానని భీష్మించాడు ప్రద్యుమ్నుడు. “గృహమే కదా స్వర్గసీమ” అని పాడి వినిపించేడు కూడా.
జోర్హాట్ లో కూడా కుటుంబీకులు కొంతమంది హిందీలోనూ, మరి కొంత మంది తెలుగులోనూ కూడా హితబోధ చేశారు. ప్రద్యుమ్నుడు పట్టించుకోలేదు. ఒక తెలుగాయన బ్రహ్మోపదేశం కూడా చేశారు.
“వత్సా, ప్రద్యుమ్నా, గృహస్తు అని ఎందుకు అంటారో తెలుసా?” సమాధానం కోసం చూడకుండా కొనసాగించాడు,
“గృహమే ఆస్తిగా కలవాడిని గృహస్తు అంటారు. మిగిలిన ఏ ఆస్తులూ భార్యా పిల్లలు వాడికి మిగలనీయరు. వారి సరదాలకు, వారి భోగాలకు, వారి టింగురంగా లకు ఖర్చు అయిపోతుంది. తండ్రిగారు ఇచ్చిన గృహము కూడా అతి కష్టం మీద నిలుపుగో గలుగుతాడు. ఇంటికి దీపం అనిపించుకునే ఇల్లాలుని గృహస్తి అంటారు. అంటే గృహంలో ఏనుగు అని అర్ధం. వారికి ఎదురు చెప్పలేరు, తెలియకుండా ఏ పని చేయలేరు. చెవులు పెద్దవి కదా.” ఇంతటితో ఆగలేదు ఆయన.
“పెళ్లి అయిన కొంత కాలం తరువాత ”జాయెతు జాయె కహా, సంఝేగా కౌన్ యహా దర్ద్ భరే దిల్ కి జుబా” అని పాడుకోవాలి. వలదు నాయనా వలదు పెళ్లి అనే యజ్ఞంలో సమిధి కావలదు” అని ప్రభోదించారు.
అయినా ప్రద్యుమ్నుడు లక్ష్యపెట్టలేదు. పైగా,
“ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి” అని పాడాడు కూడా.
ప్రద్యుమ్నుడు రాధ ఫోటో చూడగానే మనసు పాడేసుకున్నాడు ఆమె మీద. ఫోటోలో చూడగానే ప్రేమించడం ‘లవ్ యట్ ఫస్ట్ సైట్” అంటారా అని తనలో తనే చర్చించుకున్నాడు. “రాధే నా జీవనజ్యోతి” అని తీర్మానించుకున్నాడు.
తండ్రిగారికి ఉత్తరం వ్రాద్దామనుకున్నాడు “పితాశ్రీ, కట్నకానుకలు, లాంఛనాలు అంటూ అడగవద్దు. అవసరమైతే పెళ్లి ఖర్చులు కూడా కొంత మనమే భరిస్తాం అని చెప్పండి వారికి” అని. కానీ అంత పని చేసే ధైర్యం చాలలేదు. విషయం తెలిస్తే, పెద్దక్కగారు రుద్రకాళి అవతారం ఎత్తుతుందేమో నని భయపడ్డాడు కూడా.
ఒక ఇరవై రోజుల తరువాత తండ్రిగారు ఉత్తరం వ్రాశారు. “ఇంకో రెండు సంబంధాలు వచ్చాయి. ఒకాయన హైదరాబాదులో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. అబ్బాయికి హైదరాబాదు ట్రాన్స్ఫర్ కూడా చేయిస్తానన్నారు, అమ్మాయి అక్కడే M.Sc చదువుతోంది. కట్న కానుకలు బాగానే ఇస్తారు అని మధ్యవర్తి చెప్పాడు. రాజమండ్రి ఆయన కూడా మళ్ళీ వచ్చారు. దసరాలకి వస్తే వెళ్లి చూసి ఏదో ఒకటి నిశ్చయించు కోవచ్చు” అని.
ఈ మాటు ప్రద్యుమ్నుడు బెదరలేదు, ఆలోచించలేదు. ధైర్యంగా తండ్రిగారికి ఉత్తరం వ్రాసేసాడు.
“నాకు ఇక్కడ ఉద్యోగం బాగానే ఉంది. ఆర్నెల్ల క్రితమే Ph.D పని మొదలు పెట్టాను. ఇంకో నాల్గైదు ఏళ్లు పట్టవచ్చు. Ph.D వచ్చేదాకా ఇక్కడినుంచి కదిలే ఉద్దేశ్యం లేదు. ఆయనెవరు నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడానికి. నేను ఒప్పుకోకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. రాజమండ్రి ఆయన మళ్ళీ వచ్చాడని అన్నారు కదా మీరు. పిల్లని ఇంతదూరం పంపడానికి ఆయన అప్పుడు అభ్యతరం చెప్పలేదు కదా. వారి అమ్మాయి మన ఇంట్లో అందరికీ నచ్చింది కదా. ఇంకా సంబంధాలు చూడడం ఎందుకు?” అని నిర్మొహమాటంగా తన మనసులో మాట చెప్పేసాడు.
