తను భగ్నప్రేమికుడనే విషయం శ్రీనివాసుడుకి చిన్నప్పుడే తెలిసింది.
నాల్గైదు ఏళ్ల వయసులో పక్కింట్లో సీగానాపెసునాంబ ఉండేది. దాని నోరు, పళ్ళు
ఎప్పుడూ విశ్రాంతిగా ఉండేవి కావు.
ఎప్పుడూ ఏదో ఒకటి మర
ఆడిస్తూనే ఉండేది. బాల శ్రీనివాసుడికి కూడా జిహ్వ చాపల్యం ఎక్కువే. సీగానా
పెసూనాంబని ప్రేమించడం మొదలు పెట్టాడు. “నువ్వు ఎంచక్కా
ఉన్నావు” అన్నాడు. “నీ బుగ్గలు బూరెల్లా ఉన్నాయి”
అన్నాడు. “నీ రంగు పనస తొనలా ఉంది”
అన్నాడు. పెసూనాంబ నాలుగు ఆకులు ఎక్కువే
చదివింది. “నువ్వు ఎంత ప్రేమించినా సున్నుండలో చిన్న ముక్క
కూడా ఇవ్వను” అంది. అది శ్రీనివాసుడి మొదటి భగ్నప్రేమ.
కొంచెం వయసు వచ్చిన తరువాత అంటే ఏడో క్లాసులో ఉండగా క్లాసు మేటు కుసుమని ప్రేమించడం మొదలు పెట్టాడు
శ్రీనివాసుడు . వాళ్ళ నాన్నగారికి స్కూలు దగ్గరలోనే చిన్న హోటల్ ఉండేది. రెండు మూడు మాట్లు తన గర్ల్
ఫ్రెండ్స్ ని, ఒకరిద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని కూడా వాళ్ళ హోటలుకి
తీసుకెళ్ళింది. ఆర్నెల్ల పాటు ఎంత గాఢముగా, ఘోరంగా ప్రేమించినా శ్రీనివాసుడిని
మాత్రము ఎప్పుడూ వాళ్ళ హోటలుకి
తీసుకెళ్ళలేదు. విసుగెత్తి ప్రేమని
భగ్నించేసాడు శ్రీనివాసుడు.
కాలేజిలో చదివేటప్పుడు పుర ప్రముఖుడి కుమార్తె లీలావతిని ప్రేమించాడు. వాళ్ళ నాన్నకి ఒక
సినిమా హాలు, రెండు బట్టల కొట్లు, ఒక నగల దుకాణం ఉన్నాయి. ఆమె వెనకాల నడవడం మొదలు పెట్టాడు. ఏడు కాదు ఏడు
వేల అడుగులు వేసాడు ఆమె వెనకాల. ఆమె తిరిగి చూడలేదు. ముందు నడుస్తూ వెనక్కి తిరిగి
చూడడం మొదలు పెట్టాడు. ఆమె రూటు
మార్చేసింది. అయినా ప్రయత్నం మానలేదు శ్రీనివాసుడు. కాలేజిలో ఆమె చుట్టూ తిరగడం
మొదలు పెట్టాడు. నాల్గైదు రోజులు ఆమె చుట్టూ తిరగగానే నిర్మోహ మాటంగా, కర్కశంగా చెప్పేసింది. “ఇంకో మాటు నాకు వంద అడుగుల లోపుల కనిపిస్తే మా నాన్నకి చెబుతాను” అని. ప్రేమ మొగ్గ తొడగకుండానే పెద్దలకి తెలుస్తే, వీపు కాయలు కాస్తుందని శ్రీనివాసుడు ప్రేమను
అణుచుకున్నాడు.
యూనివర్సిటీలో చదివేటప్పుడు, ఆపైన ఉద్యోగం చేసేటప్పుడు డజన్ల కొద్ది
అమ్మాయిలను ఇష్ట పడ్డాడు. అందరినీ
సమదృష్టితోనే ప్రేమించాడు. ఎడ తెగకుండా,
విరామం లేకుండా, అప్పుడప్పుడు ఏక కాలంలో నలుగురిని కూడా
ప్రేమించేశాడు. ఎందుకైనా మంచిదని, వాళ్లకి
కూడా నాన్నలు, అన్నయ్యలు కూడా ఉంటారు కదా అని, తన ప్రేమ ఆ అమ్మాయిలకు కూడా తెలియకుండానే ప్రేమించేశాడు. అజ్ఞాత ప్రేమ సార్వభౌముడు అని కూడా అనేవారు
మిత్రులు శ్రీనివాసుడిని.