“దసరాలకి శలవు దొరకదు. నెల క్రితమే కదా తిరిగి ఇక్కడకు వచ్చింది. సంక్రాంతికి రావడానికి ప్రయత్నిస్తాను.” అని కూడా వ్రాసాడు.
సంక్రాంతికి ఇంటికి వెళ్లాడు ప్రద్యుమ్నుడు. రాధా ప్రద్యుమ్నుల జాతకాలు బ్రహ్మాండంగా కుదిరాయి అని చెప్పారు. పెళ్లి చూపులు అన్నారు. మొట్ట మొదటి పెళ్లి చూపులు ప్రద్యుమ్నుడికి. శ్రద్ధగా తయారయ్యాడు. భూమికి చంద్ర మండలానికి మధ్య దూరం తెలుసుకున్నాడు. గుడ్డులో పోషక పదార్ధాలు ఏమిటో భట్టి పట్టాడు. ఎందుకైనా మంచిదని కాంగో దేశం వైశాల్యం కూడా కనుక్కున్నాడు. M.Sc. పరీక్షలకి కూడా ఇంత కష్టపడలేదు కదా అని విచారించాడు.
పెళ్లి చూపులకి వెళ్ళారు. అమ్మాయి ఫోటోలో కన్నా బయటే బాగుందని ప్రద్యుమ్నుడు సరదా పడ్డాడు. వంటా వార్పూ , సంగీతం కూడా వచ్చునట. ఏదో సినిమాలో సుశీల పాడిన కీర్తన కూడా పాడింది. “ఇది ఏ సినిమాలో పాట?” అని పెళ్లి కూతురి తరఫు వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో నని భయపడ్డాడు ప్రద్యుమ్నుడు కానీ ఎవరూ అడగలేదు. అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తుందేమో నని ప్రయత్నించాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుడి తండ్రి గారు వీటో చేసేసారు. ఇటువంటి తిక్క ఆచారాలు మన ఇంటా వంటా లేవని తేల్చేసారు. తను భట్టి పట్టిన నాలుగు విషయాలు అమ్మాయికి చెప్పి తన లోక జ్ఞానం ప్రదర్శించాలన్న ప్రద్యుమ్నుడి ఉత్సాహం నీరు కారిపోయింది. పెళ్లి చూపుల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. అమ్మాయి తండ్రి మంచి రోజు చూసుకొని మిగతా విషయాలు మాట్లాడటానికి వస్తాం అని చెప్పారు.
ప్రద్యుమ్నుడు జోర్హాట్ వచ్చేసాడు. కలలో రెండు మూడు యుగళ గీతాలు పాడుకొన్నాడు కూడా రాధతో.
ఫిబ్రవరి నెలలో ప్రద్యుమ్నుడు తన బాసు గారితో దులియాజాన్ లో ఒక కంపనీకి వెళ్లాడు. బాసు గారి గౌరవార్ధం వాళ్ళు ఆ రాత్రికి అక్కడ ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో రామనాధం అనే ఒక తెలుగాయన ప్రద్యుమ్నుడితో పరిచయం చేసుకున్నారు. విందు కాబట్టి మందు గట్రా ఉన్నాయి. ఒక గ్లాసు చేతితో పట్టుకుని, మరో చేత్తో సిగరెట్టు పట్టుకొని ద్విపాత్రాభినయం చేస్తున్న ప్రద్యుమ్నుడితో రామనాధం గారు చాలాసేపే మాట్లాడారు. హాబీలు గట్రా కనుక్కున్నారు. జీతం, ప్రమోషను వచ్చే అవకాశాలు కూడా కనుక్కున్నారు. ఆయన ప్రద్యుమ్నుడి బాసు గారితో కూడా మాట్లాడడం గమనించాడు ప్రద్యుమ్నుడు.
తిరిగి వచ్చేటప్పుడు బాసు గారు చెప్పారు ప్రద్యుమ్నుడితో “ఆ రామనాధం నీకేదైనా ఉద్యోగం ఇస్తాడేమో? నీ గురించి అడిగాడు నన్ను.”
“అవునండీ నన్ను కూడా చాలా విషయాలే అడిగారు. ప్రాజెక్ట్ వర్కు గురించే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా చాలానే అడిగారండి. ఏమైనా, నా Ph. D అయ్యేదాకా మిమ్మల్ని వదలనండి” అని చెప్పాడు ప్రద్యుమ్నుడు.
“అందుకనే కుర్రాడు బుద్ధిమంతుడే కానీ దుడుకు స్వభావం, అని చెప్పాను. ప్రైవేట్ కంపనీలు వ్యక్తిగత విషయాలకి కూడా తగు ప్రాధాన్యత ఇస్తాయి.” అని అన్నారు.