అష్ట కష్టాలు పడి శ్రీనివాసుడి నాన్నగారు శ్రీనివాసుడి పెళ్లి చేశారు పద్మావతితో. పెళ్లైంది కదా తీరుబడిగా భార్యని తెగ ప్రేమించేద్దామని తీర్మానించు కున్నాడు. “నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను” అని
చెప్పాడు కాపురానికి వచ్చిన పద్మావతితో. “పెళ్లి అయిం తరువాత ఇంకా ప్రేమ ఎందుకు?” అని కొచ్చెను మార్కు పెట్టింది ఆవిడ. “ప్రేమ అమరం. అజరామరం, డివైన్” అంటూ
ఆవేశంగా చెప్పాడు. “ ఏభై వేలు కట్నం తీసుకున్నప్పుడు ఈ ప్రేమ
గుర్తుకు రాలేదా” అని ఘట్టిగానే అడిగింది పద్మావతి. “అయినా ఓ చంద్రహారం చేయించారా? కంచి పట్టు చీర
కొన్నారా? కాశ్మీరు తీసుకెళ్ళారా? ఏం చేశారని మిమ్మల్ని ప్రేమించాలి?” అని ప్రశ్నల శరపరంపర సంధించింది. నిరుత్తరుడయ్యాడు శ్రీనివాసుడు.
ఇందులో తన జీవిత కాలంలో ఏమీ చేయలేడు
కాబట్టి ఉదాత్త ప్రేమ, ప్రేమాతి ప్రేమ
భార్యతో కూడా సాధ్యం కాదని తేలిపోయింది శ్రీనివాసుడికి.
ఏదో సాధారణ భార్యా భర్తల ప్రేమతోనే జీవితం ఇప్పటిదాకా సాగిపోయింది. అయినా
అప్పుడప్పుడు సినిమాలలోగానో, నవలల్లోగానో ప్రేమించుకోవాలని ప్రయత్నం చేశాడు శ్రీనివాసుడు.
కానీ, పద్మావతి కంట్లో నలుసు పడితే శ్రీనివాసుడి కంట్లో కన్నీరు కారలేదు. ఒక మాటు తీవ్ర ప్రయత్నం కూడా చేశాడు. ఆవిడ
కంట్లో కారం కొట్టాడు. ఆవిడ కన్నీరు మున్నీరుగా నానా శాపనార్ధాలు పెడుతూ
విలపించింది. కానీ శ్రీనివాసుడి కంట్లో
కన్నీరు రాలేదు. శ్రీనివాసుడి కాలు విరిగితే పద్మావతి కుంటలేదు.
పద్మావతి చేసిన కూర తింటే శ్రీనివాసుడి కంట్లో కన్నీరు ఉబికింది కానీ నోట్లో లాలా జలం స్రవించలేదు. శ్రీనివాసుడికి జబ్బు చేస్తే ఆవిడ గుండెలు బాదుకోలేదు. పరామర్శించడానికి వచ్చే వాళ్లకి భోజనాలు, కాఫీ
టిఫిన్లు తయారు చేసి పెట్టి, తీరుబడి
చేసుకునే లోపుగా రెండో రోజునే శ్రీనివాసుడు హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేశాడు. అందుకని పద్మావతి
శోక తప్త విచార ముఖబింబాన్ని దర్శించే
భాగ్యం కూడా శ్రీనివాసుడికి కలగలేదు.
ఈ విధంగా తమ భార్యా భర్తల ప్రేమ కనీసం కధలలో లాగా పై స్థాయిలో లేదు అని కూడా
అర్ధం అయింది శ్రీనివాసుడికి.
ఇలా భగ్న ప్రేమలతో ముఫై ఏళ్లు
నిండిపోయాయి శ్రీనివాసుడికి . “సఫల ప్రేమ
నాకు ఎండ మావియేనా?” అని విలపిస్తున్నాడు
శ్రీనివాసుడు.
అంతే, అంతే కొన్ని జీవితాలు అంతే.
(అబ్బే, ఏం లేదు. క్లుప్తంగా కధలు వ్రాయడం ప్రాక్టీసు చేస్తున్నాను.....దహా.)
6 కామెంట్లు:
మీ శైలి అద్భుతం.
బాగుందండీ కథ. మున్ముందైనా ఏదైనా కహ్తలో శ్రీనివాసుడి ప్రేమకి జయం పలకండి :))
:))
కురచ నవ్వులు ఏల బులుసు వారు !
వ్రాయుడు మీ శైలిన నాన్ స్టాప్ నవ్వుల గీతాలు !!
మరీ కురచ కథ అయి పోయిందండి - బులుసు వారి ట్రేడ్ మార్క్ కొంత తగ్గినట్టు అనిపిస్తోంది !!
చీర్స్
జిలేబి
ఉపేందర్ గారికి,
ధన్యవాదాలు.
కొండల రావు గారికి,
ధన్యవాదాలు. ప్రయత్నిస్తానండి.
అనానిమస్ గారికి,
ధన్యవాదాలు.
జిలేబి గారికి,
దరహాసంలో ఉన్న అందం అట్టహాసంలో ఉండదని...దహా.
స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు కదాని కురచ కధ...దహా.
Adi premenantara? Attraction Anukunta?
కామెంట్‌ను పోస్ట్ చేయండి