ప్రద్యుమ్నుడు కలల్లో రాధతో డ్యూయెట్లు పాడుకుంటూనే తండ్రి గారి దగ్గర నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాడు. మార్చి అయిపోయింది. ఏప్రిల్ మొదలై వారం కూడా అయిపోయింది. తండ్రి గారి వద్ద నుంచి కబురు రాలేదు. మనసు కీడుని శంకించింది. ఏమైనా అడ్డంకులు వచ్చాయేమో నని సమాధాన పడడానికి ప్రయత్నించాడు. నాన్నగారికి వ్రాసే ధైర్యం లేక ప్రద్యుమ్నుడు పెద్దక్క గారికి ఉత్తరం వ్రాసాడు.
తిరుగు టపాలో ఉత్తరం వచ్చింది.
“వాళ్ళ వాళ్ళు ఎవరో దులియాజాన్ లో ఉన్నారట. నీ దురదృష్టం కొద్దీ నువ్వు వాళ్ళ ఆఫీసుకే వెళ్ళావట. ఆయన నీతోనూ, మీ బాసుతో కూడానూ మాట్లాడారట. “కుర్రాడు పొగరుబోతు, సిగరెట్లు కాలుస్తాడు, మందు కొడతాడు, క్లబ్లో రాత్రి 10 గంటల దాకా పేకాట ఆడుతాడట.” అని సమాచారం తెలుసుకొని వాళ్ళ వాళ్లకి తెలియ పరిచారట” .
ఈ విషయం మధ్యవర్తి ద్వారా తెలిసి ప్రద్యుమ్నుడి తండ్రి గారు అగ్గిరాముడై ఇంట్లో కధకళి కూడా చేసేసారట. “ఉద్యోగం మాని ఇంటికి వచ్చేయమని నీకు తాఖీదు పంపడానికి ఆయన తయారయితే అతి కష్టం మీద నేనూ అమ్మ కలసి ఆపాం”, అని కూడా అక్కగారు తెలియజేశారు.
“ఔరా రామనాధం ఎంత పని చేసేవురా” అని ఆక్రోశించాడు ప్రద్యుమ్నుడు.
6 కామెంట్లు:
అందుకే కొన్ని కొన్ని పనులు గుట్టుగా చెయ్యాలి అంటారు పెద్దలు 😁😁.
బావుంది సర్, కథ.
౧౯౬౮ సంవత్సరమా.. అపుడు మా నాన్న గారి వయసే రెండేళ్ళు.. ఇంక నేనేమీ వ్యాఖ్యానించగలను సర్.. మీ ౧౯౬౮ విశేషం నా జీవితంలో ఆ కాలం నుండి హాఫ్ చెంచురి దాటినాక అనగ ౨౦౧౮ లో జరిగిందిగా..
మీరు హాస్యానికన్నారో ఏమిటో ఆ మాట.. మొదటి పెళ్ళి చూపులు హెవిటండి విడ్డూరం కాపోతే.. నా పెళ్ళి లో పిల్లని వెతటకంలో సాయం చేశారు పూజ్యులు మా పిన్ని గారు, పిన్నా గారు. పెళ్ళి చూపులు వారి సమక్షంలోనే, నిశ్చయ తాంబుళాలు, కళ్యాణ ఘడియలకు మా అమ్మ నాన్నలు, ఇతరత్ర కుటుంబ సభ్యులు, మా పిన్ని, పిన్నా గార్రు హాజరయ్యారు.. ఒక సారే జన్మ పొందుతాము ఆచార్య.. కాని ప్రతి యేట పుట్ఠీన రోజును జరుపుకుంటాము.. అలానే పెళ్ళి సైతం ఒక్క సారే.. వివాహ వార్షికోత్సవం ప్రతి యేట.. మన జన్మలో అమ్మ నాన్నల దెంత ముఖ్యమైన పాత్ర ఉంటుందో అంతటి పాత్రే భార్యకు కూడా వర్తిస్తుంది. (మున.. మీ పరిభాషలో ముసిముసినవ్వు)
~శ్రీ
విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదములు. చిన్నప్పుడు చాలా పనులు గుట్టుగానే చేసేవాడిని అనుకునేవాడిని. కానీ దొరికిపోయేవాడిని.అందుకని కొంచెం పెద్దయిన తరువాత బహిరంగంగానే చెయ్యడం అలవాటు చేసుకున్నాను.........మహా
straylight గారికి. ........ ధన్యవాదములు.
శ్రీ (ధరని)త గారికి. ........ ధన్యవాదములు. ఇక్కడ ఏదైనా నేను హాస్యానికే అంటాను. అప్పుడప్పుడు బెడిసికొడుతుంది కూడాను. ఇక్కడ నా ఉద్దేశం పెళ్లి చూపులలో మొదటిది అనే తప్ప మొదటి పెళ్లి కి అని కాదు. నాకు కూడా ఒకటే పెళ్లి. కానీ మూడు నాలుగు పెళ్లి చూపులు జరిగిన గుర్తు. రెండిటిలో అంత దూరం మా పిల్లను పంపం అని నిష్కర్షగా చెప్పారు తల్లితండ్రులు. వార్షికోత్సవాలు ఎప్పుడూ జరుపుకోలేదు. ....... మహా
కామెంట్‌ను పోస్ట్ చేయండి